Previous Page Next Page 
ఖజురహో పేజి 10


    "హలో....మిస్ చాయా!" అతను ఎడమచేత్తో ఆమె కళ్ళముందు చిటికలు వేస్తూ పిలిచాడు.
    
    చాయ ఉలిక్కిపడి "ఏమిటీ?" అంది.
    
    "నా పేరు బావుందా?"
    
    "మీ కారు బావుంది!" ఆమె ఠక్కున చెప్పింది.
    
    ఆమె సమాధానానికి అతను కాస్త చిన్నబోయినట్టు ముఖంపెట్టి నాకన్నా నా పేరుకన్నా కూడా కారే బాగుందా?"
    
    అతని బుంగమూతిని చూసి ఛాయా పక్కున నవ్వేసింది.
    
    అతను మంత్రముగ్ధుడిలా ఓ క్షణం అలాగే వుండిపోయి అంతలోనే తేరుకుని "ఆపకండి ప్లీజ్! అల నవ్వుతూనే వుండండి. మీరలా నవ్వుతుంటే ఎలా వుందో తెలుసా? మల్లెలు జలపాతంలోంచి జలజలా రాలిపడిపడ్తున్నట్లు, సంగీతంలోని మాధుర్యం అంతా వెదురు తోటలోంచి ఒకేసారి పలుకుతున్నట్లు, వసంతాగమనానికి పక్షులు కిలకిలలాడుతూ స్వాగతసంగీతం పలుకుతున్నట్లు" అతను ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళినట్లుగా చెప్పుకుపోతున్నాడు.
    
    "బాబోయ్....ఆపండి" చాయ భయంగా అంది.
    
    "మీరు కవులని తెలిస్తే నేను చచ్చినా మీ కారు ఎక్కేదాన్ని కాను. మీ కవితా సీమలలోంచి కాలు కింద పెట్టకపోతే ఎ లారీనో పుణ్యం కట్టుకుని మానని ఏకంగా స్వర్గసీమకే పంపించేస్తుంది."
    
    ఆమెమాటలకి అతనూ నవ్వేసాడు. ఆమెని తదేకంగా చూస్తూ "చాయా యూ ఆర్ బ్యూటీఫుల్" అన్నాడు.
    
    చాయ చెవులకి ఆ మాట వినడం అలవాటే అయినట్టు ఆమె పెద్దగా పట్టించుకోలేదు.
    
    "అవునూ.....మనకి బయటవాళ్ళు కనబడుతున్నారుగా? మరి బయటివాళ్ళకి మనం కనబడుతున్నామా?" అడిగింది.
        
    "నో! ఈ కారులో ఏం జరిగినా బయటవాళ్ళకి కనబడదు. మీరు నిశ్చింతగా వుండొచ్చు" అన్నాడు కిరణ్.
    
    "కనబడాలి. అద్దం కిందికి దించండి" అంది చాయ.
    
    అతను ఓసారి చాయవంక ఆశ్చర్యంగా చూసి, ఆమెవైపు అద్దం కిందికి దించాడు.
    
    "నేను చాలా రోజులుగా మిమ్మల్ని గమనిస్తున్నాను. ఇలా మీతో పరిచయం.....కార్లో మీ పక్కన కూర్చోవడం నాకింకా నమ్మశక్యంగా లేదు. ఐయామ్ వెరీ లక్కీ" ఆమె కళ్ళలోకి చూశాడతను.
    
    చాయ కిటికీలోనుండి తల బయటికిపెట్టి, బస్ స్టాప్ లో నిలబడినవాళ్ళనీ, కాలినడకన వెళ్ళే వాళ్ళని గర్వంగా చూస్తోంది. అలా నిలబడినవాళ్ళ కళ్ళు తనలా కారులో వెళ్ళేవాళ్ళని ఈర్ష్యగా చూస్తాయని ఆమె అభిప్రాయం.
    
    కిరణ్ డ్రైవ్ చేస్తున్నాడన్న మాటేగానీ అతని కళ్ళు ఆర్తిగా ఆమె అందాన్ని ఆపాదమస్తకం తడిమేస్తున్నాయి.
    
    చాయ ఠీవిగా కాలుమీద కాలు వేసుకుని కూర్చుంది. ఆమె తొడుక్కున్న చౌకరకం స్లిప్పర్స్ లోంచి కనబడుతున్న ఆమె పధం, రేకు విప్పిన గులాబీ మొగ్గలా వుంది.
    
    'పావ్-రూలేనె దో పూలోంకా ఇనాయలు హోగీ! ఇనాయలు హోగీ!'
    నరేనా హమ్ కో నహీ ఇన్ కో భీ షికాయత్ హోగీ! షికాయత్ హోగీ!
    
    అని తాజ్ మహల్ లో పాట సన్నగా హమ్ చేసాడు. ముంతాజ్ చాయ అంత అందంగా వుండదేమో అనుకున్నాడు.
    
    చాయ అలవోకగా తలతిప్పి అతన్ని చూసి చిరునవ్వు నవ్వి నుదుటిమీద పడుతున్న ముంగురులని సవరించుకుంది. గాలి సైతం ఆమెని విడవలేనట్లు ఆమె పైట మాటున దూరి పరవళ్ళు తొక్కుతోంది.
    
    ఆమె వేసుకున్న గంధపురంగు బ్లౌజ్ ఆమె శరీరంలో కలిసిపోయి అతన్ని అదోరకమైన మత్తుని కలిగిస్తోంది. గాలికి తొలగిన పైట పక్కగా సన్నగా లోయలా ఏర్పడిన దారి మధ్యలో నో ఎంట్రీ బోర్డులా నల్లని పుట్టుమచ్చ దర్జాగా దర్శనమిస్తోంది. పైట పక్కనుంచి తొంగిచూస్తున్న ఆమె ఎద పొంగుల్ని చూడగానే అతనికి గాలిచోరని గదిలో నిలబడి పున్నమి చంద్రున్ని, మూసివున్న కిటికీ సందులోంచి సగమే చూస్తున్న అనుభూతి కలిగింది. రయ్యిమని గాలి వీస్తున్నా అతనికి ఒంటినిండా చెమటలు పట్టాయి.
    
    హేమంతానికి గడ్డకట్టి గ్రీష్మానికి కరుగుతున్న ప్రేమధారల్లా అతని నుదుటిమీద నుంచి చెమట బిందువులు రాలిపడ్డాయి.
    
    "అదేమిటీ! మీకు ఉక్కపోస్తోందా?" ఆశ్చర్యంగా అడిగింది చాయ.
    
    కిరణ్ కర్చీఫ్ తీసి నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ "నాలో ఘనీభవించిన ప్రేమ నీ చూపుల వేడికి కరుగుతోంది" అన్నాడు.
    
    చాయ ఓసారి కనుబొమలు ముడివేసి చూసి అంతలోనే మామూలుగా మారి "త్వరగా పోనీయండి. కాలేజీ గేటుముందు ఆపవద్దు. లోపల కేంటిన్ దాకా పోనీయండి" అంది.
    
    "అదిసరే కానీ చాయా! నీతో ఒక్క విషయం మాట్లాడాలి" కిరణ్ అప్పుడే మాటలు నేర్చుకుంటున్న పసివాడిలా తడబడ్డాడు.
    
    "సాయంత్రం మాట్లాడుకుందాం" అంది.
    
    అతని ముఖంలో ఆశ చోటు చేసుకుంది.
    
    "థాంక్యూ! సాయంత్రం ఎన్ని గంటలకొచ్చి పికప్ చేసుకోను" అన్నాడు.
    
    "ఫోరోక్లాక్" అంది.
    
    కారు కాలేజీ గేట్లోంచి రయ్యిన దూసుకుపోయి కేంటిన్ ముందు ఆగింది.
    
    చాయకి డోర్ తీయడం చేతకాలేదు.
    
    కిరణ్ ఆమెకు ఎలా తీయాలో నేర్పించి ఆమె దిగబోతుంటే గబుక్కున ఆమె భుజాలచుట్టూ తన చేతిని వేసాడు.
    
    చాయ అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, "బై కిరణ్ మళ్ళీ కలుస్తాంగా" అంది.
    
    అప్రయత్నంగా అతను చేతిని వెనక్కి తీసేసుకున్నాడు.
    
    చాయ విలాసంగా దిగి డోరు వేసి స్టెయిల్ గా చెయ్యి వూపింది.
    
    "బై!" కిరణ్ కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆమెని స్పర్శించైనా అతని చెయ్యి షాక్ తిన్నట్లు ఇంకా స్టీరింగ్ మీద వణుకుతూనే వుంది.
    
    దూరంగా నిలబడి వింతగా చూస్తున్న ఆమె ఫ్రెండ్స్ "ఎవరే అతను?" అంటూ వచ్చి చాయని చుట్టుముట్టారు.
    
    "అతని పేరు కిరణ్" అంది చాయ. అంతకన్నా ఏం చెప్పాలో ఆమెకి తట్టలేదు. అసలు అంతకన్నా ఏం తెలీదు కూడా.
    
    అతను బస్ స్టాప్ లో కారు ఎక్కమనగానే ఎక్కి కూర్చుంది. దార్లో అతని గురించి ఏమీ తెలుసుకోవడానికి ప్రయత్నించను కూడా లేదు.

 Previous Page Next Page