Previous Page Next Page 
మొగలిబాకు పేజి 12

   

   "నేనా విషయం మాట్లాడడంలేదు బావా" తన వీక్ నెస్ సుబ్బారావు చెప్పెయ్యడంతో వెర్రెక్కిపోయాడు సత్యనారాయణ.
   
    "పోనీ.....అలాంటిదే ఇంకొకటి చెప్పనా?"
   
    నెమ్మదిగా అడుగులు వేస్తే, ఎవరయినా వచ్చి బ్రతిమిలాడుతారేమోనని సత్యనారాయణ ఐడియా. కానీ ఆ ఐడియా ఫలించలేదు. కొంతదూరం వరకూ అలా స్లోమోషన్లో నడిచి, తర్వాత మణిరత్నం సినిమాలోలా స్పీడుగా నడిచి, కొంతదూరం వెళ్ళాక ఎడ్లబండి ఎక్కాడు.
   
    ఎడ్లబండి, ఎడ్లమువ్వల చప్పుడు కొంతసేపటికి దూరంగా వినబడి సాగింది. ఆ తర్వాత-
   
    "మామయ్య మనసు బాధ పడిందేమోనే అమ్మా....." నెమ్మదిగా అన్నాడు నారాయణరావు.
   
    "మావయ్యట మావయ్య.....లక్షలాస్తి పెట్టుకుని నీకెప్పుడైనా చడ్డీ అయినా కుట్టించాడట్రా? ఒరేయ్ నారాయణమ్.....నీకు కాంచన మాల లాంటి సంబంధం తెస్తాన్రా.....ఆ సురభిని మరచిపో.....అంతే" గదిలోకెళ్ళినట్టుగా నటించి గడపలో స్థంభం చాటున కూలబడి వాళ్ళ సంభాషణంతా విన్న ముసిల్ది ఖంగున అరిచేసరికి అందరూ బిత్తరుపోయారు.
   
    "నువ్వెళ్ళి పడుకోవే......అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది కదా....." సుబ్బారావు అనేసరికి ముసిల్ది నెమ్మదిగా లేచి గొణుక్కుంటూ లోనికి వెళ్ళిపోయింది.
   
    అయిదునిమిషాల తర్వాత పద్మావతమ్మ లోనగదిలోకి ఒకసారి చూసి "ఈవిడగారు సురభిని వద్దంటోందంటే ఏదో కారణం ఉంటుంది. తన మాటలు ఎప్పుడూ బయటపెట్టదు గదా....." పద్మావతమ్మ అంది.
   
    "నాన్నమ్మ ఉద్దేశం ప్రకారం నేను కలెక్టరో, గవర్నరో కావాలి గదా......"
   
    "నువ్వా.....కలెక్టరా-గవర్నరా - నేన్నీకు కన్నతండ్రినిరా......నాకులేని తెలివితేటలు నీకు ఎక్కడనుంచి వస్తాయిరా. ముసిల్ది ఏదో మాస్టర్ ప్లాన్ వేసింది.....అంతే మీ అమ్మ ఊహించిందే కరెక్టు"
   
    మంచం ఎక్కి, దుప్పటిని భుజాలవరకూ లాక్కుని-
   
    "అటు నాన్నమ్మ, ఇటు మీరు....మీరిద్దరూ నన్ను ఫుట్ బాల్ ని చేసి ఆడుకుంటున్నారు. ఇంకా నా చదువు పూర్తికానిదే, నాకు పెళ్ళేవిటే....అమ్మా.....నువ్వయినా చెప్పవ్....."
   
    "ఒరేయ్ నారాయణరావూ ఈ తతంగమంతా క్లయిమాక్స్ కి వచ్చేది నీ చదువయ్యేటప్పటికే అర్ధమైందా....మీ నాన్నమ్మ వచ్చేతరం ఆలోచన, ఈ తరంలోనే చేస్తుంది__నీకు తెల్సు కదా....."
   
    "ఇలాంటిదానికి, అర్జంటుగా రమ్మని టెలిగ్రామ్ కొట్టి మరీ తెప్పించారెందుకూ" దీర్ఘాలు తీసాడు నారాయణరావు.
   
    "నేను తెప్పించానా.......మీ మావయ్య వాళ్ళూరులో బయలుదేరే ముందే తెలివిగా నా పేరుతో టెలిగ్రామ్ ఇచ్చి వచ్చాడు. నువ్వు తెలివి తక్కువ కుంకవి కాబట్టి సరిగ్గావచ్చి ఇరుకులో పడిపోయావ్....." సుబ్బారావు అన్నాడు.
   
    "ఈసారి ఏ టెలిగ్రామ్ ఇచ్చినా నేను రాను తెల్లవారుజామునే లేచి వైజాగెళ్ళిపోతాను" నారాయణరావు మాటకు ఏ ఒక్కరూ బదులు చెప్పలేదు.
   
    మర్నాడు నారాయణరావు తెల్లవారుజామునే లేచి, అప్పటికే మేల్కొన్న తల్లితో మాత్రమే చెప్పి ఇంట్లోంచి బయటపడ్డాడు.
   
    అతను వాళ్ళూరునుంచి వైజాగ్ వచ్చేసరికి పదిన్నరయింది.
   
                                                                           *    *    *    *
   
    బస్టాండ్ లో దిగి, సిటీబస్సెక్కి ఆర్ట్స్ కాలేజీకి నారాయణరావు వెళ్ళేసరికి కాలేజీ మొత్తం నిశ్శబ్దంగా వుంది.
   
    స్టూడెంట్సూ లేరు- లెక్చరర్లూ లేరు__ఆఖరికి వైస్ ప్రిన్సిపాలూ, ప్రిన్సిపాలూ, ఫ్యూన్ లూ లేకపోయేసరికి- నారాయణరావు గాభరాగా జుత్తు పీక్కున్నాడు.
   
    తను రెండ్రోజులు రాకపోయేసరికి కాలేజీ షిప్టు చేసేసారా? అంత అర్జంటుగా, ఆంధ్రాయూనివర్శిటీలోంచి ఆర్ట్స్ కాలేజీని విడదీసేసి షిప్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
   
    ఎవరయినా యూనివర్శిటీమీద రాత్రికి రాత్రి బాంబేసారా? లేక ఇక్కడెక్కడయినా ఏ విమానమైనా కూలిపోయిందా?
   
    అనుమానంగా విమాన శకలాలకోసం వెతికి అవి కనిపించకపోవడంతో నేరుగా కేంటిన్ వేపు పరుగెత్తాడు.
   
    కేంటిన్ కూడా పల్చగా వుంది. ఓ పక్క మొహంకూడా తెల్సిన ముఖంలా కనిపించలేదు. కేంటిన్ కౌంటర్లో కూర్చున్న రెండువందల పదికేజీల ఆసామి వేపు నడిచి-
   
    "ఆర్ట్స్ కాలేజీమీద బాంబు ఎప్పుడు పడింది....." సీరియస్ గా అడిగాడు.
   
    "బాంబా.....పడిందా?" నిర్లిప్తంగా ప్రశ్న వేశాడా ఆసామి.
   
    "ఒక్కడూ లేడు కదయ్యా......పోనీ ఫ్లయిట్ కూలిందా?" అడిగాడు నారాయణరావు తిరిగి.
   
    "ఫ్లయిట్ కూలిందా?" మళ్ళీ నిర్లిప్తంగా ప్రశ్న వేశాడు ఆ ఆసామి.
   
    "ప్రశ్నకు ప్రశ్న జవాబా.....ఆన్సర్ చెప్పి తగలడు....." కోపంగా గొణుక్కున్నాడు నారాయణరావు.
   
    సరిగ్గా ఆ సమయానికి అక్కడకొచ్చిన ఓ సర్వర్ మహాశయుడు__
   
    "కె.జి.హెచ్.కి వెళ్ళవయ్యా......మమ్మల్నెందుకు చంపుకు తింటావ్...." అని చెప్పగా మరో ప్రశ్న వేయకుండా గబగబా పరుగెత్తి బస్టాప్ కెళ్ళి బస్సెక్కాడు నారాయణరావు.

                                           *    *    *    *
   
    కింగ్ జార్జ్ హాస్పిటల్ అనే కె.జి హెచ్. కు వెళ్ళే దారులనిండా కిక్కిరిసిన యూనివర్సిటీ స్టూడెంట్స్.....స్టూడెంట్స్......
   
    అటు పూర్ణామార్కెట్, ఇటు జగదాంబా జంక్షన్, జాలరి పేట రోడ్లనిండా ఎక్కడ ట్రాఫిక్ అక్కడ స్తంభించిపోయింది.
   
    సిటీ బస్సులన్నీ ఆగిపోయాయి.
   
    ఎవరికి, ఏం జరిగిందో తెలీదు. రోడ్లమీద వెళ్ళేజనం రకరకాల సందేహాలతో సతమతమైపోతున్నారు.
   
    కూరగాయల కోసం, పూర్ణామార్కెట్ కి వెళ్ళి, తిరిగి వస్తూ జనసందోహంలో ఇరుక్కుపోయిన ఓ అరవై ఏళ్ళ పెద్దాయన-
   
    "ఏం జరిగిందీ__" అని పక్కనే నడుస్తున్న వ్యక్తిని అడిగాడు.
   
    "యూనివర్శిటీ స్టూడెంట్స్ అందరూ కె.జి.హెచ్ కి తరలి వచ్చారంటే, ఏదో పెద్ద ఉపద్రవమే ముంచుకొచ్చుంటుంది. వి.సీ....సూసైడ్ చేసుకొని ఉండొచ్చని నా అనుమానం....."
   
    "అదే నేనూ అనుకున్నాను లెండి" ఆ పక్కాయన బదులిచ్చి, జనంలోంచి దూసుకొస్తుండగా, ఆయన్ని ఇంకెవరో అడిగారు.
   
    దానికి ఆయన-
   
    "తెలీదా.....వాళ్ళావిడకీ, తనకీ ఏదో చిన్న విషయంలో మన స్పర్ధలొచ్చి యూనివర్సిటీ వైస్ చాన్సులర్ సూసైడ్ చేసుకున్నాట్ట.....టూ ఫాదటిక్....."
   
    ఆ జవాబు విని, ముందుకెళ్ళిన ఇంకో జెంటిల్ మాన్ ని "ఏవిటీ" అని ఎవరో ప్రశ్నించగా, అసలే ఆడవాళ్ళ పొడగిట్టని ఆ ఆజన్మ బ్రహ్మచారి.
   
    "తెలీదా......ముఖ్యంగా మన రాష్ట్రంలోని ఆడవాళ్ళకు కామన్ సెన్స్ లేదయ్యా.....సీతా, సావిత్రి, సూర్పణఖ అని మనం వాళ్ళని పొగడ్డమే తప్పించి, వాళ్ళకి రెస్పాన్స్ బులిటీలేదయ్యా.....ఏదో భర్తతో కిచెన్ రూమ్ లోనో, బెడ్ రూమ్ లోనో చిన్న గొడవయిందనుకో....సర్దుకు పోవాలా అక్కర్లేదా......వీరనారులు కదా....ఎందుకు సర్దుకుపోతారు......యూనివర్శిటీ వి.సీగారిని సదరు వి సీ శ్రీమతి గరిటిచ్చుకొని ఒక్కటిచ్చుకుందట. అంతే....అసలే ఆయనది అరవై ఏళ్ళ అరిటాకులాంటి ప్రాణం టప్ మని లేచిపోయింది. మైగాడ్ బ్లస్ హిజ్ సోల్....."

 Previous Page Next Page