Read more!
Next Page 
దివిసీమ ఉప్పెన పేజి 1

                                 

   
                                  దివిసీమ ఉప్పెన ప్రళయానికి  

                                   46 ఏళ్ళు పూర్తి 


    
    సముద్రఘోషతోనే గడిచిపోయింది. ఆవులు ఆకాశాని కేసి చూసి అంబా అని అరిచాయి. కుక్కలు యిళ్ళెక్కి యేడ్చాయి. రానున్న భీభత్సానికి భీతావహమైన ఆ రేయి నాంది పలికింది.
    
    తెల్లవారింది శనివారం వచ్చింది. అది శనివారం కాదు. దివిసీమకే శనివారమయింది. హోరుగాలిలో వూగిసలాడి చెట్లు విరిగిపోతున్నాయి. పూరిపాకలు పడిపోతున్నాయి. తుఫానుకు తట్టుకోలేక పశుపక్ష్యాదులు తల్లడిల్లిపోతున్నాయి. ప్రజలంతా జట్టులు జట్టులుగా ఒకరినొకరు పట్టుకొని గట్టిగా వున్న  ఇండ్లకు జేరుకొన్నారు. గాలివేగంలో తాము జేరాలనుకొన్నచోటికి జేరలేక, మరొక చోటికి చేరుకొంటున్నారు. కొందరు యెగిరిపోయే యిండ్లను మోకులతో బిగిస్తున్నారు. వలతో ఇండ్లకప్పుల్ని కప్పుతున్నారు. కొందరు ఎవరి కుటుంబాలను వాళ్ళు కాపాడుకొనటానికి యెంతో శ్రమ చేస్తున్నారు ప్రాణాలను కూడ లెక్కచేయకుండా ఇండ్ల కప్పుల పై నిలబడి శ్రమ చేసే అనేకమంది యువకులను నేను కళ్ళారా జూశాను.
    
    శనివారం మధ్యాహ్నము 12 గంటలయింది. జోరుగా వీచే హోరుగాలి. ప్రళయ భీకరమైన సముద్రఘోష నేలకొరిగే యిండ్లు గాలిపటాలులా యెగిరి పోయే యిండ్ల కప్పులు, విరిగి పడిన చెట్లు, ముళ్ళమండలచే పూడిపోయిన బాటలు ఒకటేమిటి? చిందర వందరై ప్రతి ఒక్కటి గందరగోళాన్నే చూపిస్తున్నవి. తలదాచుకొనేటందుకు సరైన కొంప యెచ్చటా కనుపించలేదు, మా యిల్లే కొంచెం గట్టిగా వుంది, మాకు దగ్గరలో వున్న వాళ్ళంతా మా యింటికి వచ్చారు. అప్పటికే నా ఆస్పత్రి పై కప్పు యెగిరిపోయింది. రేకులు దూలాలు షుమారు ఫర్లాంగుదూరములో పడ్డాయి. అదృష్టవశాత్తు వాటి క్రింద యెవరూ పడలేదు. దానిలో వున్నవాళ్ళుకూడా యింట్లోకే వచ్చారు.

    మధ్యాహ్నం ఒంటిగంటయింది. గాలి తూర్పు నుంచి చాలా ప్రమాదస్థాయిలో వస్తోంది. తలుపులాగటంలేదు. లోపలిగడియలుపీక్కుపోయాయి. లోన పలుగులు వేసి తొక్కి పట్టుకొన్నాము. కప్పిన వెలిశ నుంచి కర్రలు జారి పడటం మొదలు పెట్టాయి. గోడబలంగా రెండు మూడుసార్లు వూగింది దూలాల క్రిందుగా నెర్రియిచ్చింది. ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారి యేడవటం మొదలు పెట్టారు. తలుపు లటూ యిటూ కొట్టుకొని బ్రద్దలయిపోతున్నాయ్. ఇంటి నడికప్పు యెగిరిపోయింది. ముందుగోడ పడిపోయేటట్టుంది. ఒక్కక్కరే మొత్తమంతా వెనుక వసారాలోకి జేరుకొన్నాము, తలుపు నాపలేక వదిలేశాము. వాన నీళ్ళు యింట్లో చీలమండలలోతు పడ్డాయి. చలితో నిలువెల్ల వణికి పోతున్నాము. కొందరు నిలబడలేక నీళ్ళలో చతికిల పడ్డారు.
    
    మధ్యాహ్నం రెండు గంటలు కావచ్చింది. గాలి ఆగ్నేయ దిశకు మారింది. ఈ గాలిలోనె ఉప్పెన వస్తుందని పెద్ద వాళ్ళంటున్నారు గాలి వేగం వున్నకొలది తారస్థాయి నందుకొంది, షుమారు గంటకు 200 కిలో మీటర్ల వేగం వుండవచ్చు. రేడియోలు పని చేయటం మానేశాయి. చాలా భీతావహంగా వుంది. షుమారు మూడు గంటల సేపు అలాగే వుంది. సాయంత్రం నాలుగు గంటల తరువాత ఒక్కసారిగా ఆ వుద్రేకం తగ్గింది. కొంతమంది ధైర్యము చేసి యెక్కడైనా మంచి కొంపలున్న వేమోనని వెతుకుతున్నారు. మాకు దగ్గరలోనే కృష్ణానది వుంది. దానిలో నీరు ఎంతో ఎత్తున ప్రవహిస్తుంది. చూస్తుండగానే కరకట్టను తాకింది మాకు తూర్పులో ఒక పెద్ద చెరువుంది. దాని కట్టలు పొర్లిపోయాయి. ఉప్పెన వస్తుందని మేమంతా కంగారు పడ్డాము. ఇంతలో గాలి మారింది. దక్షిణ దిశ నుంచి వస్తుంది దీనినే "పైగాలి" అంటారు. దీనిలో కూడా మాకు యెక్కువ నష్టమే కలిగింది. ప్రొద్దు గూక వచ్చింది. బయటేమి జరుగుతుందో మాకు కనుపించలేదు. ఉప్పు నీటివాగ మా యింటి వాకిటి వరకు వచ్చింది. యెక్కడ యేమి జరుగుతోందో తెలియదు చీకటిమయం. అప్పుడప్పుడు తీగల్లా మెరుపులు నలువైపులా కనుపిస్తున్నవి.
    
    శనివారం రాత్రి 11 గంటలు కావచ్చింది. గాలి పడమట దిశకు మారింది. వేగంతో మొదట కొంత వరకు మార్పేమియును కనిపించలేదు. మా యింటి రాళ్ళు ఊడిపడటం మొదలు పెట్టాయి. మేమంతా ప్రాణాల పై ఆశలు వదలుకొన్నాము. కనీసము తల దాచుకొనేందుకయినా మేమున్నచోట ఒక పక్కా బిల్డింగు కూడా లేదు. చలివణుకెడుతోంది. మగ వాళ్ళమంతా వెనుక వసార తలుపుల దిమి పట్టుకొన్నాము. ఆ రాత్రి ఒంటిగంట తరువాత గాలి క్రమేపి తగ్గటం మొదలుపెట్టింది. అంత వొడలెరుగని శ్రమ జేసిన మేము, సొమ్మసిల్లి ఒకరి ప్రక్కన ఒకరు కుప్పగా కూలిపోయాము.

 

                         
    
    తెల్లవారింది. తుఫానుపోయింది, అక్కడక్కడ మబ్బులున్నా పొద్దు కనబడుతోంది. ఇరగని చెట్టు గాని, పడిపోని యిల్లుగాని లేదు. పశువులు పోయాయి. పంటలు పోయాయి. బంధువులు పోయి యెక్కడివాళ్ళక్కడ యేడుస్తున్నారు. నాకు అత్యంత ఆప్తులు కమ్మవారు. వాళ్ళు ఏడు కుటుంబాల వాళ్ళు యేటొడ్డున కాపురముంటున్నారు. వాళ్ళంతా చనిపోయివుండవచ్చనుకు న్నాను. వాళ్ళని చూడటానికి బయలుదేరాను. మా యింటికి వాళ్ళున్న చోటుమూడు ఫర్లాంగులుంటుంది. ఉప్పెనకు ముళ్ళకంపలు కొట్టుకొని వచ్చి తెట్టువపట్టింది. బాటలన్నీ వొండ్రుపట్టివున్నవి. నడవడం చాలా కష్టంగా వుంది. ఎక్కడ చూసినా ఒకదాని ప్రక్కనే ఒకటి పశువుల కళేబరాలు, యేటి ఒడ్డు పొడువునా పడివున్నవి. కర్రపోటీ వేసుకుంటూ వాళ్ళున్న చోటికి చేరాను. అక్కడొక చెరువుంది. దాని నిండా చచ్చిపోయిన పశువులే. షుమారు నూరుకు మించి వుండవచ్చు. వాటిని జూసి నా కళ్ళ వెంట అప్రయత్నంగా నీరొచ్చింది. నా మితృలంతా బాగానే వున్నారు. అతికష్టం పై వాళ్ళంతా ప్రాణాల్ని కాపాడుకోగాలిగారు. వాళ్ళను జూచి యింటికి తిరిగి వచ్చాను.

    నా బంధువులెవరూ నావద్ద లేరు. నేను వాళ్ళందరినీ వదలి యీ లంకలో కాపురముంటున్నాను. వాళ్ళేమయ్యారో నాకు తెలియదు. మేమేమయ్యామో వాళ్ళకు తెలియదు. నేను యెట్లా వెళ్ళేది? యెటు పోదామన్నా రేవు. దాటటానికినావలు లేవు. ఆదివారమంతా ఆ ఆలోచనతోనే గడచిపోయింది సోమవారంనాడు భోజనం చేసి బయలుదేరాను. యెట్లాగో కష్టపడి యేరుదాటాను. ఎక్కడ చూసినా పశు కళేబరాలే! వందల కొలదిగ పడివున్నవి. వాటిని కళ్ళారాచూచి పెల్లుబికే దుఃఖాన్ని దిగమ్రింగుతూ ఏటిమొగ జేరాను. మేడలు తప్ప మిగిలిఉన యిళ్ళన్నీ కొట్టుకపోయాయి. రాతి గోడల యిండ్లు మాత్రం యింటి పట్టుకొద్దిగా గుర్తులు తెలుస్తున్నవి. ఆ వూరిలో షుమారు 12 అడుగుల నీరు ప్రవహించి వుండవచ్చు. గ్రామస్థులంతా దాబాలపైకి ఎక్కి ప్రాణాలను దక్కించుకొన్నారు. ఆ వూరునకు పడమటవైపున కరకట్టవున్నది. అది అక్కడక్కడా గండ్లుపడి కొట్టుకపోయింది ఆకట్ట 12 అడుగుల యెత్తు వుండవచ్చు. ఆకట్ట కొట్టుకపోవుటచేతనే ఆ గ్రామంలో కొంతమందయినా బ్రతకగలిగామని చెప్పారు. అక్కడనుంచి కాలువకట్ట యెక్కాను. కాలి నడకనే ముందుకు సాగిపోతున్నాను.
    
    కాలువకట్టను లోగడే కంకరరోడ్డుగా మార్చారు. దీని మీద కార్లు వచ్చిపోతుంటాయి. ఇప్పుడు కార్లులేవు సరికదా కంకర్రాళ్ళు కూడా లేవు. అక్కడక్కడ రోడ్డుకడ్డంగా నాలుగు నావలు మాత్రం పట్టివున్నవి. అవి సొర్లగొందినుండి వచ్చి యుండవచ్చు. ఆ రోడ్డు ప్రక్కనే కరెంటు స్థంభాలున్నవి. అవిభిన్న భిన్న రీతుల్లో ఆ నాటి తుఫాను బలాన్ని ప్రదర్శిస్తున్నవి. కొన్ని 'జే'లువలెను, మరికొన్ని 'జడ్'ల వలెను ఇంకొన్ని మెలివేసిన తాటినారమట్టలవలెను కన్పట్టుచున్నవి. రోడ్డంతా తెట్టువపట్టివుంది. నడవటానికి వీలుకావడంలేదు. అతి కష్టంపై పెదపాలెం లాకు వద్దకు జేరుకున్నాను. అక్కడనుంచి కాలువ కట్టమీద నడవాలి. అసలైన ఉప్పెన బీభత్సమంతా ఆకట్ట పైన కనబడుతుంది. ఇళ్ళు, వాములు ఆ కట్టనిండా పట్టాయి, కాలువ నిండా శవాలు, తేలియాడుతున్నాయి. దానిమీద నడవడమే చాలా కష్టంగా వుంది. కాలువకట్టకు గంట్లుపడ్డాయి. ఒక్కొక్కచోట తొడ లోతుకు మించి సుడిగుండాలు కూడా పడ్డాయి. ఎట్లయితే కష్టపడి పర్ర చివరకు జేరుకున్నాను.

 

                      
    
    పల్లపుగ్రామాల నుంచి జనం జట్లు జట్లుగా వలస పోతున్నారు. సముద్రపు ఒడ్డునుంచి 15 కిలోమీటర్ల దూరంవరకు తీరం వెంటనున్న గ్రామాలన్నీ కొట్టుకపోయాయి. ఆపైన నాలుగైదు కిలోమీటర్ల వరకు ఉప్పునీటి పోటు పొడిచింది. పంటపొలాలు పాడైనాయి. వేసిన కుప్పలు కొట్టుకపోయాయి. లక్షలకొలది పశువులు పోయాయి. వేలకు వేలు జనం పోయారు. మిగిలిన వారుజీవచ్చవాల్లా గున్నారు. ఎటు చూసినా తుఫాను భీభత్సాలతో హృదయ విదార కంగా వుంది. అప్పుడప్పుడు ఆకాశాన హెలీకేఫ్టర్లు వచ్చిపోతున్నవి. అక్కడక్కడా ఆహారపదార్దాలను జారవిడుస్తున్నవి. రాష్ట్రపతి మొదలు నాయకులంతా ఒక్కొక్కరే వచ్చిపోతున్నారు. డాక్టర్లు, యాక్టర్లు ఒకరేమిటి వేలకొలది మానవతావాదులు తమ సానుభూతిని చూపిస్తున్నారు. విదేశాలనుంచి కూడా అనేకమంది దాతలు వచ్చి సహాయ సంపత్తులందిస్తున్నారు.
    
    నాలుగురోజుల తరువాత నాగాయలంక వెళ్ళాను. కాలు పెట్టేదానికి సందులేదు. బజార్లన్నీ జనంతోకిక్కిరిసి వున్నాయి. ఆహారపదార్దాలను తీసుకొని అనేకమంది దాతలు వస్తున్నారు. వచ్చేలారీలచుట్టూ వందలాది జనం మూగుతున్నారు. వీళ్ళంతాఉప్పెన బాధితులే. కట్టుగుడ్డలులేవు. కడుపునిండా తిండిలేదు. అరవైఎకరాలు వున్న రైతులు కూడా ఆకలికి ఆగలేక అందించే అరటిపండ్లకు చేతులు జాస్తున్నారు.
    
    అతికష్టముపై అవనిగడ్డ చేరాను. మా ప్రతినిధి మండలి వెంకట కృష్ణారావుగారిని కలుసుకొనవలయునని నా వుద్దేశము. అందుకనే ఆయనగారింటికి వెళ్ళాను ఎక్కడ జూచినా జనమే. గాంధీక్షేత్రములో కాలుపెట్టేదానికి సందులేదు. వచ్చేవాళ్ళు, పోయే వాళ్ళు వాళ్ళందరిని పరామర్శించే మండలి దంపతులు కడలిపొంగును చూడలేకపోయినా కదలి వచ్చిన ఈ జనప్రవాహాన్ని జూచి ఆశ్చర్యపడనివారు లేరు. ఒకప్రక్క ఉప్పెన బాధితులు, మరోప్రక్క వారికి సహాయము చేయుటకు వచ్చిన దాతల సమూహాలు వీరంతా యేమేమి చేయాలో తగిన రీతిని సలహాలిస్తున్న మండలి ఆయన్ని కళ్ళారా చూశాను. నాకళ్ళను నేనే నమ్మలేకపోయాను. మాసినగడ్డం, చెరగని కన్నీటి చారలు, వివర్ణమైన మోము పైకి కట్టిన పంచి, తలకు చుట్టినతుండు, సామాన్య రైతు వేషము. రెండుకాళ్ళకు కత్తులు కట్టబడి వున్నవి. ఒకచేతికి దీక్షాబంధము కట్టబడి యున్నది. దీనజన రక్షా దక్షుడైన ప్రజాబంధు మండలిని చూడగానే కళ్ళవెంట అప్రయత్నముగా నీళ్ళు వచ్చాయి. ఉప్పెన రాకాసికోరల్లో చిక్కుకొని కకావికలైన దివిసీమకు ప్రతీకంగా మండలి కనిపించారు. ఆయన్ని చూడగానే దుఃఖం ఆగలేదు. నా దుఃఖాన్ని నాలోనే మ్రింగి, ఆయన చేస్తూన్న నిర్విరామకృషికి ముగ్ధుడనయ్యాను.
    
    వారింటికి దగ్గరలోనే గాంధీక్షేత్రం వుంది. అది ప్రభాకర్ జీచే ప్రభావితమైంది. దానిలోనే హేమలతా, లవణంగార్లున్నారు. వారి కృషి ఆత్యద్భుతంగా వుంది. ఆ అమృత మూర్తుల ఆదరణతో ఉప్పెనబాధితులు కొంచెం కోలుకొంటున్నారు. అదిజూచిన ఆనందంతో నేను నా యింటికి జేరుకున్నను.
    
    కాలందొర్లి పోతోంది. రోజులు గడిచిపోతున్నాయ్. ఎక్కడ చూచినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నవి. ఎక్కడ విన్నా ఉప్పెన బాధితుల విషాదగాథలే వినవస్తున్నవి. ప్రతి గ్రామానికి వెళ్ళి చూశాను. ప్రతి ఒక్కరిని కలుసుకొన్నాను. వారు చెప్పిన యదార్ధ విషయాలను "ఉప్పెన వాటి ఉదంతాలు" అను పేరుతో మీకు అందజేస్తున్నాను. ఈ 'ఉదంతాలు' యుగాంతాళ వరకు చరిత్ర సత్యాలుగా పాఠక లోకం గుర్తింతురుగాక! ఆర్ద్ర హృదయంతో ఉప్పెన బాధితుల నాదరింతురు గాక!!                               

Next Page