కేవలం అతని మేధస్సు....యుగంధరుడి రాజకీయ దురంధత, కౌటిల్యుని మేధస్సు అప్పాజీ చతురత అతనిలో దాగున్నాయి.
అతని ఇల్లు నగరానికి దూరంగా నందనోద్యానవనాలతో విశాలమైన లయ నికుంజాలతో నిండివుంటోంది.
చూడటానికి పైకి పూరిల్లులా కనిపించినా లోపల ఫోన్, టీ.వి....రేడియో, వీడియోలాంటి అత్యాధునిక సౌకర్యాలన్నీ వుంటాయి.
జాతీయ దినపత్రికలు మొత్తం ప్రతిరోజూ వస్తుంటాయక్కడికి.
అతనెవరో? ఎక్కడి నుండి వచ్చాడో? అతని గమ్యమేమిటో ఎవరికీ తెలియదు.
చూడటానికి సన్నగా రివటలా బలహీనంగా కనిపిస్తాడు.
కాని....
అతని చూపులు ఎదుటివాడి అంతరంగాన్ని అవలీలగా పట్టేయ గలంత వాడిగా వేడిగా వుంటాయి.
ఎవరన్నా ఏదన్నా చెబుతుంటే వింటున్నాడో, లేదో అన్నట్లుగా వుంటుందతని వాలకం.
అరమూసిన కనురెప్పల వెనుక అగ్నికణాలే వుంటాయో, అనంత ప్రేమవాహిని అమృతపు జల్లులే వుంటాయో....
ఎవరికీ అవగతంకాదు.
కాదు, కానివ్వడు.
ఎవరన్నా ఏదన్నా అన్యాయం జరిగింది.
రక్షించండంటూ వస్తే అప్పుడు లేస్తాడు నిద్ర. ఎలాంటి బలప్రయోగం, ఘర్షణ, రక్తపాతం లేకుండా కేవలం తన ఆలోచనలతోనే అన్యాయంచేసినవాడి పీకకు ఉచ్చు బిగిస్తాడు.
ఎప్పుడూ, ఎక్కడా, ఇంతవరకు అతని పధకం దెబ్బతినలేదు. దారితప్పలేదు.
అతనే రాజర్షి.
చుట్టుపక్కల వాళ్ళకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కు వెళ్ళరు. కోర్టుకు అంతకంటే వెళ్ళరు. సరాసరి రాజర్షి ఆశ్రమానికే వస్తారు.
రాజర్షి....
ఆశ్రమం,
అని అతనేం సన్యాసిలా వుండడు.
కాషాయ బట్టలు ధరించడు.
ఖద్దరు లాల్చీ, ఖద్దరు పైజమా, మెడలో మెలితిరిగి కనిపించే మఫ్లర్, కాళ్ళకు కాన్పూర్ చెప్పులు.
ఒక్క ఉదుటున రాజర్షిని చూస్తే.... అతనే ఎస్.పీల్ని, ఐ.జీల్ని, ఐ.ఎ.ఎస్. లాంటి బ్యూరోక్రాట్స్ ని సయితం అన్యాయం చేసారని తెలిస్తే హడలెత్తించగల అవితరసాధ్యుడని ఎవరూ ఊహించలేరు.
అతనికి తోడు యిద్దరు అనుచరులు, ఇద్దరు వంటవాళ్ళు, యిద్దరు తోటమాలీలు మాత్రమే ఉంటారు.
నిర్మానుష్యంగా వుండే నిశీధి ప్రాంతంలో నిశ్శబ్దమే వారికి తోడు.
రోజంతటిలో ఆ ఆశ్రమంలో ఒకటో, రెండో మాటలు మాత్రమే వినిపిస్తాయి.
ఎవరికివారే రాజర్షి కళ్ళలో కదలాడే అతని మనోభావాన్ని పసిగట్టి అందుకు తగ్గట్టుగా వ్యవహరించుకుపోతుంటారు.
అన్యాయం చేసినవాడు ఎంతటి గొప్పవాడయినా, మరెంతటి ప్రమాదకరమైన వ్యక్తి అయినా రాజర్షికి తెలిసినరోజు నుండి అతని ప్రతికదలిక ఆటోమేటిగ్గా ఆశ్రమంలో రికార్డయిపోతుంటుంది.
ఉన్నట్టుండి అతను ఓ రోజు తన అనుచరుల్ని ఇద్దర్నీ పిలిచి అప్పటికే తన మేధలో రూపుదిద్దుకున్న పథకం గురించి వివరిస్తాడు.
ఆ మరుక్షణం....
ఆ ఇద్దరూ చిరుతపులుల్లా రంగంలోకి దిగటం పథకాన్ని యధాతథంగా అమలు పర్చటం.
అన్యాయం జరిగినవాడికి ఆనందం కలిగించటం వారికి సర్వసాధారణమైన విషయం.
రాజర్షిని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియజేసిన సంఘటన సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం జరిగింది.
ఆ ఏరియాకి కొత్తగా గౌసుద్దీన్ అనే ఐ.పి.యస్. ఆఫీసర్ ఎ.ఎస్.పి.గా వచ్చాడు.
అతనోరోజు ఓ మామూలు వీధిరౌడీని రిమాండ్ లోకి తీసుకున్నాడు.
కారణం ఏమిటని అడిగిన అతని భార్యను ఆడదనికూడా చూడకుండా నానా దుర్భాషలాడి పంపించేసారు. మరుసటిరోజు ఓ.పి.సి. ద్వారా తెలిసిందేమిటంటే ఆ రౌడీ దొంగనోట్లు మార్పిడి చేసాడని.
అది విని అతని భార్య అవాక్కయిపోయింది.
ఎవరి సలహామీదనో రాజర్షి ఆశ్రమానికి వెళ్ళి పనికోసం అర్ధించింది.
రోజు కూలిమీద తోటపనికి కుదిరిందికూడా.
ఓరోజు ఆమె ఆరోజు కూలితీసుకుని వెళుతుండగా బయటి నుంచి వస్తున్న అతనికళ్ళలో పడింది.
ఆమె కళ్ళు అప్పటికే ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయినట్లుగా ఉన్నాయి. అతని దట్టమైన కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి లేచాయి.
మరో అరగంటకల్లా ఆమె పరిస్థితి అంతా అతనికి తెలిసిపోయింది.
ఆమె చెబుతున్న మాటల్నిబట్టి ఆమె భర్త నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు, ఇంటిపట్టునే ఉంటున్నట్లు తెలిసింది.
ఆమె కళ్ళలో కనిపిస్తున్న వేదన వెనుక దాగిన నిజాయితీని రాజర్షి కళ్ళు పసిగట్టాయ్.
ఆమె తనంతట తానే తన మొగుడు వీధిరౌడీ అని, చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడని ఒప్పుకుంది.
రాజర్షికి ఆమె మాటలపై నమ్మకం కుదిరింది. వెంటనే తన అనుచరుల్ని రంగంలోకి దింపాడు.
వెళ్ళిన గంటకే అనుచరులు మొఖాలు వేలాడేసుకొని వచ్చారు.