Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 8

భూతాలరాజు మొహం చేటంత అయింది. "జైల్లో నుంచి బయటపడటమా..." అని మాటను సగంలో ఆపి, ఖాండ్రించి ఉమ్మేశాడు. సెంట్రీ సమీపిస్తున్నాడని సూచన అది.
సెంట్రీ బూట్ల చప్పుడు దగ్గరై, మళ్ళీ దూరమై పోయింది.
"జైల్లోనుంచి బయటపడటం ఎవరికీ ఇష్టంకాదు?" అన్నాడు భూతాలరాజు. "కానీ ఎట్లా ?"
మెల్లిగా చెప్పడం మొదలెట్టాడు సందీప్.

                                                             డైనమైట్

ఆ ప్రదేశం అంతా కఠిన శిలామయం. పెద్ద పెద్ద బండలు ఉన్నాయి.
తీవ్రమైన నేరాలు చేసి కఠినశిక్ష విధించబడిన ఖైదీల గుంపు ఒకటి అక్కడ జరుగుతున్న ఒక నిర్మాణానికి శ్రమశక్తిని ధారపోస్తోంది.
వాళ్ళల్లో సందీప్, భూతాలరాజు కూడా ఉన్నారు.
పెద్దపెద్ద బండలను డైనమైట్ తో పగలగొడుతున్నారు కొందరు. వాటిని మళ్ళీ చిన్న చిన్న కంకర రాళ్ళలా కొడుతున్నారు ఖైదీలు.
సుత్తితో కొట్టటం ఆపి, "ఇవాళే ముహూర్తం" అని గుర్తుచేశాడు సందీప్, గుస గుసగా.
సమాధానం చెప్పకుండా, తువుక్కున ఉమ్మేశాడు భూతాలరాజు.
సూర్యుడు పడమటికి వాలిపోతున్నాడు. సెంట్రీ వేసిన విజిల్ వినబడింది. ఖైదీలు పనులు కట్టిపెట్టి, రొప్పుతూ నిలబడి, మొహాలకు పట్టిన చెమట తుడుచుకుంటున్నారు.
"అందరూ వ్యాన్ దగ్గర లైన్లో నిలబడాలి" అని సూచిస్తూ మళ్ళీ విజిల్ వేశాడు సెంట్రీ.
ఒక్కొక్కరే వచ్చి, పనిముట్లు వ్యానులో పెట్టి, ఎక్కుతున్నారు.
భూతాలరాజు వ్యాన్ ఎక్కబోతూ ఆగి, "ఓరి దీని తస్సాదియ్యా !" అన్నాడు పెద్దగా.
"ఏమయింది ?" అన్నాడు సెంట్రీ విసుక్కుంటూ.
"పొద్దుటి నుంచీ ఒకే రకమైన సుత్తితో కొడుతూ ఉన్నానుకదూ, ఆ అదురుకి నా గాజు కన్ను ఎక్కడో జారిపడిపోయింది" అన్నాడు ఆందోళనగా. అతని కుడికన్ను లొట్టపడి ఉంది.
సెంట్రీకి జాలి వేసింది. "సరే! పరిగెత్తి వెళ్ళి తెచ్చుకో!" అన్నాడు.
"సుత్తి దెబ్బలకు నుసినుసి అయిపోయిందో ఏమిటో ఖర్మ !" అని పెద్ద పెద్ద అంగలేస్తూ వెళ్ళిపోయాడు భూతాలరాజు. ఈ హడావిడిలో అందరూ వ్యాన్ లో నుండి దిగి, గుంపుగా నిలుచున్నారు. సరిగ్గా సెంట్రీ వెనక నిలబడ్డాడు సందీప్.
దూరంగా భూతాలరాజు వంగి వెతుకుతూ ఉండడం కనబడుతోంది. కానీ అతను జేబులో నుంచి అగ్గిపెట్టె తియ్యడం, డైనమైట్ వైరుని అంటించడం, ఎవరికీ కనబడలేదు.
మరుక్షణంలో బ్రహ్మాండమైన శబ్దం.
ఒకటి తర్వాత ఒకటిగా పది డైనమైట్స్ స్టిక్స్ పేలాయి.
గుంపులో కలకలం బయలుదేరింది. "ఏమిటది? ఏమిటది?" అన్నాడు సెంట్రీ గాబరాగా.
ఆ సమయంలోనే సందీప్ సెంట్రీ చేతిలోని గన్ లాగేసుకున్నాడు. తర్వాత అతన్ని ఉడుములా పట్టుకుని, ఫ్రెంట్ సీట్లో కుదేసి, వ్యాన్ స్టార్టు చేశాడు. టకటక గేర్లు మార్చి, భూతాలరాజు దగ్గరికి పోనిచ్చాడు. కోతిలా ఎగిరి వ్యాన్ లోకి దూకేశాడు భూతాలరాజు.
సరిగ్గా నలభై సెకండ్ల తర్వాత రోడ్డు ఎక్కి, శరవేగంతో సాగిపోయింది పోలీస్ వ్యాన్.

                                                      డొక్కు కారు

ఊరిబయట ఉన్న ఒక పాత ఇనుమూ, రద్దీ అమ్మే షాపు దగ్గర వ్యాను ఆపాడు సందీప్.
రంగు అంతా గీకేసి తుప్పుపట్టినట్లు కనబుడుతున్న ఒక పాత మోడలు స్టాండర్డు కారు ఉంది, ఆ తుక్కు మధ్య. నెంబరు ప్లేట్లూ, మడ్ గర్డ్సూ, హెడ్ లైట్సూ, తలుపులూ ఏమీలేవు దానికి.
వ్యాన్ లో నుంచీ దిగి, భూతాలరాజూ, సెంట్రీలతో సహా ఆ డొక్కు కారులో ఎక్కాడు సందీప్. డాష్ బోర్డు క్రింద ఉన్న రెండు తీగెలను జాయిన్ చేశాడు. సన్నగా రొద చేసి, సరికొత్త ఇంజను అమర్చిన దానిలా మృదువుగా ముందుకు సాగిపోయింది కారు.

 Previous Page Next Page