అందరికన్నా ముందుగా వచ్చాడు షైజా! అతని వెనుక ఖిమో కూడా వచ్చాడు. వారి ముఖముద్రాలు అత్యంత ఆసక్తి పూర్ణంగా ఉన్నాయి.
లోనికి వస్తూనే షైజా వాణి పాదాలమీద పడిపోయినాడు. ఆమె పచ్చని పాదాలకు నుదురు తాకించి మ్రొక్కులు మొక్కాడు. అతని వినుక ఖిమాతో సహా నాగాలందరూ వంగిపోయి తలలు నేలకు తాకించినారు. శ్రీశైల సానువులలో అది చాలా కీలకమైన చోటు. అన్నిదిక్కుల చీకటి గుయ్యారాల్లో పొదలు - అడవిచెట్లు పెరిగి ఉన్న రహస్యమైన చోటు.
అక్కడనుంచి గణేశ్వరం, గరుడేశ్వరం, ఏలేశ్వరం, మృదంగేశ్వరం, గుప్తమహేశ్వరం లాంటి తీర్ధ ప్రాంతాలకు వెళ్లేందుకు గుప్తమైన దారులున్నాయి. ఘంటాకుండము, వరాహకుండము, చంద్రకుండాల్లాంటి దర్శనీయమైన తీర్ధాలకు వెళ్ళే రహస్య మార్గాలున్నాయి. బిల్వమల్లీశ్వరుడు, ప్రహళ గిరిశ్వరుడు; మాతంగేశ్వరుడు, నవనందులు, నవదుర్గలు, నవ భైరవుడు లాంటి దైన సన్నిధులకు ప్రచురం కాని బాటలున్నాయి.
అక్కడ ఒక ఎత్తయిన రాతి మీద నిలిచి చూస్తే శృంగాత్రయం దర్శించవచ్చు. అవి శ్రిశైలస్వామి అయిన మహేశ్వరుని త్రిశూలాగ్రాలవలె కనిపిస్తాయి. అంత కీలకమైన చోటు ఒకటుందని తెలుసుకోవడం సాధారణ యాత్రికులకు దుస్సాధ్యం. స్థానికులకైనా అసాధ్యం. అయితే ఈశాన్య ప్రాంతం నించి దక్షిణాది వరకు మూలికల అన్వేషణలో పురోగమించిన నాగాల నాయకుడు షైజాకు అది అలవాటైన విద్య.
అందునించి అటువంటి చోటుని ఎంపిక చేయగలిగినాడతడు. అ చోటు ఎంతో కీలకమయినది, నవాగతురాలయిన వాణి ఆ విషయాన్ని అర్ధం చేసుకుంది. నాగరికులు చొరరాని స్థావరాలకు ఆటవికులు సునాయాసంగా వెళ్ళగలుగుతారని ఆమెకు తెలుసు.
వారందరూ తన పట్ల అమితమయిన గౌరవాన్ని ప్రదర్శించిన తరువాత రవంత స్థిమిత పడిందామె, ఒకసారి తనను తాను పరిశీలించుకుంది.
తాను ధరించిన అలంకారాలేవి స్థానభ్రంశం కాలేదు. ఎలక్ట్రానిక్ వాచ్ లో సమయం ఎనిమిది గంటలు సూచిస్తోంది. తారీఖు చూచి ఉలికిపడిందామె. అప్పటికి తానుకారు దిగి వచ్చి నాలుగవ రోజు గడుస్తోంది. స్మృతి విహీనంగా మూడురోజులు గడిచిపోయిన సంగతి తలచుకోగానే ఆమెకు ఉవ్వెత్తున కోపం వచ్చింది.
తనకోసం దిగులు పెట్టుకుని ఏడ్చే కన్నబిడ్డా, అనుక్షణము పరితపించిపోయే కట్టుకున్నవారూ జ్ఞాపకం వచ్చారు. ఈ సంగతి తండ్రి స్థితి ఎలా అవుతుందో ఆమెకు తెలుసు.
అవన్నీ మననం చేసుకున్న తరువాత రవంత కళవర పడిపోయిందామె. ఒకప్పటవాణిలా సాహసోపేతంగా సమస్యల మధ్య పురోగమించే స్థితినుంచి ఇటీవల మార్పులు ఆమెను దూరంచేశాయి.
తల్లీ, ఇల్లాలు అనే రెండు మహత్తరమయిన, పవిత్రమయిన బాధ్యతల వల్ల ఇప్పుడామె బందీ అయింది. ఎప్పుడేమి ఆలోచించినా ఆ కర్తవ్యాలకు అనుగుణంగానే ఆలోచించాలి.
అందునించి ఈ చాలెంజ్ ని ఆత్మవిశ్వాసంతో స్వీకరించేందుకు ఆమె రవంత వెనుకంజ వేసింది.
"షైజా! నాగాజాతీయులయిన దొరల ఆత్మవిశ్వాసం మీద మోడి ఆట తరువాత నేను చాలా విశ్వాసం ఏర్పరచుకున్నాను. కాని దురదృష్టవశాత్తు ఆ నమ్మిక జీవితాంతం నిలిచిపోకుండా ఇప్పుడు దిగజారిపోయింది. ఎందుకో తెలుసా! నీవు ఒక ఇల్లాలిని, ఒక తల్లిని వంచనతో తీసుకువచ్చావు, బందీని చేశావు" అన్నదామె.
వివశమయిన కోపంతో, బిడ్డమీది పరితాపంతో ఆ మాటలు అన్నదామె.
ఆ మాటలు ఆటవిక న్యాయానికి నిలిచే నాగాల దొర షైజాను శూలాలవలె గుచ్చినాయి. అన్నింటినిమించి 'బందిని చేశావు' అన్నమాటను అతడు భరించలేకపోయినాడు దుఃఖభారంతో ఖిన్నుడయినాడు.
"పట్నవాసం దొరసానీ? ఆనాడు మోడి ఆటలో మామీద సునాయాసంగా గెలిచావు. నాగమణిని సాధించావు. ఆ తరువాత సప్తధాతు సంజీవని మూలికల్ని సంపాదించి ఇచ్చావు. నీ తనువు మహా సర్పరేఖలు ముద్రితమయి ఉండటంనించి పవిత్రమయినది. మీ తెలుగువారికి ఆ పద్మావతి, ఆ కాంతమ్మ, ఆ కనకదుర్గమ్మ, ఈ భ్రమరాంబిక ఎంత పవిత్రమయినవారో మా నాగాజాతీయులైన వారందరికి నీవు అలాటి అంబవు. నిన్ను బంధించటమన్న ఆలోచన మా మనస్సులో వచ్చి కాపాడుకోవటం నాకు అవసరమయింది తల్లీ!" అన్నాడు షైజా.
"అవునమ్మా అపార్ధం చేసుకోకు" అంటూ అర్ధించింది రేనో! ఖిమో సాగిలి ఆమె పాదాలమీద పడ్డాడు.
షైజా మాటలన్నీ విని వారి ప్రవర్తన పరిశీలించిన తరువాత విభ్రాంతి అయిపోయింది వాణి.
మిగిలిన నాగాలు ఎంతో ఆరాధనా భావంతో ఆమె వంక చూస్తున్నారు. వాణి తన జీవితవాహిని అనివార్యంగా మరొక మలుపుకు తిరుగుతోందని భావించింది.
జీవితమనేది ఏకోన్ముఖమయిన ప్రయాణం కాదు. బ్రతుకుపదంలో అందరూ బాటసారులే. ఎవరి దారులు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో ఊహించటం ఒక్క విదాతకే చేతనవును.
అనివార్యమయిన పరిణామాలు ఎదురు అయినప్పుడు ఇతఃపూర్వం ఆశించినవీ, అందరానివి అన్నీ తలపుకు వస్తాయి. ఆ బంధాలు దుఃఖాన్ని మాత్రమే ఇవ్వగలుగుతాయి. ధీశక్తి, మనోధృతి కలిగిన వారి సంగతి అందుకు విభిన్నంగా ఉంటుంది.
తల్లీ, తండ్రి, అక్కా, చెల్లీ, కడుపు చీల్చుకుని వచ్చిన తనయుడు, కట్టుకున్న భర్తా, ప్రేమించిన భార్య, మిత్రులు వీరందరినీ మానవ ప్రాణులు ప్రేమిస్తాయి. ఎంతవరకూ? చైతన్యతాస్పూర్తి కలిగిన ఈ శరీరంలో స్పందనలు కొనసాగినంతవరకే! ఒకవేళ అనూహ్యమైన సమయంలో అర్ధంతరంగా ఈ ఊపిరులు ఆగిపోతే ఆ బంధాలన్నీ ఏమవుతాయి? ఏడ్చెందుకైన సమయం చాలని ప్రాణప్రయాణ సమయంలో వారి పలకరింపులు అంతర్లోకాలను స్పృశించలేవు. ఆనందానికి, విషాదానికి, ఆత్మియతలకి అతీతమయిన ఒక మానసికావస్థ ఏదో ఒకనాడు ప్రతి ప్రాణికి అనివార్యం.