Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 8


    అంతా విన్న ఇందర్ "ఇంతకీ ఆ అవంతి రాకుమారి స్వస్థలం ఎక్కడట?" వ్యంగ్యంగా అడిగాడు.

    "నాటకాల వాళ్ళతో వూళ్ళు తిరిగే అమ్మాయికి ఒక వూరని ఏముంది?"

    "నిజమే పాపం మనింటికి రమ్మనాల్సింది."

    "రమ్మంటే మాత్రం వస్తుందా! ఏదోలే ప్రస్తుతానికి రక్షించాను అంతే చాలు. నిన్న ఆ సంఘటనతో సాహసం చేయటం చాలా తేలికని గుర్తించాను. చంద్రశేఖర్ ఆజాద్ పేరు నిలబెట్టాను."

    "అవున్నేను ఒక మాయలాడిని రక్షించి"

    "మాయలాడా! అంటే నేను రెండు సార్లు చెప్పింది నమ్మనట్లే కదా! రాంగ్ అన్నావు. మొత్తం రాంగ్ అనా అర్ధం!" చంద్ర కోపంగా అడిగాడు.

    "ఆ.... నీవు రక్షించటం తప్పించి మొత్తం రాంగ్" ఇందర్ గట్టిగా అన్నాడు;

    "ఎలా!"

    "రౌడీ అబ్బాయి వేషంలో ఆ పిల్ల నీకో కల్లబొల్లి కథచెప్పి వేషం మార్చి అమ్మాయిలా తయారయింది."

    "ఇది నేను చెప్పిందే కదా!"

    "నీవు చెప్పిందేలే మధ్యలో అడ్డురాక విను. అమ్మాయిగా మారిన ఆ అమ్మాయిని నీవు గుర్తు పట్టలేక పోయావ్. ఆ పిల్ల అలానే వెళ్ళిపోక నీకో కథ చెప్పి పార్క్ బైటదాకా తీసుకు వెళ్ళింది.

    "మర్యాదకి ఒక్కమాట కూడా నీతో చెప్పకుండా ఆటోలో ఉడాయించింది. ఆ పిల్ల మోసగత్తెగాక మంచిదా! రౌడీ పిల్ల దొంగపిల్ల మాయలాడి...."

    "ఇందర్!" బాధగా అన్నాడు చంద్ర.

    "ఆ పిల్లదాన్ని అంటే నీవు గిలగిల లాడుతావు ఎన్నకథ?" కనుబొమలు తమాషాగా ఎగరవేసి అడిగాడు ఇందర్.

    "ఆ అమ్మాయి నన్ను భయ్యా అంది తెలుసా!" చంద్ర రోషంగా అన్నాడు.

    "ఏ ఆడపిల్ల అయినా నిన్ను అలాగే అంటుందిలే" ఇందర్ నవ్వుతూ అన్నాడు.

    "సరేలే నీకు నేను లోకువ. ఆడ పిల్లలు లోకువ. మగాళ్ళంటే మోసగాళ్ళనే భయంతో ఆ అమ్మాయి నాతో చెప్పకుండా ఆటోలో వెళ్ళింది. అది తప్పా! నేను మొదట్లో ఆ అమ్మాయి మోసం చేసిందనే అనుకున్నాను. కాని.... కాని....ఆలోచిస్తే సవ్యంగానే తోచింది. నా మంచితనం తనకి తెలియదురా! ఆపదలో వున్న ఆడపిల్లని అందునా నాటకాల అమ్మాయిని రక్షిస్తే నీవు మెచ్చుకుంటా వనుకున్నాను. నన్ను రక్షిస్తే నీ స్నేహితుడు నిన్ను మెచ్చుకుంటాడనీ పాపం పిచ్చిది అమాయకంగా నాతో అంది."

    "అలా అందా?" ఇందర్ అడిగాడు.

    "ఆ.... అలానే అంది...." చంద్ర అన్నాడు.

    చంద్ర అమాయకుడు. నిజం చెప్పినా అర్ధం చేసుకోడు. అనవసరంగా చంద్రని బాధపెట్టడం దేనికి! ఆ పిల్ల మోసంచేసి వీడిదగ్గర ఏమీ ఎత్తికెళ్ళలేదు. తను తప్పించుకోటానికి చంద్రని అడ్డు వేసుకుంది. అనుకున్న ఇందర్ మాట మార్చదల్చుకున్నాడు.

    "అరే భాయ్! చంద్రశేఖర్ ఆజాద్! నిన్ను ఆటలు పట్టించటానికి అలా అన్నాను అంతే. ఆపదలో వున్న ఆడపిల్లని అందునా అబలని రక్షించావు యింకెప్పుడూ నిన్ను పిరికి అనను సరేనా!"

    "నిజంగా అంటున్నావా!"  చంద్ర అనుమానంగా అడిగాడు.

    "నిజంగా అంటున్నాను."

    "అబ్బ, ఇప్పుడు వెయ్యి ఏనుగులు బలం వచ్చింది."

    "సాహసమే వూపిరిగా జీవించే వాళ్ళకి అంతే, సరీగ వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. అప్పుడే నీలో మార్పు చూస్తున్నాను."

    "నిజంగా!"

    "నిజం."

    చంద్ర దవడలు వుప్పొంగాయి. ఛాతీ అంగుళం పైకి లేచినట్లయింది.

    "అవంతీ రాకుమారి ఎట్లా వుంటుందిరా!" ఇందర్ మెల్లిగా కూపీ లాగటానికి మొదటి ప్రశ్న వేశాడు.

    "అందంగా వుంటుంది."

    "అందంగా అంటే?"

    "అదేమో నాకు తెలియదు. చూడంగానే బాగుంటుంది-"

    "వయసు!"

    "పద్దెనిమిది పాతిక మధ్య వుండొచ్చు"

    "మరోసారి చూస్తే గుర్తుపడతావా?"

    "ఓ.... ...."

    "పార్క్ లోంచి బైటికి రాగానే ఎవరెవరు ఎదురయ్యారు?"

    "ఎవరూ రాలేదు."

    "పార్క్ బైట ఎవరూ లేరా?"

    "ఉన్నారు. నేను వాళ్ళని సరీగ చూడలేదు."

    "ఉద్దరించలేకపోయావ్!" అనబోయి మాట మింగేశాడు ఇందర్.

    "ఆ అమ్మాయి నీ జీవితంలో ఎప్పుడైనా తారసపడితే మంచి మాటలతో ఒకసారి మనింటికి తీసుకురా."

    "ఎందుకు?" అనుమానంగా అడిగాడు చంద్ర.

    "ఇంతవరకూ పిరికివాడి వనుకున్నాను. నీ ధైర్య సాహసాలను మొదటిసారిగా చూశాను. అదీ ఎలా! ఆ అమ్మాయి వల్ల అవునా?"

    "ఎస్."

    "కనుక, నీ వెన్నుతట్టి నీలో దాగున్న సాహసవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ ని మేలుకొలిపిందా లేదా!"

    "ఎస్. ఎస్."

 Previous Page Next Page