Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 10

సరిగ్గా ఆ దూలం కింద ఎరుపు పసుపు రంగుతో ఒక ముగ్గువేసి వుంది. దాని మధ్య ఒక కుంపటి పెట్టి వుంది.
"ఏమిటిదంతా?" అన్నాడు భూతాలరాజు, భయంగా ఒక అడుగు వెనక్కి వేస్తూ. "నువ్వు చేతబడులూ అవీ చేస్తావేమిటి?"
"చేతబడిలాంటిదే మా బడిలో జరిగిన సంఘటన చెబుతాను. చిన్నప్పుడు ఒక పల్లెటూళ్ళో చదువుకున్నాను నేను. మహా కర్కోటకుడయిన మేష్టారు ఒకయాన ఉండేవాడు మాకు. చిన్నచిన్న తప్పులకి కూడా పెద్దపెద్ద శిక్షలు వేసేవాడు. ఆయనకి అత్యంత ప్రీతి పాత్రమైన శిక్షలు రెండు ఉండేవి. 'ఒకటి కోదండం. అంటే ఇది.' అంటూ ఒక్క చేతితో భూతాల రాజుని తలక్రిందులుగా ఎత్తి అతని కాళ్ళకి కొబ్బరితాడుని బంధంలా బిగించి లాగాడు సందీప్ భూతాలరాజు గబ్బిలంలా వేలాడాడు.
"ఏమిటీ దౌర్జన్యం ?" అన్నాడు భూతాలరాజు ఊపిరి అందాక.
అది పట్టించుకోకుండా, "రెండోశిక్ష ముంత పొగ' అని కుంపట్లో కాస్త కిరోసిన్ ఒంపి, లైటర్ తో వెలిగించి గుప్పెడు మిరపకాయలు కుంపట్లో పోశాడు సందీప్. ఘాటుగా పొగ పైకిలేచింది. చటుక్కున బయటికి వచ్చేసి తలుపులు బిగించాడు. లోపల భూతాలరాజుకి కొరబోయి, విపరీతంగా దగ్గడం వినబడుతోంది.  
 అయిదు నిమిషాలు గడిచాక తలుపులు తీసి లోపలికి వెళ్ళాడు సందీప్. భూతాలరాజు కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రబడి వున్నాయి. ముక్కులో నుంచీ, కళ్ళలోనుంచీ ఏకధారగా నీళ్ళు కారుతున్నాయి.
"చిన్నప్పుడు మా మేష్టారు ఈ కోదండం, ముంతపొగా అనే శిక్షలు విధించి, దెయ్యపు పిల్లలు లాంటి గడుగ్గాయిలను గూడా దారిలోకి తెచ్చేవాడు. ఏం భూతాలరాజూ! దయ్యం వదిలిందా ? ఇంకాసిని మిరపకాయలు వెయ్యమంటావా ?" అన్నాడు సందీప్.
జంతువులా మూలిగాడు భూతాలరాజు.
తాడు వదులుచేసి, భూతాలరాజుని కిందకు దింపాడు సందీప్. షర్టుతో కళ్ళు, మొహం తుడుచుకున్నాడు రాజు.
"చెప్పు" అన్నాడు సందీప్.
బక్క కోపంతో ఊగిపోయాడు భూతాలరాజు. "నీ ఖర్మ! ఆ విగ్రహానికి నిజంగానే మహిమ ఉంది. దాని దగ్గరికి వెళ్ళినవాళ్ళు కుక్కచావు చస్తారు. చావంటే నీకు మోజుగా ఉందేమోగానీ నాకులేదు. నన్ను ఊబిలోకి లాగకు" అన్నాడు, అక్కసుగా.
నవ్వాడు సందీప్. నిజం నెమ్మదిగా బయటపడుతోంది.
"విగ్రహం దగ్గరికి వెళితే నువ్వు చస్తావో, చావవో గానీ రాననీ మొరాయిస్తే మాత్రం ఈ గదిలోనే ఊపిరాడక చావటం ఖాయం. ఏ చావు చస్తావో తేల్చుకో" అన్నాడు.
సందీప్ ని అంచనా వేస్తున్నట్లు చూశాడు రాజు. "వెధవది! 'ముందు వెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి' అని ఇలాంటి పరిస్థితినే అంటారనుకుంటాను. సరే! ప్రాణాలకు తెగించి నిన్ను ఆ విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళానే అనుకుందాం. నాకేం ఒరుగుతుంది ?"
"నీ శ్రమకు తగిన డబ్బు..."
"కూలి డబ్బులు పారేస్తానంటే వచ్చే ఓపిక లేదు నాకు ! వ్రతం చెడ్డా ఫలం దక్కాలన్నారు. ఈ ప్రయత్నములో ఏం దొరికినా నాకు సగం ఇవ్వాలి. ఫిఫ్టీ - ఫిఫ్టీ సరేనా ?"
"ఓ.కే! డన్ ! ఫిఫ్టీ - ఫిఫ్టీ !" అన్నాడు సందీప్ చెయ్యి కలుపుతూ.
"చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళడం అంటే చావును వెదుక్కుంటూ పోవడమే! మంటను చేరబోయి దీపపు పురుగులు చచ్చినట్లు ఇప్పటికి వేలమంది ఆ విగ్రహం ఆకర్షణలో పడి చచ్చిపోయారు" అన్నాడు రాజు.
సమాధానంగా వెళ్ళి జీపుని స్టార్టు చేశాడు సందీప్.
అతన్ని మింగేసేలా చూస్తూ, తను కూడా జీపు ఎక్కాడు భూతాలరాజు.
జీపు వెనక భాగంలో పేర్చిపెట్టిన సామానులవైపు ఒకసారి తృప్తిగా చూసుకున్నాడు సందీప్. తర్వాత తలెత్తి ఆకాశంలోకి చూశాడు.
తెలియని దుష్టశక్తి ఏదో ఫోకస్ చేస్తున్న వెలుగులా బూజు బూజుగా కనబడుతోంది తోకచుక్క.
అన్వేషణ మొదలయింది.

 Previous Page Next Page