Read more!
Next Page 
వెన్నెల వొణికింది పేజి 1

                                 


                                           వెన్నెల ఒణికింది
    
                                                                            --కొమ్మూరి వేణుగోపాలరావు
    
    
                                  

 

     చిన్మయి మొదట్నుంచీ చాలా క్రమశిక్షణతో పెరిగింది.
    
    తెల్లవారుఝామునే లేవడం, స్నానం చేశాక ఓ అరగంటసేపు పూజ చేసుకోవడం, తర్వాత స్కూలుకు వెళ్ళేదాకా పుస్తకాలు పట్టుకోవడం, స్కూల్లో కూడా చాలా మితంగా మనసుకి నచ్చినవాళ్ళతో మాత్రమే స్నేహం చేయడం, వాళ్ళతోకూడా అతిగా మెలక్కుండా మౌనంగా మాట్లాడుతూ, వాళ్ళ యిళ్ళకు వెళ్ళకుండా వాళ్ళు తమ యింటికి రాకుండా జాగ్రత్త పడుతూ అంటీ అంటనట్లుగా వుండటం, రాత్రి పదిగంటలదాకా పుస్తకాలు ముందేసుకుని కూచోవడం, నెలకు ఏ ఒక్కసారోగాని సినిమా చూడకపోవడం...
    
    ఆమె అంత క్రమశిక్షణతో మెలగడానికి ముఖ్యకారకురాలు తల్లి.
    
    తమ బంధువుల్లోకాని, స్నేహితుల్లోకాని, పరిచయస్థుల్లో కాని తాను చూసిన ఎన్నో అనుభవాలు.... కులంగాని కులంవారిని తల్లిదండ్రులకిష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకోవడం, మరీ మొండికేసిన తల్లిదండ్రులుంటే లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లలు బరితెగించి ప్రవర్తించడం, విచ్చలవిడిగా తిఒరగడం, పిచ్చి పిచ్చి అలవాటులన్నీ చేసుకోవటం.....ఆమెకెంతో భయాన్ని కలిగించాయి. భర్త ఉద్యోగధర్మంమీద తీరిక లేకుండా వుంటూ పిల్లల పెంపకాన్ని గురించి శ్రద్దతీసుకునే స్థితిలో లేనందువల్ల ఆమే అన్ని విషయాలూ చూసుకునేది.
    
    చిన్మయి బి.ఏ. పాసయ్యాక ఆమెను యింకా పైకి చదివిద్డామని భర్త ఉత్సాహపడినా, చుట్టుపక్కాలు సలహాలిచ్చినా తల్లి వినిపించుకోలేదు. వాళ్ళకు వున్నది ఓ కొడుకూ, కూతురూ కొడుకెలాగూ చదువులో పైకివస్తూనే వున్నాడు. మంచి ఉద్యోగస్థుడయి తీరతాడు. కూతురు పైకి చదివినకొద్దీ వయస్సు మీరిపోతుంది. ఇరవైఆరు ఇరవైఏడేళ్ళు వచ్చాక మంచి సంబంధాలు దొరకటం కష్టం. దారుణంగా రాజీపడాలి. అలా రాజీపడి పెళ్ళిళ్ళు చేసుకుని జీవితాలు దుఃఖమయం చేసుకున్న వాళ్ళను ఎందర్నో చూసింది. వున్నది ఒక్క కూతురు. పెద్దపెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసి ఏదో వెలగ పెట్టాలన్న కోరిక తనకేమీ లేదు. చిన్మయి చక్కగా కాపురం చేసుకోవాలి. కూతురైనా నిండయిన సంసార జీవితమనుభవించాలి. చిన్మయి ఎదురు చెప్పలేదు. విజయలక్ష్మిగారు కూతురికోసం సంబంధాలు గాలించసాగింది.
    
    నాలుగైదు నెలల్లోనే ఆమె ప్రయత్నం ఫలించింది.
    
    ఆ పెళ్ళికొడుకు పేరు రాజీవ్. ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ పాసయి మద్రాసులో ఉద్యోగం చేస్తున్నాడు. కుర్రాడు రూపవంతుడు, గుణవంతుడు. ఇతరులు చెప్పినదాన్ని బట్టి అతను ఆమెకి బాగానచహాడు. చిన్మయి తండ్రికి కూడా నచ్చాడు. చిన్మయి ఎంతవరకూ చూసిందోగాని తనకికూడా బాగా నచ్చినట్టు చెప్పింది.
    
    ఇక్కడింకో ముఖ్యవిషయం వుంది. రాజీవ్ మాతృభక్తి పరాయణుడు. అతనిపైన ఇంకా యిద్దరన్నలున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయినాయి. రాజీవ్ కి విదేశాలకు వెళ్ళే ఆలోచన వుంది. అక్కడ ఉద్యోగంగానీ, ట్రైనింగ్ అవకాశం గానీ వస్తే అవన్నీ పూర్తిచేసుకుని తర్వాత పెళ్ళి చేసుకునే ఉద్దేశముందిగానీ, తల్లి జగదీశ్వరిమాట జవదాటలేక యీ సంబంధానికి ఒప్పుకున్నాడు. అంతే గాక చిన్మయి అతనికి మనస్పూర్తిగా నచ్చింది.
    
    పెళ్ళి జరిగిపోయింది.
    
    పెళ్ళయిన మొదటి ఇరవైరోజులూ జగదీశ్వరి కోడలిని తనదగ్గర అట్టే పెట్టుకుంది.
    
    ఆమెకు చిన్మయి బాగా నచ్చింది. ఈకాలం పిల్లలాగా హళ్ళూ పెళ్లూ లేకుండా నిరాడంబరంగా, నింపాదిగా సహజ సౌందర్యంతో విలసిల్లే చిన్మయి ఆమె మనసునెంతో ఆకట్టుకుంది. ఆమె కోడల్నెంతో ప్రేమించేది. కానీ ఎంత ప్రేమవున్నా అత్తగారి మర్యాదలు పొందాలన్న చిన్న చిన్న కోరికలు ఆమెకు వుండేవి.
    
    మంచంమీద వంట్లో బావుండనట్లు పడుకొని 'ఇదిగో చిన్మయీ! నాకు నీరసంగా వుందిగాని ఆ మంచినీళ్ళు ఇలా పట్రా అమ్మా చిన్మయీ! నాకు బత్తాయితొనలు వలిచి పెట్టమ్మా చిన్మయి! నాకు తలనొప్పిగా వుందిగాని ఆ అమృతాంజనం రాసి, తల నొక్కమ్మా, చిన్మయీ! నాకు నడుస్తూంటే కళ్ళు తిరుగుతున్నాయిగాని నన్ను బాత్రూందాకా నడిపించమ్మా.'
    
    చిన్మయి మనసులో ఏమనుకునేదోగానీ, అత్తగారి మాటమాత్రం తు.చ. తప్పకుండా ఆచరించేది.
    
    జగదీశ్వరి కోడల్ని చూసి చాలా సంతోషించింది.
    
    ఆమె కొడుకుతో మద్రాసు కాపురానికి వెళ్ళిపోతున్నప్పుడు కళ్ళనీళ్ళుకూడా పెట్టుకుంది. తన మెడలోనీ చంద్రహారం తీసి కోడలి మెళ్ళో వేసింది. ఈ దృశ్యంచూసిన పెద్దకోడలు పళ్ళు కొరుక్కుంది చాటుగా. అది వేరే విషయం.
    
    రాజీవ్ మద్రాసులో రాయపేటలో ఓ పోర్షన్ అంతకుముందే అద్దెకు తీసుకున్నాడు.
    
    మూడుగదుల పోర్షన్ కిచెన్, బాత్ రూం అన్నీ బాగానే వున్నాయి.
    
    చిన్మయి సంసారజీవితం మొదలయింది.
    
    ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దనుకున్న రాజీవ్ కు జీవితం మధురాతి మధురంగా కనిపించింది. ఆఫీస్ నించి ఇంటికిరాగానే టిఫెనూ అదీ పూర్తిచేసుకుని స్కూటర్ మీద భార్యను కూచోబెట్టుకుని బయటకి తీసుకువెళ్ళిపోయేవాడు. ఒకరోజు బీచ్ కి, ఒకరోజు సినిమాకి, ఒకరోజు ఎగ్జిబిషన్ కు, ఇంకోరోజు మౌంట్ రోడ్ కు, మరోసారి ప్యారిస్ కార్నర్ కు...
    
    రాత్రుళ్ళు సాధారణంగా హోటల్స్ లోనే భోజనం చేసేవారు ఒకసారి ఫుడ్ లాండ్స్ లో, ఇంకోసారి సామ్ గ్రోవ్, మరోసారి అశోకా హోటల్...
    
    ఓసారి చోళాకి బఫే డిన్నర్ కి తీసుకెళ్ళాడు వైవిధ్యంకోసం ఇద్దరూ వెజిటేరియన్సే. అక్కడంతా నాన్ వెజిటేరియన్ మయంగా కనిపించింది. శాఖాహారపు డిషెస్ ఎక్కడున్నాయో కష్టంమీద వెదుక్కోవలసి వచ్చింది.
    
    ఇంటికొచ్చాక చిన్మయి బాధగా అంది. "అలాంటిచోట్లకు మనం వెళ్ళవద్దండీ. మనస్సు అంగీకరించనిచోటికి వెళితే యిరుక్కున్నట్లుగా వుంది" అంది.
    
    రాజీవ్ ఆమెమనసులోని చికాకును అర్ధం చేసుకున్నాడు. "నీకిష్టంలేని పని ఎప్పుడూ చెయ్యను చిన్మయీ" అన్నాడు.

Next Page