Previous Page Next Page 
ఆక్రోశం పేజి 8


    "ఏం లక్ష్మి! దేవుడికి దండం పెట్టుకోడానికొచ్చావా?" అభిమానంగా పలకరించాడాయన.

 

    సమాధానం చెప్పకుండా ముందుకో అడుగువేసింది లక్ష్మి.

 

    చిరుగుల ఎర్రటి జాకెట్టు... లంగా...

 

    ఆ అమ్మాయిని ఎప్పుడు చూసినా జాలిపడుతుంటాడాయన.

 

    చదివించమని లక్ష్మి తండ్రికి చెప్పాడు. చదువుకోమని లక్ష్మికి చెప్పాడు.

 

    తను చెప్పడం వరకే ఏమీ సహాయం చెయ్యలేడని తెల్సు.

 

    మరి దీపాన్ని వెలిగించే ఓపిక లేక, నలభై ఏళ్ళ అనసూయమ్మ లేచి నిలబడింది.

 

    "నేను చెప్పానా! ఆ దీపం వెలగదని. నీ ఛాదస్తం... పద" బలహీనంగా నవ్వాడు సుబ్బారెడ్డి.

 

    "అంతేలెండి... మీరన్నదే నిజం..." ముందుకొచ్చింది అనసూయమ్మ.

 

    "ఇవాళ గాలి మరింత విసురుగా వుంది అనసూయా..." మంటపంలోకి వస్తూ అన్నాడాయన.

 

    "గాలి లేనప్పుడైనా దీపం ఎంతసేపు వెలిగిందని? సోమవారం నాడైనా... ఓ దీపం వెలిగిస్తే..." బాధగా అందావిడ.

 

    "ఈ ఊరి శివుడికి దీపం అచ్చిరాదేమో..." నిర్లిప్తంగా అన్నాడాయన.

 

    మరింత ముందుకొచ్చింది లక్ష్మి. మాస్టారు మాటలకి లక్ష్మికి నవ్వొచ్చింది.

 

    "ఏం లక్ష్మీ నవ్వుతున్నావ్? నీక్కూడా దేవుడు చులకనైపోయాడా?" అడిగాడాయన.

 

    "లేదు సార్! గాల్లో కాదు... తుఫానులో కూడా దీపం వెలుగుతుంది సార్. వెలిగించడాన్ని బట్టి వుంటుంది" పెద్ద ఆరిందలా అంటున్న లక్ష్మి ముఖంవైపు ఆశ్చర్యంగా చూశాడు సుబ్బారెడ్డి.

 

    "గాల్లో దీపం వెలుగుతుందా... ఎలక్ట్రిక్ దీపమా?" అనసూయమ్మ అమాయకంగా అడిగింది.

 

    "లేదమ్మగారూ! ప్రమిదలో దీపమే" అనసూయమ్మవైపు చూస్తూ అంది లక్ష్మి.

 

    "ఎలా...?!" భార్యాభర్తలిద్దరూ ఒకేసారి అడిగారు.

 

    "ఉత్తినే చెప్తానేంటి... పందెం కడితే చెప్తాను... ఏం మాస్టారూ! పందెం కడతారా?"

 

    హుషారుగా అడిగింది లక్ష్మి.

 

    "దేవుడి దగ్గర దీపం వెలిగించడానికి పందెం ఏమిటే... చేతనైతే వెలిగించు" అంది అనసూయమ్మ.

 

    సుబ్బారెడ్డి లక్ష్మిని నశశిఖ పర్యంతరం చూశాడు.

 

    లక్ష్మిలో వయసు తెస్తున్న మార్పుల్ని గమనించాడాయన.

 

    పల్లె వీధుల్లో, పంటల్లేని పొలాల్లో లక్ష్మి ఒంటరిగా, అమాయకంగా తిరుగుతున్నప్పుడు-

 

    కుర్రాళ్ళందరూ ఆమె గుండెలవైపు, ఆబగా చూడడం, ఏదో మిషతో ఆమెను తాకడానికి ప్రయత్నించడం ఆయనకు తెల్సు.

 

    రెండు మూడుసార్లు తన భుజంమీద కండువాని ఇవ్వడానికి ప్రయత్నించాడు.

 

    ఆ కండువాని, తనకెందుకు మాస్టారు ఇస్తున్నాడో తెలియని లక్ష్మి-

 

    "మగాళ్ళ కండువా నాకెందుకు..." అని పరుగు పరుగున వెళ్ళిపోయేది.

 

    ఆ సంఘటన గుర్తుకొచ్చింది సుబ్బారెడ్డికి.

 

    మామూలుగా యిస్తే లక్ష్మి కండువాను తీసుకోదు. ఏదో కారణమ్మీద లక్ష్మికి ఆ కండువాని యివ్వాలని నిర్ణయించుకున్నాడాయన.

 

    లక్ష్మి అమాయకమైన ముఖంవైపు చూశాడాయన.

 

    'అలాగే లక్ష్మీ! దేవుడు దగ్గర దీపాన్ని, గంటసేపు ఆరకుండా నువ్వు వెలిగించాలి. వెలిగించావనుకో... నా కండువా నీకిస్తాను" అన్నాడాయన.

 

    నవ్వింది లక్ష్మి.

 

    "నాకెందుకది... పది రూపాయలిస్తారా? చెప్పండి... గంటసేపు ఏమిటి, ఆరుగంటలసేపు ఆరకుండా, ఆ దీపాన్ని నేను వెలిగిస్తాను" మరింత హుషారుగా అంది లక్ష్మి.

 

    "ఆరుగంటలసేపా..." మరింత ఆశ్చర్యంగా వుందాయనకు.

 

    "అవును పది రూపాయలిస్తారా? చెప్పండి..." రెట్టించింది లక్ష్మి.

 

    "ఇస్తాన్లే. వెలిగించు..." రాతి అరుగుమీద చతికిలబడుతూ అన్నాడాయన.

 

    మొదట విసుక్కున్నా, అనసూయమ్మ కు కూడా ఆశ్చర్యంగా వుంది ఈ పందెం.

 

    తను కూడా భర్త పక్కనే కూర్చుంది అనసూయమ్మ.

 

    "మరి వెలిగించు చూస్తావేం?" అన్నాడు సుబ్బారెడ్డి.

 

    'అయితే ఇక్కడే కూర్చోండి. ఇప్పుడే వస్తాను" మాటతో పాటు ఊళ్ళోకి పరుగుతీసింది లక్ష్మి.

 

    అయిదు నిమిషాల తర్వాత రొప్పుతూ, చేతిలో ఏదో సీసాతో వచ్చింది.

 

    నేరుగా గర్భగుడిలోకి అడుగుపెట్టింది.

 

    ప్రమిదలోని నూనెను కింద పారబోసి, వత్తుల్ని సరిచేసి, తన చేతిలో సీసాలోని ఆయిల్ ని ప్రమిదలో వేసి, వత్తుల్ని ఎగదోసి, సుబ్బారెడ్డి దగ్గరకొచ్చి, అగ్గిపెట్టె తీసుకుని వెలిగించింది.

 

    గాలి రివ్వు రివ్వుమని వీస్తోంది.

 

    అగ్గిపుల్ల వెలిగిస్తున్న లక్ష్మివైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇద్దరూ.

 

    అగ్గిపుల్లతో వత్తుల్ని వెలిగించింది.

 

    వత్తులు నెమ్మదిగా అంటుకున్నాయి. రాజుకున్నాయి. వత్తులు వెలుగుతున్నాయి.

 

    గాలి వీస్తూనే వుంది.

 

    దీపం వెలుగుతూనే వుంది. సుబ్బారెడ్డి గబుక్కున లేచి ముందుకెళ్ళాడు. అనసూయమ్మకు కూడా ఆ దృశ్యం వింతగా వుంది.

 

    "ఏమిటే! ఏమిటి... వేసావే ఆ ప్రమిదలో?" కాంతివైపు సంతోషంగా చూస్తూ అడిగింది అనసూయమ్మ.

 

    "ముందు పందెం డబ్బులివ్వండి... తర్వాత చెప్తాను" సుబ్బారెడ్డి పెదవుల మీద చిరునవ్వు కదలాడింది ఆ మాటకు.

 

    "ఇస్తాను... ఈ డబ్బుతో ఏం కొనుక్కుంటావ్?" జేబులో చెయ్యి పెడుతూ అడిగారాయన.

 

    జవాబు చెప్పడానికి తటపటాయించింది లక్ష్మి.

 

    నెమ్మదిగా ఆమె పెదవులు విచ్చుకున్నాయి.

 

    "బియ్యం అయ్యి, నాలుగురోజులైంది. పట్నానికెళ్ళి ఇవాళ కూడా రాలేదు..." బితుకు బితుకుగా చెప్పింది లక్ష్మి.

 Previous Page Next Page