"ఇవ్వకపోతే?"
"ఇవ్వకపోతే ఏం జరుగుతుందో ఇందాకే చెప్పాను."
"ఆ లోపు పాపం నీకేదన్నా జరిగితే?"
"సౌమ్యంగానే అన్నా అందులో పాము బుస వినిపించింది పరమశివానికి,
"అందుకే అన్ని వివరంగా వ్రాసి ఓ మిత్రుడిదగ్గర వుంచాను. ఈలోపు నాకేదన్నా జరిగితే మీ మూలంగానే జరుగుతుందని అందులో వ్రాశాను"
ఓ క్షణం భయంగా చూశాడు మధుమూర్తి.
వెంటనే అతనికేం మాట్లాడాలో పాలుపోలేదు. వెనుతిరిగిచూశాడు.
పట్టాభి ఉదయ్ నడుస్తున్నారు_పట్టాభి పథకం మధుమూర్తికి తెలుసు.
ఉదయ్ నోటెంట ఆ పనిచేసింది నేనేనని. చెప్పించగలిగితే దాన్ని అడ్డం పెట్టుకుని పరమశివాన్ని బెదిరించవచ్చు. కానా సూచనలేవి పట్టాభి ముఖంలో కనిపించటంలేదు.
"సరే....పట్టాభితో మాట్లాడి నీ వాటా సెటిల్ చేస్తాను" అన్నాడు రాజీ ధోరణి నటిస్తూ.
కానీ మధుమూర్తికి తెలుసు. పదిహేనురోజుల్లో వడ్డీతోసహా పరమశివం వాటా అతనికిచ్చేస్తే లక్షల్లో నష్టం వస్తుందని.
మరో రెండు నిముషాలకు వాళ్ళు విడిపోయారు.
"కుర్రాడేమన్నా చెప్పాడా" మధుమూర్తి ఆత్రుతగా అడిగాడు.
"చాలా చెప్పాడు"
"పోలీసు విజిల్, సైరన్ బొమ్మలు కొన్నది తనేనని చెప్పాడా ?"
"నేను దొంగలా కనిపిస్తున్నానా?" పట్టాభి సీరియస్ గానే అడిగాడు అతన్ని.
మధుమూర్తి అర్ధంకానట్లు చూశాడు.
"ఆ కుర్రవెధవకి అలాగే కనిపించాను. అందుకే తను కొన్న బొమ్మల వివరాలు చెప్పను అన్నాడు."
మధుమూర్తి అంత బాధలోను పెద్దగా నవ్వాడు.
"ఆ బచ్చాగాడు చాలా తెలివికలవాడు. నీ ముఖాన్ని బట్టి, నీ ఆరానుబట్టి జాగ్రత్తపడి వుంటాడు. వాడే ఆ పని నిజంగా చేసుంటే....
"ఛత్ నోర్ముయ్ ఆ పనిచేసింది వాడే. అందులో సందేహం లేదు. వాడికి అబద్ధం చెప్పటం ఇష్టంలేదు. చెప్పడుకూడా! పరమశివం పెంపకం అలాంటిది. వాడు అబద్ధం చెప్పడని మనకి తెలుసనికూడా వాడికి తెలుసు."
"నిజంగా ఆ కుర్రాడు తెలివికలవాడే. లేదంటే నువ్వు దొంగ వెధవని ఎలా కనిపెడతాడు."
అతను తమాషాకి అన్నాడు.
పట్టాభి అతనివేపు గుర్రుగా చూశాడు.
"సరేలే....నీ చూపులతో బెదిరించాల్సింది నన్నుకాదు పరమశివాన్ని. పదిహేను రోజులలో వడ్డీతో సహా తనవాటా తనకి పడెయ్యకపోతే మనతో జైలు ఊచలు లెక్కిస్తానని బెదిరించాడు"
మధుమూర్తి మాటలు పూర్తవుతుండగానే అతని కళ్ళు నిప్పులు చెరిగాయి.
"చూస్తా వాడి వాటాసంగతి నిజంగానే చూస్తా. త్వరగా పద. ముందు చిన్నపుల్లల బొమ్మలమ్మే షాప్స్ లో మనవేట ప్రారంభించాలి. ఆ తర్వాత ఆ ఉదయ్ గాడికి ఎందరు ఫ్రెండ్స్ వున్నారో శోధించాలి. పరమశివంపై దుర్గాదాసు నిఘా పెట్టాలి."
నడకలో వేగం పెంచుతూ అన్నాడు అతను.
o o o
"అడిగాడా?" పరమశివం ఆతృతగా అడిగాడు.
"అడిగాడు....అబద్ధం చెప్పను కదా."
"చెప్పేశావా?" భయంగా చూశాడు అతను.
"అబద్ధం చెప్పలేదు, నిజం దగ్గరకు రానివ్వలేదు" కొడుకువేపు విస్మయంగా చూశాడు పరమశివం.
______________________________________________________________________
డబ్బు లేకుండా డబ్బుతో డబ్బుకోసం వ్యాపారం ఈ వ్యవస్థలో మరింత సులభతరం !
______________________________________________________________________
"నువ్వే చెప్పావుకదా చచ్చినా అబద్ధం చెప్పకూడదని....నిజం చెపితే మనల్ని చంపేస్తారని కూడా చెప్పావ్. అబద్ధం చెప్పకుండానే మన ప్రాణాలు దక్కాలి. అంటే....నిజం దగ్గరకు వాళ్ళను రానివ్వకూడదు. అంతేగా నాన్నా?"
పరమశివం కొడుకు తెలివితేటలకి విస్మయ పడ్డాడు.
"అంతే....అంతే....మరింకా విషయాన్ని మర్చిపో" అన్నాడు పరమశివం కొడుకును స్కూల్ దగ్గర వదిలేస్తూ.
o o o
సాయంత్రం నాలుగు కావటానికి మరొక్క నిమిషమే వుందనగా పట్టాభి, మధుమూర్తి స్కూల్ గేటుకి దగ్గరలో వున్న చిల్లర దుకాణంలోకి వెళ్ళీ ఆ కొట్టువాడితో ఏదో మాట్లాడి అతని చేతిలో ఓ పదిరూపాయలుంచారు.
తర్వాత ఆ కొట్లోనే ఓ మూలగా కూర్చుని స్కూల్ గేటుకేసి దృష్టిని సారించాడు.
సరిగా నాలుగవుతుండగా స్కూల్ గంట వినిపించటం, పిల్లలు బిలబిలమంటూ బయటకు దూసుకురావడం జరిగింది.
పట్టాభి కళ్ళు అంతమంది విద్యార్ధుల్లోనూ ఉదయ్ ని గుర్తుపట్టగలిగాయి.
ఉదయ్ ప్రక్కన మరోకుర్రాడున్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతున్నారు.
పట్టాభి సైగనందుకుని మధుమూర్తి కొట్లోంచి చటుక్కున బయటికొచ్చేశాడు. ముందు వెళుతున్న ఉదయ్ ని, పక్కనున్న-కుర్రాడ్ని అనుమానం రాకుండా అనుసరించ సాగాడు.