జనం గానం
ప్రభువులు పద్యాలకూ పద్య ప్రబంధాలకూ పట్టంగట్టే రోజుల్లో పదాలకు ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళు ప్రజలు--- మామూలు మాటలతో రస పేటికలులా భావాన్ని పంచి ఇచ్చిన "జయకారుల" బ్రతుకు బంగరుమయం చేసిన వారు ప్రజలే! పొలం పోతూవస్తూ, పొలాల్లో పనులు చేసుకుంటూ, పెళ్ళి పేరంటాళ్ళలో సంప్రదాయాన్ని నిలుపుకుంటూ, కొలువుల్లో, గుడిసేవలో, ఇక్కడా అక్కడా అనికాకుండా జన జీవితం సారవంతంగా వుండే ప్రతి చోటా 'పాటలే' పదవి అలంకరించాయి. పండిత సభల్లో, రాజసభల్లో మాత్రమే పద్యం నాట్యం చేస్తే అడుగడుగునా చిందు వేసింది పదమే.... ... దాన్నే జనంపాట అన్నారు.
ఎంత పేదవాడే వేణుగోపాలుడెంత పేదవాడే....
ఇదిపల్లవి .... ఎత్తుగడలోనే ఎంత భావశబలత!
వేణుగోపాలస్వామిట- పేదవాడట - అదీ రెండుసార్లు రెట్టించి పలుకుతున్నాడు. భువన పాలకుడై అందరికీ సంపద పంచి ఇచ్చే దేవుడై గుడి కట్టుకుని నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలతో వైభోగం అనుభవించే గోపాలుడు పేదవాడా! ఏమో కవిగారు వూరికే అనరుగా! అంత పేద గాకుంటే--- అలనాడు కూచేలుని అటుకులకు చేసాచునా---- ఓ చెలులార.
శభాష్! అదీ జవాబు - వేణుగోపాల స్వామి ధనికుడే అంటారా! మేం ఒప్పం బాబూ! పేదవాడు కాకపోతే కూచేలుడు చెంగున మూటగట్టుకుని వచ్చిన పచ్చి అటుకులు సాచి అడిగి తీసుకుని మరీ తింటాడా! అది పేదవారి ఆహారం! దాన్నే అభిలషించిన ఆయన ఇంకెంత పేదవాడో కదా! కవిగారి వాదనను కాదనగలమా?
ఇంకా ఏమేమి ఉపపత్తు లిస్తాడో విందాం!
పండమంచమె యుంటె భావజనకుడీ
పాముపై నిద్రించునా
అండవేరే యుంటే అచ్యుతుడా దనుజనీ
అవనీ దానమడుగునా
వుండ నిల్లే వుంటే పుండరీకాక్షుడు
యుదధి వాసము చేసునా ఓ చెలులారా!
పాపం! జగదేక పాలకుడే అయినా పడుకోడానికి కనీసం ఓ కుక్కి మంచమైనా లేదే!
అందుకే పాము పడక వేశాడు. ఏ దిక్కులేక ఏమీ లేకనే బలి చక్రవర్తిని మూడడుగుల నేల బిచ్చ మడిగాడు! ఇల్లు కట్టుకోడానికా! కాదు పండించు కోడానికా? కాదు - ఊరికే పడుకోటానికి! ఇల్లు లేకనే కదా ఆయన సముద్రంలో కాపురం పెట్టింది. పాపం! ఈనాటి మనం ఆనాటి ఆయన కంటే మెరుగేనేమో!
కట్టు వస్త్రమె యుంటె కంస వైరిగో - పాం
గన చీర లా శించునా
గొట్టు బడక యుంటె గోవిందుడీ గతి
గోవుల తాగాచునా
పొట్ట నిండితే శౌరి పొరుగిండ్ల జొరబడి
పొంచి వెన్న ముచ్చిలునా ఓ చెలులార!
నిజంగా ఎంత దీన జీవనం! కట్టుకోడానికి బట్టలేదు (బట్టలు కాదు), జీవనాధారం లేదు. కష్టపడినా కడుపు నిండదు. అందుకనే గోపికల చీరలు తీసుకున్నాడు. గోవులు కాచాడు. గొల్ల ఇళ్లలో చొరబడి పాలు వెన్న దొంగలించాడు! చెప్పండి అది ఆయన నేరమంటారా? కాదు ఆకలిది, ఆకలి కోసం ఆవులు కాచాడు. అది తీరకపోతే అందరిళ్ళలో (కొందర్ని దోచి కొందర్ని వదల్లేదు) పాలు వెన్నలు తినేశాడు - వెండి బంగారు ఎత్తుక పోయ్యేడా కట్టుకోడానికి మారు బట్టలేక పోవడం వల్లే గుట్టలుగా పడి వుండడం చూసి గోపికల చీరలు ఎత్తుకెళ్ళాడు!
పరిపాటి వహానమీ ప్రద్యుమ్నునికే వుంటే
పక్షినెక్కి తిరుగునా
దరివేరే వుంటే శ్రీధరుడనిశము నిజ
దాసుల పంచ జేరునా
గురియైన సాయ కమీ మురవైరి కేయుంటె
గరిక పోచ జట్టునా ఓ చెలులారా!
ఎక్కడానికి వాహనం ఏదీ లేదు! హంస ఒకరికి - నెమలి ఒకరికి - చిలుక ఒకరికి అలా అలా పోయాయి. రధం లేదు, గుర్రం లేదు, ఏనుగూ లేదు, అందుకే గద్ద నెక్కాడు. మా దేవుడు ఎవరూ దిక్కులేరు, దగ్గరికి చేరనివ్వరు. అందుకే నిజదాసుల పంచకు వస్తాడు. మా ప్రభువు ఆయుధం సరియైంది ఏదీ లేదు. త్రిశూలం ఒకరు వజ్రాయుధం ఒకరు అలా అలా తీసేసుకున్నారు. అందుకే కాకా సురుడ్ని హతమార్చేందుకు గరికపోచే అయుధమైంది.
ఇప్పుడు చెప్పండి - మీరే ఆలోచించి చెప్పండి.
కట్టబట్ట లేదు. ఉండడానికి ఇల్లా లేదు. తినడానికి తిండి లేదు, ఊడిగం చేద్దామంటే మంచి ఉద్యోగమూ లేదు మరి మా వేణు గోపాలస్వామి పేదవాడు కాదంటారా! మీరు కాదన్నా ఆయన పేదల్లో కెల్లా పెద్ద పేద!
ఈ మనోహర గీతం - కీర్తన ఆలపించింది. సారంగ పాణి, పద రచనలో సారంగలపాణి....
శృంగార సంకీర్తనలు, దేశీయాలు, జాతీయాలు, వేదాంతం తన పదాల్లో బంగరు బయలు చేసిన భావుకుడు కార్వేటి నగర గోపాలునికి కై సేసిన పద బంగారాలు, ఒక్క పదం చాలు వేల వరహాలు చేస్తుంది. గుండెల్లో దూసుకపోయి కుదురుగా కూర్చునే పదాలు- పద చమత్కారాలు ఎన్నో - చేమకూర చేసిన చమత్కారం తన పదంలో భద్రపరిచిన తీరు చూద్దాం.
మగువను సభల నెన్నుదురు
మామ నదిలించు నెన్నుదురు ఆ
వగలాడి పల్వరుస కుదురు మేటి
వజ్ర మణులనుచు బల్కుదురు ఈ
జగతి దానికెవ్వరు నుదురు విరి జాజలం పై నీకు వదురు....
మాటల చమత్కారం కాదు. నడకలో, వయ్యారాలు, పగలూ కూడా ప్రదర్శించాడు.
ఇలాంటి భావాలు ఇంకెన్నో! మనసుతో ఆనందించిమైమరిచే ఈ పద కవితలు కృత్రిమ భావాలతో వికృత భావాలతో విరబూస్తున్న ఈ రోజుల్లో మానసిక చికిత్సకు మంచి మందులు--- కుహనా నాగరికత వేళ్ళూనుతున్న సాహితీ రంగానికి శస్త్ర చికిత్సలాటివి పదకవితలు అని చదవందే తెలుగు రాదు మన భాషకు వెలుగురాదు.
----*----