దోవలో పల్లెటూరు పడుచు తగాదాలు తీరుస్తున్నాను. ఇది బడి పని కన్న ముఖ్యవిషయం అని__
తారీఖు ... 4_38
ఉదయం గం|| 7_30 నుంచి 8_30 వరకు
పల్లెటూరు పడుచు తగాదా తీరుస్తున్నాను.
అని డైరీలో వ్రాస్తే__
సెన్సు ఆఫ్ హ్యూమర్ చస్తేనేగాని గవర్నమెంటులో వుద్యోగం నిలవదు. ఒక్క రామ్మూర్తి ప్రమోషన్ కోసం ఎన్ని ఎప్లికేషనులో ఈసఫ్సు కథ వ్రాయగలిగాడు. కాని అందరికీ గుండెలున్నాయా. గెజెట్ లో కొంచెం కులాసాగా చదువుకోడానికి వీలుగా కథలు వేయించగలిగారా దీక్షితులు గారు! నా జాతకంలో గ్రహాల ప్రకారం ప్రస్తుతం ప్రమోషన్ సూచింపబడి వుంది, గనక తప్పక యిప్పించాలని పైకి వ్రాయగలిగానా నేను?
ఇంతలో యుద్ధం ముదిరింది. కర్రసాముకి తయారయినారు. కన్య ఉత్సాహం హెచ్చింది. వూరికే ఆచారానికని చిన్న యేడుపు ప్రారంభించింది. వ్యూహంలో తోవ దొరక్క చూసి చూసి విసిగి విజిట్ జ్ఞాపకమొచ్చి, సైకిలెక్కాను, విధిలేక; వెనక్కి వెనక్కి చూసే old horse ని బాదుకుంటూ, ఎర్రని ఎడారి బాట వెంబడి పల్లెటూరి పడుచు లేకపోతేనేం? కలలు మిగిలాయి.
ఎన్నిసార్లిట్లా పనిలేనివాణ్ణిగా వుండి నా బుద్ధి యీడ్చినట్లల్లా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలిగితే బావుండుననుకొన్నది! అట్లా ఆ పోట్లాట చివరివరకూ చూసి గెలిచి ఆ కన్యను పొందిన వారితో ప్రయాణమై_ మెల్లిగా అంతులేని ఆ కోసిన వరిపొలాలమీదనించి ఎక్కడికో తెలీని వూరికి _ కాళ్ళకింది యెండుమోడు కరకరలు, గాలి వూడ్చుకుపోతూ చేసే యీడుపు శబ్దం, నల్లటి యెండు కాలవ గట్టుమీద రేగడి పలుకులు, చిక్కని తుమ్మనీడలు _ కాళ్ళకింద పగిలే నత్తగుల్లలు, అప్పుడప్పుడు నావంక తిరిగి చూసే ఆ వనిత, ఆ యెండు పొలంలో కూడా నిర్లక్ష్యంగా పెరిగే యెండాకాలపు కలుపుమొక్కలు, మెల్లిగా రెండు కుక్కలు, గుడిసెలు... కంపు... బురద... చెరువు... వూరు...
కలలు కంటూ బయలుదేరాను నా నిర్భాగ్యానికి నేనే పడే దిగులు చారని యెర్రని రోడ్డుమీద వదులుతూ.
ఎందుకు చెప్పదూ ధైర్యంగా కాపరం తనకి యిష్టంలేదని? ఎప్పుడు వస్తుంది ధైర్యం స్త్రీకి? ఎట్లా వస్తుంది? చదువా? నాగరికతా? లాభంలేదు. ఈమె యీ విద్యలేని అనాగరిక స్త్రీ తనకి కాపరం మరీ దుర్లభమైతే పారిపోతుంది. ఎక్కడో ముష్టి, దాసీ పని, వేశ్యవృత్తి, ఎట్లానన్నా జీవించగలదు కాని చదువుకున్న స్త్రీలు, నాగరికులు ఆ మూటిలో దేనికీ పనికిరారు. అసలు యింట్లోంచి బండీలేంది కదలలేరు. తెగించి బైటపడ్డ స్త్రీలు _ దెబ్బలు... రౌడీలు... తగాదాలు...అదీ వారి చరిత్ర.
ఎప్పుడూ యీ స్త్రీ ఒకరకం నీచత్వంలోంచి యింకోరకం నీచత్వానికి వొగ్గవలసిందేనా యిట్లా! అన్ని యీవిల్సుకీ (evils) మందు విద్య అంటారు మాట్లాడితే! ఏంచేస్తుంది విద్య? కోర్ ట్లకీ, ఓట్లకీ, నోట్లకీ తయారుచేస్తుంది, స్వేచ్చగా తిరిగే మనుష్యుల్ని! ఎవరికి స్వేచ్చనిచ్చింది యీ విద్య!
ఈనాటి యువకులకి మాత్రం వాళ్ళు యెవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ల కళ్ళు విద్యావతుల ముఖాలకేసే యెత్తివుంటాయి. విద్య గల వస్తువును తాను పెళ్లి చేసుకున్నానని అందర్నీ యీర్ష్యపడే సేట్టు చూపించుకోడానికి తప్ప భర్త ఆమెనుండి ఏం సుఖమనుభవిస్తున్నాడు! సంసారానికీ, వంటకీ, కనడానికీ, పెంచడానికీ యీవిద్య యేమీ ఉపయోగపడదు. పైగా అభ్యంతర పెడుతుంది.
ఎంతైనా కానీ, యీ sex కోర్కె__ భార్యా భర్తలమధ్య వుండే ఆకర్షణ కూడా sex మరిచిపోకండి, నీతిపరులూ; సంసారులూ, ఆధ్యాత్మిక భర్తలూ, ప్లేటోనిక్ కవులూ... యీ sex ఆకర్షణా, పిల్లలమీది ప్రేమా__ ఇవన్నీ భూమిలోనించి _ చెట్లకి కాయలిచ్చే భూమి సారానికి చాలా దగ్గిర అని. విద్యలూ, iashioos కవిత్వం, ఆధ్యాత్మికాలూ, మర్యాదలూ, రోగాలూ, కపటాలూ_ ఎక్కువైనకొద్దీ _ దూరమౌతారు అసలు నరాల్లో, ఎముకల్లో పొందే శాంతికీ, సౌఖ్యానికీ తిండి సరిగా వంట పట్టడం, పక్కమీద నరాలు శాంతిపడడం, పిల్లల పాలదాహం, తీర్చడంలేంది, స్త్రీ అంత క్షుద్రురాలూ, వ్యర్దురాలూ, పాపిష్టీ, నరకవాసీ, ఎవరూ వుండరు. వీటినించి దూరంచేసే, చదువూ, దేవుడూ, నాగరికతా, నీతీ__ అంత అనర్ధాలు, విరోధులు, మ్రుత్యువులు _ ఇంక కనపడవు.
ఇంక స్నేహమూ, ప్రసంగమూనా? దానికి వుద్యోగస్తులకి వ్యవధే వుండదు. అయినా యిద్దరు పిల్లలు పుట్టింతరవాత తగాదాలు లేని ప్రసంగాలే వుండవు. అదిగాక యెంత చదువుకున్నా, యెన్ని పరీక్షలు గట్టెక్కినా, తాము చదివింది వంటపట్టించుకొని యే విషయమైనా ఒరిజనల్ గా మాట్లాడగల స్త్రీలు చాలా తక్కువ. మాటలు విన్నా ఉపన్యాసాలు విన్నా వుత్త చిలక పలుకులు. అసలు జన్మవల్ల సంస్కారం కలిగిన స్త్రీలున్నారు గొప్పవారు, పల్లెటూళ్లలో. కాని చదివి గొప్పవారైన స్త్రీలు యీదేశంలో లేనట్లున్నారు. మళ్ళీ చదువువల్ల చక్కని పాలిష్ వచ్చిన పురుషులున్నారు.
దుష్ట ఆచారాలు మాని, నవీన పద్ధతుల్ని అవలంబించి గృహాన్ని ఆనందపరుస్తారా? ఏమీలేదు. ఒక పురాతన ఆచారం బదులు, అంత నిర్జీవమైన యింకో నవీన ఆచార సంప్రదాయాన్ని నేర్చుకుంటారు. వాటి ననుసరించని వాళ్ళని ఖండించి, సాంఘికంగా తక్కువగా చూస్తారు. బట్టలో, కట్టులో, మాటలో, తిండిలో అన్నీ అతి కఠోరమైన నిబంధనలు. fashion మర్యాద దొంగ దేవతల పీఠం వద్ద నిత్యం కొలువు ఆ దేవత కోసం భర్త సౌఖ్యం, పిల్లల స్వేచ్చ బలి. ఈ విద్యావంతులూ, సంస్కార ప్రియులూ, వీళ్ళంత ఆత్మవంచితులు యెక్కడా లేరు.
స్వేచ్చ! స్వేచ్చ! స్త్రీలకి స్వేచ్చ! పిల్లలకి స్వేచ్చ! కార్మికులకి స్వేచ్చ! మామూలు మాటలు, ప్రతివాళ్ళ నోటినుంచీ యీ మాటలు. ఆ స్వేచ్చా దేవత ప్రత్యక్షమయిందా? కావలసిన స్త్రీ, పెంచిన పిల్ల, పోషించిన నౌకర్లు, పాకుతున్న కుక్క _ రూపాన స్వేచ్చ కావాలని ఎదురుతిరిగి కళ్ళముందు నిలపడదా ఆదర్శాన్ని భరించగల మనుష్యు లెందరున్నారు? స్వేచ్చ! ప్రతివారికీ స్వేచ్చ! ఎక్కడ వుంది ఆ స్వేచ్చ జీవితంలో? బంధం నించి బంధనానికి పాకితేనేగాని నిలవలేని యీ బతుకులో! మాయమీద మాయ కల్పించుకొని కప్పుకుంటేనే గాని కళ్ళు తెరవలేని యీ ప్రపంచంలో!
ఈ స్వాతంత్రపు స్త్రీలు వేశ్యల్ని అనుకరించాలని ఎంతో ప్రయత్నం చేస్తారు _ ఒక్క ఆకారంలోనే కాదు. వేశ్యలు కొన్నాళ్లు బోర్డింగు స్కూలు పిల్లల్ని అనుకరించారు. కాని ప్రస్తుతం అందరూ కలిసి సినిమా స్టార్లని ఆదర్శంగా పెట్టుకున్నారు. జుట్టుపైకి కట్టడం, పువ్వులు కిరీటాల వలె గుచ్చడం; ఇవన్నీ తమ తక్కిన ఆకారానికి సరిపోతాయా, లేదా అని యోచించరు. ఎందుకీ అలంకారం? ఎవరి కోసం అని ప్రశ్నించుకోరు. ఈ జెనరేషన్ స్త్రీలు యిట్లా కళ్ళముందు మారిపోతూ వుంటే వాళ్ళనేమీ అనలేక, యెట్లా అభ్యంతరపెట్టాలో తెలీక, గుడ్లు మిటకరించి చూస్తూ, ఊరుకుంటున్నారు, పెద్ద ముత్తయిదులు.