'చెల్లెలా!' పిలిచాడు నారదుడు. 'నేను నీకగ్రజుడిని అవుతాను. నేను బ్రహ్మ మానసపుత్రుడిని. నారదుడ్ని! నువ్వూ బ్రహ్మ మానస పుత్రివే!'
ఆమె అన్నగారి పాదాలను చూస్తూ వందనం సమర్పించింది.
'ఇష్టవర ప్రాప్తిరస్తు!' దీవించాడు.
ఉలికిపడ్డాడు ఇంద్రుడు.
బ్రహ్మ కూడా కలవరపాటు చెందాడు.
'పితామహా! చెయ్యక చెయ్యక అద్భుత సృష్టి చేశావు. నభూతో నభవిష్యతే కాదు. నవర్తమానః అన్నట్లు లావణ్య రాశిగా పోత పోశావు. ఏ కన్యకైనా తన తండ్రి తగిన వరుణ్ణి ఎన్నిక చేసి కన్యాదానం చేసి అత్తవారింటికి పంపితే అనురూప లావణ్య తారుణ్యాదుల సరిజోడుతో సంసారం చేసి తరిస్తుంది. నా చెల్లెమ్మకు ఏ వరుడిని సృష్టించి ఉంచావ్!'
ఉలిక్కిపడ్డాడు బ్రహ్మ.
అవును ఎవరు? ఎవరు? ఎవరు? అనుకున్నాడు.
వింటూన్న దేవ నాధుడికి మంచి అవకాశం చిక్కినట్టయింది.
'దేవర్షీ! ఎదురుగా నేనుండగా మరొకరి మాటెందుకయ్యా? ముక్కోటి దేవతలు మొక్కులందుకునే మూడు లోకాలకూ అధిపతిని. ఈ సృష్టికర్త, ఆ స్థితి కారకుడు, ఆ లయ కారకుడూ, ఆపై నేనే కదా ప్రప్రధముడిని. వీరైనా నన్నే త్రిలోకాధిపతిగా మన్నిస్తారు కదా! అమరలోక అర్ధ సింహాసనం అలంకరించే అదృష్టం అహల్యకు దక్కనీ!' అన్నాడు దేవేంద్రుడు.
ఆశగా ఆకాంక్షాయుతంగా అంతరంగం నిండా తననే నింపుకుని తనవైపు చూస్తూ అభ్యర్థించిన అమర దేవుడిని చూసి సిగ్గుతో మొగ్గలా ముడుచుకు పోయింది అహల్య.
తొలిచూపులోనే ఇంద్ర వైభవం చూసిన ఆమె కన్ను చెదిరింది.
సృష్టికర్త నిరసనగా చూశాడు.
'భలే బాగుందయయా దేవేంద్రా! నీ పాదాలకి నీవే నమస్కరించుకుని, నిన్ను నీవే దీర్ఘాయుష్మాన్ భవా అని దీవించుకున్నట్లుంది. నీకు నీవే నీ అర్హత ప్రకటించుకుని నిన్నెనిక చేసుకుంటే ఎలా? ఎన్నిక చేయవలసింది చెల్లెలు! లేదా పితామహుడు. అయినా స్వర్గానికి వెళ్ళినా సవతి పోరు తప్పలేదన్నట్లు అహల్యకు శచీదేవి సాపత్నీతం బాధావహం కాదా! అందునా నీకు భార్య ఒకతే! కానీ బహునారీ సుందరుడవు కాదూ నీవు?'
ఇంద్రుడికి చిర్రెత్తుకొచ్చింది.
అహల్య చూపులతో సమ్మతి తెలిపిందని తనలో తాను మురిసిపోతుంటే- బ్రహ్మ అఖిల లోకాలకూ అల్లుడవుతాడని మురిసి కూతుర్ని ఇచ్చి కట్టబెడతాడని తను తలపోతల్లో తల మునకలవుతూంటే మధ్యలో ఈ కలహభోజనుడి అడ్డు పుల్లెమిటీ? అనుకున్నాడు.
'వరుడి యోగ్యతలు పరమేష్టి బాగా నిర్ణయించగలడులే! కాబోయే బావగారితో మేలమాడకు అప్పుడే' అన్నాడు నవ్వుతూ.
ఇంద్రుడి మాటలు నారదుడికి నవ్వు తెప్పించాయి.
అంతలో విశ్వామిత్రుడు అన్నాడు 'సర్వ కారణ కర్తా! సృష్టికి ప్రతి సృష్టి చేసి అపర బ్రహ్మ అనిపించుకుని, వశిష్టుడంతటి వాడితో బ్రహ్మర్షి అనిపించుకున్న ఈ గాధేయుడికి కన్యాదానం చేసి నీ సృష్టిని సార్ధకం చెయ్!'
'గాధేయా! రా గాధేయా! రా - గాధేయా! అని పిలిచి మన్నింపక ముందే పీటెక్కి కూర్చోకు! పితామహులు తగిన వరుణ్ణే ఎన్నిక చేస్తారులే!' అన్నాడు నారదుడు.
'చక్కగా అన్నావు. జడ ముడికీ, మొండి జడదారికీ జగదేక సుందరి సౌందర్యాభిలాషా!' అన్నాడు దేవేంద్రుడు.
విశ్వామిత్రుడు జవాబు చెప్పేలోగా మరో దిక్పాలకులకూడూ ఇంకో మునీ- ఓ దిక్పాలుడు అలా అలా అందరూ అహల్యని అభిలషిస్తూ అర్ధించారు.
బ్రహ్మకి సమస్య పరిష్కరించరానిదిగా కనిపించింది.
'పుట్టక పుట్టక ఓ పిల్ల పుడితే తోబుట్టువు పుట్టీ పుట్టగానే పెద్ద సమస్య పుట్టించిందే!' అన్నాడు నారదుడు.
'నారదా! అహల్యకు అనురూప వరుడ్ని, అన్ని విధాలా యోగ్యుడ్ని అల్లుడిగా నా మన్ననలు పొందగలిగిన మేధావిని సూచించు'
'అటు తిరిగి ఇటు తిరిగి ఇది నా మీదే పడిందా'
'బావగారిని వెతికేది బ్రహ్మవిద్యా! ఇటునుండగా ఎన్నిక చేయడం ఏమంత కష్టం' కల్పించుకుని అన్నాడు మహేంద్రుడు మళ్ళీ.
'వర పరీక్ష ఒకటే సమస్యా పరిష్కార సాధనంగా తోస్తున్నది'
'వర పరీక్షా?' అడిగాడు దేవేంద్రుడు.
'ఔను. వర పరీక్ష ఒకటే మార్గం. పితామహా! పరీక్షలో నెగ్గిన వారికి అహల్యనిచ్చి కన్యాదానం చేయండి! అంతే!'
'ఏమి పరీక్ష? అదీ నీవే సూచించు!' అన్నాడు.
'భూ ప్రదక్షిణం చేసి ముందుగా ఎవరయితే రాగలుగుతారో వారే వర పరీక్షలో నెగ్గినట్టు!'
'భేష్! చక్కని మాట. పరుగు పందెంలో గెలిచిన వారికే పరువాల కుప్ప దక్కుతుంది' పరీక్షకు సమ్మతించి అన్నాడు పరమేష్టి.
'మరి బయలుదేరమా!' అన్నాడు మహేంద్రుడు తొందరపడ్తూ అడిగాడు.