ఆ మధ్యాహ్నమే చుట్టపు చూపుగా వచ్చిన నారాయణరావు మేనమామ సత్యనారాయణ కూడా అక్కడే వున్నాడు.
"బావా, నేనో పది నిమిషాలయ్యాక బయలుదేరతాను" అన్నాడు సత్యనారాయణ.
"ఈ చీకటి రాతఃరిలో బయలుదేరి నువ్వేం చేస్తావయ్యా బావా.....తెల్లవారు జామున బయలుదేరు" చెప్పాడు సుబ్బారావు.
"లేదు బావా.....పది.....పదిహేను నిమిషాలకు నేను బయలుదేరితే, అక్కడకు వెళ్ళాక, నా పనులన్నీ నిర్విగ్నంగా జరుగుతాయి. నా పట్టుదల స్నాగాతి నీకు తెలుసుకదా-" చుట్ట పొగ దట్టంగా ఊదుతూ అన్నాడు సత్యనారాయణ.
"నీ జాతకాల్నీ, మూఢనమ్మకాల్నీ, మా అత్త ఎలా భరిస్తుందో మావయ్యా....." మంచం మీద పక్కను సర్దుతూ అన్నాడు నారాయణ రావు.
"ఒరేయ్.....అల్లుడూ.....ఇపుడు సరిగ్గా తొమ్మిదీ, ఇరవై ఒక్క నిమిషం అయిందిరా.....ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. చూడు నారాయణరావ్....ఇపుడు నువ్వు చెప్పే నిర్ణయం మీద మన కుటుంబ సంబంధాలు ఆధారపడి ఉంటాయని, గుర్తుంచుకొని, నీ నిర్ణయం చెప్పు."
సడన్ గా సత్యనారాయణ సీరియస్ గా మాట్లాడుతుండే సరికి అందరూ నిశ్చేష్టులై చూశారు.
"ఏంటి బావ.....ఇప్పటి వరకూ బాగానే ఉన్నావ్ కదా....!" సుబ్బారావు జోకులేయ బోయాడు.
"చెప్పింది విను.....నీ కొడుకు నిర్ణయం చెప్పాక నువ్వు చెప్పాల్సింది చెప్పు.....నారాయణరావ్ కి....మాసురభికి వయసొచ్చిందని మీకు తెలుసు.....డానికి పెళ్ళి సంబంధాలొస్తున్నాయ్....సురభికి నారాయణరావు అంటే ఇష్టం.....మీకు కూడా సురనహి అంటే ఇష్టం.....అంచేత మీరొక మాట చెప్పేస్తే...." అందరి ముఖాల్లోకి చూస్తూ అన్నాడు సత్యనారాయణ.
"సురభి గురించి, నువ్వడగాలా....అన్నయ్యా...అదెప్పుడో మా ఇంటి కోడలు......ఓ మంచి ముహూర్తం చూడు.....నాలుగక్షింతలు వేసేద్దాం__" నారాయణరావు తల్లి పద్మావతమ్మ అంది.
"పెద్దదాన్ని నేనిక్కడ ఉండనా.....మీ నిర్ణయాలు మీరు చేసోసు కొండర్రా.....నేనెందుకు తగలడడానికి....." కంచుకంఠంతో అనేసరికి అందరూ కాంతమ్మవేపు చూశారు.
"అమ్మా....నీ నిర్ణయమే మా నిర్ణయం....సురభికి, నారాయణ రావుకి పెళ్ళి చేయాలన్నది .... నీక్కూడా అంగీకారమే కదా....." నారాయణరావు తండ్రి సుబ్బారావు అన్నాడు.
"ఒకప్పుడు అంగీకారమే....ఇప్పుడు కాదు....." ముసిల్ది అలా అడ్డు తిరుగుతుందని ఊహించని జనం ఒకసారి నిర్ఘాంతపోయారు.
"ఎందుకిష్టం లేదు?....? మా సురభికి, కన్నువంకరా....కాలువంకరా?" సత్యనారాయణ అన్నాడు ఒకింత కోపంగా.
"సురభి గురించి కాదర్రా......నేను మాట్లాడేది.....నారాయణరావు గురించి..... నారాయణరావు పుట్టినపుడే మనం ఏవనుకున్నాం....మనం ఆడ్ని గవర్నరో, కలెక్టరో, చెయ్యాలని అనుకున్నమా లేదా?"
"ఆ రెండు పదాలూ నీకెలా తెలిసాయే......బాబూ....చచ్చిపోతున్నాం......ఆడు కలెక్టర్ అవుతాడో, కాడో తెలీదు గానీ, గవర్నర్ కాలేడే తల్లీ__" సుబ్బారావు అన్నాడు.
"దానికీ, దీనికీ సంబంధం ఏంటీ....." చిరాగ్గా అడిగాడు సత్యనారాయణ.
"ఎందుకులేదు......ఉంది......చాలా సంబంధం ఉంది. మా వంశములో ఆ మాత్రం, ఈ మాత్రం చదువు చైద్విన వాళ్ళలో నారాయణ రావు ఒక్కడేనని, మీకు తెలుసు......ఆడు కలెక్టరయ్యేంత వరకూ పెళ్ళికి నేనొప్పుకోను.....అదే కాకుండా......ఒక్కక్షరం ముక్కరాని పల్లెటూరి దానిని, నారాయణరావు చేసుకోవడం నాకిష్టంలేదు......"
ఆ మాటకు అందరూ, నిర్ఘాంతపోయారు.
"అత్తయ్యా.....మీకు సురభి అంటే ఇష్టమే కదా...." పద్మావతమ్మ అంది.
"ఇష్టమేనే తల్లీ......కానీ నా మనవడికి దానిని కట్టబెట్టి, ఆడిగొంతు కొయ్యడం నాకిష్టంలేదు"
"అంటే... నువ్వు నారాయణరావుకి వేరే సంబంధం చేస్తావా?" అడిగాడు సత్యనారాయణ.
"ఈ సంబంధం చెయ్యడం మాత్రం నాకిష్టంలేదు. అంతే......ఒరేయ్ కుర్రకుంకల్లారా.....నేను ఆలోచించి చెపుతున్నది నారాయణ రావ్ భవిష్యత్తు గురించి.....ఆడికా విషయం తెలుసు." నారాయణరావ్ వేపు చూస్తూ అంది కాంతమ్మ.
చిన్నప్పట్నించీ నాన్నమ్మ కాంతమ్మ ఆలోచనలన్నీ తనమీదే అనే విషయం నారాయణరావుకి బాగా తెలుసు.
కొంచెం చాదస్తంగా ఆలోచించినా. ఆమె నిర్ణయం ఎప్పుడూ ఫెయిల్ కాలేదనికూడా అక్కడున్న వాళ్ళందరకూ తెలుసు.
సురభి విషయంలో సడన్ గా అడ్డు తిరగడమే అక్కడున్న వాళ్ళందరకూ ఆశ్చర్యంగా వుంది.
"ఒరేయ్ నారాయణరావ్, చెప్పాల్సినోడివి నువ్వు. ఆఖరిమాటగా చెప్పు" అడిగాడు సత్యనారాయణ.
"నాన్నమ్మ మాటే నా మాట....." నెమ్మదిగా అన్నాడు నారాయణరావ్.
"అంటే సురభికి అసలు చదువనేది లేదనేగా నీ ఒపీనియన్......చదువు లేకపోతే ఏంట్రా.... సంసారం చక్కగా చేసుకోగలదు" ఏదో మేనమామ సత్యనారాయణ.
"చూడు.....టాపిక్ ని సైడ్ దారికి మళ్ళించకు. నాకు చెడ్డ కోపం వచ్చేస్తుంది. ఇదిగో సుబ్బారావ్, పద్మావతీ, నారాయణ్రావ్. నా అభిమాన నటి జ్యోతిలక్ష్మిమీద ప్రమాణంచేసి, చెపుతున్నాను. ఎన్ని అవాంతరాలు ఎదురయినా, ముసిల్ది ఎన్ని అడ్డంకులు పెట్టినా నా ఏకైక కూతురు సురభిని నీకిచ్చి పెళ్ళిచేస్తాను__ఆ పెళ్ళికి నా అభిమాని జ్యోతిలక్ష్మిని తీసుకొస్తాను" అని కండువాని విసురుగా దులుపుకుని, సత్యనారాయణ ముందుకి అడుగువేస్తున్నాడు నెమ్మదిగా__
"సంసారం ఎవరయినా చేయగలర్రా అబ్బీ......నీ కూతురికి వేరే సంబంధం చేసుకో నామాట విను. ఇదే మా నారాయణరావు ఉద్దేశం కూడా" అనేసి లేచి చక్కా లోపలి గదిలోకి వెళ్ళిపోయింది నాన్నమ్మ కాంతమ్మ.
"బావా, నీ మాటకూడా అదేనా?" అడిగాడు సత్యనారాయణ.
"ముసిల్ది బతికున్నవరకూ ముసిల్దానిమాటకు అడ్డు చెప్తే......దానాస్తి ఏ అనాధాశ్రమానికో రాసేస్తుంది. అప్పుడు....మనమేం చెయ్యలేం" సుబ్బారావు అన్నాడు__నిస్సహాయంగా చూస్తూ.
"పద్మావతీ.....నువ్వూ నీ మొగుడు మాటేనా?" పౌరుషంగా అడిగాడతను.
"లేదన్నయ్యా, ఆయనతో నాకున్న అభిప్రాయ భేదాలు నీకు తెలుసు. కానీ మా నారాయణరావు మాటే నా మాట."
"ఏడ్చినట్టుంది వ్యవహారం....ఆ ముసిల్ది మీ అందరి మనసుల్నీ మార్చేసిందన్నమాట.....చూద్దాం ....ఒరేయ్ నారాయణరావ్.....నిన్ను ఆఖరిసారిగా అడుగుతున్నాను. ఆలోచించుకొని చెప్పు."
నారాయన్రావుకి చిన్నప్పటినుంచీ ఒకేసారి ఆలోచించడం అలవాటు. రెండోసారి ఆలోచించడం లేనేలేదు.
"సురభిని క్షమించమని చెప్పు మావయ్యా" అని అనేసి లోపలి వెళ్ళిపోబోయిన నారాయణరావు కాలర్ పట్టుకుని లాగి-
"ఒరేయ్ బడుద్దాయ్ నా పంతం, పట్టుదల గురించి నీకు తెలీదు గానీ, మీ అమ్మా, నాన్నలకు బాగా తెలుసు" అన్నాడు కోపంగా సత్యనారాయణ.
"మీ మావకు చెడ్డ పట్టుదల. పెళ్ళికాకముందు మునసబుతో చిన్న గొడవపడి, టూరింగ్ టాకీస్ లో నెలరోజులపాటు తనొక్కడే జ్యోతిలక్ష్మి సినిమాను అన్ని ఆటలూ ఆడించుకుని చూసి, రెండులక్షలు తగలేసాడు"