హైదరాబాదులో ఉన్న 273 మురికి పేటల్లో మూడున్నర లక్షల మంది ఉంటున్నారని మున్సిపాలిటీవారి అంచనా.
ఈ మురికి పేటలో బాలయ్య గుడిసె, పోచయ్య గుడిసె ఒకదానికి ఎదురుగా ఒకటి ఉన్నాయి ఆ రెండిండ్ల మధ్యనున్న ఇరుకు సందులోంచి వెడితే ఎడమవైపు గొందిలో పిచ్చయ్య గుడిసె ఉంది కుడివైపు సందులో ఉన్న పెద్ద మురికి గుంట ముందున్నది పరమయ్య ఇల్లు ఇవికాక ఇంకా అనేక గుడిసెలు చిందరవందరగా ఉన్నాయి అన్నిటికీ మున్సిపాలిటీవారి నంబర్లున్నాయి అందరూ ఓట్లకు అర్హతగల భారత పౌరులే అందరూ పన్నులు చెల్లిస్తున్నవారే కాని, వీరిని మనుషులే కాదు, దేవుడూ విస్మరించాడు అయినా, వారికి ఆ ఇద్దరిలో విశ్వాసం చావలేదు.
శనివారం కావడాన లక్ష్మి తలమీంచి స్నానం చేసి వెంట్రుకలు ఆరబెట్టుకుంటూంది బాలయ్య రిక్షా తుడుస్తున్నాడు పోచయ్య టిఫెన్ క్యారియర్ తుడిచి పనికి వెళ్ళడానికి తయారు అవుతున్నాడు.
మురికి పేటకు కొద్ది దూరంలో ఒక మార్క్ టూ అంబాసిడర్ కారు ఆగింది కారు దిగి డ్రైవరు గుడిసెలవైపు పరిగెత్తాడు జనాన్ని పిలవడానికి అందులో ఉన్న ఉస్మాన్, సూర్యారావు ఇద్దరూ లక్ష్మిని చూచారు ఆమె అందం చూచి ఇద్దరూ ముగ్ధులయ్యారు సూర్యారావు కారు దిగి, ఆమెను చూస్తూ ఉండిపోయాడు అతనికి ఏవేవో ఆలోచనలు వచ్చాయి అల్లాంటివే కొన్ని ఆలోచనలు ఉస్మాన్ మెదడులోనూ మసిలాయి.
ఉస్మాన్ పొట్టివాడు బలిష్టుడు ఖద్దరుతప్ప అన్యం ధరించడు తెల్లని షేర్వానీ, చుడీదార్ ఫైజమా మాత్రమే కాక గాంధీ (కి) టోపీ పెడ్తుంటాడు టోపీ లేకుంటే అతని వ్యక్తిత్వానికి ఏదో లోపం కలిగినట్లు అతనికే కాదు - మనకూ అనిపిస్తుంది గాంధీ తోపీకి ముందు సైతం అతనికి టోపీ పెట్టడం అలవాటే అయితే, అప్పుడతను పెట్టింది కుచ్చుటోపీ పోలీసుచర్య జరిగి హైద్రాబాద్లో భారత సైన్యాలు ప్రవేశించిననాటినుంచీ గాంధీ టోపీయే ధరిస్తున్నాడు భారత సైన్యానికి మొట్టమొదట స్వాగతం చెప్పింది తానేనని అతి గర్వంగా చెప్పుకుంటాడు కాని, అంతకు ముందు రజాకార్లకు సాలార్ గా ఎంతమందిని బలిగొన్నదీ చెప్పుకోడు గిట్టనివాళ్ళు అతణ్ణి తారసకాడంటారు కాని, అతడు మంత్రులతోనూ, మహా నాయకులతోనూ తీయించుకున్న ఫోటోల ఆల్భం ఎప్పుడూ అతని దగ్గర ఉంటుంది ఆ పలుకుబడే అతనికి జీవిక ప్రస్తుతం అతణ్ణి గురించి ఇన్ని విషయాలు మనం తెలుసుకోవడం తప్పే, ప్రస్తుతం అతను విచ్చేసింది ఈ గుడిసెల వాళ్ళను ఉద్దరించడానికి అయినపుడు.
బాలయ్య, పిచ్చయ్య, పోచయ్య, పరమయ్య, ఇతరులూ కారు దగ్గరికి వచ్చి సలాం చేశారు ఉస్మాన్ ప్రతి సలాం చేసి ఆల్బంతో సహా కారు దిగి "ఆ లడ్కీ ఎవరు?" అని అడిగాడు అంతా వెనక్కు తిరిగి చూచారు అప్పుడుగాని గ్రహించలేదు లక్ష్మి తన నెవరో చూస్తున్నారని వెంటనే గుడిసెలోకి దూరింది.
"అదానుండి పోరున్రి, దానికి ఇంక చిన్న పెద్దెరిక లేదున్రి ఇగోగీ పోచిగాని పెండ్లం మొన్ననే లగ్గమైందుండి" అని, "వచ్చిన మత్లబు చెప్పక పోతిరి" అడిగాడు బాలయ్య.
"అప్సర కాలుజారి నెలమీద పడి ఇల్లు వెతుక్కుంటూ ఇటు వచ్చిందేమో ననేట్లుంది అప్సరసలను తల తన్నిన అందం -ఆహా! డబ్బులేదు కాని, ఇలా ఇలా ఇక్కడ నుంచున్నట్టే మూవీ కెమెరా తెప్పించి ఫిలిం తీసేవాణ్ణి తలా వేయి చందా ఇస్తే రేపీపాటికి డాక్యుమెంటరీ తీసేస్తా - 'పానకంలో పద్మం'" అని సూరి యింకేదేదో చెప్పబోతుంటే అతని వాగ్దారను ఆపడానికి ఉస్మాన్ ఉపన్యాసం ప్రారంభించాడు.
"నేను మీకు మద్దత్ చేసేటంద్కు వచ్చిన - చందా లడిగి సినిమా తీసేటంద్కుకాదు" - సూరి నోరుమూసి అటూ యిటూ చూచాడు గుడిసెల వాళ్ళంతా ఏవగింపుగా ఒకసారి అతణ్ణిచూచి ఉస్మాన్ చెప్పే మాటలు వినసాగారు.
"జోఁప్డి లేసుకున్న జమీన్లన్ని హడప్ చేయాల్నని చూస్తున్రు మాలిక్ లు జమీన్ దామ్ రోజ్ రోజ్కి బఢాయిస్తోందని ఎరికేకద! జోఁప్డిల్లుండేది గరీబులు వాళ్ళతానేముంటది? ఈన్నించి హటాయించి న్రనుకో మళ్ళ యాడ బసాయిస్తరు? గరీబోల్ల కాణ్ణుంచి జమీన్ ఖించాయించుకొని రుప్యాచేస్కునేటంద్కు చూస్తాన్రు అమీర్లు జోఁప్డిలోల్లకు ఖిద్మత్ చేసేటంద్కు ఒక అంజుమన్ పెట్టినం మినిస్టరుకు భీ అంజుమన్ మత్లబు సునాయించినం ఆయినభీ మదద్ చేస్తనన్నడు గుడిసెల్ను ఉరాయించె టంద్కెవడన్న వచ్చిండనుకోరి, నాకు ఇత్తలా ఇయ్యిండ్రి నేను టిలిపోను మీద మినిస్టరు సాబుకు ఇత్తలా ఇస్త ఆయినగాడిల కూకుండి జట్న వస్తడు వచ్చినోన్ని భగాయిస్తడు నిన్ననే నేను మినిస్టర్ను కల్సి తస్వీర్ దిగినం చూడ్రి ఈ మిసిస్టరున్నడే - శానమంచోడు గరీబ్ అవామ్ కు కిద్మత్ చేసేటోడు.
ఈ పన్లన్ని చేసేటంద్కు పైకం కావాలె కద! పైకం లేంది ఏమన్న ఎల్లుతాది ఈ జమాన్ల? మీరు జోఁప్డికి పాంచ్ రూపైలు వసూలు చేసియ్రు ఇక మీరు బేఫికరుండ్రి మీ కేమన్నా వస్తే నా జాన్ అడ్డమేస్త మల్ల మహెనకు పాంచ్ రూప్య అంతే ఇయ్యాక పోయిన్రనుకోరి, తెల్లారేటార్కల్ల గుడిసెలు ఉఖ్డాయిస్తరు ఏమంటరు?" అని అందరివైపు చూచాడు.
అప్పటికి చాలమంది కూడారు కారు చుట్టు ఒకరిముఖాలు ఒకరు చూచుకున్నారు వారికి ఏమీ అర్ధం కాలేదు వారికి తెలిసిందల్లా అయిదు రూపాయీ లివ్వకుంటే గుడిసెలు ఊడబెరుకుతారని కాని, అయిదు రూపాయీలంటే మాటలా? ఏం చేయాలో ఎవరికీ అర్ధంకాలేదు బాలయ్యే ముందుకు వచ్చాడు "దొర! నీ కాల్మొక్త పట్టుపట్టమంటే అయిదు రూపాయి లాన్నుచొస్తయుండి? జర సబబ్ చేయున్రి పైలీకి వసూలు చేసి ఇస్తం జరా మెహర్భానీ ఉంచుండి గరీబోల్ల మీద ఎట్లనన్న చేసి ఇస్తంగాని గుడిసెలు పీకించకుండి నీ కాల్మొక్తం మే మొచ్చినప్డిడొక్క బంగ్లనన్న లేకుండే అసలు ఇల్లున్నాదుండి? మేమె గుడిసె లేస్కున్నం సరేనండి, పైలికి తెచ్చిస్తం కావాల్నంటే పేర్లు రాస్కపోండి ఏమంటారు?" అని అందరిని అడిగాడు.
"బాలయ్యన్న కన్న ఎక్కు వేరికెనానానె మాకు నువ్వెట్ల చెపితే గట్లింటం" అన్నారు వాళ్ళంతా.
"సరె నంట్రాను దొర పైలిక్కాదుగని దుస్రీకి తెచ్చిస్తం వాయిద చేసి ననక తప్పరుఁడి గరీబోల్లు"
"సర్ సిల్పిలన పేర్లు చెప్పుండి, రాస్కపోత దూస్రీకి తెచ్చిస్తరు కద? వాయిద తప్పొద్దు నా ఇల్లాడున్నదో ఎర్కెన? చార్మినార్ తాన పత ఎరికెనా?" అని అడిగిన ఉస్మాను, జవాబు కోసరం ఎదిరి చూడకుండానే విజిటింగు కార్డు బాలయ్యకు అందించి "ఈ కారటు చూపిన్రంటే నా మకాన్ దిఖాయిస్తరు" అని చెప్పి, "పేర్లన్నీ సిల్పిలగ రాయించుండి గీ పేర్లున గుడిసెల్దే నా జమ్మెదారీ" అన్నాడు కాస్త కరుకుగా.
"గరీబోల్లం బాంచను జరా మెర్బానీ ఉంచుండి కోప్పడ్తే ఎట్ల బతుకుతం? పైకమంత ముట్టచెపుతంగాని జర కాపాడుండి మా రాముడు పుట్టినప్పుడొచ్చినం ఆని కిప్పుడిరవై ఏండ్లొచ్చే గిప్పుడు పొమ్మంటే యాడికి పోతం? మీరే రచ్చించాలే" అని, "పేర్లు రాయించుండిర సిల్సిల్న, పనికి పొయ్యే యాళై తాంది" అన్నాడు బాలయ్య.
ఒక్కరొక్కరే ముందుకు వచ్చి మారుపేర్లు రాయించారు పేర్లు రాసుకొని ఉస్మాన్ సాహెబ్ సూరితో కలిసి వెళ్ళిపోయాడు.
ఉస్మాన్ను గురించి తలా ఒకరకంగా వ్యాఖ్యానిస్తూ గుడిసెలకు చేరి పనులకు వెళ్ళడానికి తయారవుతున్నారు పోచయ్య గుడిసెలోకి రాగానే లక్ష్మి "నాకేందో బుగులు గున్నదే ఎందుకొచ్చిన్రు వాళ్ళీడికి?" అని అడిగింది.
"గుడిసెల్నెవరో పీకుతమంటాన్రట పీకకుండ చేసేటంద్కు సంగం పెట్టిన్రట చందలడిగేతంద్కు వచ్చిన్రు"
"సైతానున్నట్లున్నడు వాడెట్ల చూసిండు! వాడు చూసిన కాన్నించి దుగులైతాంది నేనియ్యాళ పనికి పోను నువ్వుసుత పోవద్దు ఒక్కదాన్నుండలేను"
"ఏమో! ఎల్తలేవు, ఇయాళ సుత పనికి నాగ పెడ్తవా?" అంటూ బాలయ్య వచ్చాడు.
"బాలయ్యన్న! లచ్చి బుగులైత దంటాందే ఇంట్ల ఉండమంటాంది" అన్నాడు పోచయ్య
"ఎందుకే లచ్చి బుగులు? కష్టం చేసుకుంటేనే ఎల్తలేదు ఇంట్లకూకుంటే ఎట్ల ఎల్తది? ఇదోచూడు లచ్చి! నువ్వీ గూడానికి దేవతసువంటి దానివి నిన్నే మన్నంటే ఎవడన్న బతుకుతాడే? లే, లేచి పనికి పో" అని ఇద్దరినీ పనికి పంపి బాలయ్య రిక్షా తొక్కుతూ వెళ్ళిపోయాడు.
బాలయ్య బలవంతాన బయలుదేరిందిగాని భయం భయంగానే పనిచేసే చోటికి చేరింది లక్ష్మి గేట్లో ప్రవేశిస్తుండగానే వెనకనుంచి పెద్దగా కారు హారను వినిపించి అదిరిపడి వెనక్కు జరిగింది ఆ అదురుపాటుతో చేతిలో టిఫిను జారి కిందపడి మూత ఊడి అన్నం నేలమీద పడిపోయింది కారు ముందుకు వచ్చి టిఫిను మూతను నలక్కొట్టి నిలిచిపోయింది.