Previous Page Next Page 
అహల్య పేజి 8


    'ప్రభూ అడవిలో తండ్రి తప్ప అన్య జన పరిచయం లేని ఋష్యశృంగ మహర్షిని కొనితేవటానికి వేశ్యోత్తమ బయలుదేరి వెళ్ళిందట ప్రభూ! తన ఆట పాటలతో ఆయన్ని ఆకర్షించి అలరించి ఆపై తన మాయలో బంధించి వంగ దేశానికి కొని రావటానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుందట!'


    'కొడుకును క్షణమైనా విడిచి ఉండలేని ఆ విభాండక మహర్షి కను దృష్టినుంచి ఋష్యశృంగుడిని తప్పించడం సాధ్యమా!'


    'కాలం కలిసి వస్తే!'


    'కాలం.... బహు కాలంగా అనుకూల కాలం కోసం ఎదురుచూపులు చూడటంతోనే సరిపోతున్నదయ్యా....'


    సుమంత్రుడేమీ అనలేదు. అంతలో ప్రతీహరీ వచ్చాడు.


                                         6


    'కనుక... ఇన్ని కల్పాలుగా సృష్టించని, ఇకముందు సృష్టించబోని సౌందర్య రాశిని ఇప్పుడే సృష్టిస్తాను. జగదేక సుందరిని మీముందు నిలుపుతాను. సోయగాల ప్రవాహం, సుకుమారాల సమూహం, అందాల రాశీత్వం, వన్నెల చిన్నెల వయ్యారాల రూపకం - ఓహ్ ఒకటేమిటీ? ఏ లోపం లేని అన్నిటా మిన్నదైన అందవతికి ఇప్పుడే జన్మనిస్తాను.


    లోపం... ఇంతదాకా సృష్టించిన అందరిలో ఏదో ఒక లోపం ఉండనే ఉంది. దానికి తగిన కారణం ఉండే ఉంటుంది. అది నాటి మాట! నేటి మాట- సర్వ లక్షణ సంపన్నురాలూ, అందచందాలే ఐశ్వర్యంగా గల యువతీ అంగాంగాన అనుంగుని వైభవం అంగరంగ వైభవంగా ప్రకటించగల రసజ్ఞ మరెప్పుడూ తనకు సాటి రాగల స్త్రీ లేదని యుగాయుగాలూ చెప్పుకోగలిగిన అదృష్టవంతురాలు అయిన కన్యను నిర్మిస్తాను.


    ఔను. ఆమె కన్యక! వివాహం జరిగినా, సంతానం కలిగినా ఆమె శాశ్వతంగా సకల లోకాలలోనూ 'కన్యక'గానే పిలవబడుతుంది. ప్రప్రధమ కన్య ఆమే! అది నా వరం. కొందరికి కలవరం కలిగించే వరం'.


    బ్రహ్మ ఆగాడు. పరిపూర్ణ తృప్తితో క్షణమాత్రం తలపోశాడు. తన సృష్టిలో ఎక్కడెక్కడ ఏయే అందాల ఔన్నత్యం ఉందో అవన్నీ తలపోశాడు.


    రంభ ఊరువులూ, మేనక కన్నులూ, హరిణి చూపులు, హేమ శరీర ఛాయ, మదాలస మరుపు, శశిరేఖ మెరుపు తిలోత్తమ నాజూకు, అలా అలా ఇలా తలంలోని మేలి మేలి అందాలూ అన్నీ రంగరించాడు.


    విద్య, వినయం, వివేకం ప్రసాదించాడు.


    దేవాధి దేవతలు, ముని పుంగవులు, మహర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు కన్నులు విచ్చి చేష్టలుడిగి, అచ్చెరువంది చూసేలా వారి ముందు ప్రత్యక్షమయింది ఓ అందాల రాశి! ఓ జగదేకసుందరి!


    ఆమెను చూడగానే యతులకు మతులు పోయాయి. మునులకు మనస్సులు చలించాయి. మహర్షులు హర్షాతిరేకంతో పరవశులయ్యారు. బ్రహ్మర్షుల బుద్ధి సంచలించింది.


    ఆ లలనా శిరోమణి కనులు విప్పింది. కనులు తిప్పింది. కనులారా అందరినీ కనుగొంటూ ఆబ్ధవునికి అంజలించింది.


    ఆ కదలికలు అమరేంద్రుడికి కలవరం పుట్టించాయి.


    'జనకా!'


    కోయిల కుహూ కుహూమని పలికిందా! చిలుక చిరు పలుకులు చిలుకరించిందా! నీలకంఠం తన కలకంఠం సవరించిందా!


    ఊహు! ఆ మదవతి పలుకరించింది బ్రహ్మను.


    'అహల్యా!' అని పిలిచాడు.


    ఆయనలా పలుకరించగానే ఆ యువతీ లలామ పేరు 'అహల్య' అక్కడున్న అందరికీ తెలిసిపోయింది. అహల్య! అహల్య! అహల్య! అందరినోళ్ళా అహల్య నామస్మరణం!


    పంచాక్షరీ జప పరాయణులు దానిని మరిచి అహల్య! అన్నారు.


    అష్టాక్షరీ మంత్రోపాసకులు మైమరిచి అహల్యా! అహల్యా! అని స్మరించారు.


    ఓంకార స్మరణే అనుక్షణం కర్తవ్యమైన మహనీయులు అహల్యా! అని నామస్మరణ చేశారు.


    'ఓ సుకుమారే! నీ పేరు అహల్య!' అన్నాడు సృష్టికర్త.


    తిరిగి నమస్కరించి ఇటు తిరిగి చూసింది అహల్య.


    ఆమె వెంటే చూపులు తిప్పుకుంటూ తిప్పలు పడుతున్న మహేంద్రుడప్పుడే ఆమెను చూశాడు. ఇద్దరి చూపులు కలిశాయి.


    తొలిసారి ఆమె కన్నెత్తి చూసింది బ్రహ్మ పదకమలాలు, మలిసారి ఆమె కనులు విప్పి చూసింది మహేంద్రుడి వదన కమలం. అందులోని జంట పద్మాలు. నాలుగు కనులూ ఒకటయ్యాయి.


    పుట్టి నేర్చిందో-పుట్టక ముందే నేర్చిందో- చప్పున ఓ చూపు చూసి తల వంచుకుంది అహల్య!


    శతకోటి మన్మధులు పుట్టుకొచ్చారు. ఆ చూపుల తూపుల్లో ఆ వాల్చూపుల వయ్యారంలో మునకలేస్తున్నాడు ఇంద్రుడు. అక్కడున్న అందరూ అహల్య సౌందర్యాన్నే గమనిస్తున్నారు.


    ఆడవారైన సరస్వతి, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలైన వారంతా అచ్చెరుపాటుతో విచ్చిన కనులతో వీక్షిస్తున్నారు.


    అందరినీ అలా చూసిన నారదుడికి నవ్వొచ్చింది.

 Previous Page Next Page