Previous Page Next Page 
కాలనాగు పేజి 10

    కప్పు అందుకుని తాగారాయన.శరీరంలో చైతన్యం వచ్చింది.

    "ఆదిత్యా!అలా కూర్చో" తను మంచంపై కూర్చుంటూ కొడుక్కి కుర్చీ చూపించారాయన,

    ఆదిత్య  కూర్చున్నాడు

    అరుంధతి భర్త పక్కనే కూర్చుంది.

    'నిన్న నీ వెక్కడికి వెళ్ళేవు' సూటిగా ప్రశ్నించాడు
   
    'ఎప్పుడు నాన్నా ?'

    'సాయంకాలం?'

    'పార్కుకి వెళ్ళాను'

    'ఎవరితో? వెంట ఎవరైనా అమ్మాయి వుందా? ఆమె ఎవరు? గర్ల్ ఫ్రెండా?' అడిగారాయన.
   
    'నాన్నా ! సంధ్యా నేనూ కలిసి వెళ్ళాం సంధ్య తెలుసు కదా విశ్వేశ్వరం గారమ్మాయి_'

    'ఆదిత్యా! నువ్వామెని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా? మీరిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారా?'

    క్షణంపాటు ఆలోచనలో పడ్డాడు ఆదిత్య. అంతే! 'అవును నాన్నా!' అన్నాడు.

    అరుంధతి కొడుకుని ఆశ్చర్యంతో చూసింది.

    నిట్టూర్చాడు ధర్మరాజు

    'బాబూ!' నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోకూడదట? ఆమె దేవతాస్ర్తీ అట ! ఆమెతో యిలా తిరగటం నీకూ_మనకూ_మంచిదికాదట. ఫోన్లొ చెప్పారు. నన్ను బెదిరించారు. నేను ఆ మాటలకి ఒప్పుకోలేదు.

    అలా తిరగటం, పెళ్ళి చేసుకోవలనుకోవటం తప్పు కాదన్నాను. అదిగో అప్పుడే ఎదో ఘాటైన వాసన నా ముక్కులికి సోకింది. నేను స్పృహ తప్పాను.

    ఆదిత్య ఆశ్చర్యపోయాడు

    అరుంధతికి అంతా వింతగా వుంది.

    'ఆ వాసన ఎక్కడ నుంచి వచ్చింది?'

    కొడుకు ప్రశ్నకి వెంటనే జవాబు చెప్పలేదు. "నీవు నమ్మవేమో కానీ అది ఫోన్ ద్వారా వచ్చిందనిపించింది అవతల ఏదో గొప్ప పాము బుసకోట్టినట్టుగా భ్రమించాను. అంతవరకే తెలుసు_'అన్నాడు.

    'హల్లో ధర్మా! ఎలా వున్నావ్?

    డాక్టర్ దేవనాధ్ వస్తూనే అడిగాడు.

    అటు చూశాడు ధర్మరాజు. తెల్లని పాంటు,షర్టు.... అంతే ఇంకేం కనిపించలేదు. మనిషి ఆకారం మాత్రం తెలుస్తోంది.

    'స్పృహ ఎప్పుడు వచ్చింది?' వచ్చి కుర్చీలో కూర్చుంటూ ప్రశ్నించాడు మళ్ళి కిట్ ఓపన్ చేశాడు.

    'ఇప్పుడే! అరగంటైంది!' అన్నాడు ఆదిత్య

    'ఎలావుంది?' స్టెత్ తో పరీక్షిస్తూ అడిగాడు. తర్వాత బి.పి. చూశాడు నాలుక పరీక్షించాడు ఏదో ఇంజక్షన్ చేశాడు. అంతా రొటిన్ వర్క్.

    "దేవ్! ఆదుర్దాగా పిలిచాడు ధర్మరాజు. "నాకు నువ్వు కనిపించటం లేదు డాక్టర్. నువ్వేకాదు అరుంధతి. ఆదిత్య ఎవరూ కనిపించటం లేదు. ఇల్లుకూడా స్పష్టంగా లేదు. ఈ మంచమూ, యీ కుర్చీ, యీ యీ బల్ల అన్నీ అస్పష్టంగా కనిపిస్తోన్నాయి. ఇది గుడ్డితనం కాదు. పూర్తి అంధత్వం కాదు... పొరలు కమ్మినట్టు మసకలు కమ్మినట్టు అంతా అస్పష్టత అతని గొంతుతో విషాద వేదనలు ప్రవహించాయి.

    నిర్ఘాంత పోయాడు డాక్టర్ దేవనాధ్

    'కనిపించటం లేదా?'

     'ఊహూఁ నువ్వు తెలుస్తున్నావ్! కానీ కన్పించటం లేదు'

    'ధర్మా! కళ్ళు తెరువు?'

    కనురెప్పలు బాగా విడదీసి కనుపాపల్ని, కనుగుద్దుని పరిక్ష చేశాడు డాక్టర్. అవి బాగానే వున్నాయి. కాటరాక్ట్ వస్తే మార్పువస్తుంది అయినా ఒక్క రాత్రిలో  కాటరాక్ట్  అంతగా వచ్చేస్తుందా?

    "ఏమిటి విచిత్రం!"

    'డాక్టర్!' ఆదుర్దాగా పిలిచాడు ధర్మరాజు

    'ధర్మా! కళ్ళుబావున్నాయి_' అన్నాడు డాక్టర్
   
    అంత విచారంలోనూ సంతోషం పోంగివచ్చింది ధర్మరాజ కి' 'ధాంక్స్' అన్నాడు ఆనందంగా.

    'కానీ కనిపించటం లేదంటే...' అర్దొక్తిలోఆగేడు డాక్టర్ దేవనాధ్' అయినా మనం ఆప్తాల్మజిష్టుకు చూపిద్దాం. అతనేం చెప్తాడో విందాం! తర్వాత పూర్తి చేయలేదు అతను.

    నాకు చూపు వస్తుందంటావా? ఆత్రంగా అడిగాడు ధర్మరాజు ఆ ఆత్రుత వెనుక ఎంతో వేదన వుంది. తపన వుంది

    "వస్తుంది!" చప్పున అన్నాడు డాక్టర్

    ఆ మాట వినగానే ధర్మరాజు ముఖంలో కాంతులు వెల్లి విరిశాయి "ధాంక్యూ!ధాంక్యూ డాక్టర్!" అన్నాడు సంభ్రమంగా 'దేవ్!అన్ని అవయవాల్లో అతి ముఖ్యమైంది శిరస్సు దానిలో ముఖమైనవి కళ్ళు మనిషికి ఎన్నివున్నాచూపు లేకపోతే అతని జీవితం వ్యర్ధం.ఈ లోకం ఎంత అందమైంది దేవ్!ఈ ప్రకృతి అందాలు ఎంత గొప్పవి. తెలి తెలి కాంతులు పరచుకుంటూ వచ్చే ఉషోదయాన్ని, భూమినిండాబంగారు కాంతులు వెదజల్లే సాయం సంధ్యని,కొండల్లో,కోనల్లో, నగరాలపై, నదులపై, రాలపై వెండి వెన్నలని విరజిమ్మే జాబిల్లి...ఓహ్_ఆ అందాలు అన్నీ చూడకుండా బ్రతికి ఫలమేమిటి నాధ్? స్నేహం రుచి తెలియక పోవటం వేరు. తెలిశాక ఆ మిత్రుడిని పోగొట్టుకోవటం వేరు. అదెంత బాధాకరం. పుట్టుగుడ్డి తనేం పోగొట్టుకున్నడో తెలీదు అతనికి ఆత్మ దృష్టే దృషి, జ్ఞానదృష్టే దృష్టి. కానీ యిలా మధ్యాంతరంగాచూపుపోతే..."

    ఆ తర్వాత మాటాడ్లేకపోయాడు ధర్మరాజు. అయన గోంతుకపూడక పోయినట్టుగా అయింది.

    డాక్టర్ దేవనాధ్ ఆయన భుజాన్ని మెల్లగా నిమిరాడు "డోంట్ వర్రీ నీకూ చూపు తెప్పించే భాద్యత నాది" ఒకవేళ  ఆస్తాల్మజిష్టు నర్వ్ దెబ్బతిని చూపు రాదన్న నేను నా ఆక్యుపంక్చర్ పద్ధతిలో చూపు తెప్పిస్తాను అది నా రిసెర్చి సబ్జక్ట్స్... అన్నాడు దైర్యం చెబుతూ.

    'ధాంక్స్!' పొడిగా అన్నాడు ధర్మరాజు ఆయన మనస్సింకా తేరుకోలేదు

    డాక్టర్ బయటికి వెళ్ళేడు సెలవు తీసుకుంటూ

    ఆయన వెంటే నడిచాడు ఆదిత్య.

 Previous Page Next Page