'మరింకెందుకు ఆలస్యం? ఇక్కడినుంచి బయలుదేరి ఇక్కడికే తిరిగి రండి!'
'ఇంద్రా! మాయలూ, మాయోపాయాలు వద్దు. చక్కగా చక్కని రాజమార్గంలో గెలిచి...'
'పందెంలో గెలిచి అందాలరాశి అహల్య పాణిగ్రహణం చేస్తా!' అంటూ కదిలాడు అమరేంద్రుడు అహల్య వైపు దృష్టి నిలుపుతూ. అహల్య ఆరాధనా పూర్వకంగా చూసింది.
ఒకరివెంట ఒకరు. పందెంలో పాల్గొనతలిచిన వారు కదిలి వెళ్ళగా కథ ఏ మలుపు తిరుగుతుందో కన్నె ఎవరి సొత్తు అవుతుందో కడదాకా ఆగి చూసి వెళ్ళాలనే కుతూహలం కలవారు సభ విడిచి నందనవనం ఛాయల్లో విశ్రమించారు. బ్రహ్మ, సరస్వతి, నారదుడు మిగిలిపోయారు.
* * * *
ప్రతీహారి ప్రవేశించి, దశరధ మహారాజుకు వినయంగా శిరసొగ్గి అన్నాడు 'జయము జయము మహారాజా! వంగ దేశం నుండి వెళ్ళిన వేశ్యా బృందం ఋష్యశృంగుల వారిని ఆకర్షించి విభాండక మహర్షుల వారికి ఎరుక కాకుండా తమ అందచందాలతో నాగరిక ఆకర్షణలతో వారిని నగరానికి తీసుకుని వచ్చారట ప్రభూ!
ఋష్యశృంగుల వారు వంగ భూమి మీద అడుగు మోపీ మోపగానే ఎక్కడెక్కడి మేఘాలూ చెలి వివాహానికి విచ్చేసే చెలికత్తెలలా వచ్చి గుమిగూడి కుండపోతగా వర్షించాయట ప్రభూ!
ఆ వర్షాల వల్ల నదులు పొంగాయట. చెరువులు గుంటలు నిండాయట. భూమి కడుపారా వర్ష జలాన్ని తాగి కర్షకానందం కలిగేలా కృషి యోగ్యమైందట ప్రభూ! రోమపాద మహర్షులవారు తమ పుత్రిక శాంతాదేవి గారిని విభాండక కుమారులు ఋష్యశృంగుల వారికిచ్చి కన్యాదానం చేయ సంకల్పించారట.
దైవజ్ఞులు సుముహూర్తం నిర్ణయించి, తమరిని కుటుంబ పరివార సమేతంగా ఆహ్వానించటానికి వాయువేగ మనోవేగాలతో పయనించే గుర్రాలను పూన్చిన రధాలపై విచ్చేస్తున్నారట ప్రభూ! మన వేగులు ముందుగా తెచ్చిన శుభ వర్తమానమిది' తను చెప్పవలసినది చెప్పి శిరస్సు వంచాడు ప్రతీహారి.
దశరధుడికి చెప్పలేని ఆనందం కలిగింది.
వార్తాహరుడి వైఖరి వార్తను విన్నవించిన విధానం ఆ పదాల పొందిక ఆ అక్షర విన్యాసం ఆయనను ఎంతగానో అలరించాయి.
ముఖ్యంగా 'రోమపాద మహర్షుల వారు తమ పుత్రిక' అని ఉభయార్ధకంగా ప్రయోగించిన అతని నేర్పరితనానిని దశరధుడు చాలా సంతోషించి తన కంఠసీమ నలంకరించిన ముక్తహారాన్ని బహూకరించాడు.
శిరస్సు వంచి బహుమానం స్వీకరించాడు ప్రతీహారి.
అంతలోనే మరొకడు 'జయము జయము మహారాజా!' అంటూ ప్రవేశించి రోమపాద మహారాజులవారి వసువున విచ్చేసిన పురోహిత బృందం తమ దర్శనార్ధం వేచి ఉన్నారు' అని నివేదించారు.
మహారాజు పెల్లుబికిన ఆనందంతో 'సుమంత్రా నీవు స్వయంగా వెళ్ళి వారిని దర్శించి మా మాటగా ఆహ్వానించి వారికి తగిన విడిది ఏర్పాట్లు చేసి మా దర్శనానికి వెంట బెట్టుకుని రావయ్యా!' అన్నాడు.
సుమంత్రుడు 'చిత్తం!' అంటూ సెలవు తీసుకున్నాడు.
7
భృగుమహర్షికి వీడ్కోలు పలికి గౌతమ మహర్షి తన శిష్యులకు న్యాయ సూత్రాలు పాఠం చెప్పడం ప్రారంభించాడు.
పాఠం జరుగుతూ ఉంది. వేదిక దగ్గరలో ఉన్న చెట్ల మీద కూర్చుని ఉన్న చిలుకలు కూడా పాఠాలు శ్రద్ధగా వింటున్నాయి. ఆ సమయంలో నారదుడు 'నారాయణ! నారాయణ!' అంటూ గగన వీధి నుండి భువన మండలానికి దిగాడు.
గౌతముడు శిష్యులతోపాటు లేచి వారికి సురమునికి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులు సమర్పించి పండ్లు, పుట్టతేనె, పాలు సమర్పించాడు. మధు ఫలాలు స్వీకరించి కొద్దిగా పుట్టతేనె ఆస్వాదించి, కడుపు నిండా పాలు తాగి సంతుష్టితో దీవించాడు దేవర్షి.
'శుభమస్తు! శుభమస్తు!'
గౌతముడు అబ్బురపాటుతో అడిగాడు 'ఏమది దేవర్షీ!'
'గౌతమా! మనకు ఋషి సంప్రదాయ రీత్యా నెయ్యమే గడిచిందిన్నాళ్ళూ! ఇక ముందు....'
'తమతో ఎప్పటికీ నెయ్యమే నడుస్తుంది దేవర్షీ! కయ్యానికి తావే ఉండదు'
'నేనెంత కలహ భోజనుడినైనా మన మధ్య కయ్యాలెందుకు వస్తాయిలే! నేననబోయింది వియ్యం గురించి'
'వియ్యమా?' ఆశ్చర్యంతో అడిగాడు గౌతముడు.
'ఔను! మన సంబంధం మౌని సంప్రదాయమే కాక, ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయానికి చేరువ కావాలి!'
నవ్వాడు గౌతముడు. 'బాగున్నది దేవర్షీ బాగున్నది. నేనా బ్రహ్మచారిని. తమరా దేవర్షులు. బ్రహ్మ నిష్టా గరిష్టులు! వివాహమే లేని మనకు వియ్యమెలా అవుతుంది. దేవమునులు తమ మనసులో ఏదో దాచి దోబూచులాడుతున్నట్టున్నారు' అన్నాడు.
పకపక నవ్వాడు నారదుడు.