Previous Page Next Page 
మాయ జలతారు పేజి 10


                                                    4
    
    బాలయ్య రిక్షా ఇంటి ముందుంచి దిండు తీసుకొని గుడిసెలో దూరాడు పెద్దకూతురు రాజమ్మ కాళ్ళు చాచుకొని కూర్చుంది ఆవిడ కాళ్ళమీద తమ్ముడు పుల్లయ్య పడుకొని వగరుస్తున్నాడు బాలయ్య బియ్యపు కుండలో చేయి పెట్టాడు అడుగు తగిలింది అడుగు తుడిచి చేయి తీశాడు పొద్దుటినుంచి ఎండు డొక్కతో, చింపిరి తల, చింకిబట్టలతో వున్న రాజమ్మ తండ్రి రాగానే ఆశగా చూచింది ఆ చూపుతో కూలిపోయాడు బాలయ్య పుల్లయ్యకు జ్వరం నాలుగురోజుల్నుంచి, మూసినకన్ను తెరవలేదు ఏం చేయాలో అర్ధం కాలేదు ఒక నిట్టూర్పు విడిచి బయటికి వచ్చి తలపట్టుకొని కూర్చున్నాడు.
    బాలయ్యకు తన పల్లె, సొరతీగ పాకిన గుడిసె, యింటి ముందరి బంతిచెట్లూ గుర్తుకు వచ్చాయి బాలయ్య తండ్రి వెట్టి మాదిగ దొరలకూ అధికారులకూ వెట్టి చేస్తూనే కళ్ళుమూశాడు బాలయ్యా, అతని అన్న కొమరయ్యా అదే వృత్తి అవలంబించాడు ఊళ్ళో ఏదో సంఘం పెట్టారు వెట్టి చేయరాదన్నారు దొరల దౌర్జన్యం నశించాలన్నారు అన్నదమ్ము లందులో చేరారు వెట్టి మావారు కూలి చేసుకొని జీవిస్తున్నారు భూములు పంచుతామని వచ్చారు కొందరు బాలయ్య తుపాకి పట్టుకొని రంగంలో దూకాడు దొరలు పారిపోయారు వాళ్ళ ఇండ్లు దోచుకొన్నారు పొలాలు పంచారు బాలయ్య నేలచెక్క వాడయ్యాడు పోలీసులు వచ్చారు బాలయ్య పారిపోయాడు కొమరయ్యను పట్టుకొని హింసించారు తుదకు తుపాకీతో కాల్చి చంపేశారు బాలయ్య పొలం ఊడింది దొరలూ పల్లెకు చేరారు బాలయ్యను పట్టుకొని జేలుకు పంపారు జేలు నుంచి తిరిగి వచ్చి తల్లినీ, పెళ్ళాన్నీ తీసుకొని పట్నం వచ్చేశాడు ఒక్క కొడుకునూ, ఇద్దరు కూతుళ్ళనూ కని, క్షయ వ్యాధితో కన్ను మూసింది బాలయ్య భార్య తల్లి కేన్సరై చనిపోయింది ఈ మధ్యనే కొడుకు రామారావు ఇరవై సంవత్సరాలవాడు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు కాస్త షోగ్గాడు ఈ మధ్యనే రొమాన్సులో పడ్డాడు పరమయ్య కూతురు శారదను ప్రేమిస్తున్నాడు.
    "రాజీ! రేషన్ దుక్నపోడేమన్నడు?" కూతురును అడిగాడు బాలయ్య.
    "ఉద్దేరియ్యనన్నడు" నిశ్చలంగా బదులు చెప్పింది రాజమ్మ.
    "ఉద్దేరిచ్చేకాడ గింజల్లేవు గింజలున్నకాడ ఉద్దెరలేదు గీరేసనెందుకు పెట్టిన్రో? ఎవల్ని చంపేటంద్కో?" విసుగ్గా గులుక్కున్నాడు
    "దున్యల మందెక్కువైన్రంటనే? గిట్లనన్న కొందరు చస్తరని పెట్టిన్రంట, ఏమంటవ్?" పిచ్చయ్య వచ్చి కూర్చుంటూ అన్నాడు.
    "ఏమంట? నా బొందంట నా బొక్కలంట గా నైజాం సర్కారోడే బాగనిపిస్తాండు బువ్వన్న దొరకెడిది అసలా హాలీసిక్కల్నే బర్కతున్నదని! రూపాయి పట్కపోతే చాటనిండ బియ్యమొచ్చెడివి నయా పైసొచ్చింది బర్కతు సుతాం లేకుండా పోయిందే రూపాయి పట్కపోతే చాటలకేంది, కీసలక్కూడ వస్తలేవు ఎట్ల బతుకుతురో గరీబోల్లు తెలుస్తలేదు"
    "గరీబోల్లు బతకాల్నని ఎవరనుకుంటాన్రే నీ పిచ్చిగని గిదంత ఉన్నోల్ల దున్యే! ఉన్నోల్లదున్య" మోటార్ గాడిలోల్లకోసం సడకు లేస్తాన్రు బిజ్లిగోలలు పెడ్తాన్రు నల్లలు, మోరీ లేస్తాన్రు మరి, గరీబోల్లకేం పెడతాన్రో చెప్పు? గుడిసెలేసుకున్నంద్కు రంగుపూసే, లంబర్లేసి పాయె ముర్కిపాలిటోడు టెస్కులు గుంజుతాండే ఒక నల్ల పెట్టిండా? ఒక్క బిజ్లిగోల పెట్టిండా? టెక్సులేమో ఈడగుండె, బిజ్లిగోల లాడపెట్టె"
    "అయ్య! ఆకలే! గింత చాయన్నచేస్తే పోరడుట్టి ఉపాసమున్నడు పొద్దటాల్నుంచి" అన్నది రాజమ్మ.
    బాలయ్య కళ్ళకు నీళ్ళు వచ్చాయి వెంటనే ఆరిపోయాయి జేబు చూస్తే ఒక బీడీ, అగ్గిపెట్టెలో రెండు పుల్లలూ ఉన్నాయి గురుగులన్నీ సొదా చేయగా దొరికిన 24 పైసలు రాజమ్మకిచ్చి "చాపత్త, బెల్లం తెచ్చి చా చెయ్యి" అని పుల్లయ్యను తాను తీసుకొని రాజమ్మను పంపించాడు.
    "ఇయ్యాలేమీ గిరాకి కాలేదానే బాలయ్యన్నా?" అడిగాడు పిచ్చయ్య
    "కాకేమన్న? అయింది గని ఉన్నరు గద మనకు పుట్టిన కొడుకులు పోరల్నుపాసముంచి వాలకు పెట్టాల్నాయే అవ్వ దినాలకు అప్పు తెచ్చిన్నా వచ్చిన పైకమంత గుంజుకొని ఒక్క రూపాయిచ్చి ఎల్లగొడ్తడు సేటు తక్కువొచ్చిందని పైస బచాయించ మనసొప్పదసె ఏం పుట్కొగాని, పానం బిగపట్టుకొని అబద్ద మాడిన్ననుకో ఇయాల ఏం చెయ్యమంటవు చెప్పు? పోరలకు బువ్వ లేదాయె! ఆడెంత తిట్టిండనుకున్నావు తక్కువొచ్చిందని! కొట్టెతంద్కు సుత వచ్చిండే పైపైకి వాణ్యమ్మ అట్లనే నెత్తిమీదేసి పూడ్చి పెడ్దమనుకున్నకాని, తెల్లార్తే ఆని రిచ్చ కావాలె గదనే తిట్లుపడి రెండు రూపాయలు బచాయించు కొస్తన్ననుకో, సైకలోడు కండ్లబడ్డడు ఎరికెగద, బట్టలమ్మె టంద్కొస్తడు చూడు!"
    "అయ్యో! ఆదా? ఎరికే! లేకపోతే యేందే! వద్దంటాండే ఉద్దేరేసి పోతాడు బజార్ల నిలబెట్టి వసూలు చేస్తడు"
    "అట్లనే చేసిండే పిచ్చయ్యన్న! ఆడట్ల కండ్లపడ్డడా గిట్ల పానం పోయిందనుకో వాణ్ణి చూసిన గిట్ల ఎన్కకు తిరిగిన్నో లేదో దొంగ సాలెగాడు చూసిండే 'ఒరే బాలిగా!' అని ఎంటపడ్డడనుకో గట్ల నిలబడి పోయిన్ననుకో వచ్చి మీద పడ్డడనుకో 'ఇస్తవ? చస్తవ' అని మంది కూడిన్రనుకో 'ఇస్తనయ్య, ఇయ్యనంటాన్నానా? జరా కష్టంలున్న నాల్గుడిన లాగ' మన్ననే ఇంకేమున్నది ముండకొడుకు అంది పట్టుకున్నడే 'పైకం కక్కి పోబే నీ తాత ముల్లీ డున్నదనుకున్నవా? అని ఉద్దెర తీసుకున్నడు అడుగుతే ఇగిస్త అగిస్తనంటడు, మొఖం తప్పిస్తడు ఇయ్యాల కండ్లబడ్డడు ఇంక నాలుగొద్దు లాగమంటడు' అని చెప్పిండు కూడిన మందికి.
    "అలికీ జనం అంతే రాజ్యం వాళ్ళదేనయా, ఏమంటాం?" అని ఎల్లిపోయిండొకడు "తీసుకునేటప్పుడు తీసుకుంటవ్ ఇయ్యమంటే ఎందు కియ్యవుబే" అన్న డింకొకడు "ఇస్తం దొర ఇయ్యనన్నాన? మా యవ్వ చచ్చింది జరా కర్చుల పడిన నాలు గొద్దులు నిలిస్తే ఇస్తనన్న గద" అన్నననుకో "ఇంకెప్పు డిస్తవుర? నాలుగొద్దులు, నాలుగొద్దులని యాడాది చేసినవు బట్టలిడిచి ఆడ పెట్టిపో" అన్నడే బుట్టలోడు పానం చచ్చినట్లయిందనుకో కీసలున్న రొండు రూపాయలు ఆని చేతుల పెట్టి కళ్ళు కడుపుల పట్టుకొని బైటపడ్డ గుడిసె కొచ్చెటార్కల్ల గిట్లున్నది ఏం బతుకులే పిచ్చయ్యన్న! గొడ్లకన్న యాళ కింత గడ్డి దొరుకుతదిగాని గరీబోనికి బువ్వ దొరికదాయె!" అని బీడీ తీసి వెలిగించాడు బాలయ్య.
    నోట్లో చుట్ట పెట్టుకొని, చెంబు పట్టుకొనిపోతున్న పరమయ్య "ఏమొ, శాన మంతకాలు కాడ్తాన్రు, తగిలిందయాన్నిన్న?" అని అడిగాడు పిచ్చయ్యను.
    "మంతక లేందే పరమయ్యన్న? కార్కాన్ల కొలువు చేస్తాన్నవు, నీకేం తెలుస్తదే? పైలె వచ్చే టార్కల్లపడే చేతుల సర్లే, పోయిరా" అన్నాడు బాలయ్య.
    "గట్లనే ఉంటది లేవే ఎంత చెట్టు కంత గాలి" అంటూ వెళ్లిపోయాడు పరమయ్య.
    "పంటలు గరీబోల్లే పండించిరి, బంగ్లలు గరీబోల్లే కట్టిరి, కార్ఖానాల్ల గరీబోల్లే పని చేసిరి వీండ్లకేమో బువ్వకు లేదాయె ఉన్నోల్లేమొ మతలుడాయించిరి సరేగాని బాలయ్యన్నా, ఆదతైన పానంకాదే కల్నీల్లకు గుంజుతాందే"
    "పిచ్చయ్యన్న నువ్వే మన్నను, గరీబోల్లు నాయంగనే బతకాల్నే ఏ జల్మల పాపం చేసినమో ఈ జల్మల గిట్లయిన్నం ఇప్పుడు సుత ఎందుకే దొంగతనం? కూల్నాలి చేసుక బతకరాదూ? ఎన్నిసార్లు పట్కపోయిన్రే పోలీసులు! ఇంక మడిసివి కాకపోతివి!"
    ఇంతలో చంకలో ఉన్న పుల్లయ్య మూలిగాడు ఎత్తుకొని లోపలికి వెళ్లిపోయాడు బాలయ్య పరమయ్యా రావడంతో పిచ్చయ్య లేచిపోయాడు.
    
                                                *    *    *
    
    టాక్సీ నుంచి దిగారు సూరి, బాలయ్య కొడుకు రామారావు "ఇప్పుడే వస్తా, మీరిక్కడే ఉండండి" అని చెప్పి వెళ్లిపోయాడు గుడిసెల వైపు రామారావు.
    లక్ష్మిని చూచిన్నాటినుంచి నిద్రపోవడంలేదు సూరి ఉస్మాన్ అతనికి మద్దతు ఇస్తానన్నాడు డబ్బుకూడ ఆశ పెట్టాడు ఎంతో ప్రయత్నం చేసి, నగరమంతా గాలించి పట్టాడు రామారావును అతని ద్వారా గుడిసెల వాళ్ళను పరిచయం చేసుకుని లక్ష్మిని లోబరచుకోవాలని అతని ప్రయత్నం రామారావును సినిమాల్లో చేరుస్తాననీ, హీరోను చేస్తాననీ ఎన్నో ఆశలు చూపటమేకాక సినిమాలకూ హోటళ్ళకూ తిప్పుతున్నాదు రామారావు సుమారు సూరి శిష్యుడైపోయాడు తండ్రితోనూ ఇతరులతోనూ పరిచయం చేయిస్తానని తీసుకొని వచ్చాడు సూరిని అక్కన్నే నుంచొమ్మని రామారావు వెళ్ళిపోతే, కొంత దూరం అతణ్ణి అనుసరించి నుంచుండిపోయాడు సూరి.
    టీపొడి, బెల్లం తేవదానికి వెళ్ళిన రాజమ్మ, రామారావు ఎదురైనారు పుల్లయ్యను లోన పడుకోబెట్టీ వస్తున్న బాలయ్యకు.
    "యాడికి పోయినవుర గింతసేపు?" అడిగాడు బాలయ్య.
    "సినీమాకు" అని తెక్కుగా జవాబు చెప్పాడు రామారావు.

 Previous Page Next Page