Previous Page Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 8


    అంతవరకు వాళ్ళ మాటలు వింటూన్న చంద్రం తల్లి ముందుకు వచ్చాడు.
    అన్నయ్యని చూడగానే క్షణకాలం ఆశ మెరుపులా తోచింది విశాల మనసులో కనీ, అన్నయ్య ముఖబింబంలో అతని మనోభావాలు బాగా ప్రతిఫలిస్తున్నాయి. వాటిని చదవగానే ఆమె ఆశ నిరాశ అయింది.
    "విశాలా!"
    ఆ పిలుపే ఆమె నవనాడుల్నీ క్రుంగదీసింది.
    "అమ్మ చెప్పినదానికి అంగీకరించు. వాదించకు! అమ్మ కంటే నీవూ, నేనూ ఎక్కువ తెలిసిన వాళ్ళం కాదు. నాన్నగారి పరువు, మర్యాదలకి తగ్గట్టుగా నడుచుకోవటం అమ్మకు బాగా తెలుసు.
    ఆమె మనస్సుని గాయపరచటం మనకు శ్రేయస్కరం కాదు.
    పెద్దవాళ్ళకంటే మనం తెలిసిన వాళ్ళం కాదు.
    వాదించకు ఊరికే. అమ్మ చెప్పినట్లుగా విను, అమ్మని అర్ధం చేసుకో పరిస్థితులు అర్ధమవుతాయి.
    "అన్నయ్యా!"
    ఏడవకమ్మా! చెల్లిలి కంటనీరు చూసి ఏ అన్నా సహించలేడు. నాన్నగారు ఉంటే ఎలా చేసేవారో తెలియదు. కానీ, అమ్మ నాన్నగారి మనస్సునిబట్టి నడుస్తూంది. నేనూ అంతే. ఇక నీవూ అలాగే నడుచుకోవాలి.
    రమణని ప్రేమించానంటావు.
    ప్రేమంటే ఏమిటమ్మా, విశాలా?
    అతనితో కలిసిమెలిసి తిరిగావు. ఆడుకున్నావు. చదువుకున్నావు. అతడంటే ఆకర్షణ పెరిగింది. అంతే.
    అదేనా చెల్లీ, ప్రేమ ?
    ఇంకా నీమనస్సే బాగావికసించలేదు. పదహారు - పదిహేడు సంవత్సరాల అమ్మాయికి ఏది ఏమిటో ఏం తెలుసమ్మా?
    చెప్పకు, నాకు అంతా తెలుసు. నేనేం తెలియని వాడినికాను. అది నెరవేరేది కాదు. ఇక అతన్ని మరచిపో.
    చంద్రం ఇంకేమీ అనకుండా, వినకుండా వెళ్లిపోయాడు.
    దుఃఖంతో, అవమానంతో, నిరాశతో ఏడుస్తూ ఉండిపోయింది విశాల.
    విశాల పాలిటికి విశాలని వదిలేసి వెళ్లింది మాణిక్యమ్మ.


                             *    *    *


    ఈ సంఘటన జరిగిన అయిదు రోజుల తర్వాత ఒక రోజు సాయంత్రం రమణని నిలవేసింది మాణిక్యమ్మ.
    చంద్రం పెళ్ళికి కావలసిన వస్తువులు సమకూర్చటంలోనూ, ఇంటికి వెల్ల వేయించటం లాంటి పనులతోనూ, చంద్రానికి కావలసిన దుస్తులు కుట్టించడంలోనూ తీరికలేక అతను మళ్ళీ మాణిక్యమ్మకి చిక్కలేదు మాట్లాడటానికి.
    పట్నంనుంచి తెచ్చిన సరుకుల్ని సరుకుల కొట్లో పెట్టించి, ముఖం కడుక్కుని వచ్చి వంటింట్లో పాలు తాగుతున్న రమణని చూసి, "రమణా! ఆ వెంకయ్య మళ్ళీ మనిషిని పంపాడు. నీవు ఒకమాట చెపితే నేను అతనితో మాట్లాడతాను" అంది.
    రమణ మనస్సు స్తంభించి పోయినట్లయింది ఆ మాటలతో. ఏం జవాబు చెప్పాలా?" అనుకున్నాడు.
    "ఇంతకీ నీవు సరోజని చూశావా?"
    తల ఊపాడు రమణ.
    "నా చాదస్తం కాకపోతే ఇంటిముందు ఇంటిలో ఉన్న అమ్మాయిని చూశావా అని అడగటం ఏమిటి? ఇంతకీ నచ్చిందా?"
    జవాబు చెప్పలేదు రమణ.
    "నచ్చకపోవటానికి దానికేం కన్ను వంకరా కాలువంకరా ? నలుపా? బొమ్మలా ఉంటుంది. చూస్తే కళ్ళు తిప్పుకో బుద్ధికాదు. అంత బాగా ఉంటుంది. మన దరిద్రంకొద్దీ మనకు నచ్చకపోతే ఏం చేయగలం?"
    గుటకలు మింగాడు రమణ.
    పాలు త్రాగటం ముగించి గ్లాసు కింద పెట్టాడు.
    అంతలో వచ్చాడు చంద్రం.
    రమణని చూసి "సరుకులన్నీ తెచ్చావా?" అని అడిగాడు.
    "ఆఁ."
    "ఇంకేమీ అవసరం లేదు కదా?"
    "ఊహుఁ"
    "టెయిలర్ గుడ్డలన్నీ కుట్టాడా?"
    "ఆఁ"
    "అమ్మా! సరుకులన్నీ తయారుగా ఉన్నాయా?"    
    "పిండి వంటలన్నీ తయారుచేయించాను. ఇంక లడ్డూ, మైసూర్ పాక్, జిలేబీ చేయించాలి.
    "అవి ఇప్పుడే వద్దులే, అమ్మా పెళ్ళి నుంచి తిరిగి రాగానే చేయిద్దాం. ఎలాగూ మరులు పెళ్ళికి నాలుగైదు రోజులు వ్యవధి వుంటుంది కదా?" అన్నాడు రమణ.
    "అవునమ్మా, అలాగే చేయిద్దాం" అన్నాడు చంద్రం.
    "సరే. మీ ఇష్టం". అని, చూడరా, చంద్రం, నీ పెళ్ళిలోనే వీడిపెళ్ళి ముగిద్దాం అంటే ఊఁ అనకుండా ఉన్నాడు. మన వెంకయ్య పదేపదే కబురు పంపుతున్నాడు. వీడేమో ఉలకడూ, పలకడూ. ఏం చేయాలో?" అంది.
    ఆ మాటలకి రమణ తలవంచుకున్నాడు.
    "రమణా!"
    తల ఎత్తి చూశాడు రమణ.
    "నీ అభ్యంతరం ఏమిటి?"
    "నాకిప్పుడే పెళ్ళి అవసరం లేదు."
    "ఎందుకు?"
    "నాకూ ఓ తమ్ముడు ఉన్నాడు. ఓ తల్లి ఉంది. వాళ్ళ బాధ్యత అంతా నాపైనే ఉంది. తమ్ముడిని చదివించాలి. నాకంటూ ఓ ఇల్లు, కొంత పొలం సంపాదించుకోవాలి. నేనూ ఓ మనిషిని అనిపించుకోవాలి. సాటివారిలో పాలేరుగా, పాలేరుకొడుకుగా కాకుండా సమానుడుగా ఎంచుకోవాలి. అప్పుడే పెళ్ళి చేసుకుంటాను."
    ఆ మాటలు విని కలుక్కుమంది మాణిక్యమ్మ.
    చంద్రం గుండెలో సూటిగా నాటుకున్నాయి ఆ మాటలు.
    "రమణా! ఎంత వాడివయ్యావు, బాబూ! సంతోషం నీవూ నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటానంటే మేము కాదంటామా? ఏదో నిన్నూ నా పిల్లలతో బాటు పెంచాను కాబట్టి నిన్నో యింటివాడిని చేయాలనీ, ఆ బాధ్యతా నాదేననీ పిచ్చిగా అనుకున్నాను.
    బాగా చెప్పావు, బాబూ!
    "నీకూ ఓ యిల్లు ఉండాలి. నీకూ స్వంతపొలం ఉండాలి. నిజమే ఎన్నాళ్ళిలా ఉండిపోతావు?
    ఈ ఇంట్లోనే ఇల్లిచ్చి, ఈ భూమిలోనే పొలంఇచ్చి, నిన్నూ నా ఇంట్లో, కంట్లో నిలుపుకుందామని పేరాశపడ్డాను.
    కానీ, నాది దురాశ అని అర్ధమైంది యిప్పుడు.
    నీ ఇష్టం, వెళ్ళిపో, బాబూ.
    కాదనటానికి మేము ఎవరం?
    కానీ__
    "కనీసం అబ్బాయి పెళ్ళయేవరకయినా ఉండిపో, మా మర్యాద కాపాడు. నలుగురిలో తలవంచుకునేలా చేయొద్దు" అని విసవిస వెళ్ళిపోయింది మాణిక్యమ్మ.
    చంద్రం కూడా రమణవేపు అదోలా చూసి వెళ్ళిపోయాడు.
    వాళ్ళ మాటలు విన్న రమణ నిర్ఘాంతపోయాడు.
    'ఎంత సూక్ష్మంగా, ఎంత చాకచక్యంగా తనని ఇంటినుంచి వెళ్ళిపొమ్మని చెప్పారు. అసలు విషయాన్ని దాచి, అంతరంగాలు బయటపడకుండా అనుకున్న పనిని సాధించారు' అనుకున్నాడు.
    వ్యవహారంలో వీళ్ళ నేర్పరితనానికి విస్తుపోయాడు.
    వాళ్ళ వక్రబుద్ధిని నిరసించాడు. 'ఛీ! ఛీ!' అనుకున్నాడు.
    ఆ తర్వాత అతనికి ఆ ఇంట్లో క్షణమైనా ఉండటానికి మనసు అంగీకరించలేదు. పినతల్లితో తమ్ముడితో వెంటనే వెళ్ళిపోయి ఎక్కడయినా ఉండిపోవాలనుకున్నాడు.
    'కానీ, ఇన్నేళ్ళు తనని పోషించి యింతవాడిని చేసిన ఆ కుటుంబంలో ఒక్కగానొక్క అబ్బాయికి మరో పదిరోజుల్లో కళ్యాణం జరగబోతూంది. ఈ సమయంలో తను యింటినుంచి వెళ్ళిపోతే గ్రామంలో తప్పకుండా అలజడి బయలుదేరుతుంది. నలుగురూ నాలుగు విధాలు అనుకుంటారు. అదోరకంగా అవమానం వాళ్ళకి.
    'వాళ్ళ కుచ్చితం వాళ్ళకే ఉండనీ, తను ఎందుకు పలువురి దృష్టిలో పలచనై పోవాలి?
    'ఈ నాలుగురోజులూ కళ్ళుమూసుకుంటే జరిగే కార్యం జరిగిపోతుంది."

 Previous Page Next Page