కౌశికుడు ఒక బ్రాహ్మణుడు. అతడు ఒక మంచి గ్రామమున నివాస మేర్పరచుకొనెను. ఒకనాడు అతడు ఒక చెట్టుక్రింద కూర్చొని వేదములు గుణించుచుండెను. ఆ చెట్టుపైనున్న కొక్కెర అతనిపై రెట్ట పెట్టెను. కౌశికునికి కోపము వచ్చెను. అతడా కొంగను చూచెను. కొంగ భస్మమై కూలెను. అందుకతడు చాలా చింతించెను.
అప్పటికి మధ్యాహ్నమాయెను. అతడు భిక్షకు బయలుదేరెను. ఒక బ్రాహ్మణి ఇంటికి చేరెను. 'భిక్షాందేహి' అని వాకిట నిలిచెను. ఆ బ్రాహ్మణి భిక్షాపాత్రను కడుగుచుండగా, ఆమె భర్త వచ్చెను. ఆమె భర్తకు భోజనము చేయించి, పరుండ బెట్టి భిక్షాపాత్రతో బయటికి వచ్చెను. అమ్మగువం జూచి కౌశికుండు రొషరంజిత లోచనుండగుచు, అడిగినప్పుడు పెట్టక ఇంత ఆలశ్యమేల జేసితివి అని అడిగెను. అందుకా బ్రాహ్మణి భర్తృశుశ్రూష వలన ఆలస్యమయినదని చెప్పి, "నీవతి క్రోధుండవగుటయు నెరుంగుదు. నీ కోపంబున నొక్క కొక్కెర నిహతంబయ్యెగాదె అని నీవు కేవల స్వాధ్యాయపరుండవుగాని ధర్మసూక్ష్మత మెరుంగవు గావున మిథిలా నగరమ్మునందలి ధర్మవ్యాధుని కడకేగుము" అనెను.
"ఇచ్చట మనమొక విషయము గమనించవలెను. ధర్మసూక్ష్మము నెరిగిన కిరాతుడు స్వాధ్యాయపరునకన్న మిన్నయని వ్యాసుడు చెప్పుచున్నాడు" అన్నారు స్వామి.
"అయ్యగారూ! మల్ల బాపనాయన కటికోని దగ్గరికి పాయెనా?" అడిగాడు రామకిష్టయ్య.
కౌశికుడు మిథిలా నగరమునకేగెను. ధర్మవ్యాధుని మాంసశాలకేగెను. అల్ప మృగ మాంసఖండంబు లంగడిం బచరించి యమ్ముచున్న వాని ననవరత విక్రయాత గజన సమాతృతు నక్కిరాతుంగని యతిజు గుప్సితంబయిన సూనాపణంబు సేరనొల్లక తొలంగి యొక్క యెడ నుండెనంత, ధర్మవ్యాధుడు బ్రాహ్మణుని రాక నెరింగెను. అతడే దిగివచ్చి, కౌశికునకు మ్రొక్కి "మిమ్ము బ్రాహ్మణి పంపినదిగదా రండు" అని ఇంటికి తీసుకొని వెళ్ళెను. కటికవాడు బ్రాహ్మణునకు అనేక ధర్మములు బోధించెను. తరువాత ఇంటిలోనికి తీసుకునిపోయి ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను, తాను వారిని పూజించుచున్న విధమును వివరించి "నీకు వృద్దులయిన తల్లిదండ్రులున్నారు. నీకై వగచి వగచీ వారి కన్నులు పోయినవి. నీవు తప్ప వారికి దిక్కులేదు. నీవు వారిని విడిచినావు. సదాధ్యయనశీలుడవయినావు. అది ధర్మము కాదు.
నీ యధ్యయనమ్మును సుకృ
తాయాసము నిష్పలంబులై చను గురుసే
వాయుక్తిలేక తక్కిన
జేయుము నా పలుకు మేలు సేకురు నీకున్."
అందుకు కౌశికుడు తను చేసిన తప్పును తెలుసుకొని "నా పాలిటి వేల్పు నీవు" అని ధర్మవ్యాధుని కొనియాడి "నిను నొక శూద్రుగా దలప నేర గుణాకర నీ చరిత్రముంగన మది నద్భుతం బొలసె" అని వానికిం బ్రదక్షిణంబు సేసి వీడ్కొని చని కౌశికుండు నిజ జననీ జనకుల కతి భక్తి శుశ్రూష సేసి కృతార్దుండయ్యె."
"మంగళం కోసలేంద్రాయ" అని మంగళహారతి ఇచ్చి ముగించారు స్వామి. రామకిష్టయ్య తెచ్చిన నువ్వులూ, బెల్లం అందరికీ పంచింతరవాత రామకిష్టయ్య అడిగాడు.
"అయ్యగారూ! అంటరుగని కటికోడు కటికోడే, బాపనాయన బాపనాయనే! వాడు ఈనకెట్ల నీతుల్సెప్పిండుండి? అందుకే అన్నరేమో రామాయణం రంకని భారతం బొంకని. అంత ఎట్లనో ఉన్నదుండి. నాకయితె నమ్మకం కలుగుతలేదు."
నారాయణస్వామి కళ్ళద్దాలు తీసి పుస్తకం మీద పెట్టి కళ్ళు నలుచుకొని "రామకిష్టయ్యా! ధర్మం అన్నిటికంటె గొప్పదయ్యా! కులాలు, అధ్యయనం దానికింద పనికిరావు. ధర్మాన్ని ఆచరించినవాడు ధర్మవ్యాధుడు. ధర్మాన్ని వదులుకున్నవాడు కౌశికుడు. అందువల్ల వ్యాధుడు కౌశికుణ్ణి మించిపోయినాడు. భారతంలో ఉన్నది గదనయ్యా.
పాపవర్తనుండు బ్రాహ్మనుండయ్యును
నిజము శూద్రునికంటె నీచతముడు
సత్య శౌచధర్మశాలి శూద్రుండయ్యు
నతడు సద్విజుండ యనిరి మునులు."
నారాయణస్వామి పద్యం పూర్తిచేయకుండానే లచ్చమ్మ గురువయ్య ప్రవేశించి "కాల్మొక్త అయ్యగారూ" అని అక్కడే నేలవంటి దండాలు పెట్టారు.
వారిని చూసి రామకిష్టయ్య మండిపడ్డాడు.
"ఒరే! మాలమాదుగులు అయ్యోర్లిండ్లకొస్తె ఇగ బాగుపడ్డట్టె, పొగరెక్కిందిర గాడ్దికొడుకులకు. బుక్కెటందుకు బువ్వండెటార్కల్ల ఎగిరిపడ్తాండ్రు, ఇంక నిలబడ్డ రేమిరో! పొమ్మంటె పోవేమిర గాడ్దికొడక! పోతవమల్ల...." అని లేచి నుంచున్నాడు. అక్కడున్న వాళ్ళంతా లేచి నుంచున్నారు. గురువయ్యమీదికి యుద్ధానికే సన్నద్ధులైనారు.
"ఎరకలేకొచ్చినం బాంచెను. పోతంలేరి. మీరెందుకు కోపడ్తరు" అని లచ్చమ్మ గురువయ్యను లాక్కొని వెళ్ళిపోయింది.
"పాపం ఎందుకోసరం...." నారాయణస్వామి మాట పూర్తిచేయకుండానే అందుకున్నాడు రామకిష్టయ్య.
"అయ్యగారూ ఇగో చెప్తాన్న, పురాణాల్ల ఏమన్న ఉండనియ్యండి. మాలోండ్లు మాలోండ్లే, మనం మనమే. మల్ల మాలోణ్ని బాపనోణ్ణి చేస్తమంటరా? ఇగ మీరున్నరు. మేమున్నం." అని లేచి వెళ్ళిపోయాడు రామకిష్టయ్య. మిగతావారు రామకిష్టయ్యను అనుసరించారు.
స్వామి వాకిలిదాకా వెళ్ళి వాళ్ళు వెళ్ళినవైపే చూస్తూ నుంచున్నారు.
నాంచారమ్మ వ్యాసపీఠం, గంథం, కళ్ళద్దాలు తీసి వంటింట్లో తన పనిలో మునిగిపోయింది.
నారాయణస్వామి వాకిట్లో చాలాసేపు నుంచున్నారు. వారికి పరిపరి విధాల ఆలోచనలు వచ్చాయి. ఎందుకు వచ్చాడో గురువయ్య! భార్యతో కూడా వచ్చాడు! ఏదో పని ఉండే వచ్చి ఉంటాడు. రామకిష్టయ్య ఎలా ప్రవర్తించాడు! పురుగును నెట్టినట్లు నెట్టేశాడు. గురువయ్య పాపం ఒక్క మాట అనలేదు. వెళ్ళిపోయాడు. ఏం తప్పు చేశాడతను? అతడు అంటరానివాడు. ఇంట్లోకి వచ్చాడు. అది తప్పే కావచ్చు. గురువయ్య విషయంలో అది సమంజసమా! అతడు తన ప్రాణం కాపాడాడు. ఎంత పరోపకారి!
ఇలాంటివే అనేక ఆలోచనలు వచ్చాయి. ఏమేమో ఆలోచించారు. అక్కణ్ణుంచి వంటింట్లోకి వెళ్ళి నాంచారమ్మ పక్కన కూర్చొని "నాంచారూ! పాపం గురువయ్యను ఎట్ల కసిరిండు రామకిష్టయ్య! ఏం పని మీద వచ్చిండో పాపం!" అన్నారు.
నాంచారమ్మ ఆశ్చర్యపోయింది. నారాయణస్వామి అలా ఎన్నడూ ఆమెను ఏ విషయంలోనూ అడగలేదు. నాంచారమ్మ ఒక్కసారి నారాయణస్వామి కళ్ళల్లోకి చూచింది. ఆవేదన కనిపించింది. ఎన్నడూ దేని గురించీ లక్ష్యం చేయని స్వామికి ఈ ఆవేదన ఏమిటి! స్వామిలో ఏదో భయంకరమయిన మార్పు వస్తూంది అనుకుంది. ఆమెకు ఎందుకో గుబులు పుట్టింది. ఏమనాలో ఆమెకు అర్థం కాలేదు.
"మీరు చెప్పింది భారతంలో ఉన్నదా?" అనాలోచితంగా అడిగేసింది నాంచారమ్మ.
ఎవరో వీపుమీద కొట్టినట్లయింది నారాయణస్వామికి.
"నాంచారూ? నమ్మకంలేదా నామీద! లేనిది ఎందుకు చెపుతాను? జ్ఞానం ప్రధానం నాంచారూ! దీపానికి ప్రాధాన్యం వెలుగు కదా? జ్ఞానం మనిషికి ప్రాధాన్యం. జ్ఞానంలేని బ్రాహ్మణునికంటే జ్ఞానం ఉన్న మాలడు మేలు."
"దేవుని ఇంట్లో అట్లాంటి మాటలనకండి."
"వెర్రిదానా ఇట్లరా" అని ఆమెను తీసుకొనివచ్చి బల్లపీటమీద కూర్చుండపెట్టి గ్రంథం తెచ్చారు. "విను మన యతిరాజులు ఉన్నరే ఎవరు? రామానుజులు వారే శూద్రులను ఆశ్రయించారే!"