మనసున్న వాని మనుగడ కష్టం. అన్నింటికీ ఏడుస్తాడతడు. అంతకంటే ఏం చేయలేడు గనుక!
"గురువయ్యా! నిజంగా నువ్వు మంచోనివి. ఒకరికి ఉపకారం చేస్తవు. ఒకరి నుంచి ఉపకారం కోరవు. అంతకంటే ఏంకావలె గురువయ్యా!" నారాయణస్వామి మాటల్లో తడి కనిపించింది.
"అట్లనకండి అయ్యగారూ! అనకండి, బాంచోల్లం మేం, చాకిరి చేసేటందుకే పుట్టినం గులాపోల్లం. చెప్పున్రి ఏం పనున్నదో. నా చర్మం వలిచి చెప్పులు కుట్టనా?"
"వద్దు గురువయ్యా వద్దు. ఇప్పటికే చాలా చేసినవు."
"మల్ల ఎందుకో పిలిస్తిరి?"
"ఎందుకో వస్తివి?"
"అట్లంటరా! మాలచ్చి కెరకనుండి. పొద్గాల తీసుకొస్త. కాల్మొక్త."
ఇప్పుడే రమ్మందామనుకున్నారు నారాయణస్వామి. రామకిష్టయ్య కోపం గుర్తుకువచ్చి, అవును రామకిష్టయ్య గుప్పిట్లో అందరి ప్రాణాలూ ఉన్నాయి! అతని డబ్బు ముందు ఇతని పాండిత్యం ఎంత? అయినా ఆ మాట అనలేదు స్వామి. "అట్లనేలే. తప్పకరా" అన్నారు__గురువయ్య తాగి ఉన్నాడని గ్రహించి అన్నమాట అది.
"అట్లనే వస్త" అని దండంపెట్టి వెళ్ళిపోయాడు గురువయ్య.
"ఇంత మంచివాళ్ళకు పంచములుగా ఎందుకు సృష్టించిందండి దేవుడు?" భర్తనడిగింది నాంచారమ్మ.
నారాయణస్వామి భార్య కళ్ళల్లోకి చూచాడు. ప్రశ్నలు కనిపిస్తున్నాయి ఆమె కళ్ళలో. నారాయణస్వామి మెదడు సమాధానాల కోసం వెతికింది. దొరకలేదు.
"ఖర్మ" అన్నాడాయన.
"అంతేనా?" అని మాత్రం అంది నాంచారమ్మ.
"మంచియన్నది మాలయయితే మాలనే యగుదున్" అన్న గురజాడ వారికి తెలియదు.
తెల్లవారి గురువయ్య లచ్చమ్మను తీసుకుని వచ్చాడు. స్వామిని పిలిచాడు వసారాకు దూరంగా నుంచొని. స్వామి వచ్చారు.
"దండం పెట్టె అయ్యగారికి. దేవునంటోరు" అన్నాడు లచ్చమ్మతో. ఇద్దరూ నేలనంటి నమస్కరించారు. ఇంతలో నాంచారమ్మ కూడా వచ్చేసింది.
"ఏం లచ్చమ్మా! చెప్పకపోతివి" అడిగారు నారాయణస్వామి.
"పామును చంపిండండి...." అని మొదలుపెట్టి యావత్తు కథ చెప్పేసింది.
ఆ కథకూ వీళ్ళు రావడానికి నిమిత్తం ఏమిటో అర్థంకాలేదు స్వామికి. తరవాత కథ చెప్పమన్నట్లుగా గురువయ్యను మోచేత్తో పొడిచింది లచ్చమ్మ.
"ఏంలేదండి పామును చంపితే పోరలు బతకరటగద. గుబులు పడ్తాంది లచ్చి. లచ్చి నీలుపోసుకున్నదండి" తలవంచి సిగ్గుగా వేళ్ళు విరుచుకుంటూ చెప్పాడు గురువయ్య.
లచ్చమ్మ ముఖం జేవురించింది.
నాంచారమ్మ ముచ్చటగా లచ్చమ్మను చూచింది. ఆమెకు ఎందుకో చెప్పరాని ఆనందం కలిగింది. లచ్చమ్మ తల్లి కాబోతూంది. ఆ మాటే ఆమె మనసును పొంగించింది.
"పామునెందుకు చంపితివి గురువయ్యా!" ఎంతో సానుతాపంతో అడిగింది నాంచారమ్మ.
"నా కెరకానుండి, కోంటాయన చంపమన్నడు. చంపిన. పడగ మీద కొట్టిన్నుండి. చితికి నెత్తురు కారింది. అబ్బ అది తల్చుకుంటేనే వళ్లు వణుకుతాంది. నేను చంపలేదు బాంచెను. కోంటాయన చంపించిండు. చెప్పురి పోరలు నిజంగానే బతకరా!" అప్పుడే పామును చంపినట్లు వణికిపోతున్నాడు గురువయ్య. లచ్చమ్మ ముఖంలో సైతం భయం స్పష్టంగా కనిపిస్తూంది.
"చంపించినోడు ఒకడయితే పాపం గురువయ్యనెందుకు చుట్టుకుంటుందండి" ఆతురతగా అడిగింది నాంచారమ్మ.
గంభీరంగా ఆలోచిస్తున్నారు నారాయణస్వామి. తనకు రానున్న ఆపదను కూడా తెలుసుకోకుండా పామును చంపాడు గురువయ్య. దెబ్బ సరిగ్గాపడి ఉండకపోతే గురువయ్యే చావవలసినవాడు. దైవ సంకల్పం వల్ల గురువయ్య బతికాడు. పుట్టనున్న బిడ్డకు కలుగనున్న ప్రమాదం గురించి ఆలుమగలు అలమటిస్తున్నారు. చంపించింది రామకిష్టయ్య. తన భద్రత కోసం. తన ప్రాణాల కోసం. చంపినవాడు గురువయ్య. చంపింది స్వార్థంతో కాదు. పరులకోసం! అయినా రామకిష్టయ్యను ఒక్క మాట అనడంలేదు గురువయ్య! మరి రామకిష్టయ్యో? అమాయకంగా నా ఇంట్లో అడుగు పెట్టినందుకు గురువయ్యను నానా దుర్భాషలాడాడు. ఎంత కృతఘ్నుడు రామకిష్టయ్య! అనుకున్నారు. తరువాత భార్యతో అన్నారు.
"నాంచారూ! కర్తా కారయితాచైవ....! పాపం చేయించినవాడికి, చేసినవానికి చెందుతుంది. ఇద్దరూ అనుభవించవలసిందే."
"అయితే నేను పాపం చేసినట్లేనా అయ్యగారూ! దానికి ఉపాయం లేదా నుండి" ధీనంగా అడిగాడు గురువయ్య.
"పోరలు బతికే ఉపాయం చూడుండి. కాల్మొక్త. చచ్చి మీ కడుపున పుడ్త" మాతృ హృదయం కృశించింది. ఏడుస్తూనే అన్నది లచ్చమ్మ.
"అయ్యా! ఏదన్నా ప్రాయశ్చిత్తం చెప్పండి. చూడండి పాపం ఆ పిల్ల ఎట్ల ఏడుస్తున్నదో" అని భర్తతో అన్న నాంచారమ్మ "లచ్చమ్మా! ఏడవకు దేవుడు నిన్ను రక్షిస్తడు. గుమ్మడి పండంటి కొడుకు పుడ్తడు" అన్నది.
ఆశగా చూచారు ఆలుమగలు.
"గురువయ్యా! పుట్టలో పాలుపోయించు లచ్చమ్మతో. పాలు తెస్తే మంత్రించి ఇస్త. పాపం దూరం అయిపోతుంది. పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్తడు."
"అట్ల చెప్పురి కాల్మొక్త. ఇప్పుడే తెద్దునా పాలు!" అడిగాడు గురువయ్య.
లచ్చమ్మ ముఖం వికసించింది.
"పాలు వాండ్లెక్కడ తెస్తరండి. నేను పోస్తలే గురువయ్యా! నెలకొక్కసారి పోయి పుట్టకు పాలు" నాంచారమ్మ అన్నది.
"అయితే పోయ్రి" అన్నాడు గురువయ్య.
"అట్లకాదు గురువయ్యా. ఇద్దరూ స్నానాలు చేసి శుచిగా రాండి" నారాయణ స్వామి.
"అట్లనే లేన్రి" అని బయల్దేరిన గురువయ్య నాపి లచ్చమ్మ "రేపు పొద్గాల వస్తముండి_బట్టలు ఉతికి ఎండేసుకోవలెగద" అన్నది ఉన్నవి వంటిమీద బట్టలేననే విషయం సూచిస్తూ.
నాంచారమ్మ హృదయం ద్రవించింది. "ఉండండి" అని గురువయ్య దంపతులను ఆపి లోపలనుండి ఒక దోవతి, చీర తెచ్చి వాళ్ళమీదికి విసిరివేసి "ఇవ్వి కట్టుకొని పాలు పొయ్యండి" అన్నది.
నాంచారమ్మ ఔదార్యాన్ని ఆశ్చర్యంగా చూచారు నారాయణస్వామి.
"కట్టుకుంటరు పాపం బట్టలన్న లేవట" వ్యధ నిండిన గొంతుతో అన్నది.
బట్టలందుకున్న గురువయ్య దంపతులు మూర్తీభవించిన కృతజ్ఞతా రూపాలుగా చేతులు నేలకానించి దండంపెట్టి వెళ్ళిపోయారు.
"మీరు మంత్రాలెప్పుడు నేర్చిన్రు!" అడిగింది నాంచారమ్మ_ఆ మాటల్లో వెక్కిరింపు ధ్వనించింది.
"నాకు మంత్రాలు రావు నాంచారు. శ్రీమన్నారాయణుడు ఒక్కడే దేవుడు. తిరుమంత్రం ఒక్కటే మంత్రం. అది నా విశ్వాసం. గురువయ్య చేసిన పాపానికి వణికిపోతున్నాడు, ఏదో ఒకటి చేయకుంటే అతనికి తృప్తి లేదు. అందుకే పాలుపొయ్యమన్న, మంత్రించిన పాలంటే మరింత నమ్మకం కలుగవచ్చు."
"అబ్బ ఎన్ని మాటలు నేర్చిన్రండి" అని బిందె తీసుకొని చెరువుకు వెళ్ళిపోయింది నాంచారమ్మ. చిన్న పంచె తీసుకొని ఏటికి వెళ్ళిపోయారు నారాయణస్వామి.
నారాయణస్వామి, నాంచారమ్మ ఇంటికి వచ్చి తమ కార్యక్రమాలు పూర్తిచేసుకునేవరకు గురువయ్యా, లచ్చమ్మా మంచి బట్టల్తో ప్రత్యక్షమైనారు. నొసట కుంకుమ, విరియబోసుకొని ఉన్న తడి వెంట్రుకలతో లచ్చమ్మ ముద్దుగా కనిపించింది నాంచారమ్మకు.
"పాలు మంత్రించిన 'రామ రామ' అంటూ పుట్టలో పోయండి" అన్నారు నారాయణస్వామి.
"అయ్యగారూ! ఒక్క మాట, కాల్మొక్త. మీరు కూడా ఆడిదాక వచ్చి మంత్రం చదువుతే బాగుండు నంటున్నది లచ్చి" దీనంగా వేడుకున్నట్లు అన్నాడు గురువయ్య.
ఇరకాటంలో పడ్డారు నారాయణస్వామి. వారికి రామకిష్టయ్య గుర్తుకు వచ్చారు. అతడు తమ ముందు రక్కసిలా నుంచుని అటకాయిస్తున్నట్లనిపించింది. అది కాకుంటే వారికి అడ్డంకి ఏమీలేదు. ఆలోచించి అన్నారు. "పాలు మంత్రించినవే పుట్టలో పోస్తే సరిపోతుంది."
లచ్చమ్మ చిన్నబుచ్చుకుంది. "వస్తెనే మంచిది బాంచెను__ పోరలు బతుకుతరు."
"వెళ్ళిరారాదండి ఏం బోయింది_దూరంలో వుండి మంత్రం చెప్పండి" నాంచారమ్మ బ్రతిమాలినట్లుగా అంది.
తప్పలేదు నారాయణస్వామికి. మెడలో తులసిమాలతోనే బయల్దేరాడు.
వారు వెళ్ళేప్పుడు లచ్చమ్మతో "పోయేటప్పుడు రా చింతకాయపచ్చడి పెడ్తా. పుల్లటిది తినాల్నని ఉంటదిగద!" అన్నది నాంచారమ్మ.
లచ్చమ్మ ముఖం చేటంత అయింది.
అలా ఏర్పడ్డ పరిచయం నానాటికి పెరగసాగింది. లచ్చమ్మ ప్రతిరోజూ నాంచారమ్మ దగ్గరికి వచ్చేది. పచ్చళ్ళు, ఊరగాయలు, కూరలు ఏదో ఒకటి పెడ్తూనే ఉండేది నాంచారమ్మ. లచ్చమ్మ కడుపు పెరుగుతుంటే నాంచారమ్మకు సంతోషంగా వుండేది. లచ్చమ్మ తన ఇంటి విషయాలన్నీ నాంచారమ్మతో చెప్పుకునేది. నాంచారమ్మకు చెప్పుకోవలసిందేమీ లేనందుకు విచారంగా ఉండేది.
గురువయ్య అప్పుడప్పుడు నారాయణస్వామికి కనిపిస్తుండేవాడు. కట్టె పుల్లలు కొట్టడమో, గడ్డిమోపు తేవడమో, తప్పిపోయిన బర్రెను పట్టుకురావడమో చేస్తుండేవాడు. గురువయ్య ఎన్నడూ ఏది అడగలేదు_ నారాయణస్వామి ఇస్తే తీసుకోలేదు.
వారి పరిచయాన్ని ఊరు వింతగా చూచింది.
7
పుట్టకు పాలు పోయించిన్నాటి సాయంకాలం మామూలుగా పురాణం వినడానికి వచ్చాడు రామకిష్టయ్య. రామకిష్టయ్యకు జరిగిన సంగతి తెలిసింది. అయినా అతడు ప్రత్యక్షంగా స్వామిని అడగలేదు.