Previous Page Next Page 
మ్యూజింగ్స్ -2 పేజి 8


    రామతిలకం __ మనమధ్య తెనాలి రైలుస్టేషను మిత్రుల స్వాగతాలు_
    ఏమైనావు? నీ ఊర్ధ్వ జ్ఞాపకాలలో నీవెక్కడన్నా, ఎప్పుడన్నా_ వేశ్యకి హృదయమేమిటి, నూనృతమేమిటని నమ్మలేకపోయిన, నా దుమ్ముతనం _ నిన్ను అడిగితే, కదిలిస్తే, నా హృదయానికి స్వేచ్చనిస్తే...ఎక్కడ మునుగుతానో అనే నీచపు భయం...
    క్షమించావా, ఆలోకంనించి కాని! 'చిత్రాంగి' వ్రాసిన 'చలం' కూడా...
    అనుకుంటున్నావా, ఇంకా!
    ఆ ఉదయం మొగవాళ్ళ గుంపుమధ్య, ఆకుపచ్చ చీర, ఆకుపచ్చ చీరెమధ్య అందమయిన స్త్రీ, ఆ అందమైన స్త్రీకి...... ఇంకా మాటలు పడుతున్నాయిగాని ప్రెస్ ఆక్టు అడ్డం వస్తుంది, అయినా తక్కినవన్నీ _ బూతులు వ్రాస్తున్నానని గోలపెట్టే శోత్రీయుల భావనాశక్తికి వదిలేస్తాను.
    గుర్రం ఆగింది. నేను దిగి దూరంగా నుంచుని, తగాదా అర్ధం చేసుకుంటున్నాను. అంతమంది మొగాళ్ళు తనకోసం గోల పడడం 'హెలెన్ ఆఫ్ ట్రాయ్' వలె నిదానంగా గర్వంగా చూస్తోంది, ఆ పల్లెట్టూరి పడుచు. నా hat ని చూసి పంచాయితీకి గుంపు నన్ను సమీపించింది. ఆమె కదలలేదు. ఈ హ్యాటు పెట్టుకున్న మొగాడి వుద్దేశ్యమేమిటో ఆ తమాషా కూడా చూద్దామన్నట్టు కళ్ళు నావంక నిలిపి శాంతంగా చూస్తోంది ఆమె తగాదా వియ్యంకులకి. పర్మిషన్ లేకుండా తండ్రి పిల్లని అత్తవారింటినుంచి దొంగిలించుకుపోతున్నాడుట.
    "ఆ అమ్మాయిని అడక్కూడదా? ఆమెకి యిష్టమేమో!", అన్న నా సలహా కొందరికి నచ్చింది. నవీనులూ, విద్యాధికులూ, కాదుగా! 'దాని ఇష్టమేమిటి?' అని అనేందుకు. స్త్రీ విద్యమీదా, స్త్రీ స్వాతంత్రంమీదా లెక్చర్లు ఇచ్చి, కమిటీలలో మెంబర్లు కాలేదుగా ఆ పల్లెటూరివాళ్లు! ఆ 'స్త్రీ' వాళ్ల దృష్టికి గృహిణి, భార్య, పిల్లల్ని కని వంశాల్ని నిలబెట్టేమాత; అర్దరాత్రి నీరసపు నరాల బాధకి ఉపశాంతినిచ్చే మరకాదు. అలంకరించి షోకుగా చూసుకునే బొమ్మ కాదు; కమిటీలకి ప్రవేశాన్నిచ్చే ద్వారం కాదు. స్త్రీల సభల్లో, పురుషుడి ఉపన్యాసాలు చదివి, కీర్తి తెచ్చుకుని, భర్తకి ఉపకరించే సాధనం కాదు.
    వాళ్ళందరూ ఆమెమీదపడి ప్రశ్నల్ని కురిపించారు. ఆమె మాట్లాడలేదు. నాకు వాళ్ళిచ్చిన న్యాయస్థానాధ్యక్షత పదవి పురస్కరించుకొని ఆమెను బోనెక్కమన్నాను. కాని నా కో ఆపరేటరువలె ఆమె నా అధికారాన్ని అంగీకరించినట్టులేదు. కదల్లేదు. ఆమె సెక్సు ఆధిక్యతకు తలవంచి జడ్జే ఆమెని విచారణకై సమీపించాడు. ఆమెని దగ్గిరిగా చూసి రెండు ప్రశ్నలు వేసేటప్పటికే "ఛేంబర్సు"లో విచారణ చెయ్యాల్సిన కేసుగా తోచింది. ఆ మొహం నిండా పెంకెతనం అలుముకు వుంది. ఆ పెదమల బిగువు, ఆ చురుకుచూపు ఝాన్సీరాణీని జ్ఞప్తికి తెస్తున్నాయి. కాని ఆ చురుకు చూపులలోని చంచలం, ఆ దవడల జారు, ఆ కనుబొమ్మల తేలికతనం ఆమె హృదయలక్ష్మి అస్తిరమంటున్నాయి. భర్తని తలుచుకుంటే దిగులేసింది. ఆ గుర్రంమీద స్వారీ చెయ్యాలంటే (ముళ్ళ కళ్లెం కూడా రెండుగా కొరికే దవడలవి) మనిషి చాలా సమర్ధుడైవుండాలి. ఎంత విదిలించినా, వెనక్కాళ్ళతో తన్నినా, మెడతిప్పి కొరికినా, కిందపడి దొర్లినా తన తొడల పట్టు వదలకూడదు. కొరడా ప్రయోగంలో దిట్టమైనవాడై వుండాలి. కాని అంత దౌర్జన్యంలోనూ ఆమెనే అంటిపట్టిన మొగవాణ్ణి ఒక్క వూపుతో మనోవేగపు సవారితో తీసుకుపోయి యే స్వర్గ ద్వారాలో తెరిచి చూపుదామనుకున్నాను. ఎత్తై, నల్లనై, నునుపై, కఠినమై ముందు ఎదురు నడిచే రొమ్ము -నుదుటిమీద గాలిలో నృత్యం చేసే అణగని ముంగురులు (ఎంత కత్తిరించినా కనకమ్మగారి కందని అందాలతో - వాటినే గిడసబారిన ముంగురులన్నాడు రంగ)...పైకి చాచుకునే (చేతివేళ్ళకి చక్కలిగింతలు పెట్టే) నడుం...ఆ భర్తని తలుచుకుంటే ఈర్ష్య కలిగింది.
    ఆ గట్టి దేహమంతా, (మనసెక్కడ వుంటేనేం) నా దగ్గిరిగా వొత్తుకోడం తటస్తిస్తే చాలదా?
    తన్నుకోండి, గింజుకోండి. 'పశువో పశువో!' అని యడవండి. చిత్రగుప్తుడికీ, ఈశ్వరుడికీ, అర్జీలు పంపుకోండి. ప్రజలూ, విమర్శకులూ, దొంగచూపులతో గదుల్ని రహస్యాల కోసం వెతికే సతీమతల్లులూ, చాతనైతే నాకా వుపకారం చేసి, ఇంకా నన్ను నరకలోకాలకి, రికమెండు చెయ్యండి.
    ఛేంబర్సులోకి రమ్మంటే లేచింది ఆమె. గుంపు మా వెనకనే వచ్చింది. వాళ్లకి ఛేంబర్సు అంటే అర్ధమయినట్టులేదు. గతిలేక 'ఓపెన్' విచారణ పెట్టాను. ఎందుకోగాని నాతో చక్కగా మాట్లాడింది. అత్తవారింట్లో వుండడమే తనకిష్టమన్నది. మరి యెందుకు బయలుదేరావని క్రాస్ కొశ్చన్ వేస్తే 'ఈ గోలలో నాకేమీ వినపట్టం లేదండీ' అని కళ్ళు కిందికి వాల్చేసింది. జడ్జీగారి మెళ్ళో శా...మ్మగారు గుచ్చి యిచ్చిన వాడిన మల్లెదండేగాని రత్నాల హారమే వుంటేనా ఆమె మెళ్ళో వేసును, ఆమె చమత్కారానికి.
    జడ్జీగారి 'సైలెన్సు' అరుపును పార్టీలు లక్ష్యపెట్టకపోవడం వల్ల జడ్జీగారు 'విజిటర్సు గాలరీలోకి నెమ్మదిగా చేరుకున్నారు. ఆమె తండ్రితో ప్రయాణం కావడం మళ్ళీ అత్తవారింటికొచ్చేందుకు కాదని తెలుస్తోంది, అందరికీ కాని ఆమె వొప్పుకోదు. నయానా భయానా, ఆ బెజవాడ మునసబు మల్లే లాలన చేసి, అడిగితే వొప్పుకుంటుందేమో ఛేంబర్సులో. అందరి ముందూ చెప్పకూడదా, తనకి భర్తతో వుండడానికి ఇష్టంలేదని. నేను తన పక్షం తీర్పు చెబుదునుగదా అని కోపం వచ్చింది నాకు. కాని ఒకసారి అన్న తర్వాత ఆమె మాట మార్చుకునేటట్లు చెయ్యడం యెవరి తరమౌతుంది! ఏం చెయ్యాలిప్పుడు? అయినా మధ్య నేను తీర్పు చెయ్యవలసిన అవసరమేమొచ్చింది? వాళ్ళ తగాదా వాళ్ళు తీర్చుకోలేరా? కాని యెట్లానన్నా... నేను...యీమెని.....ఏమిటిది? పొద్దున్న విజిట్ చూపించకపోతే_ పొద్దునంతా ఏమిటి చేస్తున్నావని అడగరా అధికారులు?

 Previous Page Next Page