అది రాజారావు కారు ఇదివరకు రాజారావు తన పనులు జరిగే చోటికి ప్రతి రోజూ వస్తుండేవాడు కాని, ఈమధ్యన ఎప్పుడోగాని రావడంలేదు పనులన్నీ చంద్రయ్య బాధ్యతమీదే జరుగుతున్నాయి అందువల్ల రాజారావు తన యజమాని అని లక్ష్మికిగాని, లక్ష్మి తన కూలీల లోనిదని రాజారావుకుగాని తెలియదు.
భయంత్య్హో వణికిపోతూ, తానేదో పెద్ద నేరం చేసినట్లు రెండు చేతులూ జోడించి నీరు నిండిన కళ్ళతో నిలిచి ఉన్న లక్ష్మిని చూచాడు రాజారావు క్షణం అలానే చూస్తూ ఉండిపోయాడు ఆ అందం, ఆ భయం, ఆ తత్తరబాటు, ఆ దుఃఖం అతన్ని కలవరపెట్టాయి.
యజమాని వచ్చాడని చంద్రయ్య పరిగెత్తివచ్చి దృశ్యం చూచాడు యజమానికి నమస్కరించడం కూడా మరిచి, "ఏయ్ లచ్చి! ఏందట్ల నిలబడ్డవు? ఎంత పొద్దెక్కిందో కండ్ల పడ్తలేదా? నడువు, జల్ది పనిమీద ఎక్కు" అని కేకలు వేశాడు.
గిన్నెమూత నలిగిపోయింది గిన్నె దొర్లిపోయి రోడ్డుమీద పడింది అన్నం మట్లో కలిసిపోయింది మిగిలిన గిన్నె తీసుకొని వెళ్ళాలా, ఇలాగే వెళ్ళాలా అనే సందిగ్ధంలో పడ్డది లక్ష్మి.
"చెప్తాంటే ఇనపడ్తలేదా? వస్తవా రేపన్నించి పొద్గాల పన్లకిరా, లేకుంటే బంద్ చేయి ఆఁ - నడువ్"అన్నాడు చంద్రయ్య.
లక్ష్మి ముందుకు అడుగేసింది కార్లోంచి "ఆగు" అని తలుపు తెరుచుకొని దిగాడు రాజారావు.
కారు తలుపు పడిన చప్పుడు, రాజారావు కేక విని దభాల్న ఆగి వెనక్కు తిరిగింది లక్ష్మి పనిలోంచి తీసేస్తారేమో అనే భయంతో గజగజ లాడింది.
"నీ టిఫిను నా కారుకింద పడి నలిగిపోయింది అన్నం పడిపోయింది ఇదిగో, ఈ డబ్బు తీసుకో" అని పది రూపాయలు అందించబోయాడు రాజారావు.
లక్ష్మి అలాగే నుంచుండిపోయింది ఆమెకు అంతా అయోమయంగా ఉంది కళ్ళు కనిపించడం లేదు చెవులు వినిపించడంలేదు రాజారావు ఏమన్నది ఆవిడకు వినిపించలేదు.
"ఊఁ - పైకం తీసుకో దొర ఇస్తాండు జల్దీ పనిమీద ఎక్కు" అన్నాడు చంద్రయ్య.
చంద్రయ్య అన్న చివరిమాటలు మాత్రం వినిపించాయి లక్ష్మికి గబగబా ముందుకి నడిచి వెళ్ళిపోయింది.
"పిచ్చిపిల్ల" అని ముందుకు నడుస్తూ "పాపం, టిఫిను పడిపోయింది గిన్నెలు తెచ్చిపెట్టు" అని చంద్రయ్యకు పురమాయిస్తూ ముందుకు నడిచాడు రాజారావు.
కూలిదాని గిన్నెలు తెచ్చిపెట్టమని యజమాని తనకు పురమాయించడం కష్టమనిపించింది చంద్రయ్యకు కూలివాణ్ణి పిలిచి గిన్నెలు తెమ్మని, రాజారావును అనుసరించాడు చంద్రయ్య.
రాజారావు మనసులో లక్ష్మి మసలింది వచ్చి చింతచెట్టు కింద కూర్చున్నాడు ఇంకా లీలగా లక్ష్మి కనిపిస్తున్నట్లే ఉంది లక్ష్మిని పిలిపిద్దామనుకున్నాడు తానే లేచి అలా చూస్తూ లక్ష్మి దగ్గరికి వెళదామనుకున్నాడు.
ఇంతలో చంద్రయ్య వచ్చి నుంచున్నాడు చంద్రయ్య ముందు నుంచుంటే గంటల తరబడి వ్యాపారాన్ని గురించి మాట్లాడేవాడు ఏమి అడగాలో మాటలు తడుముకోసాగాడు తుదకు "పని ఎలా నడుస్తూంది?" అడిగాడు.
"ఏం నడుస్తుందండి? ఈ ధంధలేమి ఫాయిదున్నట్లు కండ్లపడ్తలేదు మేస్త్రీ కాన్నించి పెద్ద ఇంజనీర్ దాకా రిష్వతులేనాయే మల్ల బడికి చందని వచ్చిరి గుడికి చందని వచ్చిరి దవాఖానాకు చందని వచ్చిరి ఇగ కూలోళ్ళున్నరా టేముకు రారు, టముకు పోరుగని, కూల్లేమో ఎక్కువ కావల్నంటాండరి ఇగ కల్తీ చేయక ఎళ్లదాయె సిమెంట్లో కల్తాయె, సున్నంల కల్తాయె, ఇటికలు కాలవాయె, బంగ్లలు నిల్వవాయె దొరల్ను చూస్తే కర్చులేమో పెరుగుతాండే" - ఇంకేమేమో చెప్పదల్చుకున్నాడు చంద్రయ్య కాని దొర పరధ్యానంగా ఉన్నాడని ఊరుకున్నాడు.
రాజారావు లక్ష్మికి డెయిజీని పోల్చి చూస్తున్నాడు డెయిజీ అందమైందే కాని, అందులో కృతకత కనిపించింది పౌడరు, లిప్ స్టిక్, కత్తిరించిన వెంట్రుకలు, మోకాళ్ళవరకు స్కర్టు, తేజొహీనములైన కండ్లు, కృత్రిమపు చిరునవ్వు అన్నీ ఎక్కడో అరువు తెచ్చుకున్నట్లుంటాయి లక్ష్మి డెయిజీవంటి తెలుపుకాదు చామనచాయ, కళ్ళు పెద్దవి వాటిలో ఏదో వెలుగుంది పొడవైన వెంట్రుకలు, సహజమైన అందం, ముగ్ధత్వం భయం, దుఃఖంలో కూడా ఎంత అందంగా వుంది! డెయిజీ కాగితపు పూవు లక్ష్మీ తాజా గులాబి పూవు.
"ఇయ్యాళ చీఫ్ ఇంజనీర్ వస్తున్నాడు తనక్కీకి" అన్నాడు చంద్రయ్య, దొరనుండి జవాబు ఆశిస్తూ.
"వస్తే నేను చేసేదేముంది? ఏంకావాలో వాడి ముఖాన కొట్టు" అని లేచి నుంచున్నాడు - ఒకసారి అలా తిరిగి లక్ష్మిని చూచి, పలకరించి రావాలనే ఉద్దేశంతో ఇంతలో చీఫింజనీర్ రమణరావు రానే వచ్చాడు "హల్లో మిస్టర్ రాజారావ్!" అని విష్ చేయనూ చేశాడు రాజారావు లేచి చిరునవ్వు తెచ్చుకొని కరచాలనంచేసి కుర్చీ చూపి కూర్చున్నాడు కాఫీలు వగైరాలు వచ్చాయి కబుర్లు సాగాయి ఏకాంతంగా ఉన్నది చూసి రమణరావు అడిగాడు.
"మిస్టర్ రాజారావ్! మా అమ్మాయి పెళ్ళి నిచయం అయింది యాభైవేలకు తక్కువ కట్నం పుచ్చుకోనంటున్నాడు అల్లుడు అమెరికా వెళ్ళి చదువుకొని వచ్చాల్లే! మీరు కనీసం ఓ పదివేలు సాయం చేయాలి"
"పదివేలే? కాంట్రాక్టర్ల పరిస్థితి మీకు తెలీడం లేదండీ!" అని ఏదో భారతం అంతా చదివాడు రాజారావు.
"మీకు నేను చేసిన సహాయానికే ఇదేమంత ఎక్కువకాదు కూలిపోయిన వంతెనకు కూడా డబ్బిప్పించాను అందాకా ఎందుకు ఇప్పటి - ఈ ఆస్పత్రి బిల్డింగులో నేను చూసీ చూడకుండా ఉన్నాను కాబట్టి నడుస్తూంది ఇప్పుడు ఇనస్పెక్టు చేస్తే లక్ష పెట్టించగలను మీతో"
"మిస్టర్ రమణారావు! ఎందుకంత చదువుతారు? కష్టంగా ఉందన్నాను గాని ఇవ్వనన్నానా? చెక్కు కావాలంటే ఇప్పుడే ఇస్తా డబ్బు కావాలంటారా, రేపు చంద్రయ్యతో పంపిస్తా అదిసరేగాని, ఇంకేం కబుర్లు?" అడిగాడు రాజారావు.
"కబుర్లకేం కావలసినన్ని కాని, ఈ చింతచెట్టు క్రింద ఏమొస్తాయి? నడవండి నయాగరాకు కాస్త పారాయణం చేసుకోవచ్చు ఈ మధ్య బాగా లాగేస్తున్నారట మీరూ?"
"ఎక్కడిదండి, ఈ మధ్యనేగా మొదలుపెట్టింది వచ్చింది అందరూ చెప్పు కుంటారు, పోయిందెవరికీ తెలీదు చాలా పోయిందిలెండి చెప్పుకుంటే ఏం ప్రయోజనం? అయినా, ఇప్పుడెందుకూ - మీకు ఆఫీసుంటుంది సాయంకాలం నయాగరాకు వచ్చేస్తాను"
"ఆఫీసు, ఆఫీసు! గుమాస్తాలున్నారయ్యా ఆఫీసులో, కదుల్తావా లేదా?" అని చేయిపట్టి లాక్కెళ్ళాడు, రమణరావు.
రెండు కార్లూ సాగిపోయాయి.
* * *