Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 11

    మొట్టమొదట్నే ఆశాభంగం చెందిన అతివలందరూ దిగాలుపడి పోయి ఇంక అక్కడుండీ ప్రయోజనం లేదని గ్రహించి కాళ్ళీడ్చుకుంటూ మరోలోకానికి పయనమయ్యారు.
   
                                                                             *    *    *
   
    చదువులతల్లి సరస్వతీదేవి నిలయం.
   
    ఆడవాళ్ళంతా అక్కడికి వెళ్ళేసరికి తన మానసవీణ మీద కొత్త స్వరాలు కూరుస్తున్నాది చదువులరాణి సాహిత్య వేణి.
   
    విచిత్రమేమిటంటే సరస్వతీదేవి దగ్గర కూడా బోలెడుమంది అసిస్టెంట్లు వున్నారు. వాళ్ళంతా ఎడా పెడా రావటం ఎడా పెడా అన్ని వాయిద్యాలతో వాయింపు. యమ బిజీగా ఉండి కొత్తవాళ్ళు ఎవరయినా వచ్చారా అని పట్టించుకోవడంలేదు. వాళ్ళ వాళ్ళ పనులు యంత్రాల్లా చేసుకుపోతున్నారు.
   
    అన్ని వాయిద్యాల హోరులో "నమస్కారం తల్లీ!" అని అరిచినా ఆమెకి వినపడక పోవచ్చునని.... వీళ్ళంతా తెలివిగా చేతులుమాత్రం జోడించి "సరస్వతీ! నమస్తుభ్యం వరదే..." అంటూ గట్టిగా స్తోత్రం జపించారు.
   
    విద్యాలరాణి సరస్వతీదేవి విజ్ఞానఖని కావడంవలన వీళ్ళ వినయానికి సంతసించి లేచి వీళ్ళ దగ్గరకొచ్చింది.
   
    అందరూ నమస్కారం పెట్టారు.
   
    "మీరు భూలోకవాసులు కదూ! ఏమిటి విషయం అంతా ఒక్కసారిగా కలసికట్టుగా వచ్చారు?" సరస్వతీదేవి అడిగింది.
   
    లీడర్ లీలారాణి ఓ అడుగు ముందుకేసి తనని తాను పరిచయం చేసుకొని చుట్టూ ఓసారి కలయచూసి-
   
    "పర్సనల్ గా మాట్లాడాలి తల్లీ! ఒక్క అయిదు నిమిషాలు మాకోసం స్పేర్ చేయండి" అంది వినయ విధేయలతో.
   
    సరస్వతీదేవి తల తాటించి "రండి లోపలికెళ్ళి మాటాడుకుందాము" అంటూ అటు పక్కకి దారితీసింది.
   
    అందరూ సంతసించి ఆమె వెనుకనే లోపలికి నడిచారు.
   
    లోపల-
   
    పద్మం, కమలంగాక రకరకాల పూలతో చేసిన ఆసనాలు వున్నాయి.
   
    సరస్వతీదేవి పద్మాసనం మీద కూర్చుని అందరినీ కూర్చోమనంగానే తలో పూవు ఆసనంమీద తలా ఒకరు కూర్చున్నారు.
   
    "మా కష్టాలు మీతో చెప్పుకొని మా కోర్కెలు తీరేలా వరాలు పొంది పోదామని వచ్చామమ్మా!" లీడర్ లీలారాణి డైరెక్టుగా రంగం లోకి దిగి మాట్లాడుతూ అంది.
   
    "మీ కోర్కెలు నాకు తెలుసు" సహజ గంభీర స్వరంతో తేట తెలుగులో చెప్పింది సరస్వతీదేవి.
   
    ఆమె మాటలు మధుర వాక్కులుగా మంజీరనాదంలా వినవచ్చింది వాళ్ళందరికి..." చెప్పకుండానే కష్టాలు తెలుసుకున్నందుకు ఆనందంతో హృదయం ఉప్పొంగగా కళ్ళనీళ్ళు చల్లగా మారి కనుల నిండుగా ఉబికాయి. చదువుల తల్లి చల్లని తల్లి" అంటూ దండకం చదివారు.
   
    ప్రసన్న వదనంతో సరస్వతీదేవి "మీ కష్టాలు నాకు తెలుసు. ఇంగ్లీషు నవలల్ని మక్కీకి మక్కీగా కాపీచేయడం రానందున మీ రచనలు పత్రికల్లో రావడం ఆగిపోయాయి. మీపేరు ప్రఖ్యాతులు అధఃపాతాళానికి వెళ్ళిపోయాయ్. మీలో చాలామంది రచయిత్రులు ఇంగ్లీషు సినిమాలు చూడరు ఇంగ్లీషు నవలలు చదవరు. మరికొందరికయితే ఇంగ్లీషు చదవడమే రాదు. మీలాంటివారు ఎలా కాపీ చేస్తారు? కథలు, నవలలు చదివే పాఠకులకి కూడా ఇంగ్లీషు నవలలు చదవడంవలన ఇంగ్లీషు సినిమాలు చూడనందువలన ఆ భాషలో ప్రావీణ్యం అంతంత మాత్రమే కావడంతో ఏ రచయితో ఓ ఇంగ్లీషు నవలను మక్కీకి మక్కీగా తెలుగులో దించితే అది చదివినవాళ్ళు "ఆహా....ఓహో..పరమాద్భుతం....ఇలాంటి రచన ఒక్కటంటే ఒక్కటి ఆడ వాళ్ళని రాయమను చూద్దాం" అంటూ రచయితల్ని పొగడి రచయిత్రుల్ని హేళన చేస్తున్నారు. ఒకనాడు వాస్తవ గాధల్ని రాసి కీర్తి శిఖరాలను అందుకొంది ఆడవాళ్ళు కాదా! అది చూసి గతిలేక గత్యంతరంలేక మగవాళ్ళు కూడా ఆడపేరు తగిలించుకుని రచనలు చేసేవాళ్ళు..." అంది సరస్వతీదేవి.
   
    మహా రచయిత్రి మహాదేవి కర్చీఫ్ తో సుతారంగా కళ్ళకద్దుకుని అంది "ఒక విధంగా మీరు చెప్పింది నిజమే. మరోవిధంగా చూస్తే ఎడిటర్లంతా మగళ్ళయి పోయారు. స్వజాతి పక్షపాతం. ('వీళ్ళకి పక్షపాతం రాను' లోలోపల తిట్టుకొంది) నేనీమధ్య ఓ పత్రికాఫీసుకి పాతిక సీరియల్ నవలలు, యాభయ్ కథలు స్వయంగా రాసుకొని వెళ్ళాను. ఆ ఎడిటర్ మహాశయుడు నా రచనలన్నింటినీ ఒకసారి అటూ ఇటూ కెలికి "మీ రచనలు తెలుగుకంపు కొడుతున్నాయ్ ఇలాంటి రచనలు మా పత్రికలో వెయ్యం. మా పత్రికలో మీ పేరును అచ్చులో చూసుకోవాలని వుంటే ఓ పని చెయ్యండి ఉత్తరాల శీర్షిక కి ఫలానా నవల బాగుందంటూ ఓ ఉత్తరం రాయండి. అది ప్రచురిస్తాం" అని ఓ ఉచిత సలహాకూడా నా మొహాన పారేశాడు."
   
    "మహాదేవి కష్టాలు మహాదేవిని. మరి నా కష్టాల మాటేమిటి? నేను కథలు రాయను నవలల జోలికి అసలు పోను. నాలుగు లైనులునుంచి పదిలైన్లవరకు కవిత్వం రాస్తాను అంతే. "ఇందు కలదు అందుకలదు ఎందెందు చూసినా అందూ కలదు. చూసే చూపుల్లో కలదు రాసే రాతల్లో కలదు తరతరాల్లో కలదు అది రెండక్షరాలు మాత్రమే దాని పేరు ప్రేమ" అంటూ కవయిత్రి కాంచనమాల కవిత ధోరణిలో అప్పటి కప్పుడే అక్కడి కక్కడే వో కవిత చదివి పారేసి "ఇంత మంచి కవిత్వం రాసుకొని వెళితే ఎడిటరు అన్ని చోట్లా ఉండేది దేవుడు ప్రేమకాదు. అంటూనవ్వి నా కవితని నా చేతుల్లోనే పెట్టి పొమ్మన్నాడు. వీళ్ళా ఎడిటర్లు! ఎడిటర్లంతా నశించాలి" చివరిమాట ఆవేశంగా అంది
   
    వెంటనే అందరూ
   
    "మగ ఎడిటర్లంతా నశించాలి. కాపీ రచయితలు నశించాలి. మూడర్దాల పాటలురాసే కవులంతా నశించాలి.
   
    నశించాలి-నశించాలి."
   
    అందరూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.
   
    అరుణ వర్ణం దుస్తులు ధరించిన అరుణేందిర పిడికిలి బిగించి ఆ చేతినలాగే గాలిలోకి లేపి "శ్రీశ్రీకాలం అయిపోయింది. శ్రీశ్రీలు మళ్ళీ పుట్టరు కాబట్టి ఇక పుట్టవలసింది ఆడవాళ్ళల్లో ఒక స్త్రీస్త్రీ ఆమె రాతలు చిరకాలం నిలిచిపోవాలి కలకాలం వర్ధిల్లాలి.
   
    "రాబోయే కాలంలో పుట్టబోయే 'స్త్రీస్త్రీ' కి ఇదే మా స్వాగతం సుస్వాగతం" అంది తనూ ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో అప్పడాలు వత్తి అమ్మే అప్పలనరసమ్మ.
   
    "స్త్రీస్త్రీకి జై" దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు అందరూ.
   
    "స్త్రీస్త్రీ కి ఇదే నా రెడ్ శాల్యూట్" అంది అరుణేందిర.

 Previous Page Next Page