ఇందర్ అమ్మయ్య అనుకున్నాడు. ఆ తర్వాత రెండు చేతులూ తలకింద ఎత్తుగా పెట్టుకొని దీర్ఘాలోచన చేస్తూ కళ్ళు మూసుకున్నాడు.
* * *
ఆరోజు రావల్సిన రైళ్ళు అన్నీ లేటు కావటంతో ప్రయాణీకులతో రైల్వేస్టేషన్ కిటకిట లాడుతున్నది.
మెయిలయేది ఎక్స్ ప్రెస్ అయేది దాని తాత అయేది. ఇది ఇండియా కొండొకచో బిఫోర్ టైమ్ కి వస్తాయేమోగాని రైట్ టైమ్ ఎట్టి పరిస్థితులలోను రావు. ఈరోజు నాలుగు గంటలకి వస్తుంది. అందులో వింతలేదు విడ్డూరంలేదు.
బారాబజేగాళ్ళ మీద ఎన్ని జోకులున్నాయి. ఏనాడూ కరెక్టు టైముకి రాని రైలు ఆ రోజు ఓ నిమిషం అటూ యిటూ కాకుండా కరెక్టు టైముకి రావటం చూసి ప్రజలు....
రైలుఆగంగానే ఏనుగంత దండ తీసుకెళ్ళి డ్రైవరు మెడ లోంచి మరీ వేశారు.
డ్రైవరుగారు తెల్లబోయి "నేను రిటైల్ కావటం లేదయ్యా! ఇంకా నా సర్వీసు పదేళ్లు వుంది అన్నాడు. దానికి సమాధానంగా ప్రజలు "అయ్యా! మీకీ దండ వేసిన కారణం అది కాదు. కరెక్ట్ టైమ్ కి ఈ ట్రైనుని తీసుకు వచ్చినందుకు" అని విషయం వినయంగా నిన్నవించారు. విషయం తెలిసిన డ్రైవరుగారు అంతకన్నా వినయంగా "ఈ ట్రైను నిన్న ఇదే సమయానికి యిక్కడకు రావాల్సింది. కొద్ది లేటుతో ఇదే టైముకి ఈ రోజు వచ్చింది" అని చెప్పి సిగ్గుపడిపోయాడుట.
ఇలాంటి ఘనత వహించిన కథలు జోక్స్ మన రైల్వే వారి మీద వున్నప్పుడు కరెక్ట్ టైమ్ కి రైలు రావటమా! రైలు రాకడ వాన పోకడ ఎవరికీ తెలుసు!
కరెక్ట్ టైముకి బళ్ళు వచ్చినా రాకపోయినా ప్రయాణీకులు మాత్రం అరగంట ముందే రైలు స్టేషన్ కి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంటారు. విశ్రాంతి భవనాలు అందుకే స్టేషన్ లో దర్శనం ఇస్తుంటాయి.
మెయిల్లో ప్రయాణం చేస్తున్న ఒకతనికి టిఫెన్ బాక్స్ బందర్ మిఠాయి ప్యాకెట్లు అందించటానికి అవంతి స్టేషన్ కి వచ్చింది. టిఫెన్ బాక్స్ లో ఫలహారం, మిఠాయిలప్యాకెట్టులో మిఠాయిలు వున్నాయి. అంతకన్నా భయం కరమైన టాప్ సీక్రెట్ కూడా వాటిలో వుంది. అదేమిటో అవంతికి మాత్రమే తెలుసు.
మెయిల్ ఎప్పుడు వస్తుందో తెల్సుకుంది అవంతి.
సరిగ్గా గంట లేటు.
"మెయిల్ కూడా లేటేనా?" అవంతి నోరు వూరుకోక అడిగింది.
"మెయిల్ కాబట్టే గంట లేటు" జవాబు కరుకుగా వచ్చింది.
అవంతి నోరు మూసుకొని వెనుతిరిగింది. విశ్రాంతి గదులు విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణీకులతో కిటకిటలాడి పోతున్నాయి. ప్లాట్ ఫామ్ మీద వున్న బెంచీలు మీద కొందరు నిద్రపోతున్నారు. అవంతి హిగిన్ బాదమ్స్ దగ్గర పుస్తకాలు తిరగేస్తూ నుంచుంది.
అవంతి సాధారణంగా ప్రతి పనిలోను మారువేషం వేస్తుంది కాబట్టి అవంతిని చూసినా ఎవరూ గుర్తుపట్టరు. ఆ రోజు అవంతి గత్యంతరంలేక అప్పటికప్పుడు మామూలు అమ్మాయిలా తయారయింది. ఈ రోజు అలాగే మామూలుగా తయారయి స్టేషన్ కి వచ్చింది. అదే అవంతి చేసిన పెద్ద పొరపాటు.
చంద్ర ఒక మిత్రుడిని రైలు ఎక్కించడానికి స్టేషన్ కి వచ్చాడు.
మిత్రుడిని రైలు ఎక్కించటం ఆ రైలు వెళ్ళటంతో తిరుగుముఖం పట్టిన చంద్రకి హిగిన్ బాదమ్స్ దగ్గర నుంచుని విజయచిత్ర తిరగేస్తున్న అవంతి కనిపించింది.
చంద్రకి కొండెక్కిన సంతోషం వేసింది. "హాయ్ అవంతీ!" అని కేక వేయబోయాడు. ఇంతకీ ఆ పిల్ల అవంతి అవునో కాదో అన్న అనుమానం రావడంతో అక్కడే ఆగి పరిశీలనగా చూశాడు. సందేహం లేదు. ఆమె అక్షరాలా అవంతి.
చంద్రకి ఓ చిలిపి కోరిక కలిగింది. నెమ్మదిగా అడుగులో అడుగేస్తూ నడుస్తూ అవంతి దగ్గరకు వచ్చాడు. గబుక్కున అవంతి చెయ్యి గట్టిగా పుచ్చుకుని "అమ్మ దొంగా చిక్కావ్!" అన్నాడు.
అవంతి చేతిలో విజయచిత్ర జారిపోయింది. కంగారుగా తల ఎత్తి చూసింది.
పళ్ళికిలిస్తూ ఎదురుగా చంద్ర.
అవంతి రెప్పపాటులో తెలివి తెచ్చుకుంది. చంద్ర చేతిలో వున్న తనచేతిని గింజుకుంటూ అతనివేపు తీక్షణంగా చూస్తూ "చెయ్యి వదులు ఎవరు నీవు?" అంది కాస్త గట్టిగా.
చంద్ర కిచకిచ నవ్వాడు. అవంతి తమాషా చేస్తున్నది అనుకుని "ఎవరు నేనా, ఎరుగవా! అప్పుడే మరిచిపోతివా మగువా!" అంటూ రాగయుక్తంగా పలికాడు.
"ముందు చెయ్యి వదిలి మాట్లాడు" అవంతి మరోసారి గట్టిగా అంది.
"వదలను వదలను, వదిలిన అదే పోతకదా!" చంద్ర తమాషాగా అన్నాడు.
ఓకే రూపంలో ముక్కు ముఖం తెలియని వాడికి రెండుసార్లు కనపడటం అవంతికి మంచిది కాదు. ఇక్కడ నుంచి ఎలా తప్పించుకుపోవాలి! అవంతి ఆలోచిస్తున్నది. తన పేరు చెప్పటం కూడా పెద్ద చిక్కయింది.
చంద్ర ఆలోచన వేరు. అవంతిని రక్షించినందుకు ఇందర్ తనని మెచ్చుకోవటం ఇందర్ కూడా నాటకాల్లో వేషాలు వేయబోతున్నాడని. ఇందర్ అవంతిని చూద్దామనుకున్నాడని, అవంతి తమవల్ల భయపడాల్సింది ఏమీ లేదని ఎన్నో చెప్పాలనుకున్నాడు. అనవసరంగా భయపడి అపార్ధం చేసుకుని మళ్ళీ తన కళ్ళు గప్పి పారిపోవద్దని చెప్పాలనుకున్నాడు. తొందరపడి పారిపోతుందేమో అనుకుని అవంతి చెయ్యి గట్టిగా పుచ్చుకున్నాడు.