Previous Page Next Page 
జీవనయానం పేజి 9


    ఆ రోజుల్లో డబ్బు తేవడం - దాయడం అంతకష్టం. అందుకే పాతిపెట్టేవారు!     వేంకటాచార్యులవారికి లక్ష్మణాచార్యులవారు - లక్ష్మమ్మగారు ఇద్దరు సంతానం.  లక్ష్మమ్మగారిని భద్రాచలం శఠగోపంవారి ఇంటికి ఇచ్చారు. నా భార్య కమల అమ్మమ్మ రాగమ్మగారికి లక్ష్మమ్మగారు అత్తగారు.      

   

    లక్ష్మణాచార్యులవారికి నిజాం రాజ్యం మానుకోట తాలూకా చినగూడూరు గ్రామం గోవర్ధనం వరదాచార్యులవారి కూతురు బుచ్చమ్మగారిని ఇచ్చి వివాహం చేశారు.

 

    కాలినడక తప్ప వేరే సౌకర్యం లేని ఆ రోజుల్లో అంతదూరపు సంబంధాలు ఎలా కుదిరాయో! ఎలా చేశారో!!

 

    లక్ష్మణాచార్యులవారు విద్వాంసులు, వైద్యులు. దేవాలయంలో "దారోగా" ఉద్యోగం చేశారు. దేవాలయపు ఉద్యోగం అంటే నిజాం ఉద్యోగం! దారోగా అంటే సబిన్ స్పెక్టరంతటిది.

 

    లక్ష్మణాచార్యులవారికి కూనవరంలో భూములు - భద్రాచలంలో ఇల్లు - దేవాలయంలో ఉద్యోగం - వైద్యవృత్తి - విద్వత్తూ సలక్షణంగా ఉన్నాయి.

 

    ప్రకృతికి పరిపూర్ణత్వం లేదు. ప్రతిదానికీ - ప్రతివానికీ వారు రాజులు కానీ - రారాజులు కానీ ఒకలోపం ఉండాల్సిందే! మా తాతగారు లక్ష్మణాచార్యుల వారికి దగ్ధ సంతానం! అమృత హస్తంగల భిహగ్వరులువారు. తమ సంతానాన్ని రక్షించుకోలేకపోయారు!  

 

    ఇదే జీవిత వైచిత్రి!

 

    "విధి'కి ఇక్కడే ప్రాధాన్యత!

 

    మానవశక్తి పనిచేయనిచోట విధి ప్రత్యక్షం అవుతుంది!

 

    బుచ్చమ్మగారు - ఆ తల్లి - ఆరుగురిని కని గోదావరి వడ్డున పెట్టింది! ఆమె గుండె ఎంత చెరువయి ఉంటుంది? ఆమె ఎట్లు సహించి యుండును?

 

    వారు నమ్ముకున్నది రాముని. రాముడు వారికి సాయం చేయలేదు.

 

    `బుచ్చమ్మగారి ఏడవ సంతానం బావుంది. అందుకు ఆ దంపతులు మురిసిపోయారు. అదిగో, అప్పుడే జగన్నాథం నుంచి దంపతులు భద్రాద్రియాత్రకు వచ్చారు. మా తాతగారి ఇంట్లో దిగారు. బుచ్చమ్మగారి బిడ్డను చూచి మురిసి, తమకు ఇవ్వాల్సిందనీ - పెంచుకుంటామనీ అన్నారు.

 

    లక్ష్మణాచార్య దంపతులకు భద్రాచలం మీదా - భద్రాద్రి రాముని మీదా విశ్వాసం సన్నగిల్లింది. ఇక్కడ బిడ్డ బ్రతికి బట్టకడ్తాడు అనుకోలేదు. తమ బిడ్డ ఎక్కడయినా క్షేమంగా ఉండాలనుకున్నారు. బిడ్డను వారికి ఇచ్చారు!

 

    తమ కన్న బిడ్డను ఇతరులకు అప్పగించడం ఎంత బాధాకరం మాతృమూర్తికి! తాను భాదపడ్తుంది! అయినను తమ బిడ్డ క్షేమంగా ఉండాలి! ఎక్కడి అనుబంధం! ఎంతటి అనుబంధం!

 

    తల్లి ఆశలు అడియాసలయినాయి!

 

    పిడుగువంటి వార్త భద్రాద్రి చేరింది!

 

    సవతి తల్లి బిడ్డకు విషంపెట్టి చంపిందని వార్త!

 

    ఆ తల్లి కన్నీటితో గోదావరికి వరద వచ్చింది!

 

    లక్ష్మణాచార్యుల కుటుంబంలో కటిక చీకటి నిండింది! వారి విలాపం అక్షరాలకు అందనిది.

 

    ఎంతటి కటిక చీకటీ కలకాలం నిలువదు!

 

    చీకటి డొక్కను చీల్చుకొని కాంతిరేఖ అవతరిస్తుంది!

 

    విళంబినామ సంవత్సర ఆశ్వీజ శుక్లసప్తమి గురువారంనాడు బుచ్చమ్మగారికి కాంతిరేఖగా మా నాయనగారు జన్మించారు.

 

    మా నాయనమ్మకు భద్రాద్రి రాముని మీది విశ్వాసం పూర్తిగా నశించింది. రాముని ముఖాన దోసిళ్లతో దుమ్ముపోసింది. మా తాతగారు వెంటరాకున్నా, పిల్లవాణ్ణి భుజాన వేసుకుని వంటరిగా - కాలినడకన - మహారణ్యమార్గాన చిన్న గూడూరు చేరింది. అప్పటికి వారి తండ్రిగారు వరదాచార్యులవారు పరమపదించారు. బుచ్చమ్మగారి తమ్ముడు భట్టరాచార్యులువారు అక్కగారిని బరువుగా భావించలేదు.

 

    భద్రాచలంలో లక్ష్మణాచార్యులవారు భార్యను కొడుకుని వదిలి ఉండలేకపోయారు. ఇల్లు, భూములు, ఉద్యోగం, వృత్తి తృణప్రాయంగా వదిలి చిన్నగూడూరు - కట్టు బట్టలతో చేరారు.

 

    ఎంతటి అనుబంధం! ఎంత ప్రేమ! ఎంతటి అనురాగం! ఎంతటి ఆత్మీయత! తన భార్యకోసం - కొడుకు కోసం సర్వం వదిలి వచ్చారు! అసలు ఆస్తిని లక్ష్యం చేయలేదు! మానవ సంబంధానికి ప్రాధాన్యత ఇచ్చారు!

 

    ప్రాణంలేని ఆస్తికంటే ప్రాణం - హృదయం ఉన్న మనిషి ఉత్తమోత్తముడు!

 

    ఎంతటి ఆత్మవిశ్వాసమంటే వారికి - అన్నీ వదులుకొని పై పంచెతో కదలివచ్చారు! రాతిమీద బియ్యం పండించగలననే విశ్వాసం ! విద్య ఉంది బ్రతకగలననే విశ్వాసం!

 

    "విద్వాన్ సర్వత్రపూజ్యతే" - విద్వాంసునికి అంతటా గౌరవం లభిస్తుంది.

 

    బుచ్చమ్మ లక్ష్మణాచార్యులవారలు పరమపదించేవరకు మళ్లీ భద్రాద్రి ముఖం చూడలేదు!

 

    తనకు కష్టాలు వచ్చినందుకు దేవుని మీద దుమ్ము పోయడం, తిరిగి అటు చూడకుండడం వివేకవంతుల లక్షణం మాత్రం కాదు!  

 

    దేవుడు మనకు సేవ చేయడానికే ఉన్నాడా? మనకు మేలు కూర్చినపుడేనా అతనిని పూజించేది! మన కను సన్నలలో భగవంతుడు మసలవలెనా? నష్టం జరిగినపుడు దుమ్ము పోయడమేనా?

 

    ఏదో కొంత భగవంతునికి ఇచ్చి సర్వం సాధించాలనుకోవడం భగవంతునితో వ్యాపారం చేయడం అగునుకాని భక్తి కాదు.

 

    మానవ జీవితం వారికర్మమీద ఆధారపడి ఉన్నది. కర్మ అంటే పని. మన పనినిబట్టి ఫలితం ఉంటుంది. నిన్నటి పనికి ఇవ్వాళ ఫలితం ఉన్నట్లే గత జన్మలోని కర్మకు ఈ జన్మలో ఫలితం ఉంటుంది.

 

    ఇందును గురించి మహాభారతంలో ఒక కథ ఉంది.

 

    ఒక స్త్రీకి ఒక కొడుకు. అతడు పసివాడు. ఆటలకు పోయినాడు. పాము కరిచింది . మరణించాడు. ఆమె తన కొడుకు శవాన్ని పెట్టుకుని ఏడుస్తున్నది.

 

    ఇంటిపక్కన ఉన్నవాడు పామును చంపుతానని కర్ర పట్టుకొని వచ్చాడు. తన కొడుకు కర్మవలన చచ్చాడు. పాముది దోషం కాదు. చంపవద్దన్నది.

 

    పాము అక్కడికి వచ్చింది. "తల్లీ! నీదేమీ తప్పులేదు. నేను నిమిత్తమాత్రను. మృత్యువు ఆదేశించాడు. నేను కాటేశాను" అన్నది. పాము వెళ్ళిపోయింది.

 

    మృత్యువు అక్కడికి వచ్చాడు. "తల్లీ! నాదేమీ తప్పులేదు. నేను నిమిత్తమాత్రుణ్ణి. యముడు ఆదేశించాడు. నేను పాముకు చెప్పాను" అన్నాడు. మృత్యువు వెళ్ళిపోయాడు.

 

    యముడు అక్కడికి వచ్చాడు. "తల్లీ! నాదేమీ తప్పు లేదు. నేను నిమిత్తమాత్రుణ్ణి. కాలానికి అధీనుణ్ణి. కాలం ఆదేశించింది. నేను ఆచరించాను" అన్నాడు. వెళ్ళిపోయాడు యముడు.  

 

    కాలం అక్కడికి వచ్చింది. "తల్లీ! నాదేమీ తప్పులేదు. నేను నిమిత్తమాత్రుణ్ణి. నేను కర్మవశుణ్ణి. కర్మ ఆదేశించింది. నేను ఆచరించాను" అన్నది. వెళ్ళింది కాలం.

 

    కర్మ రాలేదు. ఎంచాతంటే, అది మనిషి చేతిలోనిది! మానవుని భవిష్యత్తు దాని చేతిలో ఉంది అంటుంది భారతం! మనిషి మీదా - మనిషి పని మీదా అంత నమ్మకం మనవాళ్ళకు!

 

    నిష్కామంగా భగవంతుని ఆరాధించిందే భక్తి!
    కోరికల కోసం భగవంతుని ఆరాధించడం వర్తకం!
    "దమ్ భర్ మెఁ మస్జిద్ ఖడాకర్డీ ఈమాఁ కీ హరారత్ వాలోఁ నె
    దిల్ వహీ పురానా పాపేథా ఉమకా భర్ మె నమీజీ ణ బన్ సర్"

    అంటాడు ఇక్బాల్.

 

    భక్తి ఆవేశంలో క్షణంలో మసీదు కట్టాడు. హృదయం మాత్రం పాపిష్టిది. జీవితంలో భక్తుడు కాలేకపోయాడు.

 

    లక్ష్మణాచార్యులవారు ధన్వంతరి. చినగూడూరులో ఒక సంపన్నుని ప్రాణం రక్షించారు. అతడు ఆచార్యులవారికి ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడు.

 

    నిజంలో సాలార్ జంగ్ కాలం వరకు భూముల సెటిల్ మెంట్ జరుగలేదు. ఊళ్ళకు ఊళ్ళు దేశ్ ముఖులకు గుత్తకు ఇచ్చేవారు. దేశముఖులు కిస్తు కట్టేవాళ్లు కారు. కిస్తు అడగడానికి వచ్చిన వారిని అన్నంలో విషం పెట్టి చంపేవారు. అందువల్ల దేశముఖులు పెట్టిన తిండి తినడం మానేశారు. గుడారాలు వేసుకొని కిస్తు వసూళ్లు చేశారు. దేశముఖులు   గుడారాలు తగలపెట్టించారు. సర్కారు మనుషులు ఆయుధాలతో వచ్చారు. బలవంతంగా శిస్తులు వసూలు చేశారు. దేశముఖులు శిస్తులు ఇచ్చారు. తను ముఠాలను పంపి అరణ్యమధ్యంలో సర్కారు మనుషులనుదోపిడీ చేయించేవారు.

 

    దేశముఖుల ఈ దౌర్జన్యం రూపుమాపడానికి సాలార్ జంగ్ "ఘర్ ఘర్ దేశముఖ" నినాదం ప్రవేశపెట్టాడు. అందరినీ భూస్వాములను చేయడానికి సెటిల్ మెంట్ చేశాడు. దరఖాస్తు ఇచ్చినవారికల్లా భూములు ఇచ్చారు సర్కారు. దేశముఖులు దరఖాస్తు ఇవ్వనీయలేదు. అక్కడక్కడ తప్ప భూములన్నీ తమ పేరనే చేసుకున్నారు.

 Previous Page Next Page