తిట్ల వర్షం!
"ఒసేవ్ పందీ...ఓమారిలారా..."రంగారావు కేకపెట్టాడు.
పంది అనబడ్డ అతని భార్య కూర్మావతి ఉలకలేదు,పలకలేదు.
"ఏమిటే...పిలిస్తే వినబడ్డం లేదా పిచ్చిముండా...డ్యాష్ మీద తంతే మూసీ నదిలో పడ్తావ్...ఓ మారిలారా బద్మాష్ దానా..."ఈసారి మరికాస్త గట్టిగా కేకేశాడు.
కూర్మావతి నెత్తీనోరూ కొట్టుకుంటూ వంటింట్లోంచి పరుగెత్తుకుని వచ్చింది.
"హవ్వ... హవ్వ...ఏంటండి ఆ తిట్లూ?..." లబలబ మొత్తుకుంది కూర్మావతి.
రంగారావుఆశ్చర్యంగా కూర్మావతి వంక చూసాడు.
"నేనా?...నిన్ను తిట్టానా??...ఎప్పుడూ???"
కూర్మావతి దెబ్బతిన్న మనిషిలా చూసింది.
"మీరిప్పుడు నన్ను తిట్టలేదూ?" అని అడిగింది మెల్లగా.
రంగారావు వింతగా ఆమెవంక చూసాడు. తర్వాత బుర్రకాయ్ ఓసారి గట్టిగా విదిలించాడు.
"నా బుర్ర తిరిగిపోతూంది...నేనేంటి,నిన్ను తిట్టడం ఏమిటి?... నాకంతా అయోమయంగా ఉంది...నేను ఈ మధ్య నిన్ను గమనిస్తున్నా...నేను తిట్టకపోయినా తిడ్తున్నానని ఊర్కూర్కే అభాండాలు వేస్తున్నావ్ రాస్కెల్..."మెల్లగా అన్నాడు రంగారావు బాధగా తలపట్టుకుంటూ.
"అదిగో ...అదిగో...చూశారా...మళ్ళీ తిట్టారు..."ఉక్రోషంగా అని కాళ్లని ఎగరేస్తూ నేలని తన్నింది కూర్మావతి.
"అద్దిగో...చూశావా మళ్ళీ!తిట్టకపోయినా తిట్టానని అంటున్నావ్ కుక్కా..." విచారంగా తల పట్టుకున్నాడు రంగారావ్.
"సర్లే... మీతో వాదించి లాభంలేదు...మీకేదో అయ్యింది..." అంది కూర్మావతి.ఆమె మొహం పాలిపోయి ఉంది.
"నాకేం కాలేదుగానీ...కాస్త వేడి వేడి కాఫీ పట్టుకురా ముష్టిదానా..."
కూర్మావతి ఓసారి దీర్ఘంగా నిట్టూర్చి వంటగదివైపు అడుగులు వేసింది.
"ఏయ్ పిచ్చిముండా...నిన్నే..."పిలిచాడు రంగారావు.
కూర్మావతి వెనక్కి తిరిగింది.
"ఈ గాడిద కొడుకెక్కడికి వెళ్ళాడు??"కొడుకు గురించి అడిగాడు.
"ఏమో...నాకేం తెల్సూ..."
"నాకేం తెల్సంటే ఎలా'...పిల్లలు ఎక్కడికెళ్తున్నారో...ఏమేం చేస్తున్నారో తెల్సుకోవలె పిలాస్కీ..."
"పిలాస్కీ అంటే ఏంటి?"
"ఏమో...నాకేం తెల్సు?ఎందుకలా అడిగావ్?..."
"ఇప్పుడు నన్ను పిలాస్కీ అని అన్నారుగా?"
"నేనా...ఎప్పుడూ?!..." కళ్లు ఇంతింత చేస్కుని చూస్తూ అడిగాడు రంగారావు.
కూర్మావతి మారు మాట్లాడకుండా తనలో తాను కుమిలిపోతూ వంటగదిలోకి వెళ్ళింది.
"లాభంలేదు...ఈయన మెదడుకేదో అయ్యింది...పిలాస్కీ అట!...అదేమైనా రష్యన్ తిట్టేమో!!... హమ్మో...ఈయనకి తెలీకుండానే ఇతర దేశాల భాషల్లోకూడా తిట్టేస్తున్నారు"ధన్... ధన్ మంటూ గుండెలు బాదుకుంది.
"దీపావళికి ఇంకా చాలా రోజులుండగా ఈ టపాకాయలు పేల్తున్న శబ్దం ఎక్కడినుండొస్తుందే వెర్రి పీనుగా..." హాల్లోంచి అరిచాడు రంగారావు.
అంత బాధలోనూ కూర్మావతికి నవ్వొచ్చింది.
"హబ్బ...ఊర్కోండి మీ పిచ్చి జోకులూ మీరూను...టపాకాయలు కాదూ, పాడూకాదు...నేను గుండెలు బాదుకున్నానంతే...హి...హిహి..."వంట గదిలోంచి అతనికి సమాధానం ఇచ్చింది.
"నువ్వు గుండెలు బాదుకుంటావో బద్దలు కొట్టుకుంటావో నాకనవసరం... త్వరగా కాఫీ తెచ్చి తగలడవే పింజారీ..."రంకెవేశాడు రంగారావు.
కూర్మావతి ఫటఫటా నెత్తి కొట్టుకుంది.
కూర్మావతికి ఈ మధ్య భర్త మాట్లాడే మాటలు చెడ్డ చికాకు కలిగిస్తున్నాయ్. అతని మాటలనిండా తిట్లే.
ఎందుకో హఠాత్తుగా అలా మారిపోయాడతను. పోనీ పిచ్చెక్కిందా అంటే అదీకాదు...బాగానే ప్రవర్తిస్తాడు...
మరేందుకలా పిచ్చి తిట్లు తిడ్తున్నట్టు?
తను తిడ్తున్నట్టు అతనికే తెలీదు... అది మరీ విచిత్రం.
కూర్మావతికి ఏం చెయ్యడానికీ పాలుపోవడంలేదు.
"ఒసేవ్ తింగారి రాస్కెల్...కాఫీ తెస్తున్నావా?..."హాల్లోంచి మళ్ళీ అరిచాడు రంగారావ్.
"ఆ...ఆ...తెస్తున్నా..." కలిపిన కాఫీని గ్లాసులోకి హడావుడిగా వొంచుతూ అంది కూర్మావతి.
రెండురోజుల తర్వాత కూర్మావతిపాలిట దేవుడిలా రామారావు వాళ్ళింటికి వచ్చాడు.
రామారావు అంటే కూర్మావతి పెద్దమ్మ కొడుకన్నమాట!
వైజాగ్ నుండి హైదరాబాద్ కు ఒక ఫ్రెండు పెళ్లికని వచ్చాడు.
కుశల ప్రశ్నలు అయ్యాక అడిగింది కూర్మావతి.
"అబ్బ ...ఎన్ని సంవత్సరాలైందిరా తమ్ముడూ నిన్ను చూసి...నీ చదువైపోయిందా...ఇప్పుడేం చేస్తున్నావ్?..."
"చాలా సంవత్సరాలైందనే మీ అడ్రసు కనుక్కుని కష్టపడి వచ్చాను.ఇంకా చదువేంటి అదేనాడో అయిపోయింది...ప్రస్తుతం విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ లో సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్నా..." చెప్పాడు రామారావ్.
ఆ మాట వింటూనే కెవ్వుమని అరిచింది కూర్మావతి. ఆ కేక విని రామారావ్ గదిలో కంగారుగా అటూ ఇటూ చీపురు దెబ్బతిన్న బొద్దింకలా కాస్సేపు పరుగులుతీసి, తర్వాత గోడకి జారపడి ఆయాసపడ్తూ కూర్మావతి వంక భయం భయంగా చూసాడు.
"ఏంటి తమ్ముడూ అలా పరిగెత్తావ్ గమ్మత్తుగా?"అడిగింది కూర్మావతి.
"నువ్వేందుకట్టా అరిచావ్?..." గుటకలు మింగుతూ అన్నాడు.
"నువ్వు పిచ్చి డాక్టర్ వి కదా..."
"పిచ్చి డాక్టర్ ని కాదు...పిచ్చాసుపత్రిలో డాక్టర్ ని!"పళ్లు నూర్తూ అన్నాడు రామారావు.
"అదేలెద్దూ... నువ్వు పిచ్చి డాక్టర్ వి కదా... నాకో సాయం చెయ్యాల్రా తమ్ముడూ..."
రామారావు హతాశుడయ్యాడు. కూర్మావతి వంక జాలిగా చూసాడు.
"నీకు పిచ్చి ఎప్పట్నుంచక్కా..." గుండెల దగ్గర చొక్కాని నలిపేస్కుంటూ బాధగా అడిగాడు.
ఆ మాట వింటూనే కూర్మావతి ఘొల్లున నవ్వింది.
"సాయం చెయ్యమంటున్నానంటే నా గురించి కాదు...బావగారి గురించి!"
"ఆ ...బావకి పిచ్చెక్కిందా?ఎపుడు?...ఎలా??...ఎక్కడ???..."ఆతృతగా అడిగాడు రామారావు.
కూర్మావతి భర్త రంగారావు గురించి, అతని తిట్ల గురించీ వివరంగా చెప్పింది.
అంతా విన్న రామారావు ఉత్సాహంగా అన్నాడు.
"అయితే ఇది బాగా స్టడీ చెయ్యాల్సిన కేసే..."
అప్పుడే డోర్ బెల్ మోగింది.
"ఆయనొచ్చినట్టున్నారు..."అంది కూర్మావతి హడావిడిగా వీధి తలుపువైపు నడుస్తూ. రామారావు ఆమె వెనకాలే వెళ్లాడు.
కూర్మావతి తలుపు తీసింది. రంగారావు లోపలికి వచ్చి సోఫాలో కూలబడ్డాడు. రామారావు అతని ఎదురుగా కూర్చున్నాడు.
"ఏవండీ బావగారూ...బాగున్నారా?..."అన్నాడు రామారావు.
అప్పుడు చూసాడు రంగారావు తన ఎదురుగా కూర్చుని ఉన్న రామారావుని.
"వోరి తిక్కనకొడకా...నువ్వెప్పుడొచ్చావ్ రా ఊర్నుండి?..." సాదరంగా పలకరించాడు.
రామారావు కూర్మావతి వంక చూసి నువ్వు చెప్పింది కరెక్టే అన్నట్టు ముసిముసి నవ్వులు నవ్వుతూ బుర్రకాయ్ ఊపాడు.
"అడిగిందానికి సమాధానం చెప్పకుండా ఆ వెర్రి నవ్వులేంట్రా బద్మాష్?... డ్యాష్ మీద తంతే విశాఖపట్నంలో పడ్తావ్..." సౌమ్యంగా అన్నాడు రంగారావు.
రామారావు కిసుక్కున నవ్వాడు.
"నేను...హి... ఇందుకే హిహి.. గోదావరి ఎక్స్ ప్రెసెకి...హిహిహి...వచ్చా..."
"ఆ నవ్వులేంట్రా చిల్లర్నాకొడకా..." ఆశ్చర్యంగా అడిగాడు రంగారావు.
ఇహ తట్టుకోలేక గిలగిల్లాడిపోయాడు రామారావు. నవ్వీ నవ్వీ అలసిపోయి కూర్మావతి వంక చూసి "నువ్ చెప్పింది నిజమేనే అక్కా...హి...నిజమే...హిహి...బావగారికి కాస్త..."
చూపుడువేలుని కణతకి ఆనించి అటూ ఇటూ తిప్పాడు.
ఆ రోజంతా రంగారావుతో చెడతిట్లు తిని బాగా ఎంజాయ్ చేసాడు రామారావు.
రాత్రి భోజనాలయ్యాక పక్కకి తీస్కెళ్లి రామారావుతో అంది కూర్మావతి.
"అదిరా తమ్ముడా పరిస్థితి. నువ్వు సైకియాట్రిస్ట్ వి కాబట్టి ఆయనెందుకలా మాట్లాడుతున్నారో కనిపెట్టి ఆయన రోగం కుదర్చాలిరా..."
"నేను రేపు మా ఫ్రెండు పెళ్ళి చూస్కుని విశాఖపట్నం వెళ్లిపోదామని అనుకున్నానుగానీ బావగారి పరిస్థితి చూస్తే ఇలా ఉంది... మరో రెండుమూడు రోజులుండి ఈ విషయాన్ని అటో ఇటో తేల్చి వెళ్తా..." అక్కకు భరోసా ఇచ్చాడు రామారావు.
ఇది వరకు లేని అలవాటు బావగారికిప్పుడు ఎలా వచ్చింది...పోనీ చెత్త సాహిత్యం ఏదైనా చదువుతున్నాడా అంటే ఇప్పుడొచ్చే కథల్లో,సీరియల్స్ లో అన్నీ బూతలు తప్ప తిట్లు ఎక్కడుంటున్నాయ్?
కొత్త మనుషుల్తో సాంగత్యం?...చుట్టుప్రక్కల వ్యక్తుల ప్రభావం?కావొచ్చు!
ఆ మర్నాడు రంగారావుతోబాటు అతని ఆఫీసుకు వెళ్లాడు రామారావు. అతను పనిచేసే డిపార్ట్మెంటులోని వ్యక్తులతో మాటలు కలిపాడు.వాళ్ళందరూ మామూలుగానే మాట్లాడారు.
ఇంటిదగ్గర చుట్టుపక్కలవారితో కూడా మాట్లాడాడు.వాళ్లుకూడా మామూలుగా మాట్లాడుతున్నారు.
మరి రంగారావు అలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎవరి ప్రభావం అతనిమీద పడింది?
రామారావుకి అంతుపట్టలేదు.
ఆరోజు ఇంట్లో న్యూస్ పేపరుకోసం చూసాడు.తెలుగు న్యూస్ పేపరు ఉందిగానీ ఇంగ్లీషు న్యూస్ పేపరు లేదు. రామారావు ఇంగ్లీషు న్యూస్ పేపరు కోసం కూర్మావతిని అడిగాడు.
"మా ఇంట్లో తెలుగు న్యూస్ పేపరే తెప్పిస్తాం..."చెప్పింది కూర్మావతి.
రామారావు ఆ తెలుగు న్యూస్ పేపరే తీస్కుని అటూ ఇటూ తిరగేశాడు.
పేపరు చదువుతున్న రామారావు మొహంలో రంగులు మారాయ్.
"అక్కాయ్...అక్కాయ్...పాత పేపర్లు తీస్కురా...త్వరగా..."అంటూ గావుకేక పెట్టాడు.
కూర్మావతి పాత న్యూస్ పేపర్ల కట్ట తీసుకొచ్చి రామారావు ముందు పడేసింది.
ఆ పేపర్లు కూడా అక్కడక్కడా చదివి సంతృప్తిగా నిట్టూర్చాడు రామారావు.
న్యూస్ పేపర్లనిండా తిట్లే..ప్రైం మినిస్టర్ కాంగ్రెస్ పాలన లేని రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని తిట్టిన తిట్లు, ఆ రాష్ట్ర మంత్రులు ప్రైం మినిస్టర్ ని తిట్టిన తిట్లు, ఒక పార్టీవాళ్లు మరో పార్టీ వాళ్లని తిట్టిన తిట్లు, గవర్నర్ ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి గవర్నర్ నీ తిట్టే తిట్లు...న్యూస్ పేపర్లనిండా తిట్లే తిట్లు...
ఆ న్యూస్ పేపర్లలోని తిట్ల ప్రభావమే రంగారావు సున్నితమైన మెదడు మీద పడిందని రామారావుకి అర్ధం అయ్యింది.
"రేపట్నుండి న్యూస్ పేపర్ తెప్పించడం మానెయ్ అక్కా...బావగారు సెట్ రైట్ అయిపోతారు..."కులాసాగా నవ్వుతూ కూర్మావతితో అన్నాడు రామారావ్.
* * *