Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 10

 

                               కథ సుఖాంతం

    కోటేశ్వర్రావు భార్య కాంతామణికి నెలలు నిండాయ్.ఆమె లేక లేక గర్భం ధరించింది.
    అందుకనే ఆ భార్యా భర్తలిద్దరూ యమసంతోషంగా ఉన్నారు.
    "ఏవండీ...మీకేం కావాలి?"
    పేపర్ చదువుకుంటున్న భర్తని ప్రశ్నించింది కాంతామణి.
    "నాకు అమ్మాయ్ కావాలి!..."పేపర్ పక్కనబెట్టి గారాలు పోతూ అన్నాడు  కోటేశ్వర్రావు.
    "ఏం...ఇప్పట్లో నేను పనికిరాననా వెధవ్వేషాలు?" కోపంగా అంటూ నెత్తిన 'ఠక్'మని మొట్టింది కాంతామణి.
    "హయ్యో రామా...ఇదెక్కడిగోల??... అమ్మాయ్ అంటే పడుచుపిల్ల అని కాదు...నాకు పాప కావాలని అర్థం..." అంటూ కాంతామణి పొట్టకేసి చూపిస్తే అన్నాడు కోటేశ్వర్రావు.
    "ఆ...ఆ...మీరు చెప్పిన వాళ్లని కనడానికి నేను తేరగా ఉన్నానిక్కడ... నేను అబ్బాయ్ నే కంటా..."
    "ఊహూ...అమ్మాయ్ నే కనాలి!!..."గారాలుపొతూ కాంతామణి చెయ్యి వెనక్కి మెలితిప్పి చిలిపిగా వీపుమీద ఒక గుద్దుగుద్దాడు కోటేశ్వర్రావు.
    "అబ్బా ఆశ!...నేను అబ్బాయ్ నే  కంటా..."అంటూ కోటేశ్వర్రావు జుట్టుపీకి చెంపమీద ఓ చరుపు చరిచింది కాంతామణి కొంటెగా.
    "కాదు అమ్మాయ్..."కోటేశ్వర్రావు కాంతామణి జడపైకెత్తి ఓ జల్లకాయ్ కొట్టాడు.
    "కాదు కాదు!...అబ్బాయే!!" అంటూ కాంతామణి కోటేశ్వర్రావు కాలుపట్టి లాగి కిందపడేసి పకపకా నవ్వింది.
    "అమ్మాయే అమ్మాయే అమ్మాయే..."కింద నుంచి లేచి సోఫాలో కూర్చుంటూ అన్నాడు కోటేశ్వర్రావు.
    "మనకీ వాదన రోజూ ఉండేదేగానీ...చెప్పండి ఏం కావాలో..."
    "చెప్పాగా...అమ్మాయ్ కావాలని!!"
    "అబ్బా!...నేను అడిగేది దాని గురించికాదు...మీకు కాఫీ కావాలా టీ కావాలా అని అడుగుతున్నా..." నెత్తికొట్టుకుంటూ అంది కాంతామణి.
    "నాకు కాఫీ కావాలి!!..."
    కాంతామణి భర్తకి కాఫీ తెచ్చి ఇచ్చింది. అతను కాఫీ తాగింతర్వాత కాంతామణి అంది "ఏవండీ...ఈ నెల డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్లలేదు..."
    "ఇప్పుడే వెళ్దాం...నువ్వు తయారవు!" సోఫాలోంచి లేస్తూ అన్నాడు కోటేశ్వర్రావు.
    ఇద్దరూ బట్టలు మార్చుకుని లేడీ డాక్టరు సీతాలు దగ్గరికి వెళ్లారు.
    డాక్టర్ సీతాలు కాంతామణిని పరీక్షించి మొదట పెదవి విరిచింది...తర్వాత ఫకాల్మని హాయిగా నవ్వేసింది.
    ఆవిడ అలా ఎందుకు చేసిందో అర్థంకాక ఇద్దరూ వెర్రిమొహాలేస్కుని చూశారు.
    "మొదట మీరెందుకు పెదవి విరిచారు... ఆ తర్వాత ఫకాల్మని ఎందుకు నవ్వారు?... చెప్పరా...ప్లీజ్!" అన్నాడు కోటేశ్వర్రావు చేతులు జోడిస్తూ.
    "అదా?...వెరీసింపుల్...పెదవి ఎందుకు విరిచానంటే ఆవిడ గర్భంలో బిడ్డ అడ్డం తిరిగింది.మరేమో...ఫకాల్మని హాయిగా ఎందుకు నవ్వానంటే మరి బిడ్డ అడ్డం తిరిగిందిగా...అలా అడ్డం తిరిగితే మా నర్సింగ్ హోంలోనే సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డనిబయటికి తీస్తాంగా...అందుకు!హి...అసలు ఈ బిడ్డలు మా మెటర్నిటీ హోంలని పోషించడం కోసమే అడ్డం తిరిగిపోతుంటారు...హిహి" అంది డాక్టర్ సీతాలు ఉప్పొంగిపోతూ.
    "ఏవండీ... ఆపరేషన్ చేసే తీరాలంటారా?" నీళ్లు నముల్తూ అడిగాడు కోటేశ్వర్రావు.
    "అమ్మో...చెయ్యకపోతే చాలా ప్రమాదం. తల్లీబిడ్డా ఇద్దరూ గోవిందా గోవింద!!" అంది సీతాలు.
    వాళ్లిద్దరి మొహాలూ పాలిపోయాయ్. వాళ్ల భయాన్ని గమనించిన సీతాలు ముసిముసిగా నవ్వుకుంది.
    "మీ బిడ్డింకా నయం...కేవలం అడ్డం తిరిగాడు...మొన్నీ మధ్య బాగా డబ్బుండే ఒకావిడ బిడ్దేమో గర్భసంచిలో ఏకంగా మొగ్గలే వేస్తున్నాడు. ఇలా అయితే చాలా ప్రమాదం అని చెప్పి ఆపరేషన్ చేసి బిడ్డని బయటికి తీసేశాను. వాళ్లు నాకు అయిదువేలిచ్చారు. మీకు అంతెక్కువేం అవదు.మీ బిడ్డ కేవలం అడ్డం తిరిగాడు కాబట్టి మూడువేలు అవుతుంది..."
    "అలాగే డాక్టరుగారూ...మేమింక వస్తాం" నీర్సంగా అన్నాడు కోటేశ్వర్రావు.
    "అలాగే గానీ ...మీ క్రాపు చాలా బాగుందండీ...చక్కగా బఫ్ వచ్చేలా దువ్వుకున్నారు..."అంది డాక్టర్ సీతాలు అతని క్రాపువంక మెచ్చికోలుగా చూస్తూ "మా ఆయన్ని కూడా ఇలానే దువ్వుకోమంట..."
    "బపూ కాదు నా బొందా కాదు. ఇందాక మా ఆవిడ బొడిపె వచ్చేలా మొట్టింది.అందుకే అక్కడ ఎత్తుగా అలా లేచింది..."సిగ్గుపడ్తూ అన్నాడు కోటేశ్వర్రావు.
    "అవునా?...బాగుందే!!! ఈ రోజు ఇంటికెళ్లింతర్వాత నేను కూడా ఆయన్ని గట్టిగా మొడ్తా..." సంబరంగా అంది డాక్టర్ సీతాలు.
    కాంతామణి,కోటేశ్వర్రావు సీతాలు దగ్గర శలవు తీస్కుని ఇంటికెళ్లారు.
    "డాక్టర్ చెప్పింది విన్నాక నాకు చాలా డల్ గా ఉందండీ...మనసంతా చికాకు చికాకుగా ఉంది.అందుకని ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్దామండీ..."కోటేశ్వర్రావు గుండెలమీద వెంట్రుకలు పీకుతూ అంది కాంతామణి.కోటేశ్వర్రావ్ బాధగా ఓ కేకపెట్టాడు.
    "సినిమాల్లో చూడ్లేదూ?నవలల్లో    చదవలేదూ?? ఏదైనా చెప్పదల్చుకున్నప్పుడు ఛాతీమీది వెంట్రుకలు మెల్లగా లాగుతూ చెప్తారు...నువ్వేంటి గడపీకుతున్నట్టు పీకుతున్నావ్?" పళ్లు కొరుకుతూ అన్నాడు కోటేశ్వర్రావ్.
    "సారీ అండీ!...ఇహనుండి మెల్లగానే పీకుతాను సరేనా?"
    "నువ్వ పీకక్కర్లేదు...మనం వెళ్దాం పద!!..."అన్నాడు కోటేశ్వర్రావ్ కాంతామణి చేతిని ఛాతీమీదది నుంచి లాగేస్తూ.
    ఇద్దరూ ఇంటి దగ్గరనుంచి కార్లో బయలుదేరారు.
    "ఎక్కడికి వెళ్దాం?"అడిగాడు కోటేశ్వర్రావు.
    "ఎక్కడికైనా పర్లేదు...దూరం అలా అలా తిప్పుకుని రండి"చెప్పింది కాంతామణి.
    కారు ఒక ఫర్లాంగు దూరం మామూలుగా నడిచింది.తర్వాత ఉన్నట్టుండి ఎగిరి జంప్ చేసింది.
    ఆ కుదుపుకి కాంతామణి ఎగిరి ముందుకుపడి మళ్ళీ సర్దుకుని కూర్చుంది.
    "ఏంటీ...ఏదైనా సర్కస్ కంపెనీలో పని చెయ్యాలని అనుకుంటున్నారా?...కారు సరిగ్గా నడపండి" విసుక్కుంది కాంతామణి.
    "నేను సరిగ్గానే నడుపుతున్నా..."గొణిగాడు  కోటేశ్వర్రావ్.
    కారు మరి కాస్త దూరం సాఫీగానే నడిచింది. ఉన్నట్టుండి గంతులేస్తూ నడవడం మొదలెట్టింది.
    "ఏంటిది...మనం కార్లో వెళ్తున్నామా లేకపోతే గుర్రం మీద వెళ్తున్నామా?" కంగారుగా అడిగింది కాంతామణి.   

 Previous Page Next Page