కానీ తనవద్ద ఉండేది కేవలం పదివేలు. వీటితో ఏం వస్తుంది? ఎంత హీనంగా అనుకున్నా ఇంటికి వేయి రూపాయలయినా అవుతుంది. చుట్టూ ఇటికలతో గోడలు నిర్మించి పైన గడ్డితో కప్పుకున్నా అవుతుంది. మిగిలిన దానితో పొలమే కొనగలడా? తమ్ముడినే చదివిస్తాడా? కుటుంబాన్నే పోషిస్తాడా?
ఆలోచనలతో అతని మనస్సు వేడెక్కిపోయింది. కళ్ళు మూసుకుని దీర్ఘంగా నిట్టూర్చి కణతలు రుద్దుకున్నాడు.
అంతవరకూ అదంతా మౌనంగా గమనిస్తున్న రామలక్ష్మికి అతని ఆలోచనా, అతని ఆవేదనా అర్ధమయ్యాయి. మాతృప్రేమ ఆమెను నిలువనీయలేదు.
"బాబూ! రమణా! అని ప్రేమగా పిలిచింది.
తల ఎత్తి చూశాడు తల్లి వైపు.
"ఎందుకు బాబూ, అంత ఆలోచన? ఆ ఇంటినుంచి వచ్చేశామేనని బాధపడుతున్నావా? ఆదరణా, ఆప్యాయతా లోపించిన చోట ఉండటం కష్టంబాబూ, గడప దాటివచ్చి మంచిపని చేశావు."
అతనేదో అనబోయాడు.
"ఉండు నన్ను చెప్పనీ, నీ విషయం నాకంతా తెలుసు. మంగమ్మ చెప్పింది. వాళ్ళ తీరే అంతట. అవసరమైనన్నాళ్ళూ స్వార్ధానికి వాడుకోవడం, అవసరం తీరగానే తృణమో పణమో ఇచ్చి పంపటం అంతేనట, అయినా మనమేం బ్రతకలేమా?"
అమ్మా!
"నీ ఆలోచన అంతా గ్రహించాను, బాబూ! వాళ్లు పదివేలిచ్చారట కదా? నా వద్ద మీనాన్నగారు చేయించిన నగకట్టు ఉంది, మానాన్నగారి ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బూ కొంత ఉంది. అదంతా తీసుకో. నీ తమ్ముడిని చదివించు. కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొనిరా."
"అమ్మా!" అంతకంటే అతనింకేం అనలేకపోయాడు. ఆనందంతో అతని కళ్ళు మిలమిల మెరిశాయి. 'పరువుగా బ్రతికే మార్గం కనిపిస్తూంది. తను మట్టినుంచి బంగారాన్ని పిండగలడు. అసలు తను అడుగు పెడితేచాలు భూమి - ఇదిగో! ఇదిగో! అంటూ విరగ పండుతుంది. కళ్ళు మూసుకుంటే తెరిచేలోగా తను ధనాన్ని వర్షింప చేస్తాడు అనుకున్నాడతను.
మరుసటిరోజు కరణం గారిని పిలుచుకుని వెళ్ళి పట్నంలో నగలన్నీ అమ్మేసి డబ్బు పట్టుకొచ్చాడు. రామలక్ష్మిగారు చేతికి రెండు గాజులు, మెడలో ఒంటిపేట గొలుసుమాత్రం ఉంచుకొని బంగారమంతా ఇచ్చేసింది.
ఆ డబ్బూ, తన డబ్బూ అంతా తల్లి చేతికిచ్చాడు రమణ.
జ్యేష్టశుద్ధంలో మంచిరోజు చూసి తను కొన్న ఇంటిస్థలంలో ఇంటిపని ప్రారంభించాడు రమణ. అప్పుడప్పుడే ఎడ్లు అవసరం లేదనుకున్నాడు. ముందు కానీ, ఇంటిపనికి మన్ను తోలడానికి, రాళ్లూ ఇటుకా చేర్చుకోవటానికి బాడుగ వారిపై ఆధారపడి, ఖర్చు చేసుకొనేకంటే ఎడ్లు కొనటమే మేలనుకుని వేయి రూపాయలు పోసి మంచి జత కొన్నాడు. బండి కొన్నాడు ఇంకా అవసరమైన సామాను కొన్నాడు.
తను తిరుగుతూ, పనిచేస్తూ, తనులేనప్పుడు తల్లిని, తమ్ముడినీ పనికి పురమాయిస్తూ, జ్యేష్ట బహుళ దశమి కల్లా ఇల్లు తయారుచేసుకొని, ఆనాడే చేరిపోయాడు రమణ.
ఇంట్లో చేరిన సాయంకాలం తనఇంటినీ ఇంటి చుట్టూ కాంపౌండ్ గా నాటుకున్న కంచెనీ చూసుకున్న రమణకి మనస్సు శాంతించింది.
ఇది తమ ఇల్లు. తను ఇప్పుడు గృహస్తు. తనకంటూ ఇల్లు ఉంది, తల్లి ఉంది, తమ్ముడున్నాడు. తనిప్పుడు బికారికాదు. ఏకాకి కాదు. తననెవరూ వేలెత్తి చూపలేరు.
కంచె చుట్టూ తిరిగి, చెక్కల గేటుమూసి, ముందు ఇంట్లోకి వచ్చాడు రమణ. గడ్డితో కప్పిన వసారా, అది దాటగానే హాలు తర్వాత మధ్య ఇల్లు, మళ్ళీ గది, ఆ చివర గడప దాటగానే ఆగ్నేయ దిశను వంటకై చుట్టిల్లు_ అతని కెంతో తృప్తిగా ఉంది.
ఇది మేడ కాకపోవచ్చు కాని, తన సొంత ఇల్లు అనుకున్నాడు.
కొడుకు ముఖంలో తారట్లాడుతున్న ఆనందాన్నీ, తృప్తినీ చూసి, 'వీడికి పట్టుదల ఎక్కువ. దేన్నైనా సాధించగలడు. కార్యశూరుడు వీడు. చల్లని నీడలో గోపీ కేం భయంలేదు' అనుకుంది రామలక్ష్మి.
* * *
ఖరీఫ్ సీజనుకి పనులు ప్రారంభం కాబోతున్నాయి. పొలాలకి నారుమళ్ళకి పెంటతోలుతున్నారు అందరూ. ముమ్మరంగా సాగుతున్నాయి వ్యవసాయం పనులు.
చంద్రం వాళ్ళ ఇంటినుంచి బయటికి వచ్చిన క్షణంనుంచీ రమణ ఏది మంచి పొలమో ఎవరు అమ్మజూపుతున్నారో శ్రద్ధగా విచారిస్తూనే ఉన్నాడు. మంచినీటి వసతి ఉండి, బాగా పండే పొలం అయితే కాస్త ధర పెట్టినా ఫరవాలేదు. అనే ఉద్దేశంలో ఉన్నాడు రమణ.
ఆరోజు ఉదయమే పిలిపించాడు మునసబు చలమయ్య.
అతనికీ బోలెడంత ఆస్తి ఉంది. కానీ అతని ముగ్గురు కొడుకులూ సోమరులే. ఒకడు చూచి రమ్మంటే కాల్చివచ్చేరకం. ఇంకొకడికి రాజకీయాలు తప్ప మరొకటి పట్టదు. ఎప్పుడూ తాలూకా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరొకడు పేకాట భక్తుడు. ఆట రంజుగా వుండటానికి మాంసం, మధిర అవసరం వాడికి. ఇది చేరాక మగువ లేకుండా మజా ఉండదనే సిద్ధాంతం వాడిది.
ప్రాయం మళ్ళుతూన్న వయస్సులో ఉద్యోగ ధర్మం నిర్వహించటమే కష్టంగా ఉంది చలమయ్యకి. ఇక ఆ స్థితిలో అతడు వ్యవసాయం ఏం చేయగలడు? పాలేళ్ళపైన, పనిమనుషులపైన ఆధారపడి చేయించిన ఆయన వ్యవసాయం బాపన సేద్యం లాగే అయింది. ఏటా సంసారం ఖర్చుకి అప్పుచేయక తప్పలేదు. పంటలు పండక, రాబడి లేక, ఖర్చు పెరిగిన ఈ స్థితిలో పొలం బేరం పెట్టక తప్పలేదు ఆయనకి.
"రావయ్యా, రమణా!"
తను కూర్చున్న అరుగు మీదనే కంబళి మీద చోటు చూపించాడు మునసబు.
'సాటి కులస్తుడు, గ్రామోద్యోగి, మోతుబరిరైతు తనకి తనతో సమానంగా స్థలం ఇస్తున్నాడు. రా రమ్మని గౌరవిస్తున్నాడు. ఉదయించే సూర్యుడు తను, చల్లబడుతున్న సాయంకాలం సూర్యుడు ఆయనకావచ్చు కానీ, మాడిపోయే మధ్యాహ్నం సూర్యుడు కూడా తనని సమానంగా ఆహ్వానించేరోజు అట్టే దూరంలో లేదు" అనుకున్నాడు రమణ.
నమస్కారం చేసి కూర్చున్నాడు రమణ.
ఇంట్లో రేడియో "అందమె ఆనందం" అన్న ఘంటసాల పాట మధుర మధురంగా వినిపిస్తూ ఉంది.
"నీవేదో పొలం కొనాలని ప్రయత్నంలో ఉన్నావట కదా? అలా అయితే నేను తూర్పువైపు పొలం అమ్ముతున్నాను. ఒకేచోట పండ్రెండెకరాల పొలం. నీవు బాగా కష్టించి పనిచేసేవాడివి. అదయితే నీకు కోరినట్లు పండుతుంది. నాలాటి చేతకాని వాడికి, మా అబ్బాయిల్లాంటి వెధవలకి అది నపుంసకుడి చేతిలో రంభ. నీవయితే అందులో బంగారాన్ని పండిస్తావు" అని నేరుగా వ్యవహారంలోకి దిగాడు చలమయ్య.
గొంతుకేదో అడ్డు పడ్డట్టయిందతనికి.
'తనేదో కాస్తో కూస్తో పొలం కొనాలనుకున్నాడు కానీ, అంత పొలం తూగగలడా?' అనుకున్న రమణ "అవునండీ, కొనాలనుకుంటున్నాను' అన్నాడు.
"ఊఁ అయితే నేనోమాట చెబుతావిను. నావద్ద బేరసారాలు ఉండవు. నేనూ లోకంనాడి తెలిసిన వాడిని. పొలం ధరలు ఎలా ఉన్నాయో ఎరుగుదును. నా పొలం ఎంత చేస్తుందో కూడా తెలుసు" అని ఆగి, "అరవై వేలు ఇచ్చెయ్" అన్నాడు చలమయ్య.
రమణ ఆశ్చర్యపోయాడు.
'నిజానికి అది కారుచవక. సరి అయిన పోషణ ఉండి, బాగా చూసుకుని పండిస్తే ఎకరం ఎనిమిది వేలకి తక్కువ పలకదు. పైగా రెండోకారుకి కూడా పంటకాలవకి నీళ్ళిస్తామంటున్నారు' అనుకున్నాడు.
"మీకు తెలియంది కాదు. నా వద్ద అంత డబ్బు ఎక్కడిది? ఏదో రెండుమూడు ఎకరాలు కొనాలనే ఉద్దేశ్యంలో ఉన్నాను" అన్నాడు రమణ.
"ఆ విషయమూ నాకు తెలుసయ్యా, రమణా! నీవద్ద అంత ఉండదని నాకు తెలుసు. అందుకే సగంధర ఇప్పుడిచ్చెయ్యి, మిగతా మొత్తం మూడేళ్ళలో రూపాయి వడ్డీతో తీర్చేయ్" అన్నాడు చలమయ్య.
ఆయనమాట కాదనేందుకు వీల్లేకపోయింది రమణకి. మొన్న బంగారం అమ్మగా వచ్చిన డబ్బూ, తన వద్ద మిగిలిన డబ్బూ కలిపి ముప్పై వేలయింది. నిజమే, అది ఇచ్చెయ్యవచ్చు. కానీ, సాగుచేయటానికి డబ్బు? తల్లి వద్ద ఎంతుందో ఏమో?' అనుకుని, "అలాగేనండి. మా అమ్మగారితో ఒక మాటచెప్పి అడిగి వస్తాను" అని లేచాడు రమణ.