Previous Page Next Page 
శ్వేతనాగు - 2 పేజి 10

    మాతృత్వం తాలూకు మహనీయమైన ఆకాంక్షతో ఎత్తి ముద్దాడితే గుండెలమీద తన్ని తన ముద్దు తీర్చే చిన్నారి కృష్ణుడు.
    తన గురుదేవుడు తనకోసం చేసిన అపురూపమైన త్యాగానికి గుర్తుగా వారి పేరు పెట్టుకున్న ముద్దుకృష్ణుడు ఆ లేత చేతులు తిరిగి తన చెంపల్ని తాకుతాయో లేదో తాను ఈ దిక్కుమాలిన చీకటిగుహలో శ్వేతనాగు పగకు బలిఅయి సమాధి ఐపోతే చిన్నికృష్ణుని ఆకతాయి పనులన్నీ ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు?
    కడుపున పడ్డప్పుడే అల్లరి ప్రారంభించాడు. ఆరోగ్యాన్ని అటు ఇటు చేశాడు తనకు బిడ్డ కలుగుతాడన్నా ఆనందంతో ఆ బాధలన్నీ తాను సంతోషంగా భరించింది ఆమె అలా ఉంటే కేశవరావుగారు తన బిడ్డ ఐన వాణి నలతపడుతోందని కలత చెందేవారు.
    నెలలు నిండాక చిన్నికృష్ణుడు మాతృకోశంలో గిర గిరా తిరగటం, ఈడ్చి, ఈడ్చి తన్నటం ప్రారంభించినాడు. కిలికించితాలు ఐనాయి పులకింతలైనాయి. మాతృప్రేమ మందాకినిలా పొంగులు వారింది. చివ్వున కడుపు చీల్చుకుని భూమిమీదికి వచ్చాడు వాడు.
    ఎత్తుకుంటే గుండెని తన్నేవాడు. ముద్దాడబోతే చెంపల్ని రక్కేవాడు. ముద్దు చేయబోతే బట్టలన్నీ తడిపేసేవాడు. ఎన్ని అల్లరి పనులు వాడు చేసింది? ముందు రెండు పళ్ళు వచ్చాక పైట చాటున దాచి పాలివ్వబోతే, చన్మొనలు కొరికి కళ్ళ వెంట నీరు తెప్పించాడు. ఆ చీకటి గుయ్యారంలో చివరి క్షణాలుగా భావించిన ఆ క్షణాలలో మాతృత్వం తాలూకు మధుర స్మృతులన్నీ ఆమెను కలత పెట్టినాయి. మనసు మండుతున్న నెగడులా అయింది. ఆంతర్యం అగ్నిగుండమే. అయింది.
    అయినా వాణి వెనకడుగు వేయలేదు.
    తెగించిన మొండిలా, చట్టుబారిన రాతి బండలా అడుగులను ముందుకే వేస్తోంది.
    ఆ ప్రదేశమంతా నిండిన పూత్కారాలు అక్కడ కొన్ని వందల నాగులున్నాయని అనుక్షణం గుండెలమీద గుద్దినట్లుగా గుర్తు చేస్తున్నాయి.
    మరికొన్ని అడుగులు ముందుకు వేశాక రవంత వెలుగు రేఖ కన్పించటంతో విభ్రాంత అయింది వాణి. 'ఈ చీకటిగుహలో వెలుగుకు ఆస్కారమేముంది?' అని తనను తాను ప్రశ్నించుకుంది.
    ఆ గుహ మార్గం లోపల ఎక్కడో ఒక బహిరంగ ప్రదేశానికి చేర్చుతోందని కొద్దిక్షణాల తరువాత గుర్తించిందామె. ఆమె ఊహలు నిజం చేస్తూ కొండ దారి పైకి వేడుతున్నట్లు తోచింది.
    ఆ తరువాత చదరంత ఆకాశంలో నాలుగుచుక్కలు కనిపించినాయి. కొండమీదనించి గుహలోకి ఒక పెద్దకలుగు ఉందని, అందునించి గాలి, వెలుతురూ కనిపిస్తున్నాయని అర్ధమయింది. అక్కడ ఆకాశం కింద చుక్కలవంక చూస్తూ క్షణంసేపు ఊపిరి పీల్చుకుంది వాణి.
    ఆ చోటున కొన్ని మొక్కలు మెరుస్తూ కనిపించాయి. ఆ వెలుగులో ఒక ఎత్తయిన రాతి వేదిక కనిపించింది. దానిమీద పద్మాసనం వేసుకుని నేత్రాలు నిమిలితం చేసిన ఒక అద్భుతమైన స్త్రీమూర్తి కనిపించింది. విధాత అనేమహా శిల్పి చెక్కిన శిల్పంలా ఉందామె. ఆమె ముఖం అలలన్నీ ఆగిపోయిన సముద్రంలా చాలా ప్రసన్నంగా కనిపించింది. రెప్పలకదలిక అయినాలేదు. ఊపిరులు తీస్తున్న జాడలేదు.
    ఆ శరీరంలో చైతన్యమనేది చర్మనేత్రాలకు కనిపించలేదు. పెదవి కదపాలంటే భయపడింది వాణి. ఆ వేదిక ముందు నుదురు నేలను తాకించి మాతంగేశ్వరునికి మొక్కులిడుతున్న మహాసర్పంలా తలవాల్చిందామె. హృదయభారమై వెన్నంటి వస్తున్న బతుకు బంధాలన్నీ క్షణకాలం పటాపంచలయినాయి. మనసు అన్ని ఆలోచనలకు అతీతంగా తెల్లని కాగితంలా అయింది.
    "సోదరీ! స్వాగతం" అన్న మాటలు విని ఉలికిపడి కన్నులు విప్పి చూచింది వాణి.
    వాసుకి నవ్వుతూ నిర్మలంగా తరంగిణి పొంగులు వారుతున్నట్లు అనిపించింది., తిరిగి వాసుకి మధురవీణపై వేదనాదాలను పలికించుతున్నట్లుగా కంఠాన్ని విప్పింది.
    "సోదరీ! స్వాగతం! తిరిగి ఎంతకాలానికి చూడగలిగానమ్మా నిన్ను. విజ్ఞానపు వెలుగు లోకానికి రహదారులు నిర్మించాలని నీవు ఆశించినావు. ఆపదలపాలయినావు. యోగి ఇచ్చాపూర్వకంగా తనువు చాలిస్తూ ఈ విధయం నాకు తెలియచేశారు. అప్పటినించి నీకోసం ఈ మహాగరుడయోగం ప్రారంభించాను. యోగికున్న శక్తులు నాకు లేవు. అందునించి తక్షణం నిన్ను కాపాడలేను. కానీ అందాకా నీవు సజీవంగా ఉండాలి కదా" అన్నదామె. యోగి చనిపోయినాడని వినగానే వాణికి మనస్సంతా వెలితిగా అయింది. కానీ వాసుకి అంటున్న మాటలు వెంటనే ఆలోచనా సముద్రంలో ముంచెత్తినాయి.
    "ఇంతకూ నాకిప్పుడు వచ్చిన ఆపద ఏమిటి!" అన్నదామె. వాసుకి పెదవులు రవంత కదిపి మందహాసం చేసింది.
    "పిచ్చిదానా! ఒకప్పుడు నీవు అడిగావు గుర్తుందా? నాగమణి వల్ల శ్వేతనాగు నిన్ను చేరలేకపోయినా దాని పగ ఆసాంతం కాలేదు. నీవు నీకోసం పరితపించే తండ్రీ, నువ్వు ప్రేమించే భర్తా, బిడ్డా కలిగిన దానవు. నీ కంటి వెలుగులే ఆ ఇంటి వెలుగులు. ఆ వెలుగు ఆరిపోతే వారికేకాదు. నాకు కూడా బతుకంతా చేకటి అవుతుంది." అన్నదామె.
    వాణి ఏం చెప్పేందుకూ తోచక నిర్విణ్ణిరాలు అయింది శ్వేతనాగు ఇంకా తనను వెన్నాడుతూందా! ఆనాడు తాను కలలో చూచిందంతా అసత్యమే. ఆలయంలో కన్పించింది శ్వేతనాగు నిజరూపం కాదు.
    ఆమెకు లోకమంతా తల్లకిందులయినట్లు అనిపించింది. స్వేతనాగునించి తనకింకా ఇంత ప్రమాదం పొంచి ఉన్నది అనుకోవటమే భయంగా ఉంది.
    "సోదరీ! వాసుకీ! విజ్ఞానపు లోకానికి విస్తృతమయిన రహదారులు నిర్మించాలని నన్ను ఆదేశించారు ప్రొఫెసర్ కృష్ణస్వామి. అందుకే నేను ఈ ప్రయత్నంలోకి దిగాను. దైశాంశ కలిగిన శ్వేతనాగు నన్నెందుకు వెన్నాడుతోంది," అని అడిగింది వాణి.
    ఆ ప్రశ్నకు ఇతఃపూర్వంలాగే నవ్వి ఊరుకుంది వాసుకి .
    "శ్వేతనాగు నిన్ను వెన్నాడుతోంది. ఆనాడు స్వేతనాగుతో పాటుగా నిన్ను వెన్నాడాను నేను. ఈనాడు యోగి లేకపోయినా వారి ఆదేశాన్ని అనుసరించి నిన్ను  రక్షించుకోవడం నా కర్తవ్యమయింది. అవసరమయితే అందుకోసం మరొకమారు సర్పయాగం చేస్తాను. ఆ శక్తిని సమీకరించుకుందుకే నేనిక్కడ మహా గరుడయాగం చేస్తున్నాను. అవసరమయినప్పుడు నా అంత నేనుగా వచ్చి నా కర్తవ్యాన్ని నేరవేర్చుకుంటాను. అందాకా నిన్ను నీవే రక్షించుకోవాలి. ఇప్పుడు నీవు తిరిగి వెళ్లేందుకు దారి చెబుతాను." అంటూ లేచి తన వెనుక ఉన్న ఒక రాతిని పట్టి లాగింది. వాసుకి.
    వాణి కొద్ది అడుగులు నడిచి కొండ చరియమీదకి వచ్చేసింది.

 Previous Page Next Page