"చేసుకోండి"
"ఉహూ అలా కాదు....చేసుకుందామ్"
ఇద్దరితో కలిసి కాలువకూడా నవ్వింది.
"రావయ్యా!"
ఇంట్లోకి వస్తున్న సారధిని చూసి అన్నాడు.
కుర్చీలో కూర్చుంటూ అన్నాడు సారధి.
"ఇక నీ కథనం కానీ"
"కాస్తాగు.....ఈకాఫీ పుచ్చుకో.....తర్వాతమాట్లాడు కుందాం."
ఏమి జవాబు చెప్పకుండా కాఫీ అందుకుని త్రాగాడు.
"చూడు సారధీ....నా తత్తం చక్కగా తెలిసినవాడివి....నన్ను అర్ధం చేసుకున్న వాడివి....నే నంటే సానుభూతి కలవాడివి....అవసరం అయితే సహాయం చేయగలవాడివి.....'
అడ్డొస్తూ అన్నాడు.
"ఇంకేం విశేషణాలు లేవా?" నవ్వి అన్నాడు మధురం.
"నాజీవితం చాలా చిత్రమైంది. ఎలా ప్రారంభించబడిందో? ఎలా వృద్దికి వచ్చిందో.....ఎలా ముగుస్తుందో తెలియనిది.
నేపుట్టి పెరిగింది అచ్చంపల్లెటూరు.
నాగరికతవాసన కూడా ఎరగని ఊరు.
మనుషులకీ మనుషులకీ మధ్య మమతే కాని మరమాల్లేవు. యాంత్రికంగా సాగిపోయేపట్టణ వాతవరణానికి పది ఆమడల దూరంలో వుంటుంది మా ఊరు.
మీలాగేనేనూ కరణం గారి కుమారుడిని. ఒక్కగానొక్కడివి అనే ముద్దుతో పెంచారు.
పైగా-
మానాన్నగారితో నలభైయైదో ఏట పుట్టడంతో అభిమానానికి, ఆదరానికి, అనురాగానికి, ముద్దు ముచ్చట్లకి మురిపాలకి కొదవలేకపోయింది.
ఆ రోజుల్లో కరణం గారంటే గ్రామానికి తండ్రి అనేట్టు ఉండేవి కొన్ని గ్రామాలు.
అందులో మా ఊరు ఒక్కటి!
నాబారసాలకి నాలుగు మణుగుల నెయ్యి ఖర్చు పెట్టారు. అది గొప్పని చెప్పుకోవటం లేదు సారధీ మా ఊరిలోని మనుషులు ఆదరాభిమానాలకి కొలత బద్ద అవటానికి చెప్పుతున్నాను.
అంతా ఆడంబరంగా జరిగిపోయింది.
ఏడెనిమిదేళ్ళ వయస్సు వచ్చేవరకూ ఏం జరిగిందో,
ఎలా జరిగిపోయిందో ఏమీ గుర్హులేదు. నాకు తోటి విద్యార్ధులతో ఆడుకోవాలంటే భయం-అందుకే మగపిల్లలకు సహజమైన చిన్ననాటి ఆటలు ఒక్కటీ నాకు రావు-
ఎప్పుడూ అమ్మాయిలతో తిరిగేవాడిని ప్రకృతిని కూడా పరవశింపజేసే అందచందాలతో అలంకరణలతో మర్మమెరుగని మనసులతో ఉండేవాళ్ళతో తిరగటం నాకెంతో సంతోషాన్నిచేకూర్చింది. అంత మాత్రమే జ్ఞప్తికి వుంది.
స్కూల్లో చదివింది చాలాకొంచెం ఇంటి దగ్గర మాత్రం శ్రద్దగా చదివేవాడిని. ఈ రోజుల్లో ఎలిమెంటరీ స్టేజిలో కూడా రకరకాల సబ్జెక్టులున్నాయికానీ ఆ రోజుల్లో అంటే ఇప్పటికి సుమారు పద్దెనిమిది, పందొమ్మిది సంవత్సరాల క్రితం ప్రాధమిక పాఠశాలల్లో అమరకోశం ఆంద్రనామసంగ్రహం, ఇంకా కొన్ని శతకాలు తెలుగుమాత్రం చెప్పేవారు.
ఆరోజుల్లో ప్రమోషన్సు కూడా చాలాచిత్రంగా వుండేవి. నేను మూడోక్లాసు చదివింది మూడురోజులు ఎలా ప్రమోట్ అయ్యానో చెప్పానా?"
"ఊ"
"మాస్కూలు హెడ్ మాస్టర్- ఇద్దరే మాస్టర్లు - 4,5 తరగతులకి ఆయన- క్రింది తరగతులకి ఆయన-క్రింది తరగతులకి ఇంకో ఆయన అంతే-గారు నాకూ ఇంకో అబ్బాయికీ మూడుఅంకెల భాగహారంఇచ్చారు. నేను సరిగా చేశాను. అతను చేయలేకపోయాడు. నన్ను నాల్గో తరగతిలో వేశారు అంతే!"
ఆశ్చర్యపోయాడు సారధి.
"తర్వాత హయ్యర్ ఎలిమెంటరీస్కూల్లో ఎలా చదివానో గుర్తులేదు.
కానీస్కూల్లో లిటరరీపోటీ ఏదైనాసరే అందులో పాల్గొనేవాడిని. సహజంగా ఏదో ఓ బహుమతి వచ్చేది. అలాగడిచాయి మూడేళ్ళు తర్వాత ఎనిమిదవతరగతి పబ్లిక్ పరీక్షపాసయ్యాను. మా స్కూలు కంతటికి నేనొక్కడినే పాసుకావటంనాకు ఎంతోగర్వం అనిపించింది!
ఆ తర్వాతే నా జీవితంలో పెద్దమార్పు వచ్చింది"
ఆసక్తిగా వినసాగాడు సారధి.
"చాలా దూరానవున్న ఓ పట్నంలో మా బంధువుల ఇంట్లో చదువుకివదిలారు మా నాన్నగారు వెళ్ళే రోజు మా నాన్నగారు అన్నమాటలు ఇంకా నాచెవుల్లో మెదుల్తూనే వున్నాయ్.
'అమ్మాయిలు అత్తగారింటికి వెళ్ళేప్పటి లాగా ఏడుస్తావేంరా.....ధైర్యం ఉండాలి ఎక్కడికి వెడుతున్నావ్ చదువుకేగా"
ఆ ఊర్లో చేరాను.
పెద్దస్కూలు-టీచర్లు కూడా చాలామంది ఉండేవారు.
వాతావరణం అంతా చాలాక్రొత్త-అక్కడ విద్యార్ధులు కూడా శ్రద్దగా చదివేవారుకారు.
చిన్నచిన్న బళ్లలోనే చదువు బాగా కొట్టిచెప్పుతారు సారధీ విద్యార్ధులు తక్కువ-పనీ తక్కువ అందుకని శ్రద్ద తీసుకుని కొట్టీ తిట్టి చదువు నేర్పుతారు. కానీ అదే పెద్ద పెద్ద బళ్లలో విద్యార్ధులు ఎక్కువ పని ఎక్కువ పంతుళ్ళకి విశ్రాంతి తక్కువ అందుకని చదువూ తక్కువే"
సారధి నవ్వి అన్నాడు.
"ఏదీ నిర్ణయించి నట్టు అనబోకు ఎక్కడి దోషాలు అక్కడికక్కడ చాలా ఉంటాయి"
"ఏమో-ఎలాగో ఫోర్తు ఫారమ్ అయిపోయింది. అప్పటికి నాలో పల్లెటూరి వాతావరణం కొంచానికి కొంచెం వదలిపోయింది. ఆ సెలవులో మా ఊర్లో ఉండటానికి కొంచెంబద్ధకం వేసింది. అప్పుడే హంపీ వెళ్ళాము మేమంతా. అది నా ప్రోద్బలంవల్లే జరిగింది. తెలిసీ తెలియని ఆ వయసులోనే కృష్ణరాయలు తనరాజపీఠం నా మనసులో వేసుకున్నాడు - అంతే అంతకుమించి అప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని గురించి తెలియలేదు-ఫిఫ్త్ ఫారంలో అందరూ ఎగబడుతున్నారని నేను కాంపోజిట్ మేథమెటిక్స్ తీసుకున్నాను. అప్పుడు నాకు గర్వం కూడా వుండేది- లెక్కలు బాగా వస్తాయని-కరణం కొడుకుననీ!"
"ఇప్పుడు మాత్రం లేదా"
"నీమాటకే గానీ- ఆ సంవత్సరంలో చెప్పుకోతగ్గ మార్పులేదు. మా మేష్టారు లెక్కలు చక్కగా చెప్పేవారుబాగా చేసేవాడిని. నాజీవితం మరీ మలుపు తిరిగింది అంటే యస్.యస్.సి.లోకి వచ్చాకే- మా అదృష్టం అను దురదృష్టం అను లెక్కలు చెప్పే మాష్టారు మరొకరు వచ్చారుమాకు. లెక్కల్లో అఖండుడు కానీ ఆయనంత సోమరి ఆయనే. మరొకరులేరు. పోర్షన్ ముగించేవారు- ఒక్క లెక్కా అర్ధం అయ్యేదికాదు.
ఎప్పుడైనా నేను లేచి నిలబడేవాడిని.
"ఏంటోయ్" అంటే-
"అర్ధంకాలేదు సార్" అనేవాడిని.
"ఊహూఅర్ధం కాలేదా- అయితే తూర్పుకి తిరిగి దండం పెట్టు" అనేవారు ఓసారి మరోసారి "ఇంతకుముందు అర్ధమైందా?" అనేవారు.
"అయింది" అంటే-
"ఇదీఅర్ధం కావాలి కూర్చో" అనేవాడు.
"కాలేదంటే"
"అదిఅర్ధం కాలేదా అది కాకపోతే ఇదీ కాదు" అనేవారు అలా జరిగిపోయింది. ఇంత విపులీకరించి ఎందుకు చెపుతున్నానో తెలుసా సారధీ-ఈలెక్కలు నా జీవితాన్ని ఏ విధంగా మార్చిందీ, ఎంత బాధ పెట్టిందీ చెప్పటానికే-నేనూ చాలా నిర్లక్ష్యంగా వుండేవాడిని.
కనీసంపాసు మార్కులు రావా? అనేధైర్యంతో.
ఎప్పుడూ నవలలూ నాటకాలు, కావ్యాలూ గ్రంధాలూ వీక్లీలూ చదివేవాడిని.
కానీ-