ఒక గంట లావాదేవీల్లో అంతా మునిగిపోయారు. కాస్త తాకిడి తగ్గాక రేవతి జయంతి వంక చూస్తూ 'స్మార్ట్ గా, చురుకుగా వున్నాడు ఎంత వరకు చెప్పింది చేస్తాడో చూడాలి...' అంది. జయంతి నవ్వుతూ 'న్యూ బ్రూమ్ గదా' అంది వేళాకోళంగా. "ఎస్ మిస్. న్యూబ్రూమ్ ని కదా. కొత్తలోనైనా కాస్త శుభ్రంగా క్లీన్ చెయ్యాలని ఆశిస్తున్నాను' అన్నాడు దివాకర్. ఎప్పుడొచ్చి వెనక నిల్చున్నాడో ఇద్దరూ చూడలేదు. రేవతి గాభరాగా లేవబోయింది. జయంతి మొహం ఎర్రబడిపోయింది. 'సారీ.....సారీ....' గాభరాగా ఏదో అనబోయింది.
'ఇట్స్ ఓకే టేకిట్ ఈజీ....బైది బై ఈ ఏడాది కలక్ట్ కావాల్సిన రుణాల డిటైల్స్ చూస్తున్నది మీరేననుకుంటాను. రిపోర్టు ఏమన్నా తయారు చేసింది ఉంటే, రూమ్ కి తీసుకురండి....' అంటూ ఛాంబర్ లోకి నడిచాడు.
"ష్....నయం, ఇంకా మనం అడ్డదిడ్డంగా ఏం మాట్లాడలేదు. 'రేవతి గొంతు తగ్గించి అంది కాస్త ఆందోళనగా. జయంతి గబగబ డ్రాయిరు లాగి రిపోర్టు ఫైలు వెతికి తీసికెళ్ళడానికి లేచింది.
మరో అరగంట పని గురించి అతని రూమ్ లో కూర్చుని డిస్కస్ చేస్తుంటే జయంతి చాలా అనీజీగా ఓ పక్క ఎగ్జయిటింగ్ గా ఓ పక్క అనిపించింది. అతని సూటి చూపులు, మాట్లాడుతున్నప్పుడు అదోరకం నవ్వు కనిపించే పెదాలు ఆమెని కాస్త ఇబ్బంది పెట్టాయి. ఇన్నాళ్ళు మేనేజారు అంటే స్త్రీయే వుండటం, అందులోనూ తనకంటే ఓ రెండు మూడేళ్ళు సీనియర్ మాత్రమే అయిన యువతి వుండటంతో చాలా చనువుగా గదిలోకి వెళ్ళడం రావడం పనిచూడటం అలవాటు అయి ఇది కాస్త కొత్తగా వుందనిపించింది. మాట్లాడిన అరగంటలో పనిపట్ల అతని పరిజ్ఞానం. వ్రద్ద, కాన్షన్ ట్రేషన్ ఆమెని బాగా ఇంప్రెస్ చేశాయి. స్టాఫ్ అంతా రోజులా కాకుండా చాలా నిశ్శబ్దంగా పనిచేసుకుపోయారు. వాతావరణంలో మార్పు కనిపించింది ఆ రోజు అందరికి.
* * *
మర్నాడు పదకొండు గంటళవేళ శుభలేఖలు పట్టుకుని ఉషారాణి బ్రాంచికి వచ్చింది. మామూలు సుడిగాలిగా వచ్చి 'హాయ్' అంటూ అల్లరిగా అందరినీ పలకరించి హడావిడి చేస్తున్న ఉషారాణిని చూసి 'హుష్' అంటూ నోటిమీద వేలుంచి మేనేజర్ ఛాంబర్స్ వైపు చూసింది జయంతి. 'ఎవరూ...కొత్త మేనేజరా అంటూ గుసగుసలాడి 'స్మార్ట్ గై'...టూ బాడ్ నేనున్నప్పుడు రాలేదు...' అంది విచారం నటిస్తూ. "నోర్మూసుకో వారం రోజుల్లో పెళ్ళి పెట్టుకొని ఇంకో మగాడి మీద ఇంకా ఆశే...' కోపం నటిస్తూ అంది జయంతి. ఇద్దరు నవ్వుకున్నారు. 'పోనీలే ఏం చేస్తాం ఎవరికెంత ప్రాప్తమో. నా ఛాన్సు పోయింది. నీవన్నా ట్రైచెయ్యి... ఇంతకీ బాచిలరా, పెళ్ళిగట్రా అయిందా, ఆరా తీసావా లేదా ఇంకా, బెటర్ స్టార్ట్ ట్రైయింగ్' చెయ్యి గిల్లి హాస్యంగా అంది. శుభలేఖలు అందరికీ పంచి పెట్టడం అయ్యాక 'మిస్టర్ స్మార్ట్ కీ ఒకటివ్వనా, ఎక్స్ ఎంప్లాయినని పరిచయం చెయ్యి' చూస్తా ఎలా మాట్లాడుతాడో, ఎసెస్ చేస్తాను నీకు సరి అయినవాడో కాదో అంటూ చెయ్యి పట్టిలాగి రూమువైపు లాక్కెళ్ళింది. 'చుఫ్....' అన్త్గూ వారించేలోపలే గదిలోకి లాగింది ఉష. లోపలికొచ్చిన ఇద్దరిని చూసి కాస్త ఆశ్చర్యంగా 'ఎస్...' అంటూ ప్రశ్నార్ధకంగా చూశాడు జయంతి వైపు. 'ఈమె ఉషారాణి పది రోజుల కిందటి వరకు ఈ బ్రాంచిలోనే వర్క్ చేసేది. మేరేజ్ సెటిల్ అయి రిజైన్ ఇచ్చింది' తడబడ్తూ గాభరాగా పరిచయం చేసింది జయంతి.
'మ్యారేజ్ ఇన్విటేషన్ ఇద్దామని....మీరు వస్తే చాలా సంతోషిస్తాను'- అంటూ శుభలేఖ అందించింది.
'ఓ, థాంక్ యూ....' అంటూ మర్యాద చేశాడు. శుభలేఖ తీసి చూస్తూ 'ఓ అమెరికా వాసులు అవుతారన్నమాట, అందుకే జాబ్ రిజైన్ చేశారన్నమాట' చనువుగా మాట్లాడాడు.
'శ్రీవారేం చేస్తున్నారు-కంప్యూటర్ ఇంజనీరా-ఓ, బెస్టాఫ్ లక్...'
'మీరు తప్పక రావాలి - జయంతి నా బెస్ట్ ఫ్రెండ్, ఆమె తీసుకొస్తుంది మీరు వస్తానంటే..... దారి తెలియకపోతే....' అంటూ చేర్చింది.
"ష్యూర్......ఐ విల్ ట్రై మై బెస్ట్' అన్నాడు. ఇంకేం మాటలు పొడిగించాలో తెలియక నమస్కారం చేసి గదిలోంచి బయటికి నడిచారు ఇద్దరూ.
'నీకు మతిపోతూంది. నేను తీసుకెళ్ళడం ఏమిటి అతన్ని... అంత చనువుగా మాట్లాడేశావేమిటి.... ఏం అనుకుంటాడో అతను'
'ఏదో పాపం నీకు సాయం చేద్దామని, అతనితో కాస్త పరిచయం పెంచుకునే అవకాశం వస్తుందని అలా సజెస్ట్ చేశాను. అందమో అని గోల పెడతావుగా దొరికాడు రాజశేఖరుడు - వదలకు' కొంటెగా అంది.
'రాజశేఖరుడెవడు' ఆశ్చర్యంగా చూసింది. 'అదే మన నవలా హీరో కన్నె పిల్లల కలల శేఖరుడు...' కొంటెగా నవ్వింది.