Previous Page Next Page 
క్రిమినల్స్ -1 పేజి 9


    మరి అయిదు నిమిషాలకి  ఆ ఇద్దరూ విడిపోయారు. మధుమూర్తి ఇప్పుడు ఉదయ్ ని వదిలేసి రెండోకుర్రాడ్ని  అనుసరించ సాగాడు.

    ఆ కుర్రాడు నేరుగా  తన యింటికి  వెళ్ళకుండా  తాపీగా ఆడుకుంటూ, గంతులేస్తూ  అరగంటకి ఇంటికి చేరుకున్నాడు. మధుమూర్తి ఆ యింటిని గుర్తుపెట్టుకున్నాడు.

    పట్టాభి, మధుమూర్తికి పరమశివం ఇచ్చిన గడువు దగ్గరకొచ్చేసింది.

    మరో అయిదురోజుల్లోనే  అతని వాటాను  అణాపైసలతో సహా సెటిల్ చేయాలి.

    ఇవ్వకుండా  బెదిరిద్దామనుకుంటే  తనకేధన్నా ప్రమాదం జరిగితే అందుకు బాధ్యులు పట్టాభి, మధుమూర్తి  అంటూ  పోలీస్ స్టేషన్ లో కంప్లయిట్ ఇచ్చి వున్నాడు.

    గడువు మరో మూడురోజులే వుందనగా పరమశివం మరోసారి హెచ్చరించాడు ఆ ఇద్దర్నీ.

    ఆ ఇద్దరెంత  ప్రయత్నించినా  పరమశివం కొడుకే తనకు నష్టం కలిగించిందంటూ ఫ్రూవ్ చేయలేకపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో  గడువు ఆఖరి రోజున పట్టాభి, మధుమూర్తి తమ వ్యక్తిగత ఆస్తుల్ని అప్పటికప్పుడు తెగనమ్మి పరమశివానికి యివ్వవలసిన నాలుగున్నర లక్షల రూపాయలు యిచ్చేశారు.

    పట్టాభి చివరగా అన్న మాటలు__

    "మేం చేసింది తప్పా ఒప్పా అనేది అలావుంటే__నీ కొడుకు మూలంగా  మేం లక్షలు కోల్పోయాం. నీవు భాగస్వామ్యం నుంచి తప్పుకోవటం మూలంగా కంపెనీపరంగా కూడా దెబ్బతిన్నాం.

    ఈ దెబ్బల్ని  మేమంత తేలిగ్గా  మర్చిపోలేం. ఈరోజునుంచి అనుక్షణం దెబ్బతిన్న ఈ సంఘటల్నే నెమరువేసుకుంటూ చట్టానికి దొరకకుండా  నీ కుటుంబాన్ని  సర్వనాశనం చేస్తాం. నాది పాము పగ. కాటేసేంతవరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టని పట్టుదల నాది గుర్తుంచుకో."

    పట్టాభి బెదిరింపులకు పరమశివం కొద్దిక్షణాలు భయపడినా తన డబ్బు తనకొచ్చిందన్న  ధైర్యంతో వెళ్ళిపోయాడు.

    "ఆ ఉదయ్ గాడు, నల్లపిల్లాడు  గంజాయిని తగలబెట్టించారన్నది నిజం. ఉదయ్ తండ్రి జీవితాంతం కుళ్ళి కుళ్ళి చచ్చేలా  ఒక పథకం వేయాలి. ఆ నల్లపిల్లాడు  పరమశివం ప్రాణమిత్రుడు శశిభూషణ్ కొడుకు. ఒకడికిప్పుడు చేతినిండా  కావల్సినంత డబ్బుంది. మరొకడు చట్టసంబంధమైన  వ్యవహారాల్లో  రాటుదేలినవాడు .అందుకే  మన పథకం చాపక్రింద నీరులా  వార్ని ఆక్రమించుకుపోవాలి. వారి కుటుంబాల్ని  సర్వనాశనం చేయాలి" పట్టాభి కసిగా తాగుతూ అన్నాడు.

    "కాని ఎలా?" మధుమూర్తి సాలోచనగా అన్నాడు.

    "రంగంలో మనం లేకుండా ఆ పని జరిగిపోవాలి అంటే మూడోవ్యక్తి రంగప్రవేశం చేయాలి. ఎవర్ని దింపాలి?" పట్టాభి తీవ్రంగా యోచిస్తున్నాడు.

    "ఆ రాజర్షిని దింపితే?" మధుమూర్తి మాటలకు పట్టాభి ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు.

    "అతను ఖచ్చితంగా మన పనిని  నెరవేర్చగలడు."

    కాని రాజర్షి చాలా ప్రమాదకరమైన  వ్యక్తి. మనం పరమశివం, శశిభూషణ్ ల మూలంగా  అన్యాయమయిపోయామన్న అబద్దాల్ని చాలా జాగ్రత్తగా అతని మనసులో  నాటాలి. పని పూర్తయ్యేవరకూ ఆ అబద్ధాన్ని నిజమనే రాజర్షిని నమ్మించగలగాలి. పొరపాటున  మధ్యలో  అసలు విషయం బయటకు పొక్కిందో చేతబడి తిరగబడుతుంది. అప్పుడిక రాజర్షిలాంటి  మహామేధావి పన్నే వలయం నుండి తప్పించుకోవటం  మన తరంకాదు. ఇంకెవరి తరంకాదు. కనుక అతన్ని రంగంలోకి దించటం చాలా ప్రమాదకరమనిపిస్తోంది నాకు."

    పట్టాభిలాంటి పరమక్రూరుడు సయితం  రాజర్షి పేరు చెబితే వణికి పోతున్నాడంటే  అతను  సాధారణమైనవాడు కాదు. మధుమూర్తి ఆలోచిస్తున్నాడు.

    "అయినా మరో మార్గమే కనిపించటంలేదు. తప్పదు. రిస్క్ తీసుకుందాం" అన్నాడు పట్టాభి అప్పటికప్పుడే ఒక నిర్ణయానికొస్తూ.

    అప్పటికప్పుడే  దుర్గాదాసుని పిలిపించాడు పట్టాభి.

    తాము తీసుకున్న నిర్ణయాన్ని దుర్గాదాసుకి చెప్పేశాడు?

    దుర్గాదాసు కొద్దిక్షణాలు వెర్రివాడిలా చూశాడు.

    "మతి వుండే ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇలా అడుగుతున్నందుకు....కాకపోతే  మీ ఉప్పు, కారం తింటున్నవాడ్ని అందుకే హెచ్చరిద్దామని చెప్పాను."

    దుర్గాదాసు హెచ్చరికకి మ్దుమూర్తి మరింత భయపడ్డాడు.

    "బలవంతుడయితే  అంతకంటే  మరింత  బలవంతుడ్ని తెస్తే సరిపోతుంది. శారీరక బలానికి పోటీ వుండొచ్చు.  కాని రాజర్షి మేధస్సుకు పోటీలేదు.  అతను పథకం వేసాడంటే అది నూటికి నూరుశాతం అలాగే జరుగుతుంది. అతను నేలమీద సింహంలాంటి  వాడయితే, ఆకాశంలో డేగ లాంటివాడు. నీటిలో తిమింగలం లాంటివాడు. అతడు తిరగబడ్డాడో ఈ మూడుచోట్ల  ఎక్కడో  ఒకచోట మనల్ని  మింగేస్తాడు. ఈ మూడుచోట్లా వీలుపడకపోతే  నరసింహస్వామిలా సంధిలో  మింగేయగలడు. మీ యిష్టం మరోసారి ఆలోచించుకోండి కాదు....తప్పదూ అంటే వెళతాను."

    దుర్గాదాసులాంటి నరరూప రాక్షసుడు సయితం రాజర్షి పేరు చెప్పగానే అలా భయపడ్డాడంటే? ఈసారి పట్టాభికూడా భయపడ్డాడు.


                               o    o    o


    రాజర్షి....రాజర్షి....రాజర్షి....ఆరడుగుల పొడగిరి కాదు....అందమైనవాడు కాదు....అనితరసాధ్యమైన  శారీరక బలమున్నవాడు కాదు. మరతనిలో వున్న ప్రత్యేక శక్తి సామర్ధ్యాలేమిటి?   
______________________________________________________________________________

    ఈ దేశపు ఆర్ధిక  వ్యవస్థను అత్యవసరంగా  శస్త్రచికిత్స చేయాలి....

    లేదంటే  మధ్యతరగతి  మిధ్యాజీవులు  ఫైనాన్స్  కంపెనీల పదునైన కోరల్లో  చిట్ ఫండ్ కంపెనీల  చీటింగ్స్ లో చ్చిద్రమైపోతారు....
______________________________________________________________________________

 Previous Page Next Page