ఉగాదిగీతి
ఈ ఉగాది శుభాది తరుణాన
ఈ వసంత ప్రథమ దివసాన
ఈ మనోజ్ఞ విభాత సమయాన
ఈ మహాంధ్ర జనాళి సముఖాన
కలతలే తరగలై లేస్తుంటే
కక్షలే గాలులై వీస్తుంటే
కలుష జీమూతాలు మూస్తుంటే
కుట్రలే కుక్కలై కూస్తుంటే
ధరియించి పెదవిపై దరహాసం
భరియించి యెడదలో పరితాపం
విరచింతు నీనాటి నవగీతం
చిలికింతు విజయాంధ్ర నవనీతం
తెలుగునాడును పెద్ద చౌరస్తా
నావహించిన పిచ్చి చాదస్తా
లవఘళించే భ్రమలు ఛేదిస్తా
మలుపులన్నీ దిద్ది తీరుస్తా
ఎవరురా ఆ గొప్ప మొనగాళ్ళు
మతిలేని తలకిందు గిజిగాళ్ళు
నాయకులు మనుకునే మగవాళ్ళు
ఐకమత్యం చెరచగలవాళ్ళు
తెలుగు తల్లిని పంచుకుంటారా
తెలుగు నెత్తురు నంచుకుంటారా
తెలుగు గొంతుక చించుకుంటారా
తెలుగు తాడే తెంచుకుంటారా
అంతస్సమర భీతి ముట్టించి
అభివృద్ధి పెడదారి పట్టించి
లేనిపోని పుకార్లు పుట్టించి
సత్యానికి సమాధి కట్టించి
ఎవరురా విరగబడుతున్నోళ్ళు
ఆస్తులూ పాస్తులూ ఉన్నోళ్ళు
మస్తుగా దేశాన్ని తిన్నోళ్ళు
జరుపుతా రీజులుం ఎన్నాళ్ళు
తిరగబడుతున్నారు పేదోళ్ళు
కూటికీ గుడ్డకీ లేనోళ్ళు
చదువులూ సాములూ రానోళ్ళు
విప్పుతా రికమీద వేనోళ్ళు
వీళ్ళ కోసం నేను నిలుచుంటా
వీళ్ళ బాధలు నాకు తెలుసంటా
రేపటికి వారసులు వీరంటా
వీళ్ళ ధాటికి ఎదురు లేదంటా
కళింగాంధ్ర1 త్రిలింగాంధ్రాలు2
కాకతీయుల మధురబంధాలు3
రాయలేలిన ఏడు సంద్రాలు
రాగానురాగా ప్రబంధాలు
తెలుగు జాతిని శిలువ తీస్తున్న
తెలుగు ఖ్యాతిని నలుపు చేస్తున్న
విశాలాంధ్రను చీల్చజూస్తున్న
పిశాచాలను తరిమి వేస్తున్నా
రచన : 29 - 3 - 73, ఆకాశవాణి ప్రసారితం,
ముద్రణ: ఉపాధ్యాయ వాణి మాసపత్రిక - ఏప్రిల్, 1973
1. కళింగాంధ్ర: ఒరిస్సాకి విశాఖపట్నానికి మధ్యవున్న ఆంధ్ర ప్రాంతాన్ని కళింగంధ్ర అంటారు.
2. త్రిలింగాంధ్ర: కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం మధ్య వున్న ఆంధ్రదేశం.
3.కాకతీయుల మధురబంధాలు: కాకతీయుల కాలంలో శిల్పకళ వున్నతిని సాధించిందని చెప్తారు.రామప్ప దేవాలయంలో నాగిని శిల్పంతోపాటు కొన్ని బూతుశిల్పాలు చోటు చేసుకున్నాయి.