వాణి సాలోచంగా వారి వంకచూచింది, ఆత్మవిశ్వాసపూర్ణమయిన ఆ చూపులు అంతర్లోకాలలోని ధీశక్తులను చాటిచెప్పే వాడి బాణాలవలె అయినాయి.
"దొరా! నా మీద మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు. ఎందుకయితేనేమి నా అనుమతి లేకుండా నన్ను తీసుకుని వచ్చారు. నన్ను సుషుప్తావస్థలో మూడు దివారాత్రులు ఈ కొండగుహలో గుప్తంగా ఉంచారు. ఆ కారణమేమిటో ఇప్పుడయినా నేను తెలుసుకోవచ్చునా?" అని అడిగింది వాణి.
నాగాలందరూ షైజా వంక చూస్తున్నారు. అతని సమాధానం తల్లికోసం ఎదురుచూచే తన బిడ్డతో కలిపేదిగా ఉండవచ్చు. కాని వాణి మాత్రం నిర్లిప్తంగా స్థిత ప్రజ్ఞురాలై పోయిన దానిలాగా నిలబడిపోయింది.
"పట్నవాసం దొరసానీ! నిన్ను తీసుకురావటానికి ప్రధమ కారణం మా స్వార్ధం. కానీ రహస్యంగా దాచటం అనివార్యంగా నీవు వచ్చేలా చేయటం అంతా నీ క్షేమం కోసమే తల్లీ! నీ వంటి అరుదయిన వ్యక్తులు ఆ శ్వేతనాగు పాలపడకుండా కాపాడుకోవటం మా విదికాదా!" అని అని ఎదురు ప్రశ్న వేశాడు షైజా.
వాణి శ్వేతనాగు పేరు వింటూనే విచలిత అయింది. ఆమె మనోనేత్రం ముందు మెరుపులు మెరిసినాయి. ఆనాటి తుది ఘట్టంలో శ్వేతనాగు పగ ఏమైంది" అని తాను అడిగినప్పుడు వాసుకి సమాధానం చెప్పకుండా అదొకలా నవ్వి వెళ్ళిపోవటం జ్ఞాపకం వచ్చిందామెకు.
వెన్నులోంచి వణుకులాంటి ఉద్విగ్నత ప్రారంభమయింది. ఆ పేరు వింటూనే ఆమె ముఖం ఉజ్వలంగా మారిపోయింది.
ఆనాడు వేణుగోపాలస్వామి సన్నిధిలో అంతర్దానమయిననిధిలో ప్రత్యక్షం కావడం చిత్రాతి చిత్రమనిపించిందామెకు.
"అయితే శ్వేతనాగు...." అంటూ అలా సజీవ శిల్పములా నిలిచిపోయిందామె. మాటలు పెగలలేదు.
"అవును తల్లీ? ఈ పర్వతాలమీద తృణ జ్యోతి. కాష్ట జ్యోతి అని విచిత్రమైన మూలికలున్నాయి. వాటిని సంపాదించాలంటే మాకు నీవు కావాలి. అది ప్రధమ కారణము. ఈ మధ్యన నేను తెలుసుకున్నాను. వాసుకి చెప్పింది. శ్వేతనాగు నాగమణిని ధరించిన నిన్ను చేరలేక సమయంకోసం వేచి ఉంది. దానికి రెండున్నర లక్షల విలువైన హారంగా రూపొందించినాడు నీ తండ్రి. అందునుంచి శ్రీశైలము వస్తూ దాన్ని నీవు భద్రపరచి వచ్చావు. వాసుకి చెప్పకపోయి ఉంటే పరిణామాలు వేరుగా ఉండేవి. అందునుంచి ఈ సాహసం చేశాను. నీ బిడ్డచేసిన పనిగా భావించి నన్ను క్షమించు తల్లీ!" అన్నాడు షైజా అంజలి ఘటించి.
వాసుకి పేరు వింటూనే వాణికి శ్రిగిరులు గిర్రున తిరుగుతున్నట్లు అనిపించాయి.
అయితే ఆమె వివేచన కాంతులు చిమ్ముతూనే ఉంది. మిగిలిన తాళపత్రాలను సాధించే అవకాశం చేజారిపోలేదు. అద్బుతమైన విజ్ఞానం అందించే దారులు ఇంకా మూయబడలేదు. ఆమె నేత్రాలు నక్షత్రాల్లా ఉజ్వలమైనాయి.
"అయితే వాసుకి ఎక్కడ? అని అడిగిందామె.
"రా తల్లీ? అంటూ వినయంగా దారి చూపసాగాడు నాగాలనాయకుడు షైజా.
అద్భుతమైన ఒక మానసికావష్టలో అతని వెంట అడవి దారులు పట్టి నడుస్తోంది వాణి.
4
కొండదోరవుల్లో నీరు త్రాగుతూ సూర్యాస్తమయం అయిందాకా నడిచారు వారు. రవంత విసురుగా వీస్తున్న కొండగాలి పీల్చుతూ, రాతి చట్టులలోంచి ఉబికివచ్చే అమృతదారల్ని తాగుతూ ఉంటే అధికంగా నడవడం నించి కలిగిన ఆయాసాన్ని మరచిపోయింది వాణి.
రవి బింబం నడిమింటికి చేరాక షైజా వెళ్లి ఏవో దుంపలూ, మూలికలు తెచ్చి ఇచ్చాడు.
అవి తిన్న తరువాత వాణికి ఆకలికూడా తెలియలేదు. మూలికలలో అతి సాధారణమయినవి ఉన్న విధంగానే అమిత శక్తివంతమైనవి కూడా ఉన్నాయి. మందులలో వాడే రసాయనాలు ఈనాటికీ మూలికలనించే కదా తయారవుతున్నాయి.
అయితే కాలగతి వక్రించింది. ఈనాటికీ మూలికలశక్తి సంపన్నత గురించిన విజ్ఞానం స్మ్రుతిపదాలలోకి తొలగిపోయినది.
షైజాకు ఆ పరిజ్ఞానం కావలసినంత ఉంది. ఆకలి, దప్పిక, నిద్రలేమి అధికమయినందువల్ల కలిగే ఆయాసాన్ని వాటి ద్వారా తీర్చుకోవటం అతడికి తెలుసు. ఆ విషయంలో నాగానాయకుని ప్రజ్ఞాపాటవాలు అసాధారణమైనవి.
బాగా చీకటిపడుతున్న వేళకు వారు ఒక లోయ ప్రాంతానికి వచ్చారు, అల్లంత దూరంలో క్రిష్ణాసలిలధారలు జలజల పారుతూ చిన్నగా శబ్దం చేస్తున్నాయి. ఏటిమీది నుంచి విసురుగా వచ్చిన శీతలవాయువులు శరీరాన్ని చురుక్కుమనిపిస్తున్నాయి.
"అమ్మా పట్నవాసం దొరసానీ! శ్వేతనాగు పగనించి నిన్ను విముక్తం చేయగల అద్భుత స్త్రీమూర్తి ఇక్కడే వున్నది. నీకుకూడా తెలుసుకదా! ఆమె పేరు వాసుకి. ఆ తల్లి సూచనలను అనుసరించి మాత్రమే నిన్ను నిర్భందించాల్సి వచ్చింది. లోనికి వెళ్ళమ్మా!" అంటూ లోనికి దారి చూపించాడు షైజా.
ఖిమో, రేనో, మిగిలినవారంతా అబ్బురపడిపోయి చూస్తున్నారు.
వాణి తన చుట్టూ క్రమ్ముకున్న చీకటిని చీల్చుకుని ముందుకు చూడాలని ప్రయత్నించింది. కాంతి చక్రాలవంటి కన్నులు చేకటిలో ఆత్రంగా దారికోసం అన్వేషించసాగాయి.
ముందుగా తాను ఒక గుహ ముఖం దగ్గర నిలబడినట్లుగా గుర్తించిందామె. ఆ గుహముఖానికి పెద్దశిల అభ్యంతరంగా నిలిచి ఉంది.
ప్రక్కనుంచి సన్నని దారి లోనికి వెళ్లేందుకు అనువయిన ఏర్పాట్లు అని గుర్తించిందామె. సాహసోపేతమైన వాణి జీవితంలో ఇలా చికటిదారులవెంట చొచ్చుకుపోవటమనేది అపురూపమైన విషయమేమికాదు.
అడుగు ముందుకు కదిపేందుకు నిర్ణయించుకుంది తిరిగి వచ్చేదీ రానిదీ తెలియని చీకటి దారిలో అడుగిడుతూ చివరిసారిగా షైజా వంకకు చూపు మరల్చింది వాణి.
ఆమె గుండె నిబ్బరాన్ని తలపోస్తూ కనులు మరింత విశాలం చేసి చూస్తున్నాడతడు. రెప్పవేయటం మరచిపోయినాడు.
"పట్నవాసం దొరసానీ! ఈ కొండమీద కొలువు ఉన్న వృద్ద మల్లిఖార్జునుడు నీ గుండెలో కొలువు ఉండి నిన్ను కాపాడుకుంటాడు అడుగుమొందుకు వేయటమే కదా నీ అలవాటు వెళ్ళు తల్లీ? నీవు తిరిగి వస్తే నీ పాదాలకు నుదురు తాకించి నా బతుకు పునీతమయిందనుకుంటాను, నీవు రాకుంటే ఈ గుహముందే నా తలబద్దలు కొట్టుకుని ప్రాణాలు విడుస్తాను, వెళ్ళిరా తల్లీ" అంటూ వీడ్కోలు చెప్పాడు షైజా
చీకటి తెరమాటున రహస్యంగా కన్నీరు తుడుచుకుంది రేనో. వాణి కృతనిశ్చయురాలయింది.
గుహముఖానికి అడ్డుగా ఉన్న రాతిచెట్టు వెనుక ఉన్న సన్నని కాలిబాటలోకి ప్రవేశించింది. కీచురాళ్ళు కిర్రుమంటున్నాయి. కొండమీద కొలువు ఉన్న దైవాన్ని తలపోస్తూ ఉస్సురని నిట్టూర్చినాడు షైజా.
కాలికిందపడుతున్న శిలాశకలాలు చెదురుతున్నాయి. కన్నుపోడుచుకున్నా కనిపించని కటిక చీకటి దారి వెంట పురోగమిస్తోంది వాణి. గుహవెంట లోపలికి ప్రవేశించిన తరువాత ఒక ఉద్విగ్నతలోను అయిందామె. కొంతదూరం చీకటిలో నడిచాక కంటికెదురుగా అరచేయి ఉంచుకున్నా కనిపించని స్థితి అయింది ఆ పెనుచీకటి కవ్వల ఏమున్నదో ఒక్క వాణికే కాదు, మరెవ్వరికైనా ఊహించరానిది.
అయినా తన అన్వేషణ పర్వంలో వాణి రవంతైనా వెనుకంజ వేయలేదు. అడుగులు నెమ్మదిగా కదుపుతూ మునుముందుకు పురోగమిస్తోంది.
ఆ గుహ లోపల గాఢఅంధకారం ఒక్కటే కాదు - మరెన్నో అవాంతరాలు ఎదురు కావటం ప్రారంభించినాయి. ఎట్టి స్థితిలో అయినా క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని దరి చేరనివ్వని వాణికి అవి అగ్ని పరిక్షలైనాయి. గాలి కదలి కలల్ని నిలిచిపోయిన భయంకరమైన ప్రశాంతత ఎదురైనది. అది మనసును గుబులేత్తిస్తోంది. శ్వాస కూడా అతి ప్రయత్నం మీద తీయవలసి వస్తోంది. అంతకంతకు ఆయాసం అధికమవుతోంది.
ఆ కాటుక చీకటి నిండిన గుహలో, గాలి సైతం స్తంభించిపోయిన భయంకర ప్రశాంతతలో మనఃశక్తులన్నిటినీ సమీకరించుకుని ఒక్కొక్క అడుగు లెక్కిస్తోంది వాణి. నాలుగు అడుగులు వేశాక సముద్ర అంతర్భాగంలో కొన్ని కిలోమీటర్ల లోతున నిశ్చల జలసమాధిలో లావా పర్వతం బద్దలైనట్లు చప్పుడులు వినిపించసాగినాయి.
గుహంతర్భాగంలోని రాతి గోడలు పెళ్లలూడి పడుతున్నాయేమో అనిపించెంతటి ప్రళయ శబ్దాలు చెవుల్ని తూట్లు పొడుస్తున్నట్లు అన్పించాయి.
మహాదేవుడు పూరించిన శంకనాదానికి మంచుకొండలు కదలిపోయినట్లుగా వణికిపోయింది వాణి. ఆ అఖండమైన శంఖనాదం అద్భుతమైన ఓంకారనాదమే!
దానిని ఎవరూ పూరించలేదు. గుహల అంతర్భాగాలలో గాలి రవంత కదిలినా వినిపించే విచిత్ర నాదమది. కొండగుహలలో బాగా లోపలకు చొచ్చుకుపోయాక ప్రకృతి సహజంగా వినిపించే ఓంకారనాదం!
అది విని వాణి ప్రధమంలో తుళ్ళింతలైంది.
కానీ కొద్ది క్షణాలలో తన ఉలికిపాటుకు కారణభూతమైన ధ్వని గుహాంతర్భాగాలలో ప్రకృతి సహజంగా ఎదురు అయే వింత అని గ్రహించిందామె.
కోటేశ్వరుడైన కేశవరావుగారి హృదయ స్పందనలను శాసించగల అపురూపమైన బిడ్డ ఆమె. చిన్నతనం నించి అపారమైన బిడ్డ ఆమె. చిన్నతనం నించి అపారమైన సంపదలలో తులతూగిన అదృష్టవంతురాలు!
ప్రేమించిన మగవాడినిగా చేసుకోగలిగిన భాగ్యశాలిని! తన వాడైన పురుషుని వల్ల బతుకు అర్ధాలను పండించుకుని, అల్లరి కృష్ణునికి జన్మ ఇచ్చిన మాతృమూర్తి కారులోంచి దింపిన కాలు కార్పెట్ మీద ఉంచగలిగిన ఆనందమయమైన జీవితం!
అన్నీ వదులుకుని ఒక దిక్కుమాలిన కొండగుహలో, చీకటి గుయ్యారంలో ఒంటరిగా ప్రాణాలకు తెగించి అడుగు ముందుకు వేస్తోంది వాణి.
అదంతా విజ్ఞానపు వెలుగు లోకంలో కొత్తదారులు నిర్మించాలన్న తపనతోనే చేస్తోందామె. తనకోసం ప్రాణాలను అర్పించేందుకు సైతం నడుం కట్టిన గురుదేవుడు ప్రొఫెసర్ కృష్ణస్వామి నిర్దేశించిన వెలుగుబాట అది!
ఆమె మనోమయ ప్రపంచమంతా విజ్ఞానపు వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగు లోకంలో నిలిచిన వాణికి గుహలోని చీకటి చీకటిగా అనిపించలేదు.
ఒక అభాసగా మాత్రమే అనిపించింది!
అలా ఎంతసేపు నడిచిందో! క్రమంగా శరీరంలోని ప్రతి అణువునూ గుబులెత్తించే గంభీరమైన అఖండనాదం తగ్గిపోయింది.
వాణికి దారి కనిపించకపోయినా అడుగులు చురుకుగా వేస్తూ నడుస్తోంది. మరి నాలుగడుగులు ముందుకు పోయాక ఖస్సుమని లేచిన చప్పుడైంది.
ఆ పూత్కారం వాణి పాదాల దగ్గర వెచ్చగా తగులుతోంది. తనకింక్ జీవితంలో చివరి ఘడియలు సమీపించినాయని భావించింది వాణి.
ఊఫ్..... ఊఫ్.....ఊఫ్ ఫ్ మంటూ ఆ పూత్కారం వెన్నులో వణకు పుట్టిస్తోంది. ఒకటి రెండు అయింది. ఆ శబ్దాలను అందుకుని గుహలో ఉన్న కొన్ని వందల నాగులు ఊపిరి తిప్పుకోకుండా పూత్కారాలు చేస్తున్నాయి.
వాణికి శరీరమంతా స్వేదబిండువులతో తడిసి ముద్దలా ఐపోయింది. హృదయ స్పందనలు అనుక్రమం నించి దారి తప్పుతున్నట్టు అనిపించింది.
బతుకు బంధాలన్నీ తెగిపోయాయని అనిపించిన ఆ చివరి క్షణంలో ఆమెకు ముందుగా జ్ఞాపకం వచ్చినవాడు చిలిపి కృష్ణుడు.