Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 9

"అబ్బ! పొనిద్దురూ! పొద్దస్తమానం పాముల గొడవేనా?" అంది లావణ్య భయంగా చుట్టూ చూస్తూ.
"నిజంగానే చెబుతున్నాను, కాసేపు అలానే ఉండనివ్వండి."
"నాకు ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉండడం ఇష్టం. జుట్టు కాస్త రేగకూడదు. బట్టలు కాస్త నలక్కూడదు. వస్తువులు ఎక్కడ ఉండాల్సినవి అక్కడే ఉండాలి. మా అమ్మ అలా పెంచింది నన్ను."
"కానీ లావణ్యగారూ! ప్రపంచంలో ఏవి ఉండాల్సినట్టు ఉండవు. జీవితం జరగాల్సినట్లు జరగదు. ఖచ్చితమైన అభిప్రాయాలుంటే కష్టం కదూ?"
"ఎందుకు జరగదు? జరగలేదంటే అది మన ఆమర్ధత అన్నమాట."
మళ్ళీ గాలి వీచింది. ఒక్కసారిగా లావణ్య జుట్టు నెమలి పించంలా విచ్చుకొని మొహం మీద పడిపోయింది.
నవ్వాడు శ్రీహర్ష.
"మీతో పంతం పెట్టుకుంది గాలి. నా పక్షం చేరింది."
"నాతో ఎవరూ పంతం పెట్టుకుని గెలవలేరు" అంది లావణ్య సీరియస్ గా. విసురుగా రెండు చేతులూ పైకెత్తి పొడుగాటి జుట్టుని మెలివేసి జారుడు ముడి వేసేసింది.
"ఎంత శిక్ష విధించారు." అన్నాడు శ్రీహర్ష.
"ఎవరికి?"
"మీ జుట్టుకి."
"శిక్ష విదిస్తూ ఉండకపోతే క్రమశిక్షణలో ఉంచలెం."
"బాబోయ్! అయితే మీ దగ్గర భయభక్తులతో ఉండాల్సిందే మేము."
"నవ్వింది లావణ్య.
"అర్ధమైంది కదా?"
"టైం చూసుకున్నాడు శ్రీహర్ష. రెండవుతోంది .
"ఐదింటికల్లా మనం లేచి ఒక మైలు నడిచి బస్సు అందుకోవాలి. ఇంక పడుకుంటే మంచిది."
"మీరో?"
"నేనింకో సిగరెట్ కాల్చుకుని వస్తాను."
"ఇప్పుడెం సిగరెట్టు? రెండవుతోంది. పడుకోండి" అంది ఖచ్చితంగా.
ఆజ్ఞాపించడం ఆ అమ్మాయికి అత్యంత సహజంగా వచ్చింది. ఇంకెవరన్నా అయితే బతిమాలుతున్నప్పుడు ఒక గొంతూ, ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఒక గొంతూ, హెచ్చరిస్తున్నప్పుడు ఒక గొంతూ- అలా మారుస్తాను. లావణ్య అలా కాదు. ఆమె ఏం మాట్లాడుతున్నా, 'నేను చెప్పింది జరిగి తీరాలి. అర్ధమైందా?' అన్న అజ్ఞ వినబడి వినబడనట్లు ధ్వనిస్తుంది. అందుకామె ప్రత్యేకమైన ప్రయత్నమేమీ చెయ్యదు. డబ్బున్న వాళ్ళ కుటుంబాల్లో రెండో తరానికొస్తుంది. ఆ ధీమా, ఆ ధైర్యం, ఆ దర్పం.
శ్రీహర్ష అది అజ్ఞలాగానే వినబడింది. ఒక్కసారి ఆమె వైపు నవ్వుతూ చూసి, సిగరెట్ పాకెట్ జేబులో పడేసుకుని లేచాడు.
"గుడ్ నైట్!"
"వెరి గుడ్ నైట్!" అంది లావణ్య.
శ్రీహర్ష గుమ్మం దగ్గరే కర్చీఫ్ తో దులిపి, గడప మీద తలపెట్టుకుని పడుకున్నాడు. ఉన్న ఒక్క మంచం మీదా కుటుంబరావుగారు పడుకున్నారు. ఒదిగి అయన కాళ్ళ దగ్గర పడుకుంది లావణ్య.
"లోకం తెలిదు ఈ అమ్మాయికి" అనుకున్నాడు శ్రీహర్ష. "అవును! తెలియదు తెలియాల్సిన అవసరమేముంది? తెలిసి చేసేదేముంది. తనలాగా మనసు నిండా ఆలోచనలు పెట్టుకుని సతమతమై పోవడం తప్ప! ధైర్యంగా, నిశ్చితంగా, ఆనందంగా డబ్బుతో సుఖాలు కోనేసుకుంటూ జీవితం గడిపెయ్యగల అదృష్టవంతురాలు. దానికంటే మించి, అపురూపమైన అందగత్తె, వాళ్ళింట్లో ఒప్పుకుని బ్యుటి కాంటేస్టూలకి పంపితే మిస్ ఇండియాగానో మిస్ యూనివర్స్ గానో సెలక్టయిపోగల లావణ్యవతి. లావణ్య.....లావణ్య.......పేరు కూడా ఎంత కరెక్టుగా అతికింది.
బ్రహ్మాండమైన సైజులో ఉన్న దోమ ఒకటి వచ్చి అందంగా లేతగా కనబడుతున్న లావణ్య భుజం మీద దిగి తీరిగ్గా కుట్టడం మొదలెట్టింది.
"అబ్బబ్బబ్బ!" అంటూ చటుక్కున లేచిన లావణ్య శ్రీహర్ష తన వైపే చూస్తున్నట్లు గ్రహించి మళ్ళీ ముడుచుకుని పడుకుంది.
తెల్లావారుఝామయింది. చల్లగాలి కాస్తా చలిగాలిగా మారిపోయింది. ఇంక అస్సలు నిద్దర పట్టడం లేదు. అతను ఇంకా తన వైపే చూస్తున్నాడేమో అన్న భావం ఇబ్బందిగా సిగ్గుగా ఉంది.
ఒకటి మాత్రం నిజం! ఇతని దగ్గర తను సహజంగా ఉండలేకపోతోంది. కాసేపు ధీమాగా మట్లాడినా, కాసేపు మొహమాటంగా సిగ్గుగా ఉంటోంది. కాసేపు అతను తనవైపు పట్టి పట్టి చూడకపోతే బావుండనిపిస్తోంది. కాసేపు అతను తనని పట్టించుకోకుండా ఉంటె ఏదో కాస్త వెలితిగా ఉన్నట్లనిపిస్తోంది.
ఇదేమిటి? ఎపుడూ లేనిది!

                                                                      * * *

 అలా నిద్రా, మెలుకువా లేని స్టితిలో ఉండి ఉండి చివరికి నిద్రలోకి మొదటి పాదం పెట్టగానే,
"ఇంక మనం బయలుదేరాలి" అంటూ శ్రీహర్ష కంఠం వినిపించింది.
బలవంతంగా కళ్ళు తెరిచింది లావణ్య. కనురెప్పలు బరువుగా ఉన్నాయి.
కళ్ళేర్రబడి ఇసక రేణువు కంట్లో దూరినట్లు గరగారలాడుతున్నాయి.

 Previous Page Next Page