Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 9

నాలుగు కిలోమీటర్లు వెళ్ళాక, కారు ఆపాడు సందీప్.
"దిగు ఫ్రెండ్! ఇక్కడ నుంచీ మన దారులు వేరవుతాయి" అన్నాడు సెంట్రీతో.
దిగ్భ్రమ నుండీ ఇంకా తేరుకోని సెంట్రీ కిందకు దిగి నిలబడ్డాడు. కారు మళ్ళీ కదిలి, తూర్పు దిశగా వెళ్ళిపోయింది.
వెనక్కి తిరిగి కాళ్ళీడ్చుకుంటూ నడవడం మొదలుపెట్టాడు సెంట్రీ.
ఒక కిలోమీటరు నడిచిన తర్వాత అతనికి ఒక లారీలో గిఫు దొరికింది.
కానీ ఆ లారీలోనే సందీప్ ఇందాక వెళ్ళిన డొక్కు కారు వుందని తెలియదు అతనికి. ఆ లారీలోనుంచీ దింపిన ఒక జీపులో సందీప్, భూతాలరాజూ పారిపోయారు. వాళ్ళు వదిలి వెళ్ళిన డొక్కుకారుని తీసుకుని వెనక్కు వస్తోంది లారీ.
లారీ డ్రైవరు సెంట్రీని ఊరి శివార్లలో ఒక బస్టాపు దగ్గర దింపాడు. తర్వాత సరాసరి తుక్కు ఇనుము అమ్మే షాపు ముందు ఆగింది లారీ. ఒక పెద్ద చెక్కను లారీలో నుంచీ నేలమీదకు ఏటవాలుగా జార్చారు. డొక్కు కారు దానిమీద నుండి కిందకు దిగింది. అరడజను మంది మెకానిక్కులు త్వరత్వరగా పనిచేస్తూ దానిలోని ఇంజను విప్పేసి, లోపలికి పట్టుకెళ్ళిపోయారు. పదిమంది కలిసి కారుని దొర్లించి వెల్లకిలా పడేశారు.
ఈ పని అంతా సరిగ్గా పది నిమిషాల్లో ముగిసింది.అప్పటికే ఇరవై కిలోమీటర్ల దూరం జీపులో వెళ్ళిపోయాడు సందీప్, భూతాలరాజూ.
నురగలు కక్కుతూ పోలీస్ కంట్రోల్ రూం చేరుకున్నాడు సెంట్రీ. డ్యూటీలో ఉన్న ఆఫీసరు దగ్గర వెళ్ళి, సెల్యూట్ చేసి, రిపోర్టు చెయ్యడం మొదలెట్టాడు.
"ఇద్దరు ఖైదీలు పారిపోయారు సార్ !"
"ఆయాసం తీర్చుకో! వివరంగా చెప్పు" అన్నాడు ఆఫీసరు.
"ఒక ఖైదీది కన్ను ఊడిపడి పోయింది సార్! వెళ్ళి తెచ్చుకోమని చెప్పాను. అప్పుడు వాడు డైనమైట్ పేల్చాడు."
ఆఫీసర్ చిత్రంగా చూశాడు.
"కన్ను ఊడిపోతే వెళ్ళి తెచ్చుకోమని చెప్పావా?"
"అవున్సార్! అప్పుడు వాళ్ళు నన్ను వ్యాన్ లో వేసుకుని ఒక తుక్కు సామానుల షాపుకి తీసుకెళ్ళి అక్కడ ఒక డొక్కు కారు ఎక్కి పారిపోయారు సార్!"
ఎగాదిగా చూశాడు ఆఫీసర్.
"కారు నెంబరేమిటి?"
"నెంబరు ప్లేటు లేదు సార్ దానికి! మడ్ గారూ, తలుపులూ, లైట్లూ ఏమీ ఉన్నట్లు లేవు!"
"ఇంజను అన్నా ఉందా?" అన్నాడు ఆఫీసర్ వ్యంగ్యంగా.
"ఉండే ఉండాలి సార్ ! కారు స్టార్టు అయి నడిచింది."
అపనమ్మకంగా చూస్తూ లేచి నిలబడ్డాడు ఆఫీసర్. "కమాన్."
పోలీసు జీపులో ఎక్కి పావుగంట తర్వాత రద్దీ అమ్మే షాపు చేరుకున్నారు.
"ఆ కారే సార్ !" అన్నాడు సెంట్రీ, చచ్చిపోయిన బొద్దింకలా వెల్లికిలా పడివున్న కారుని చూపిస్తూ.
అనుమానంగా దగ్గరికి వెళ్ళి చూశాడు ఆఫీసర్. ఇప్పుడు దానిలో సీట్లుకూడా లేవు. ఉత్త డొల్ల.
 సెంట్రీవైపు సానుభూతిగా చూశాడు ఆఫీసర్. 'పాపం ! ఏదో షాక్ వల్ల ఇతనికి మతి స్థిమితం తప్పినట్లుంది' అనుకుంటూ హాస్పిటల్ వైపు పోనిచ్చాడు జీపుని.

                                           ముంతపొగ

జీపుని ఒక పాత ఇంటిముందు ఆపాడు సందీప్. ఇంటిముందు అంతా దట్టంగా బ్రహ్మజెముడు మొక్కలు మొలిచి వున్నాయి. ఒక్కగది తప్ప మిగతా ఇల్లంతా పడిపోయింది.
గది తలుపులు తెరిచాడు. కిర్రుమని భారంగా శబ్దం చేస్తూ తెరుచుకున్నాయి అవి. ఒంటి దూలం వుంది కప్పుకి. దానికి ఒక కొక్కెం వుంది. ఆ కొక్కానికి వేలాడుతోంది ఒక కొబ్బరితాడు.

 Previous Page Next Page