Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 10

రెండు చేతులూ తలకింద పెట్టుకుని కాళ్ళు మంచం కిందకి వేలాడేసి పడుకుని ఉంది తను.
చటుక్కున లేచి కూర్చుంది.
"బ్రష్షులు, బెడ్ కాఫీ ఇక్కడ దొరకవు సార్! వేపపుల్లలతో సరి పెట్టుకుందామా?" అంటూ నాలుగు వేపపుల్లలు తెచ్చాడు శ్రీహర్ష.
"తప్పేదేముంది. అయినా వీటిలో ఉన్న ఆరోగ్యం బ్రష్షులు, పేస్టుల్లో వుందిటోయ్? అందుకనే నేను వేపపుల్లలతోనే దంతధావనం మొదలెట్టాను కొన్నాళ్ళు. మా అమ్మాయి మండిపడి మనిపించేసిందనుకో."
"ఇంకా నయం మా నాన్నగారికి అయన ఇష్టప్రకారం వదిలేశామంటే ఒళ్ళు కొబ్బరి పీచుతో తోముకుంటారు. ఒంటికి నార చిరలె ధరిస్తారు. ఉడకబెట్టకుండా బంగాళాదుంపలు, ఆనపకాయలు తింటారు. ఆరోగ్యనియామాలట. నాకు ఒళ్ళు జలదరిస్తుంది. అవన్నీ తలుచుకుంటే" అంది ఏవగింపుగా మొహం పెడుతూ.
"చూశావా! నా జీవితం సగం మా అమ్మాయి ఇష్టప్రకారం, జరుగుతుంది. సగం మా ఆవిడ ఇష్టప్రకారం జరుగుతుంది" అన్నారాయన.
నవ్వేశారు అందరూ- లావణ్యతో సహా.
"అవును. నేను రాక్షసిని. కనబడ్డ వాళ్ళందరికి చాటింపు వేసెయ్యండి" అంది లావణ్య. "నాకింకో అయిదు నిమిషాల్లో కాఫీ గొంతులో పడకపోతే నిజంగానే రాక్షసినై అందర్నీ రక్కేస్తాను."
కుటుంబరావుగారికి అస్తమా ఉంది. పొద్దున్నే లేవగానే ఏదో ఒకటి వేడిగా గొంతులోకి దిగకపోతే తలకిందులై పోతాడాయాన.
"సోషల్ సర్విస్ అన్న ఉద్దేశంతో కాదు గానీ నా దగ్గర ఎప్పుడూ నెస్ కేఫ్ పాకెట్ ఒకటి ఉంచుకుంటాను. నేను కాఫీ గతప్రాణిని. ఎక్కడైనా మంచి కాఫీ దొరక్కపోతే దొరికిన పాలతో నేనే కాఫీ చేసేసుకుని తాగేస్తుంటాను. ఈ అడవుల్లో అది ఒక్కటే మార్గం. అది ఇవాళ మనందరికీ సంజీవనిలాగా ఉపయోగపడుతోంది. వాచ్ మెన్ కాఫీ పెట్టాడు. సేవించవచ్చు" అన్నాడు.
అందరి ప్రాణాలు తెప్పరిల్లాయి.
ఉత్త నిళ్ళతోనే మొహాలు కడిగేసుకుని , కాఫీ తాగి బయలుదేరారు. లావణ్యవి తెల్ల బట్టలు కావడం వాళ్ళ త్వరగా దుమ్ము కొట్టుకుపోయి నిద్రలో నలిగిపోయినా, ఆ అమ్మాయి అందం ఆ బట్టల పరువు పూర్తిగా పోకుండా రక్షిస్తోంది. 'చక్కనమ్మా చిక్కినా అందమే' అన్నట్లు నలిగిన బట్టలు కూడా అదో రకమైన తమాషా అందాన్నిచ్చాయి లావణ్యకి.
        
                                          * * *

హైదరాబాద్ చేరేసరికి ఒళ్ళు హునమై పోయింది.
"అమ్మయ్య! సివిలైజేషన్ ఎట్ లాస్ట్! నాగరికతలోకి వచ్చిపడ్డాం" అంది లావణ్య నిట్టూరుస్తూ.
"పోనిలెండి. మంచి అడ్వెంచర్ మీకు!" అన్నాడు శ్రీహర్ష.
"టాక్సీ! టాక్సీ!" అని పిలిచింది లావణ్య.
"ఇంక మీ డబ్బుతో కొనగలిగిన సౌఖ్యలన్ని దొరుకుతాయి ఇక్కడ. ఇది అడవి కాదు. ఇంక బాధ లేదు" అన్నాడు శ్రీహర్ష.
"బాబూ! ఇదే అడవి. మనం దాటి వచ్చినది నాగరికత. అడవిలో ఆకలేస్తే గానీ ఇంకో జంతువుని చంపదు పులైనా సరే. ఆకలి తిరితే పక్కనే ఆడుకుంటున్న జింకని కూడా చూసి చూడనట్లు వెళుతుంది. ఆకలిగా ఉంది కదా అని అడవంతా మేసేయ్యదు జింక. ఆకలి తీరాక ఆడుకుంటుంది. తన దారికి అడ్డం రానంతవరకు ఎవర్ని ఏమి చెయ్యదు ఏనుగు- జంగిల్ లా- అడవి న్యాయం అని వెక్కిరిస్తామే గానీ అడవిలో వున్న న్యాయం ఇంకెక్కడుంది? ఇక్కడొ! ఆకలికి అంతం లేదు. ఆశకి అంతం లేదు. తినేది నాలుగు నోళ్లయినా వెయ్యికరాల పొలం కావాలి. ఉండేది ముగ్గురూ మనుషులే అయినా మూడెకరాల స్థలంలో బంగాళా, మూడు ఫర్లాంగుల ప్రైవేట్ రోడ్డూ కావాలి. ప్రపంచంలో ఉన్నదంతా మనకే కావాలి. అంతేకాదు పక్కవాడికి ఉండకూడదు. అది నాగరికత" అన్నాడు కుటుంబరావుగారు ఆవేశంగా.
శ్రీహర్ష మౌనంగా విని తల ఉపాడు.
"నాన్నగారు మరీ సోషలిజం మాట్లాడుతారు" అంది లావణ్య వెక్కిరింపుగా.
టాక్సీ వచ్చింది.
శ్రీహర్షతో చేతులు కలిపారు కుటుంబరావుగారు. అభిమానంగా చూశారతని వైపు.
"శ్రీహర్ష! కొంతమందిని చూస్తే అకారణంగా అభిమానం కలుగుతుంది. కొంతమందిని ముఖారవిందం చూస్తేనే ఒళ్ళు మండుతుంది. నువ్వు మొదటిరకానికి చెందినవాడివి. నువ్వు సమయానికి వచ్చి మాకు సహాయం చెయ్యడం వల్లె కాదు. ఇంకేందుకో కూడా నీ మీద ఇష్టం ఏర్పడింది నాకు. అప్పుడప్పుడు వచ్చిపోతూ వుండూ" అంటూ తన ఫోన్ నెంబరూ, ఇంటి అడ్రసూ ఇచ్చారు.
"గుర్తులు చెప్పరేం నాన్నగారూ! బేగంపేటలో....." అంటూ మొదలెట్టింది లావణ్య.
కుటుంబరావుగారు నవ్వారు.
"అతను అందిస్తే అల్లుకుపోయే రకం. గుర్తులు చెప్పానంట మాత్రాన రాలేని వాడు కాదు."
శ్రీహర్ష శ్రద్దగా ఇద్దరి మాటలూ వింటున్నాడు. సరైన గుర్తులు చెప్పకపోతే అతను ఇల్లు కనుక్కోలేడేమో, మళ్ళీ రాడేమో అన్న ఆదుర్దా లావణ్య మోహంలో తెలిసిపోతోంది.
"పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు కావాలన్నావు కదూ! నేను చేస్తాను. నీ తెలివితేటలతో చకచక పైకొచ్చేయ్యొచ్చు! ఆ! అన్నట్లు నికేదన్నా క్లబ్ లో మెంబర్ షిప్ వుందా?"

 Previous Page Next Page