"ఒరేయ్ హనుమా......నిన్న సబ్బవరం పెళ్ళిచూపుల్లో మనం చూసిన పిల్ల__జానకి కాదురా....ఆ పాప నా హృదయేశ్వరి.......సంధ్యరా."
"నాకు తెల్సినంత మట్టుకు ఆ పెళ్ళి చూపులకు పాపలెవరూ రాలేదుకదా బాసూ" ఆరేడు వయసుగల పాపాల్ని గుర్తుతెచ్చుకుంటూ అన్నాడు హనుమానులు.
"పాపలంటే కాన్వెంటుకెళ్ళే పిల్లలు కాదురా ఇడియట్__చీరా జాకెట్టు వేసుకునే అమ్మాయిలూ. నా సంధ్యవైపు....ఏదో ఫ్లాష్బ్యాక్ అతని గుండెల్ని పిండేయగా నెమ్మదిగా అన్నాడు నారాయణరావు.
"సంధ్యా__హు ఈజ్ షి?" ప్రశ్నించాడు హనుమానులు.
"షీ ఈజ్ ఎవ్వెర్ థింగ్ ఫర్ మీ" మొదలెట్టాడు నారాయణరావు.
"బాసూ__నువ్వు ఇంగ్లీషులో చెప్పకు....నాకు ఒకదాని బదులు ఇంకొకటి అర్ధమౌతుంది__ఆ కారణంగా, ఎవరు సిస్టరో, ఇంకెవరు సిస్టరిన్లాయో తెలీక కంగారు పడిపోతాను" వినయంగా అన్నాడు హనుమానులు.
"రెండోసారి నేను వైజాగ్ వచ్చాక, నువ్వు నా శిష్యుడిగా చేశావు హనుమా.....అంతకుముందే నా జీవితంలో విధి ఘోరంగా ఫుట్ బాల్ ఆట ఆడేసింది. ఎవరూ విడదియ్యలేని టీమ్ లా ఉన్న నన్నూ, నా సంధ్యనూ ఆ విధి రెండు చేతుల్తో చెరోప్రక్కకూ విసిరేసింది హనుమాన్లూ" ఆటో వెంకటేశ్వరా ధియేటర్ దగ్గరకొచ్చింది.
"నీ జీవితంతో విధి అంత తలతిక్కగా ఆడుకుందని, నా కెందుకు చెప్పలేదు గురూ__ఆ మాత్రం నామీద నీకు నమ్మకంలేదా."
"ఇది నమ్మకాలకు సంబంధించిన ట్రాఫిక్__అందుకే నానునను జైల్లోనే ఆ విషాద సంఘటనను ఉంచేసాను" చెపుతూ, చెపుతూ రోడ్డు పక్కకు చూసిన నారాయణరావు కెవ్వున కేక వేశాడు.
"స్టాప్___స్టాప్" అంటూ గట్టిగా అరిచేసరికి, ఆటో డ్రయివర్ సడన్ మని బ్రేక్ కొట్టగా, ఆ దెబ్బకు నారాయణరావు గోళీకాయలా తుళ్ళిపోయి రోడ్డుపక్కన ఇసకలో పడ్డాడు.
అయినా అతను వెంటనే లేచిపోయి ఏక లక్ష్యంతో బాణంలా సినిమా థియేటర్ వేపు పరుగెత్తడం ప్రారంభించాడు. అలా నారాయణరావు ఎందుకు పరుగెడుతున్నాడో తెలీక హనుమానులు అతని వెనక పరుగెత్తడం ప్రారంభించాడు. తన ఆటోకి ఇవ్వాల్సిన డబ్బులు లేక పోవడంతో, వాళ్ళలా పరుగెట్టి పారిపోతున్నారనుకుని ఆటో డ్రయివర్ "పట్టుకోండి..... పట్టుకోండి" అని కేకేసుకుంటూ వారివెంట బడ్డారు.
థియేటర్ వేపు తనెందుకు పరుగెడుతున్నాడో, నారాయణరావు ఒక్కడికే తెలుసు. నేరుగా లేడీస్ కౌంటర్స్ వేపు పరుగెత్తి, తన ఫ్రెండ్స్ తో ముందుకెళుతున్న సంధ్యచెయ్యి పట్టుకున్నాడు.
కెవ్వున కేకవేస్తూ తల పక్కకుతిప్పి చూసిన సంధ్య ఎదురుగా చెమటలు కక్కుకుంటూ నిలబడ్డ నారాయణరావుని చూసి, అంతెత్తున ఆశ్చర్యపోయింది.
"నువ్వా?"
"అవున్నేనే......నిన్ను కలవాలని ఎన్ని రోజులుగా ట్రయ్ చేస్తున్నానో తెల్సా? మొన్న సబ్బవరం పెళ్ళి చూపుల్లో జానకి బదులుగా వచ్చిన పెళ్ళికూతురువి నువ్వని నాకు తెలుసు.....అప్పుడేనీతో మాట్లాడాలనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తూ, నా తలకి దెబ్బతగలడం, స్పృహ కోల్పోవడంతో నేను నీతో మాట్లాడలేక పోయాను.....నన్ను క్షమించు" ఆమె రెండు చేతుల్నీ పట్టుకొని ప్రార్ధించాడు నారాయణ రావు.
"మిస్టర్ రావ్___నువ్వు అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదన్న మాట__నేనర్జంటుగా సినిమా కెళ్ళాలి......నన్ను వదిలెయ్__తర్వాత కలుద్దాం" అసహనంగా చూస్తూ అంది సంధ్య.
"లేదు....సంధ్యా.....నువ్వు నన్ను క్షమించకపోతే.....నేను వదలను.....ఆ ఒక్కమాట అనలేవా....సంధ్యా....."అదేదో సినిమాలో నాగేశ్వరరావు ప్రాధేయపడ్డట్టు అన్నాడు నారాయణరావు.
"ఎవడే వీడు.....వీడిక్కూడా సినిమా టిక్కెట్ కావాలా....ఇచ్చెయ్" అప్పుడే అక్కడ కొచ్చిన సంధ్య ఫ్రెండ్ అంది.
ఆ అమ్మాయివేపు కోపంగా, రోషంగా చూశాడు నారయణరావు.
"నేనెవడో......ఏమిటో తెలిస్తే.....గుండాగి చస్తావ్....." అన్నాడు అతను.
"చూడు మిస్టర్ రావ్......ఇప్పటికి నన్ను క్షమించెయ్.....ఎప్పుడయినా కలుద్దాం......" అంటూ గబగబా స్నేహితుల్తో కలిసి ముందు కెళ్ళిపోయింది సంధ్య.
అలా వెళ్ళిపోతున్న సంధ్య వేపు జాలిగా చూస్తూ వుండిపోయిన నారాయణరావు భుజమ్మీద ఏదో చెయ్యి పడడంతో, కెవ్వుమని అరిచి, పక్కకు తిరిగి చూశాడు.
"నేనే......డోన్టు వర్రీ......"పక్కన హనుమాన్లు.
"ఎవరు బాసూ......ఆ అమ్మాయి?" అడిగాడతను.
"ఒక పావుగంట క్రితం చెప్పాక.....ఎవ్విరీ థింగ్ ఫర్ మీ అని ఆ ఎవ్విరి థింగ్....నా సంధ్యరా .....దాదాపు రెండేళ్ళ తర్వాత.....మనసారా ఆమెను చూసినందుకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా?"
"మనసారా....ఆమెను చూడడం ఏమిటి బాసూ.....నువ్వు వాడిన పదాలకు అర్ధం మారిపోతున్నట్టుగా లేదూ!"
"ఇక్కడ మీనింగ్ కాదురా ప్రధానం....హార్ట్....." అప్పుడే అక్కడ కొచ్చిన ఆటో డ్రైవర్, వగరుస్తూ నారాయణరావు వేపు కోపంగా చూశాడు.
"ఏం.....జే.....ఆటో డబ్బులు ఎగ్గొట్టాలనుకున్నావా......? పద కంట్రోల్ రూమ్ కి...." వాడి తిరకాసు భాషకి అయోమయంగా చూస్తున్నాడు నారాయణరావు.
"నీ ఆటో డబ్బులు ఎవడికి కావాల్రా.....చిట్టికొండీ....మా బాసు, ప్లాష్ బ్యాక్ బాధలో ఉన్నాడు గానీ.....ఇంద తీసుకో....ఎంతయింది" అడిగాడు హనుమాన్లు.
"తొంభయ్ ఆరు రూపాయల తొంభయ్ అయిదు పైసలు......"
"అదేంటలా.....బాటా రేటులా....అదే కాకుండా.....కొత్త రోడ్ దగ్గర్నించి యిక్కడికి తొంభయ్ ఆరు రూపాయలా?"
"అదంతే......ఈ వైజాగులో నోటికొచ్చిందే రేటు.....ఇస్తావా.....చస్తావా?" ఆటో డ్రయివర్ గుడ్లురిమే సరికి, హనుమాన్లు వంద రూఅపయాల నోటు తీసిచ్చాడు.
"చిల్లర ఈసారి కనిపించినపుడు తీసుకో...." చెప్పి వెళ్ళిపోతున్న ఆటో డ్రయివర్ వేపు వెర్రిముఖం వేసుకుని చూశాడు హనుమాన్లు.
నెమ్మదిగా నడుచుకుంటూ యిద్దరూ జగదంబా జంక్షన్ వరకూ వచ్చారు___అక్కడున్న టీ కార్నర్ లో కూర్చున్నారు.
"ఒరేయ్ హనుమాన్లూ......ఇప్పటికే నా జీవితంలో రెండు జన్మలొచ్చేసాయిరా......ప్రస్తుతం నేను పూర్వజన్మ జ్ఞాపకాలతో, బతుకుతున్నట్టుగా బతుకుతున్నాను." నారాయణరావు, నెమ్మదిగా టీ సిప్ చేస్తూ అన్నాడు.
"నాకేం అర్ధం కాలేదు....." బుర్ర గోక్కుంటూ అన్నాడు హనుమాన్లు.
"గుండె చెరువుగా చేసుకుని..... నా కథ వినరా హనుమా....." నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు నారాయణరావు.
* * * *
అనకాపల్లికి పదిహేను మైళ్ళ దూరంలో ఉన్న ఆ పల్లెటూర్లో రాత్రి భోజనాలయ్యాక__
నారాయణరావు.....తండ్రి, సుబ్బారావు, నాన్నమ్మ కాంతమ్మ, తల్లి, మిగతా జనం అందరూ నిద్రకు ఉపక్రమించడానికి ముందు, లోకాభి రామాయణం మాట్లాడుకుంటున్నారు.