వింతగా చూచింది నాంచారమ్మ.
"కాంచీపురంలో కాంచీపూర్ణుడనే భాగవతోత్తముడు ఉండేవారు. వారితో కంచి వరదరాజస్వామి సాక్షాత్తు మాట్లాడేవారట. కాంచీపూర్ణులు శతపద జాతికి చెందిన శూద్రులు. వారి మహిమ నెరిగిన రామానుజుడు వారిని గురువుగా వరించినారు. తాను శూద్రుడనని రామానుజుని శిష్యునిగా చేసుకోవటానికి కాంచీపూర్ణుడు అంగీకరించలేదు. రామానుజుడు ఒక ఉపాయం ఆలోచించినారు. రామానుజుడు కాంచీపూర్ణుని భోజనానికి పిలిచినారు. వారు వస్తామన్నారు. కాంచీపూర్ణుడు భోజనం చేసిన తరువాత వారి ఎంగిలి తిని పవిత్రం కావాలనుకున్నారు రామానుజులు.
కాంచీపూర్ణుడు భోజనానికి వచ్చేరోజు _ రామానుజుని భార్య తంజయమ్మ వంట చేసింది. ఎదురుచూచి ఎదురుచూచి కాంచీపూర్ణుల కోసం బయలుదేరినారు రామానుజులు. వేరే తోవన కాంచీపూర్ణుడు రామానుజుని ఇంటికి వచ్చారు. తంజయమ్మ వడ్డించగా భోంచేసి వెళ్ళిపోయారు కాంచీపూర్ణులు. తలమీదినుంచి స్నానంచేసి వస్తున్న తంజయమ్మ తిరిగి వస్తున్న రామానుజునికి కనిపించింది. కారణం అడిగితే "శూద్రునికి అన్నం పెట్టిన కాబట్టి స్నానం చేసి వస్తున్న" అని చెప్పింది.
రామానుజుడు చాలా బాధపడ్డారు. తంజయమ్మను ఎంతగానో దూషించిన్రు. ఇటువంటి ఇంకొక రెండు తప్పులు తంజయమ్మ చేసిన తరువాత భార్యను వదిలి రామానుజుడు సన్యాసం స్వీకరించిండు" అని చెప్పి "విన్నవా మనం రామానుజం కంటె ఎక్కువా?" అని అడిగారు.
నాంచారమ్మకు అర్థం అయింది రామానుజుడు భార్యను వదిలేశాడనేది. ఆమె భయపడ్డది! మరో ఆలోచన లేకుండా అనేసింది "గురువయ్య మంచోడు" అని.
నారాయణస్వామి చాలా సంతోషించారు.
"నాంచారూ, సత్యాన్ని గ్రహించటం కష్టం. గ్రహిస్తే అది మనను నడిపిస్తుంది. వెలుగు చూపుతుంది" అన్నారు.
నాంచారమ్మకు ఏమీ అర్థం కాలేదు అయినా తల వూపింది.
రామానుజుడు ఉపదేశం పొందింది తిరుక్కొట్టు నంబియారు వద్ద. ఆ నంబి పంచములు. రామానుజుడు పదిహేనుసార్లు నంబి దగ్గరకు తిరిగిన్రు. పద్దెనిమిదోసారి మంత్రం ఉపదేశించిన్రు. రహస్యంగా ఉంచమన్నరు. రామానుజుడు దాన్ని రహస్యంగ ఉంచిందనుకున్నవా? అక్కడ శ్రీరంగనాధుని ఉత్సవం జరుగుతున్నది. అన్ని కులాల జనులు అనేకులు అక్కడ చేరిన్రు. రామానుజులు ఆలోచించిన్రు. ఈ మంత్రం ఇంతమందికి మోక్షం కలుగజేస్తే నాకు నరకం వస్తే ఏం అనుకున్నరు. దేవాలయపు గోపురం ఎక్కిన్రు. "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరిని ఎలుగెత్తి అందరికి చాటిన్రు"
"ఆఁ, అట్ల చేసినాన్రుండి. అబ్బ ఎంత మహాత్ములు!" అన్నది నాంచారమ్మ. అది ఆమె మనసులోంచి వచ్చిన మాట.
"ఇంక విను. రామానుజుడు అట్ల ఉపదేశించిండని నంబికి తెలిసింది. కోపం వచ్చింది. రామానుజుని పిలిపించిన్రు."
"గురుని ఆజ్ఞ ఉల్లంఘించిన వారికి ఏగతి కలుగునో తెలియునా?" అని అడిగిన్రు నంబి.
"తెలుసును స్వామీ? రౌరవ నరకము కలుగును" అన్నారు రామానుజులు.
"అట్లయితే మంత్రం మందరికెందుకు ఉపదేశించినవు?" అని కోపంగా అడిగిన్రు నంబి.
"ఇంతమంది జనులు విముక్తులు కాగా నేనొక్కణ్ని నరకానికి పోతేనేమి?" అన్నారు రామానుజులు.
"అబ్బ! ఎంత గొప్పవారండి" అన్నది నాంచారమ్మ.
"రామానుజుని మాట విని నంబి కూడ నువ్వన్నట్లే అని రామానుజుని కౌగిలించుకొని__
"సద్గురుండవు నీవెపో జనులకెల్ల
మా కొరంతలు దీరె నీ మహిమ కతన." అని ముగించారు నారాయణస్వామి.
"అబ్బ ఎంత గొప్పవారండి రామానుజులవారు! నరకానికి పోతనని తెలిసి అందరికి ఉపదేశించిండు. మనం గురువయ్యకు సంస్కారం కలిగించాలెనండి" ఉత్సాహంగా అన్నది నాంచారమ్మ.
"పిచ్చిదానా! అసలు గురువయ్యే మన కండ్లు తెరిపించిండు. ఇంతకాలం మనం ఆలోచించినమా ఇవన్నీ?"
"అవునండి. ఎన్నడు చెప్పకపోతిరి ఇవన్ని. గురువయ్యను పిలిపించరాదుండి."
"పిలిపిస్త. నువ్వు వంట మరిచిపోయినవు. ఇవ్వాళ ఉపవాసమా?"
"అయ్యో! నా మతి మండ! మరిచేపోయిన. పోయి మడి'కట్టుకుంట" అని నాంచారమ్మ వెళ్ళిపోయింది.
నారాయణస్వామికి ఎంతో తేలిక అయినట్లయింది. గూట్లో వెలుగుతున్న దీపాన్ని చూస్తూ ఉండిపోయారు.
6
ఓరి మద్దెలకాడ! బహు వన్నెకాడ! నిను చూస్తే నా మనసు నిలువకున్నదిరా! నీళ్ళకు నేపోంగ నా వంక చూడకురా! నీవు చూస్తే కడవ నీట మునగదురా!
గురువయ్య తాటివనం నుంచి పదం పాడుకుంటూ పోతున్నాడు. పదం పిల్లగాలిలా ఉంది. పున్నమి వెన్నెల్లా వుంది. పిల్లకాలువలా సాగుతూంది.
పదం బాగనిపించింది నాంచారమ్మకు. బాగనిపించడం కంటే గురువయ్య గొంతు గుర్తుపట్టడం ఆమె సంబరం. భర్తను పిలిచి చెప్పింది. నారాయణస్వామి పరిగెత్తి వాకిట్లోకి వచ్చారు.
"నీవు చూస్తే కడవ నీట మునగదురా" పాడుతూ సాగిపోతున్నాడు గురువయ్య.
"గురువయ్య" పిలిచారు నారాయణస్వామి.
గురువయ్య వినిపించుకోలేదు. సాగిపోతున్నాడు.
మళ్ళీ పిలిచారు నారాయణస్వామి. అప్పటికి నాంచారమ్మ కూడా వచ్చేసింది.
గురువయ్య వెనక్కు తిరిగి చూశాడు.
"నన్నా నుండి పిలిచింది?" అడిగాడు దూరంగా నుంచునే.
"అవును నిన్నే" నారాయణస్వామి.
గురువయ్య దగ్గరికొచ్చి "కాల్మొక్త గుర్విగా, గురువా అని పిలుస్తరుండి నన్ను. గురువయ్యా అని పిలిస్తే ఎవరినో అనుకున్న చెప్పండి అయ్యగారు ఏమన్న పనున్నదా?" అడిగాడు.
"ఎందుకో వస్తివి?" నాంచారమ్మ.
"ఆఁ గప్పుడా.... ఏదో వచ్చినంలేరి. కోమటాయన కోప్పడె.... పోతిమి.... మల్లెందుకులేరి. ఏమన్న పనుంటె చెప్పండి."
"గురువయ్యా! నీతోని పనుంటెనే వస్తవా? మాతో పనుండి రావా? ఎంత మంచోనివయ్యా!" నారాయణస్వామి ఎంతో మెత్తగా అన్నారు.
"అయ్యగారూ! ఎంత మంచోరుండి మీరు! నన్ను గురువయ్య అన్నరు. మంచోడన్నరు. కాల్మొక్త మీ కాళ్ళకాడ పరుండెటోల్లం. అనకుండి. అట్లనకుండి. ఎట్టి చేయించుకున్నోడు తన్నులు తన్నిండు గని ఇట్లనలేదుండి. మీరు దేవుళ్ళండి. అయ్యగారు, అమ్మగారు మేం మనుసుల మానుండి! పురుగులోలె బతుకుతున్నం. నీ కాల్మొక్త. నీ కడుపున పుడ్త" అన్న గురువయ్య నేలకు తల ఆనించి దూరంనుంచే కాళ్ళు పట్టుకున్నట్లు చేసి, మూడుసార్లు మొక్కాడు.
నారాయణస్వామి కరిగిపోయారు. నాంచారమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి!