Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 9


    "కనుక నీవు ఆ వీర ఝాన్సీని ఆ వీర రుద్రమని నాకు చూపాలి."

    "తప్పకుండా" మాట ఇచ్చాడు చంద్ర.

    చంద్ర చెప్పింది విని ఆ పిల్లదాని కథ బొత్తిగా నమ్మలేదు ఇందర్. కాదంటే చంద్ర బాధపడి పోతాడని నమ్మినట్లు నటించాడు.

    "పిల్లా! నీవు రుద్రమవి కావు ఝాన్సీవి కావు. జిత్తులమారి ఎత్తులు వేసే అరవిల్లి నాగమాంబవి.

    నీవు ఎప్పుడో అప్పుడు నాకంట పడకపోవు. నీ ముక్కు పిండకపోను. చంద్రలాంటి అమాయకుడితో ఆటలాడావ్. అదే నేనయితే అక్కడే సఫా" అనుకున్నాడు ఇందర్.

    ఇందర్ భాషలో సఫా అంటే చంపటం వఫా అంటే లొంగ దీసుకోటం. వఫాలు సఫాలు చేయటం ఇందర్ కి అలవాటే.

    చంద్ర తల్లితండ్రులకి డబ్బు, దస్కం బాగానే వుంది. వాళ్ళు పల్లెటూరులో వుంటున్నారు. తండ్రి డబ్బు పంపిస్తుంటే చంద్ర ఇక్కడ దర్జాగా రెండు గదుల సప్రేట్ పోర్షన్ తీసుకుని హాయిగా బి.ఎ. చదివేస్తున్నాడు. చదువుమీద కన్నా కవిత్వం రాయాలనే పైత్యం సినిమాలు పత్రికలు చీకూచింతాలేని జీవితం అనుభవిస్తున్నాడు. ఇందర్ చదువుకి తెలివితేటలకి తగ్గ వుద్యోగం రాలేదు. ఏదో చిన్న కంపెనీలో చిన్న జాబ్ చేస్తున్నాడు. చంద్ర రూమ్ లోనే ఇందర్ కూడా వుంటున్నాడు. వాళ్ళిద్దరి బుద్దులూ తూర్పూ పడమర అయినా ప్రాణ స్నేహితులు.

    "నేను రేపటినుంచి ఒకటి చేయాలనుకుంటున్నాను" ఇందర్ అన్నాడు.

    నానా శ్రమపడి పద్మాసనం వేసిన చంద్ర ఆ కాళ్ళు తిమ్మిరెక్కటంతో కాళ్ళు సరిచేసుకోటానికి కష్టపడుతూ "రేపటినుంచీ నీవూ ఆసనాలు వేస్తావా?" అన్నాడు.

    "అరె శేఖరాయ్ ! ఆసనాలు  నేలమీద వేయాలి. అంతేగాని మంచంమీద అందునా మూరెడు లోతు పట్టా కిందకు దిగిన మడత మంచంమీద అసలు వేయరు."

    "ఇప్పటికే నా కాళ్ళు నా ఆధీనంలో లేవు. యింకా కింద కూడానా! అద్సరే, నీకేం చెప్పాను నా పేరు చంద్రశేఖర్ కాదు చరణసింగూ కాదు, చంద్రశేఖర్ ఆజాద్ అని....అవునా?"

    "సారీరా అలవాటులో పొరపాటు."

    "వక అత్యద్భుత సాహసకృత్యం  కూడా చేసి వున్నాను. ఆ మాట మర్చిపోకు."

    "అలాగే తండ్రి!"

    "ఇంతకీ ఏదో అన్నావ్ అది తెరమరుగైంది."

    "నాకు గుర్తుంది. నాకు నాటకాలంటే  యిష్టం కదా!"

    "ఎస్"

    "రేపటి నుంచి నేను ఏదో వక నాటకసమాజంలో చేరి కొంతకాలం నటన నేర్చుకుని నాటకాల్లో వేషం వేస్తాను. ముందు నాటకాల్లో వేసి ఆపై సినిమాల్లోకి ట్రై చేస్తాను."

    "ఆపై రాజకీయ నాయకుడిని కూడా కావచ్చు"

    "ఆఫ్ కోర్స్."

    చంద్ర నవ్వటంతో ఇందర్ కూడా నవ్వాడు.

    ఇందర్ ఎలాంటి వాడో ఏం దాస్తున్నాడో తెలియని చంద్ర అమాయకంగా ఇందర్ చెప్పే ప్రతి మాట నమ్ముతుంటాడు.

    ఇందర్ చిన్న కంపెనీలో  బుల్లిజాబ్ చేస్తున్నాడన్నది శుద్ధ అబద్ధం అని....అతను ఏ నిమిషాన ఎక్కడ ఏ వేషంలో వుంటాడో అతనికే తెలియదని.... అతను వేసే మారువేషాలకి ఓ సాకు చెప్పటానికి నాటకాల్లో వేషం వేయాలన్న ఓ అభూత కల్పనా సృష్టిస్తున్నాడని.... చంద్రకి అణుమాత్రం కూడా తెలియదు.

    ఇందర్ తెలివికలవాడు.

    చంద్ర అమాయకుడు.

    అందుకే  యిరువురికీ సరిపోయింది.

    "నేను కూడా నీతోవచ్చి రోజూ నటన నేర్చుకోనా!" చంద్ర అడిగాడు.

    ఇందర్ గతుక్కుమన్నాడు. చంద్ర తనతో వస్తే తన నిజస్వరూపం తెలిసిపోదు!

    "నాటకాల వాళ్ళతో తిరుగుతున్నావా అని మీ నాన్న నీ తోలు వలుస్తాడు" ఇందర్ తెలివిగా బాణం వదిలాడు.

    "నాన్నగారికి తెలియకుండా చేస్తాను."

    "వద్దు, పెద్దవాళ్ళని మోసగించటం మంచిది కాదని నీవు చాలాసార్లు నాతో అన్నావు గుర్తుందా! పైగా కవులకి నాటకాలకీ పొంతన ఎక్కడ! యింకా కష్టపడి మంచి మంచి కవితలు రాయి! నేను వేసే నాటకంలో ఆ కవితలు చదువుతాను. పైగా నీవు ఒక సాహసం చేసి వున్నావు. మాంచి సాహసవీరుడిగా తయారు కావటానికి కావాల్సిన బుక్స్ చదువు. నీ గురువు చంద్రశేఖర్ ఆజాద్ అడుగుజాడల్లో నడిచి పేరు నిలబెట్టు"

    ఇందర్ అంటుంటే చంద్ర ఒడలు ఛాతీ అంగుళం ఎత్తున వుప్పొంగినట్లయింది.

    "అవును నాటకాలు నా వంటికి సరిపడవు. సాహసమే నా వూపిరిగా ధైర్యమే నా మనుగడగా మరణం దాకా జీవిస్తాను" గంభీరంగా అన్న చంద్రానికి కవిత్వం ఉన్నట్లుండి పుట్టుకు వచ్చింది. మంచం మీంచి కిందకు వక్కుదూకు దూకి టేబుల్ ముందు కూర్చుని కాగితం కలం అందుకున్నాడు.

    జీవిస్తాను జీవిస్తాను.

    పరుగులకోసం జీవిస్తాను.

    చంద్ర కవిత రాసుకుంటూ వుండిపోయాడు.

 Previous Page Next Page