"అంటే... నాలుగురోజుల్నించి నువ్వు..." ఎండిపోయిన గొంతుతో అడిగాడు సుబ్బారెడ్డి.
"చెరువు నీళ్ళు... తాగుతున్నాగా..."
ఏదో అదృశ్యహస్తం చెంపమీద ఫటేల్మని కొట్టినట్టయింది సుబ్బారెడ్డికి.
ఆకలిని కూడా ఎలా మాయతో, మోసం చేయొచ్చో తెల్సుకున్న పసితనం...
ఈ తరం బాల్యానికి, ఈ వ్యవస్థ యిచ్చిన కానుక.
గబుక్కున జేబులోంచి పదిరూపాయల్ని తీసి లక్ష్మి చేతిలో పెట్టాడు సుబ్బారెడ్డి.
"ఇవాళ మా ఇంటికొచ్చి తిను. రేపు యీ డబ్బుతో బియ్యం కొనుక్కో" చెప్పాడాయన.
"ఎందుకు? నాకు వంట చేసుకోవడం వచ్చుగదా" దీపం వెలుతురులో ఆ పదిరూపాయల వైపు సంతోషంగా చూస్తూ అంది లక్ష్మి.
లక్ష్మి మెరుస్తున్న ముఖాన్ని చూస్తున్నాడు సుబ్బారెడ్డి.
"అవునే లక్ష్మీ... ఇంతకీ... ప్రమిదలో ఏం వేశావ్" అనసూయమ్మ దృష్టి వెలుగుతున్న దీపం మీదే వుంది.
"ఏం వేశానో మీరే తెల్సుకోండి" తుర్రుమని పరుగెడుతూ అరిచింది లక్ష్మి.
"లక్ష్మీ" కంగారుగా పిలిచాడు సుబ్బారెడ్డి. చటుక్కున ఆగిపోయింది లక్ష్మి.
ఆ ప్రమిదలో ఏం వేసిందో, ఏం వేస్తే, గాలి వీస్తున్నా ఆ దీపం ఆరలేదో, ఆరదో అనుభవజ్ఞుడైన సుబ్బారెడ్డికి తెలుసు.
ఊళ్ళో తెగిన గాలిపటంలా, గాలివాటంగా తిరుగుతున్న లక్ష్మి ముఖంలోకి విచిత్రంగా చూశాడు సుబ్బారెడ్డి.
తనకు అవసరమైన పదిరూపాయల కోసం ఎందుకూ పనికిరాదనుకున్న పదహారేళ్ళ పల్లెటూరి అమ్మాయి తను గెలవడం కోసం పందెం కట్టి గాల్లో దీపాన్ని వెలిగించడం చిత్రంగా వుంది సుబ్బారెడ్డికి.
ఎలిమెంటరీ స్కూల్ లెక్కల మాస్టారు తనెదురుగా నిల్చున్న అమ్మాయి జీవితాన్ని కాలిక్యులేట్ చేస్తున్నాడు.
ఎవరూ గమనించని విషయాన్ని ఆ అమ్మాయి గమనించడం ఆయన ఆశ్చర్యానికి కారణం.
"నీకు యీ కండువా కూడా యిస్తానన్నాను గదా! తీసుకో తన ఎడమ భుజమ్మీద జరీ అంచు కండువాని తీసి విప్పి ఆమె భుజాల నిండుగా కప్పాడు సుబ్బారెడ్డి.
ఇప్పుడు అతడికెందుకో సంతోషంగా వుంది.
"లక్ష్మీ! నీకు భగవంతుడు తెలివితేటలిచ్చాడే... వాటిని దాచుకోకు. కానీ వంటిని దాచుకోవాలమ్మా... మీ నాన్నని పైటని కొనమని చెప్పు. అంతవరకూ దీన్ని కప్పుకొని తిరుగు" ప్రేమగా చెప్పాడాయన అంతకంటే స్పష్టంగా మరి చెప్పలేకపోయాడాయన.
లక్ష్మి భుజాల చుట్టూ కండువా వెచ్చగా వుంది. ఆ వెచ్చదనం ఆమెకు సంతోషంగా వుంది.
మరేం మాట్లాడకుండా ముందుకు పరుగెత్తింది లక్ష్మి.
"ఇంతకీ ఆ పిల్ల ఆ ప్రమిదలో ఏం వేసిందండీ" ఇంటికొస్తున్న దార్లో అనసూయమ్మ రెండు, మూడుసార్లు అడిగింది.
మూడోసారి అనసూయమ్మ ప్రశ్నను వినిపించుకున్నాడు సుబ్బారెడ్డి.
"మొద్దూ... ఇప్పటికీ తెలీలేదా? నీకు వారం రోజులు టైమిస్తున్నాను తెలుసుకుని చెప్పు... కరెక్టుగా జవాబు చెప్పావనుకో... పట్టుచీర కొంటాను."
తనకు తెలీకుండానే పందెం కట్టాడు సుబ్బారెడ్డి.
"పట్టుచీర కొంటారా?" విస్తుపోతూ అందావిడ.
ఒక విత్తనం ఎంతటి మహావృక్షమవుతుందో, ఆ విత్తునాటిన వాడికి తెలుసు.
అలాగే-
ఒక వ్యక్తి!
ఈ పిల్ల మామూలు ఆడపిల్ల కాదు. సమ్ థింగ్ రేర్.
సుబ్బారెడ్డి బ్రెయిన్ లక్ష్మి గురించే ఆలోచిస్తోంది.
అప్పుడు సరిగ్గా-
రాత్రి తొమ్మిది గంటలు దాటింది.
సరిగ్గా అదే సమయానికి-
ఆ కుగ్రామానికి కొన్ని వేల మైళ్ళ దూరంలో వున్న స్పెయిన్ లో...
* * * *
మార్బెల్లా టౌన్ లో-
తన లీజర్ రిసార్ట్ ఎదుట, స్విమ్మింగ్ ఫూల్ ప్రక్కన, కుషన్ చైర్ లో కూర్చున్న శుక్రవర్ణ మహంత.
తన అసిస్టెంట్ రాబర్ట్ మర్చంట్ వైపు కంగారుగా చూశాడు.
"వేరీజ్ హి నౌ..."
మార్బెల్లా టౌన్, ఇంటెలిజెన్స్ చీఫ్ నికొలస్, ఆ బర్డ్ డే పార్టీకి వచ్చిన రాయల్ గెస్టులు ఎక్కడెక్కడ తిరిగారో, ఎవర్ని కలుసుకున్నారో ఏం మాట్లాడుకున్నారో వాళ్ళకు తెలీకుండా రహస్యంగా తీసిన వీడియో కేసెట్ డిస్కుల్ని ఒక్కటొక్కటీ అందిస్తున్నాడు.
పక్కనున్న పోర్టబుల్ టీవీకి వున్న బాక్స్ లో ఆ డిస్కుల్ని ఇన్ సర్ట్ చేస్తున్నాడు రాబర్ట్ మర్చంట్.
తనకు కావల్సింది, అవసరమైంది కృపానంద దేశ్ ముఖ్ గురించి.
"ఐవాంట్ దేశ్ ముఖ్ డిటైల్స్..."
ఆ కేసెట్స్ మామూలు సినిమా కేసెట్స్ లా లేవు. స్పెషల్ డిస్క్స్ అవి.
కేరమ్ బోర్డు స్టయికర్ అంత మందంలో వున్నాయి ఆ డిస్కులు.
గబగబా ఆ డిస్కుల్లోంచి ఓ డిస్కుని తీసి అందించాడు నికొలస్.
మూవ్ అవుతున్న డిస్క్ వైపు మినీ టెలివిజన్ స్క్రీన్ వైపు ఆత్రంగా చూస్తున్నాడు మహంత.
కృపానంద దేశ్ ముఖ్...
తనకు కేటాయించిన గెస్ట్ హౌస్ లో, లివింగ్ రూమ్ లో కాసేపు రెస్టు తీసుకోవడం, వెంటనే లేచి బార్ రూమ్ వేపు నడవడం, ఆ రూంలో తన పి.ఏ.తో మాట్లాడటం, ఆ తర్వాత-
ఆ రూమ్ లోంచి బయటకు రావడం-
అంతే...
వీడియో డిస్క్ లో అంతవరకే రికార్డయింది. అంటే... అంటే... మహంత తలెత్తి రాబర్ట్ మర్చంట్ వేపు సీరియస్ గా చూశాడు.
"మిస్టర్ మర్చంట్! డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్...! తన కదలికల మీద నిఘా వుందన్న విషయం తెలుసుకున్న దేశ్ ముఖ్ వీడియో కెమెరా లైన్ ని కట్ చేసుంటాడు" సాధ్యమైనంత నెమ్మదిగా అన్నాడు మహంత!