ఈ డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో పిల్లలు మానసికంగా ఎదగరా? తన చెల్లెళ్ళు ఈ పిల్లకంటే చిన్నవాళ్ళే. అయినా ఆరిందాలా కన్పిస్తారు.
"మీకు బాధగా వుండదా?"
ఎందుకూ?
"ఎవరైనా మిమ్మల్ని వింతగా చూస్తే..."
"నాట్ ఎటాల్"
"అంటే ప్యాంటే వేసుకుంటానంటారా?" భయపడుతున్నట్టు అడిగాడు.
"అవును. అమూల్య శ్రీధర్ ను ఏడిపించాలనే అన్నది.
"చచ్చాం"
"మధ్యలో మీరెందుకు చావడం?"
"నేనేకదా మిమ్మల్ని తీసుకెళుతున్నాను"
అమూల్య పకపక నవ్వింది.
"భయపడకండి చీరలే తెచ్చుకున్నాను. మా డాడీ ముందే చెప్పారు."
"శ్రీధర్ రిలీఫ్ గా గాలి పీల్చుకున్నాడు.
అమూల్య పకపక నవ్వింది.
"ఏం ప్యాంటు వేసుకొంటే? అంత భయపడతారేం?"
మా అమ్మ, చెల్లాయిలు కూడా మిమ్మల్ని చూసి బెదిరిపోతారు" అన్నాడు నవ్వుతూ.
"మీ విషయం చెప్పండి."
"మీరు చీరలోనే బాగుంటారు"
"నిజంగా?" కళ్ళు చక్రాల్లా తిప్పుతూ ముద్దుగా అడిగింది.
శ్రీధర్ ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఎంత అమాయకంగా ఉంది? గర్వం బొత్తిగా లేదు.
"అయితే ఇక నుంచి చీరే కట్టుకుంటాను."
శ్రీధర్ ఆశ్చర్యంగా అమూల్య ముఖంలోకి చూశాడు.
"అంటే? ఎప్పటికీనా?"
"అవును"
"మీ ఫ్రెండ్స్ అందరూ......"
అమూల్య హాయిగా నవ్వింది. శ్రీధర్ ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది.
"ఏమిటి అలా చూస్తున్నారు?" ఇబ్బందిగా అన్నాడు.
"మీరు...మీరు అనడం తగ్గించకూడదూ? నేను మీకంటే చిన్నదాన్ని"
శ్రీధర్ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు.
"మీరు చాలా అందంగా వుంటారు" అమూల్య శ్రీధర్ ముఖంలోకి చూస్తూ అన్నది.
ఆ అమ్మాయి చొరవను ఎలా అర్థం చేసుకోవాలో తెలియని స్థితిలో తికమక పడ్డాడు.
"ఆ మాట నేను అనాలి."
"ఎందుకని?"
"సాధారణంగా ఆడపిల్లను మగవాళ్ళే అంటారు"
"ఏం ఆడపిల్లలు అనకూడదా?"
"అహా అది కాదు సాధారణంగా అనరు"
"పోనియ్ నన్ను అసాధారణమైన అమ్మాయి అనుకోండి"
శ్రీధర్ నవ్వేశాడు.
సూర్యాపేటలో కారు ఆగింది. ఇద్దరూ హోటల్లో కాఫీ టిఫిన్ చేశారు. అమూల్య డబ్బు ఇవ్వబోయింది. శ్రీధర్ ముఖం చిట్లించుకున్నాడు.
"ఉంచండి. మీ అంత ధనవంతుణ్ణి కాదు. కాని ఆ మాత్రం ఇవ్వగలను" అన్నాడు.
"మీ మగవాళ్ళకు అహం ఎక్కువ"
"కావచ్చును"
కారు గ్రామంలో ప్రవేశించేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది. అంత పెద్ద కారు ఆగ్రామంలో ఎవరింటికి వెళుతుందో తెలుసుకోవాలనే కుతూహలం గ్రామస్తుల మొహాల్లో కనిపించింది అమూల్యకు.
శ్రీధర్ ఇంటి ముందు కారు ఆగింది.
శ్రీధర్ తల్లీ, చెల్లెళ్ళు ఇద్దరూ బయటికి వచ్చారు. కారులోనుంచి దిగుతున్న శ్రీధర్ అమూల్యను ఆశ్చర్యంగా చూడసాగారు.
చీమలపుట్ట గిలినట్లు పిల్లమూక కారును చుట్టేశారు.
అమూల్య బిత్తర చూపులు చూస్తూ నిలబడింది.
"రండి" అంటూ శ్రీధర్ ముందుకు నడిచాడు.
అమూల్య బిక్కు బిక్కుమంటూ అతని వెనుకే నడిచింది.
శ్రీధర్, అమూల్యకు తన తల్లి బంగారమ్మను, చెల్లెళ్ళు కమలనూ, విమలనూ పరిచయం చేశాడు.
వాళ్ళిద్దరూ మాటలు మర్చిపోయిన వాళ్ళలా అమూల్యను, ఆమె దుస్తుల్నీ, నగల్నీ చూడసాగారు.
"ఎవర్రా ఈ అమ్మాయి?" తల్లి అడిగింది.
"జడ్జిగారి అమ్మాయి. మన ఊరు చూస్తానంటే తీసుకొచ్చాను.
"అయ్యో అలాగా! రా తల్లి!" ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది శ్రీధర్ తల్లి. ఆమె కట్టుకున్న ముతకనేత చీర రంగు వెలసి వెలవెలా పోతున్నది. వంటి మీద చిన్నమెత్తు బంగారం లేదు.