సఖీ! శకుంతలా!
మన తెనుగు భాష తీరు తీయదనాన్ని తీరుతెన్నుల్ని ప్రపంచస్థాయికి తెచ్చినవి మనుచరిత్ర, వసు చరిత్ర, అముక్త్యమాల్యద, పాండురంగ మహాత్త్యము, శృంగార నైషధం, మహానుభావులైన అల్లసాని పెద్దనా మాత్యుడు రామరాజ భూషణుడు అనబడే భట్టు మూర్తి, తెనుగు రాయుడైన శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామలింగడిగా ప్రసిద్ధికెక్కిన రామకృష్ణకవి, శ్రీనాధకవి సార్వభౌముడు ఈ మహా కావ్యాల్ని మనకు ప్రసాదించిన మహానుభావులు, వీటినన్నిటిని కలిపి తెలుగు పంచ కావ్యాలు అంటారు.
సంస్కృతంలో అయిదు ప్రసిద్ధ కావ్యాలున్నాయి. ఆ సంప్రదాయాన్ని అనుసరించే తెలుగులోనూ ఈ పంచకావ్యాలు ఎన్నిక చేశారు. సంస్కృతంలోని ఆ కావ్యాలు కాళిదాస మహాకవి రాసిన మేఘసందేశం, కుమార సంభవం, రఘువంశం, భారవి కిరాతార్జునీయం మాఘిడి శిశిపాల వధ. అయిదు కావ్యాల్లో మూడు కావ్యాలు రాసిన మహాకవి కాళిదాసు నాటకాలూ రాశాడు. అవి మూడు జగత్ప్రసిద్ధి కెక్కిన అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్ని మిత్రం.
కావ్యాల్లో మేఘ సందేశానికి ఎంత పేరు ప్రతిష్ఠలు వచ్చాయో నాటకాల్లో అభిజ్ఞాన శాకుంతలానికి అంత ప్రఖ్యాతి ప్రశంసలు వచ్చాయి. ఇతరులు ఎవ్వరూ సృష్టించలేని అపూర్వ శోభతో "శకుంతల"ను తీర్చిదిద్దాడు. ప్రపంచ కావ్యేషు నాటకం రమ్యం, నాట కేషు శకుంతలా అని సర్వే సర్వత్రా శిఖర స్థాయి చేరుకుంది ఆ నాటకం.
ఏమిటి శాకుంతలం గొప్పదనం?
ఏమిటి కాళిదాసు గొప్ప?
ప్రపంచ సాహిత్యంలోనే గొప్పదని గెట్ (GATHE) (జర్మన్) ఎగిరి గంతేసి చెప్పేంత గొప్పదనం ఎక్కడ్నుంచి వచ్చింది?
పురా కవీనం గణనా ప్రసంగే
కనిష్టి కాధిష్టిత కాళిదాసా
అద్యాల్యపి తత్తుకవే రభావా
దనామికా సర్దావతీ బభూవ---
పూర్వ కవులను లెక్కిస్తూ ఒకటి కాళిదాసు అని చిటికెన వేలు ముడిచారట. తర్వాత అంటూ రెండోపేరు చెప్పి రెండో వేలు ముడవడానికి మరో కవి పేరే. ఆ స్థాయిలో---- ఆ రీతిలో ఆ ఔన్నత్యంలో సమానమైన కవి లభించ లేదట. దాంతో అనామిక అనేపేరు ఆవేలిక సార్ధక మైందట! ఓహో కాళిదాసుకు ఎంత గొప్ప ప్రశంస.
మరో రసజ్ఞుడు నేకేం కావాలయ్యా బాబూ అని అడిగితే--- తడుము కోకుండా
కాళిదాస కవితా నవం వయః
మాహిషం దధి సశర్కర పయః
యేణమాంస మబలా చకోమలా
సంభ వంతు మమ జన్మజన్మని
ఎప్పుడూ నిత్యయవ్వనం వుండాలి--- దున్ననీనిన గేదె పెరుగే కావాలి. చక్కెర కలిపిన చిక్కని పాలే దొరకాలి. జింక మాంసమే తినాలి ఆలి అబలంగా కోమలంగా రావాలి. అంతేనా కాళిదాసు కవిత వినాలి.... జన్మ జన్మకూ ఇవే - ఇవే- కోరాలి--- అన్నాడట, కాళిదాస కవిత అంటే అదీ!
కథ కొత్తది కాదు. సుప్రసిద్ధం అందరికీ తెలిసిందే. మరి ఎక్కడుంది కాళిదాసు ప్రత్యేకత.
తొలిసారి శాకుంతలను చూశాడు ముని వాటికలో నివసించే బ్రాహ్మణ కన్నెపై తన మనసు పోయిందే అని వగిచాడు. అంతలోనే ఉహూ నా మనస్సు ఈమె మీద లగ్నమైందంటే ఈ బాలిక తప్పకుండా క్షత్రియ కన్యే కావాలి. నా మనస్సు తప్పుదారితొక్కదు అనుకుంటాడు దుష్యంతుడు అదీ కాళిదాసు ప్రత్యేకత.
సతాంపి సందేహ పదేషు వస్తుషు
ప్రమాణ మంతః కరణ ప్రవృత్తమః
అనడంలోని గొప్పదనమంతా "సజ్జనులకు" అనడంలో ఉంది. ఆమెను చూసి వలచి సొక్కి సోలిన రాజు మళ్లి ఓసారి అనుకుంటాడు. అనాఘ్రాతం పుష్పం, కిసలయమ నూనం కరరుహైరనా విద్దం రత్న...
ఇలాంటి చక్కటి ఉపమానాలతోనే "ఉపమా కాళిదాసస్య" అనే "రూఢీ" ఏర్పడి వుంటుంది.
తర్వాత రాజు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. వేలికి ఉంగరం తొడుగుతాడు. రాజ్యానికి వెళ్ళీ సగౌరవంగా మహారాజ్ఞిలా పిలిపించుకుంటానని వెళతాడు. తర్వాత దుర్వాస శాపం. శకుంతల గర్భవతి కావడం కణ్వుడు కూతుర్ని అత్తారింటికి పంపుతాడు, అప్పుడే పెంచిన ప్రేమే ఇంత బాధ కలిగిస్తోందే కన్నవాళ్ళు కూతుళ్ళను అత్తారింటికి పంపుతూ ఎంత వేదన చెందుతారో అనుకుంటాడు.
(యా స్యత్యద్య శక్తున లేతి....
పద్యంతే గృహిణిః కదంను తనయా విశ్లేష దుఖైర్నవైః)
'నాట కేషు శకుంతలా' అన్న తర్వాత "తత్రాపి చతుర్ధాంకః" "తత్రశ్లోక చతుష్టయం" అని ప్రసిద్ధి కెక్కిన శ్లోకాలలో ఒకటి ఇది కావడం. వకటవదే ఇది.
హృదయాన్ని స్పృశించేలా "పాత్రల"తో మాటాడించడం లోకరీతి ధ్వనించడం కాళీదాసుకే చెల్లు. ప్రతిమాటా పది పుటల వ్యాఖ్యానాన్ని కోరే అర్ధ గంభీర రచన కాళీదాసు సొత్తు. నిజంగా ఆయన "నవరత్నాల్లో" ఒక మేలిరత్నం. విక్రమార్కుడి ఆస్థానంలో నవరత్నాలుండేవాళ్ళట - వారు.
ధన్వంతరి క్షపణ కామర సింహశంకు
భేతాళభట్టు ఘటకర్వర కాళీదాసాః
ఖ్యాతో వరహ మిహిరో నృపతేః
సభాయాం రత్నానివై వర రుచిర్నవ విక్రమస్య
అందుకే ఎవరో మహానుభావుడన్నారు.
జయంతితే సుకృతినో రస సిద్దాః కవీశ్వరః
నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం
---*----