'తర్వాత తనెవరో, వాళ్ళెవరో, అంతే!' అనుకున్నాడు.
పొలం వేపు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయాడు. కాంపౌండ్ ఆనుకొని మంచం వాల్చుకుని, బరువయిన మనస్సుతో వాలిపోయాడు, కొలనులో రాయిపడితే చెదిరిన నీటిలా అతని మనస్సు చెదిరిపోయింది. తల విదుల్చుకుని కళ్ళు మూసుకున్నా ఆలోచనలు వదలటం లేదు.
అసౌకర్యంగా వున్నా అలాగే పడుకుని పోయాడతను.
* * *
అనుకున్నట్టుగా చంద్రం పెళ్ళి జయంతితో అయిపోయింది.
పరంధామయ్య తన హుందాకి, తన స్థాయికి తగినట్లుగా ఏర్పాట్లు చేశాడు.
చూసే వాళ్ళకి కనులపండువుగా, బంధువులకి వేడుకగా, మాణిక్యమ్మకి ఆనందకరంగా పెళ్ళి జరిగిపోయింది.
ఆరోజు నుంచి ఆ పెళ్ళి వరకు రమణ పట్టీపట్టనట్టుగానే వ్యవహరించాడు, పై వాళ్ళకి తెలియకుండా, అసలు వాళ్ళకి అర్ధమయ్యేలా నడుచుకున్నాడతను.
పెళ్ళి నుంచి తిరిగి వచ్చారంతా.
* * *
జయంతి గృహప్రవేశమూ, రమణ నిష్ర్కమణమూ దాదాపు ఒకేసారి జరిగిపోయాయని చెప్పవచ్చు.
మనసులు విరిగాక, కలతలు పుట్టాక కలిసి ఉండటం అసాధ్యం. తమ యింట్లో ఉంటూ, తమ తిండి తింటూ తమ అమ్మాయినే చేసుకోవాలని ఆశపడ్డాడని వాళ్ళు అక్కసించుకుంటే, చెమట ఓడ్చి తన రక్తధారలతో ఆ ఆస్తిని కాపాడితే ప్రతిఫలంగా యింట్లోంచి వెళ్ళగొడుతున్నారని రమణ అసహ్యించుకున్నాడు.
పరంధామయ్యగారూ, అతని భార్యా, తదితరులూ జయంతిని అత్తవారి యింట్లో దిగపెట్టి వెళ్ళారు.
ఆ రోజు సాయంకాలం రమణ, మాణిక్యమగారి వద్దకు వెళ్ళి "అమ్మా! ఇక నే వెళ్ళివస్తాను" అన్నాడు.
రమణ ఆ మాట అనగానే మాణిక్యమ్మ కంటనీరు తిరిగింది. ఇంతప్పటి నుంచి ఈ యింటిలో తిరిగి, ఈ యింట పెరిగి, కంటి దీపంలా తమని కాపాడి, చివరికి ఈనాడు రిక్తహస్తాలతో బయటికి వెళుతున్నాడు' అని అనిపించగానే చాలా బాధపడింది, ఆమె ఆ ఆవేశంలో వద్దు, రమణా! నీవు వెళ్ళవద్దు. నీకు విశాలనిచ్చి పెళ్ళి చేస్తాను యిక్కడే ఉండిపో. మీరిద్దరూ కలిసిమెలిసి నా కంటి ముందు ఉంటారు. అంతేచాలు - అందామా' అనిపించింది. కానీ, తనని తాను నిగ్రహించుకుని, "కాస్త యిల్లూ అదీ చూసుకుని వెళుదువుగానిలే, రమణా అంది.
"ఇల్లు చూసుకున్నానమ్మా! కరణంగారి నడిగి ఊరికి ఆ చివర అయిదు సెంట్ల స్థలంలో పాక వేసుకోవటానికి అనుమతి తీసుకున్నాను.
"కనీసం అది వేసుకునే దాకా అయినా ఉండరాదా?
"అమ్మా! చాలు. ఇంకా నా బాబు ఇక్కడ ఉండి. మీకు, మీ సంసారానికి సేవచేస్తూ ఉండ నవసరంలేదమ్మా! మీరు వాడిని కాదని వెలుపలికి నెడుతున్నా ఆప్యాయతని, అనురాగాన్ని చూపటానికి నేనున్నానమ్మా...ఇంకేం చెప్పకండి. మేం వెళుతున్నాం" అంది అంతవరకూ వాళ్ళ సంభాషణ వింటున్న రామలక్ష్మి.
మాణిక్యమ్మ ముఖం మాడిపోయింది. "అంత నిష్టూరంగా అనవద్దమ్మా! మేమేం వెళ్ళిపో అనటంలేదు తనూ, తన సంసారమూ అంటూ రమణే వెళ్ళిపోతున్నాడు. నేనేం చేయగలను. చెప్పు?" అని మెడలోనుంచి మూడుపేటల గొలుసుతీసి "ఇదిగో, రమణా! ఈ బంగారు గొలుసు తీసుకో. ఇది నీకు ఈ అమ్మ ఇవ్వగలిగిన కానుక. నీకు కాబోయే భార్యకి నా కానుక" అంది కన్నీళ్ళతో.
రమణ ముఖంలో నరాలు బిగుసుకున్నాయి. ఆ ఇవ్వదలచినదేదో ఆనాడే ఇవ్వవచ్చుకదా? అంటే యికనుంచి తను ఆ ఇంటికి కాని, వాళ్ళు తన యింటికి కానీ రారన్నమాటే కదా? కనీసం పెళ్ళికి కూడా వచ్చేటట్టులేరు. అలాంటి వారిసొమ్ము తనకెందుకు? అదీ కానుకట. కానుక, తను ఒకరి దయాధర్మాలపై ఆశపడి జీవించేవాడు కాదు అనుకుని, తనని తాను నిగ్రహించుకుంటూ, "ఉంచండమ్మా! నాకు యిప్పుడు కానుకలతో అవసరం ఏముంది? అంతగా అవసరమైనరోజు నేను వస్తాను. మీరిస్తారు" అన్నాడు లౌక్యంగా.
నివ్వెరపోయింది మాణిక్యమ్మ. ఆమె మనస్సు గాయపడింది. అది అవమానంగా కూడా భావించింది. కానీ, ఏమనటానికి ఆమెకి నోరు పెగలలేదు.
"సెలవమ్మా! అని కదలబోతున్న రమణని, రామలక్ష్మిని చూస్తూ అలాగే నిలుచుండి పోయిందామె.
రమణ చంద్రం వద్దకు వెళ్ళేసరికి అతనూ, జయంతీ కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తింటున్నారు. అది చూసి రమణ వెనుదిరిగి వెళ్ళబోయాడు.
"రా, రమణా!" అని పిలిచాడు చంద్రం.
"జయంతీ! యితను రమణ. బహుశా యితన్ని గురించి వినే ఉంటావు చూసి కూడా ఉంటావు. యితను నాకు తమ్ముడు లాంటివాడు, యితనే లేకపోతే నాన్నగారు పోయాక యింతటి పొలాన్ని అజమాయిషీ చేసుకోలేక పోయేవాడిని."
రమణ ఏమీ మాట్లాడలేదు.
జయంతి అతన్ని చూస్తూ ఉండిపోయింది.
"ఏం రమణా! యిలా వచ్చావు?" అని అడిగాడు చంద్రం.
"నేను వెళ్ళిపోతున్నాను."
"ఎందుకూ?" ఆశ్చర్యంగా అడిగాడతను.
"అప్పుడే చెప్పానుగా? చంద్రం, - నాకూ ఓ యిల్లంటూ లేనిదే బాగుండదని."
"ఓహో!" అన్నాడు చంద్రం. క్షణం తర్వాత" అక్కడ ఉంటూ పొలం పనులు చూస్తావా?" అని అడిగాడు.
"లేదు స్వంతంగా పొలం కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటాను."
ఆశ్చర్యపోయాడు చంద్రం, కనీసం అలా నటించాడు.
"ఎందుకు?" అని అడిగి, "అలా అడిగేహక్కు నాకు లేదనుకో, నీవు స్వంతంగా చేసుకుని బాగుపడతానంటే కాదంటే అది నా స్వార్ధమే అవుతుంది. అలాగే కానీ" అని' లేచి వెళ్ళి, బీరువా తెరిచి, "యిదిగో పదివేలు. యిన్నాళ్ళూ నీవు చేసిన సహాయానికి, కృషికి యిది తగిన ప్రతిఫలం కాదు. కానీ ఏదో నా తృప్తికోసం. కాదన్నా తిరస్కరించినా నా మనస్సు గాయపడుతుంది. వేరు సంసారం పెడుతున్నావు. కొత్త వ్యవసాయం చేసుకోబోతున్నావు. డబ్బు అన్నిటా అవసరంగా వుంటుంది తీసుకో" అని యిచ్చాడు.
రమణకి అది తీసుకోవటం యిష్టంలేదు. చంద్రం ముఖంలోకి చూశాడు. అతని ముఖంలో కనుపించిన సిన్సియారిటీ గమనించి మౌనంగా ఆ డబ్బు అందుకుని, "వెళ్ళొస్తాను. వెళ్లొస్తానమ్మా" అని కదిలాడు.
మేడమెట్లు దిగి వచ్చి తల్లినీ, తమ్ముణ్ణీ పిలుచుకుని బయటికి వెళ్ళబోతున్న రమణకి కన్నీళ్ళతో ఎదురుగా వచ్చింది విశాల. ఆమెని చూడగానే అతని గుండె తరుక్కుపోయింది.
జారబోతున్న కన్నీటిని ఆపుకుంటూ, "వెళ్ళొస్తా, విశాలా" అని గబగబా నడిచాడు. తను మాట్లాడటానికి కానీ, విశాల ప్రశ్నించటానికి కానీ అవకాశం యివ్వలేదతను. విశాల అలాగే చూస్తూ ఉండిపోయింది.
కాంపౌండ్ దాటి ఒక్కసారి తిరిగి చూసిన రమణకి కడుపులో దేవినట్లయింది. తనదనుకుని శ్రమించి సాధించిన ఫలితం నుండి వేరవుతున్నందుకు అతనెంతగానో దుఃఖించాడు.
మనస్సుని నిగ్రహించుకుని ముందుకు కదిలారు ముగ్గురూ.
6
మునసబుగారి యింటిలో చేరినరోజున రమణ భోజనం చేయనేలేదు. అతని మనస్సులో తన బాల్యమూ, తల్లి పోయినప్పుడు మాణిక్యమ్మగారూ, భూషయ్యగారూ ఆదరించిన తీరూ, తండ్రిపోయాక మాణిక్యమ్మగారూ, చంద్రం తనని ఎలా పోషించిందీ, తను అన్నిటా అన్నీ అయి ఆ యింటినీ, ఆ సంసారాన్నీ ఎలా సేవించిందీ, ఆ వ్యవసాయంలో తనెంత కష్టపడిందీ, విశాలని తనెంతగా ప్రేమించిందీ, విశాల తననెంతగా ప్రేమించిందీ, విశాలనీ తననీ దూరం చేయాలని వాళ్ళు ఎంత పకడ్భందీగా వ్యవహరించిందీ గుర్తుకొచ్చి పదే పదే మనసులో సినిమారీలులా తిరుగుతూ బాధ పెట్టింది.
సవతి తల్లి రామలక్ష్మిగారు ఎంత బలవంతం చేసినా అతను ఒక్క మెతుకయినా ముట్టలేదు. గ్లాసెడు పాలు మాత్రం ఆమె బలవంతాన పుచ్చుకున్నాడు.
మరుసటిరోజు తెల్లవారగానే అతని ముందు అన్నీ సమస్యలే నిలిచాయి.
తమ్ముడిని చదివించాలి. తనకంటూ ఓ వ్యక్తిత్వం ఏర్పరుచుకోవాలి. తమదంటూ స్వంతానికో యిల్లూ కొంతయినా పొలం సంపాదించుకోవాలి. సరిసమానస్తుల్లో మర్యాదకి లోటు రాకుండా బ్రతకాలి.
"అసలు ఊరే విడిచి వెళ్ళిపోదామా?" అన్న ఆలోచనకూడా వచ్చిందోసారతనికి. 'కానీ ఆ ఊళ్ళోనే ఉండి దర్జాగా బ్రతికి సాటి వాళ్ళతో సమాన పాయాల్లో బ్రతకాలి' అని నిశ్చయించుకున్నాడు.