Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 8

                                                   చూపుల పరిమళాలు

    ఆ ఊళ్ళో పూలమ్మేందుకే పూబోడులు ఉంటారు. వాళ్ళు పూలమ్ముతూ పూలమ్ములలాంటి మాటలు విసురుతు ఉంటారు. పూలు కొంటానికే కాకుండా మాటకొంటానికే కొందరు వయసుకాండ్లు వస్తుంటారు. అక్కడ పూలు దండలు కట్టి ఉంటాయి. కలువ పూగుత్తులు ఉంటాయి. సంపెంగలుంటాయి, మల్లెలుంటాయి. వాటిని కొనడానికి పైకొనడానికి వయసు తొందరచేసే పడచువాళ్లొస్తారు. రెండర్ధాల వ్యాపారం వాగ్వాపారం జరుగుతుంది. జనాంతికంగా స్త్రీ జనాంతికంగా భావం స్ఫురించేలా మాటలు విసుర్తారు. మూటలున్న మారాజులు మోజున్న మారాజులు కావడంతో అమ్మాయిలు అందుకు తగ్గట్టుగానే సమాధానం చెబుతారు.

    వెలది యీ నీదండ వెల యెంత?
    నా దండకును వెల పెట్టనెవ్వని తరంబు
    కలువ తావులు గాన మలికదంబక వేణి
    కలువ తావులు వాడకయ కలుగునె?
    కడివోదు నాకిమ్ము పడతి గేదంగినన
    కడివోమి ముందరికి జూడు
    జాతులే వంబు జేక్షణ
    పద్మినులు సైతమును నున్నయెడ జాతులునికి యరుదె

        ....    ....    ....

    ఆ ఊళ్ళో వేశ్యలు కూడా తక్కువవారా? తాంబూలం వేసుకోవడంవల్ల పళ్ళమీద వచ్చిన కప్పును వరిగింజతో తొలగిస్తారు. పసుపు పూసుకొని స్నానం చేసి కస్తూరి హెచ్చుకాకుండా పయ్యెదలోపలే చెయ్యాడిస్తారు.
 కలసీ కలియక ముందే ఎలాంటి వాడినైనా వాడి కులం కనుగొంటారు. ఒకప్పుడు తమను పోషించి ఆ మీద పేదవాడైన విటుడ్ని ఆదుకుంటారు. కవిత్వం కమ్మగా చెప్పగలరు కూడా.

    ఆ ఊళ్ళో పరిమళ్ళకు కావలి ఉండే ఆడవాళ్ళు-పక్కున నవ్వుతారు. ఎందుకంటే ఆ ఊరి ఏటి ఇసుక తిన్నెల్లో బాతులు తలదూర్చి నిద్రిస్తూ ఉంటే వాటిని చూసిన తలార్లు అవి వేకువ స్నానినికి వచ్చి స్నానంచేసి విడిచి మరచి పోయిన బ్రాహ్మణుల మడిబట్టలు అనుకొని తిరిగి వారికివ్వాలని వాటిని తీసుకోబోతే అవి రివ్వున ఎగిరిపోతాయట. అది చూసిన ఆడవాళ్ళు నవ్వుతారు.

    అదే ఊళ్ళో విష్ణుచిత్తులవారున్నారు. ఆయన చేసే అతిధిసేవే సేవ! వేసవిలో వర్షర్తులో చలికాలంలో ఏ కాలానికి తగిన భోజనం ఆ విధంగా విందారగింప జేస్తరాయన. ఆయనకు భార్యంటే ఎంత ప్రేమనుకున్నారు. జడివానలో పొయ్యిమండక భార్య కళ్ళు పొగచూరి నీళ్ళుకార్తాయని ఎండు కొబ్బరి బోండాలు దాస్తాడు. అంతేనా ఆయనకి అతిధులంటే ఎంత గౌరవం? ఎంత ప్రేమ!

    ఆ నిష్టానిధి గేహసీమ నడురే యాలించినన్ మ్రోయునెంతే నాగేంద్ర శయాను పుణ్య కధలు దివ్యప్రబంధాను సంధానద్వానము 'నాస్తిశాక బహుతా' నాస్త్యుష్ణతా నాస్త్యపూ పో నాస్త్యోదన సౌష్టవంచ కృపయా భోక్తవ్యమన్ మాటలున్.

    అయ్యా! కూరలు దండిగా లేవు. వేడిగా లేవు, పప్పులేదు. పూర్ణం లేదు. అన్నంకూడా అంతగా బాగా లేదేమో తమరు వేళమించి వచ్చారు. దయతో భోంచేయండి. అని దాసవచనాలు చెప్పుకుంటాడు.
    ఆయన్ని ఓరోజు విష్ణువు మత్స్యధ్వజని సభకు పొమ్మన్నాడు. మన్ననారు మాటలు విన్న ఆయనకు భయంవేసి నేనేం చదువుకోలేదు నేనేదో నీగుళ్ళో పూదోటలో గొప్పలు తవ్వి పూలు పూయించడం నేర్చినవాడిని మీ ఇంటి దాసుడ్ని- నన్నక్కడికి పంపిస్తే-నాకు- కాదుకాదు తమకు ఓటమి కాదా!

    నాకు చాతనయ్యింది గృహ సమ్మార్జనమో-జలాహరణమో శృంగార పల్యంకి కావహనంబో వనవాటికీ కరణమో వాల్లభ్యలభ్యధ్వజ గ్రహణంబోవ్య జనాత పత్ర ధృతియో.... ....

    ఆ భక్తికి విష్ణువు మెచ్చుకున్నాడు.

    నీ ఇచ్చయె మిన్నక పోవోయి-అని గెలిపింతు పో అన్నాడు. ఈయన ఈసురోమని వెళ్ళాడు-అక్కడ వేరే కధ.... విష్ణుచిత్తుడే గెలిచాడు.

    ఆ మధ్యలో వర్షం వచ్చింది. అదెలా బాధించింది అంటే మట్టిమిద్దెల వారికి మరుపనులకు నెలతబాసిన వారికి నిద్ర చెడగొట్టింది. కాలం గడిచింది. ఆ విష్ణుచిత్తడికి ఓ పుత్తడి బొమ్మ దొరికింది. ఆయమ్మ గోదాదేవి. ఆమెని పెంచి పెద్ద చేసినాడు ఆమె దేవుడికోసం పూలమాలకట్టి తన జడలో తురుముకొని ఆపై దేవుడికి అర్పించేది. అంచేత ఆముక్తమాల్యద అయ్యింది. ఆమె కధ అడుగడుగునా ఆనంద తాండవమే-

    ఆపై ఓ విష్ణుభక్తుడున్నాడు. అతనిది పెరుకొనరాని కులం అతడు మంగళకైశికీ గానం చేస్తాడు-ఓ రోజు వేకువైందని ముందే లేచి వెళుతూ వుంటే- అది అపరాత్రి కాబట్టి బ్రహ్మరాక్షసి మింగబోయింది. నేను నిత్య ప్రార్ధనచేసి తిరిగి వస్తాను. ఆపై మింగి తిను అంటాడు. రాక్షసుడు పకపకా నవ్వి ఇలాంటి మాటలు చెప్పకు అంటే ఒట్టుపెట్టు వెళ్ళి తిరిగొచ్చి అంటాడు.

    నీ చెరబాసిపోయి రజనీచెర చక్రభజింప ఘుక్తిపొందే చెర యే చెరల దవులను ఇక నుండుగ జూడు-

    నువ్వు పంపేప్పుడు ఎలా ఉన్నానో ఏ చరణంబులే యుదర మేయుర మే శిరమే కరంబులీ నా చరణంబు లా యుదర మాయుర మాశిర మా కరంబులన్ జూసుకోవయ్యా!

    అవే పాదాలు-అదే కడుపు-అదే రొమ్ము-అదే శిరస్సు-అవే చేతులు-ఏం మార్పులేదు.- ఊ తిను.... అంటే ఆ రాక్షసి దిమ్మెరపోయి దిమ్మతిరిగి పాదాలమీద పడ్డట్టె రాజీకి వచ్చి రక్షించమంటాడు. ఉహూ అని పాటలో పదభాగం ధారపోస్తాడు భక్తుడు.

    ఆ ఊరిని ఇంత మధురాతి మధురంగా చెప్పిన పుస్తకం ఆముక్తమాల్యద. దాన్నంత తీయతేనియలా చెప్పిందెవరనుకున్నారు.

    తెలుగ దేల యన్న దేశంబు తెలుగేను
    తెలుగు వల్లభుండ తెలుగొకండ
    యెల్ల నృపులు గొలువ ఎరుగనే బాసాడి
    దేశ భాషలందు తెలుగు లెస్స!

    అని బజాయించి చెప్పిన శ్రీకృష్ణదేవరాయలు! తెలుగుకు తెలుగుదనానికి తెలుగు కీర్తికి వెలుగు దెచ్చిన ప్రభురాయడు - ప్రజల రాజాధిరాజ వీరప్రతాప రాజ పరమేశ్వరార్ధ దుర్గా నటేశ సాహితీ సమరాంగణ సార్వభౌముడు!

                                                       ----*----
 

 Previous Page Next Page