మొన్న ఒక్క బాడుగ కారులో ఒక అమ్మాయీ యిద్దరు యువకులూ, అతివేగంగా వచ్చారు పెట్రోలు పంపు దగ్గిరికి. రాత్రంతా ఎక్కడో గడిపినట్టున్నారు. ఎక్కడికో అతివేగంతో పోతున్నారు. ఇదే "life" ఏం గొప్పవాళ్లమో చూస్తున్నారా? అంటున్నాయి వాళ్ళ ముఖాలు. ఆ అమ్మాయి జుట్టునిండా, ముఖం మీదనించి ఎడం లేకుండా పిన్నులు. జుట్టులో ఎన్ని పిన్నులు, రంగుల రిబ్బన్లు జాకెట్టుకి ఎన్నికుచ్చులు, చీరెకి ఎన్ని అంచులు, ఎంత పౌడరు _ ఎంతస్నో__ ఎన్ని ఎక్కువగా వుంటే ఎంత అందం, అంత ఆకర్షణ, అంత సాంఘిక విలవ! లెఖ్క, తూకం... ఎన్ని ముద్దులు _ ఎన్నిసార్లు, ఎన్ని రాత్రులు_ ఎంత దూరం _ ఎంత మంది_ ఇవీ శృంగారపు కొలతలు.
'పాపం' లో వుండే ఆకర్షణని కూడా చంపేస్తే, నరకంలో వుండే శృంగారాన్ని లాగేస్తే ఇంక దిక్కెక్కడ! ఆశ్రమాల్లో తప్ప!
నిన్న బస్సులో నాకెదురుగా కూచున్న యువతిలో కలిగిన ఐడిల్ ఇంటరెస్టుతో యిద్దరమూ అరగంట సరదాగా గడిపాము. చూపుల్లో చిన్న కదలికల్లో గొప్ప భావ ప్రకటన చెయ్యగల స్త్రీలని చూస్తే చాలా సరదా. చాలా కొద్దిమందే ఆర్టిస్టులున్నారు, యీ దేశపు స్త్రీలలో. బస్సు ఆగింతరవాత విడిపోతాము. మళ్లీ యీ జన్మలో కలుసుకోము. కాని ఆ కాస్త సేపూ ఆడుకోవచ్చు. నేను బస్సు నధిష్టించినప్పుడు ఆమె భుజాల మధ్య వెడల్పయిన వీవూ, సన్నని నడుమూ, బండరాయిమీదనించి జారే పామువలె జడా_ యింతే కనబడుతున్నాయి. ఆమె కొంచెం వ్యాయామం చెయ్యకూడదా, ఆ జబ్బలికి చక్కని వొంపు వచ్చేది అనుకున్నాను.
చాలామంది ఆడవాళ్ళకి వీపుకి కళ్ళుంటాయి. నా సైలెంటు ఎప్రీసియేషన్ కనిపెట్టింది. కొంచెంగా ఆ వీపు చలించడంలోనే తెలిసింది నాకు; తనముందు తన మొగవాళ్ళు కూచున్నారు. నేనెవరో, సంగతేమిటో డైరెక్టుగా తిరిగి చూడ్డానికి వీల్లేదు. అందుకని యిటూ అటూ కొంచెం ఫిడ్జిట్ చేసి. ఏదో విసుక్కుని, పమిటి సద్దుకోడానికని లేచి, ఒక్క చూపుతో గ్రహించి, పక్కకి తిరిగి, తన ముందు భాగంలో సగమూ, ముఖం ప్రొఫైల్ నీ నాకిచ్చేసింది, చాలా దయతో. దాంతో ఆమె తన పురుషులకీ నాకూ తెర అయిపోయింది కూడాను. అటు తర్వాత అతి నేర్పుగల ఫెన్సింగ్. నాకంట బడకుండా నన్ను స్టడీ చేయాలని ఆమె ప్రయత్నం. డైరెక్టుగా ఆమె చూపుని నా చూపుతో క్రాస్ చేసి కట్టివెయ్యాలని నా పంతం.
స్త్రీల అందాలు చూడాలంటే వాళ్ళు యేదో పనిమీద వుండగా అన్ కాన్షస్ మూమెంటులో పట్టెయ్యాలి. గొప్ప సంగీతం వినాలన్నా అంతే. నిన్న చిన్నప్పుడు నేనెరిగిన పిల్ల ఎదిగి పెద్దదై చూడ్డానికి వచ్చింది. వెళ్ళేటప్పుడు లేచి నుంచుని వెనక్కి తిరిగేటప్పుడు ఆ నడుం నించి మెడవరకూ ఆమె చూపిన కదలిక ఏ మాటలు, ఏ గీతలు, ఏ రంగులు కాచ్ catch చెయ్యగలవు? 'యింకోసారి' అని అరిచింది నా శృంగార భావం. మాటలతో నేను అరిస్తే ఆమెకేం అర్ధమౌతుంది? కావలసి నేర్చుకున్నది కాదు. తరతరాల నించి రక్తంలో సంక్రమించిన శృంగారభావం. ఆమె అంత గొప్ప ఫ్లాష్ flash చూపి నా కళ్ళని చెదర కొట్టిందని ఆమెకే తెలీదు. అట్లాంటప్పుడు ఏం చెయ్యగలం? ఒకవేళ సిగ్గూ, అభిమానమూ వదిలి ఆమెకి నామీద వున్న కాన్ఫిడెన్సు భగ్నం చేసుకొని ఆ పిల్లని కావిలించుకుంటే చేతికి యేమి అందుతుంది?
బాయి లక్ష్మీబాయి పాడుతోంది ఇప్పుడు. ఆమెని కావిలించుకుంటే ఆ సంగీతం మాధుర్యం నాకెంత దొరుకుతుందో, నిజమైన అందంకూడా అంతే దొరుకుతుంది. చిన్నపిల్లల ముద్దు మాటల్ని, అందాల నవనవల్ని చూసి భరించలేక వాళ్ళని నలిపి యేడిపించే మూర్ఖుల్ని చూడడంలేదా? అట్లానే స్త్రీ సౌందర్యం నాశనం చేసి తృప్తిపడాలని చూస్తారు ప్రజలు.
ఉత్త అవయవ సౌష్టవమే కాదు, ఆత్మమాధుర్యమే కాదు, దేహం కదలికలో, చేతుల చలనాలలో, కళ్లచూపుల వుపయోగంలో వుంది; చాతుర్యమూ శృంగారమూ నా అస్ఖలిత బ్రహ్మచర్యమూ చెడలేదు, నా బస్సుకన్య పాతివ్రత్యమూ భంగం కాలేదు. కాని రతి సమరంకన్న యెక్కువ ఇంటెన్సు అయిన అనుభవాన్ని పొందాము. చిన్ని చిరునవ్వులతో ఏ సౌంజ్ఞాలేని ఆహ్వానాలతో, ఛాలంజీలతో, ఎదురు కదలికలతో. ఇది పాపమైతే చిత్రగుప్తుడు యే పద్దులో ఏ కాలంలో column వ్రాస్తాడో! పురుష ఆకర్షణ నెరగకుండా కాపరాలు చేసే పతివ్రతలారా ఇదంతా ఖండిస్తారా? ఈ మాత్రం సౌందర్యాకర్షణని కూడా ఎన్నడూ జీవితంలో యెరక్కపోతే, మీకు స్వర్గలోకాలు రావచ్చును గాని రాళ్లని తీసుకుపోయి అనుభవించమని స్వర్గంలో పారేసి యేం లాభం?
ఎంత దాచుకోనీ, నటించనీ, అలంకరించుకోనీ, మనుష్యులు ఏదో వో సమయంలో దొరికిపోతారు. నిజస్వభావం వెల్లడిస్తారు. రా__ ప్రేమ కనబరచడానికి ప్రయత్నించి అందవికారమౌతుంది. పాపం! వి__ ఏడిస్తే అసహ్యమేసేది. హై__కోపమొస్తే పిశాచమయ్యేది. శ్రీ__ బతిమాలేటప్పుడు కోతిరూపుదాల్చేది. వెం__నవ్వితే నాకు వొళ్లుమండేది. కా__ భయమేస్తే నీచత్వం వెల్లడయ్యేది. సుబ్బారావు c% గంగానమ్మ "ఈనాడు కాదు, అబ్బాయ్, వీళ్లతో తగాదా వచ్చినప్పుడు బైట పడుతుంది వీళ్ల నిజస్వభావం. చక్కని చీరెలు కట్టుకుని నవ్వుతో పువ్వులు సద్దుకుంటూ నీతో కులుకుతూ బాగానే వుంటారు. ఏనాడో కోపమొస్తుంది. అప్పుడు నోరువిప్పి వీధివెంట పడితే_" అంటారు.
అట్టానే బస్సులో కాంత కాలుమీద కుచ్చెళ్లు కిందకి లాక్కోడానికీ, తన నడుంవంపు నాకు చూపడానికీ, కిందకి వొంగినప్పుడు, ఎందుకో ఏం తెలియజేయడానికో పై పైదవి ఒకపక్క కొంచెం పైకి లాగినప్పుడు ఒక్కసారిగా ఆమె పూర్వీకులు__ అవ్వలు, తాతలు, అత్తలు, అందరూ వారి అల్పత్వంలో, వెకిలితనంతో. ఆమెచుట్టూ మూగారు. సరిగా ఇట్లానే పెదవి పైకి లాగుతూ చిరునవ్వు ప్రపంచంమీద కురిపించే ధన్యురాలితో ఒక రాత్రంతా రైలులో ప్రయాణం చేశాను కాని యీ అలవాటే యీ పెదవి కొంచెంగా పైకి కదల్చడమే ఆమెలో అద్భుత సంస్కారాన్నీ వంశ గౌరవాన్నీ, ఆత్మ సౌకుమార్యాన్నీ, వ్యక్తపరిచింది. ఆ విధమైన పనే యీ పై రక్తమాలిన్యాన్ని చాటింది నాకు. ఈమె జుట్టు నిగనిగ, యీమె దేహమార్దవం, ముఖంలోని శాంతభావం కళ్లలో ఆసక్తి, అన్నీ పై మెరుగులు. అసలు రక్తం వేరు. నా చేతులో గీతలమల్లేనే యీ అక్షరాలవలెనే, యెంతదాచినా, ప్రపంచం ముందు, బట్టవిప్పి నుంచోపెడతాయి. ఒక్కొక్క చిన్వాలు. నేనెంత నా స్వభావాన్ని తెలీకూడదని భద్రంగా దాచి వ్రాసినా ఏవొక్కమాటో నా వేదాంతమంతా పై మెరుగనీ ఆరాక మండే నా కోర్కెలే నా రక్తమనీ బైటపడెయ్యొచ్చు.