Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 11

    అతను ఆవేశంగా చెపుతుంటే రమణ మధ్యలో అడ్డు తగిలి-
   
    "మరి మా సాయం దేనికి?" నాన్చుతూనే అడగదలిచింది అడిగాడు.
   
    "యుద్దానికి బయటు దేరే ముందు ఆయుధాలు ధరించి బయలుదేరాలి. మా యీ దుర్గాదేవి అయితే ఆమె చేతి లోని శూలం కత్తి వగైరాలు నాబోటి మీ బోటివాళ్ళు" అతను నవ్వుతూ సమాధానం చెప్పాడు.
   
    "మేము చేయవలసిన సాయం ఏమిటి? దానివల్ల మాకు అపకారం జరిగితే మా గతి ఏమిటి?"
   
    "మీకు చీమ తలకాయ అంతకూడా అపకారం జరగదు. మా గనీఖాన్ ప్లాన్ వేశాడంటే దానికింత తిరుగువుండదు....మీరు చేయవలసిందల్లా.... ..." ...అతను విషయం కళ్ళ ఎదుట కానవచ్చేలా వివరించాడు.

    "మా పధకం తయారయినప్పుడే ఈ యీస్థానాలలో ఈ యీ మనుషులు వుంటారు. వీళ్ళ పాత్ర యింతవరకు అని ఏర్పాటు చేయటం జరుగుతుంది. మా పథకంలో ఇప్పుడు ఈ కేసులో మొత్తం పదిహేడుమంది వుంటారు. పదిహేడు మందిలో నేను మీ ఇద్దరుకూడా వున్నారు."
   
    "మా ఆమోదం లేకుండానే?"
   
    "ఎవరి ఇష్టాఅయిష్టాలు ఆమోదాలు స్వయం నిర్ణయాలు మాయీ దగ్గర వుండటానికి వీలులేదు. ఇంతకీ మీరు ఒప్పుకున్నారా లేదా?"
   
    "ఒప్పుకోక..."
   
    "...పోతే ఏం జరుగుతుంది అంటావ్! మా రహస్యాలు మీ ముందువుంచినతరువాత ఒప్పుకు తీరాలి కాదంటే శక్తిమాయి మీకు వేసే శిక్షకి బలి కావాలి."
   
    "ఇది అన్యాయం" రాజు అరిచినంత పని చేశాడు.
   
    "న్యాయపోరాటం__అన్యాయం అనేమాట మా యింటవంట మా శక్తి మాయిమనుషులకి లేదు."
   
    "మేము కాస్త అవతలికి వెళ్ళి చర్చించుకు వస్తాం."
   
    "చర్చించుకోండి బాగా డీప్ గా వెళ్ళి ఆలోచించి నిర్ణయం తెలియజేయండి. మీ నిర్ణయమే మిమ్మల్ని రక్షించటమో శిక్షించటమో చేస్తుంది. అది మాత్రం మరవద్దు" గంభీరంగా అన్నాడు అతను.
   
    రాజు, రమణ అవతలికి వెళ్ళి చర్చించుకుని వచ్చారు.
   
    "ఏం నిర్ణయించుకున్నారు....?" అతను నవ్వుతూ అడిగాడు.
   
    "మాకు కొన్ని అనుమానాలు వున్నాయి, అవి అడుగుతాం. తీరిస్తే..."
   
    "అడగండి....ఆహరం పట్ల వ్యవహారంపట్ల మొహమాటం వుండకూడదు."
   
    రాజు, రమణలు ఎన్నో అడిగారు. అన్నింటికి తడుముకోకుండా జవాబు ఇచ్చాడు అతను...
   
    అప్పటికే శక్తిమాయి గురించి ఆ నోట ఆ నోట బోలెడు కధలు విని ఉన్నారు వాళ్ళు. శక్తిమాయి ఓ కేసుని చేపట్టింది. ఆమోదం తెలిపితే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలకి (కానిస్టేబుల్స్) ప్రాణానికి ప్రమాదంకావచ్చు. కాదంటే ఉద్యోగం మాట తర్వాత పంచప్రాణాలు హరీ అనటం మాత్రం తధ్యం. ఇప్పుడున్న ఇన్ స్పెక్టర్ లంచగొండి, కాముకుడు....అన్ని చెడ్డ అలవాట్లకి అవుపోసన పట్టినఅఖండ అల్పుడు....లాభం లేనప్పుడు ఎటు పని చేసినా ఒకటే.
   
    విషయం బయటపడితే ప్రమాదం. బయటపడకపోతే ఏమీ లేదు. ఇప్పుడు శక్తిమాయి మాట కాదంటేమాత్రం పూర్తి ప్రమాదం. పీకవరకు ఊబిలో కూరుకుపోయినట్లే....
   
    రాజు రమణలు ఒప్పుకున్నారు.
   
    అతని రాయబారం ఫలించింది.
   
    "మీరు మామూలుగా డ్యూటీలో వుండండి. రాత్రి పన్నెండు దాటగానే కంటికి కానరాని మత్తు గ్యాస్ గాలిలో వదులుతాము. డ్యూటీలో ఉండికూడా నిద్రపోయే మీ బుద్దావతారం ఇన్ స్పెక్టర్ గ్యాస్ గాలి పీల్చి మరింత నిద్రపోతాడు. అక్కడక్కడ డ్యూటీలో వుండే మరికొందరు కూడా రెండుగంటల కాలం నిద్రపోతారు. నీ చేతికి గాయం అయినట్లు మా వాళ్ళు మేకప్ చేస్తారు. మీ ఇద్దరూ కల్సి బన్సీలాల్ ఇంటికి వెళతారు....వెళ్ళిన తరవాత ఈ యీ...రకంగా మీరు చేయాలి. బన్సీలాల్ ఇన్ స్పెక్టర్ కి ఫోన్ చేస్తే మేము పలుకుతాం....అవన్నీ మేము చూసుకుంటాం.
   
    ఆ తర్వాత__
   
    "మీరు తిరిగి వచ్చిన తరువాత ఓ రకమైన టాబ్ లెట్ యిస్తాం. మీరు అధి మింగండి....రెండురోజులు గాఢనిద్రలో వుంటారు. ప్రాణాపాయం వుండదు. ఓ రకమైన ఆకుపసరు లేహ్యం మీ వంటిమీద అక్కడక్కడ పూస్తాం. దెబ్బలు తగిలితే కమిలి వాచినట్లు వాస్తుంది. మీకు తెలివి వచ్చిన తరువాత చెప్పవలసిన కథ చెపుతాను. ఇరువురు అలాగే చెప్పండి....మీరు మా మాట వింటే అణుమాత్రం ప్రమాదం రాకుండా మేము చూసుకుంటాం..."
   
    అతను వెళ్ళబోయేముందు రమణ అడిగాడు.
   
    "శక్తిమాయి అనే ఆమె నిజంగా వుందా?"
   
    "మీ కెందుకు వచ్చింది ఈ అనుమానం?"
   
    "లోకులు రకరకాలుగా అనుకుంటున్నారు. ఆ నోట ఆ నోట వినటం తప్పించి మాకు మాత్రం ఏం తెలుసు? ఓ ముఠాకి నాయకురాలు వుంది...అని ఒకరు, అలాంటిదేమీ లేదు వుంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి  కనపడదా? శక్తిమాయి వుందని ప్రచారం చేస్తూ వున్న ముఠాకి నాయకుడు మగవాడేనని కొందరు తలోరకంగా అంటున్నారు" రాజు అన్నాడు.

 Previous Page Next Page